వర్షాకాల ఒత్తిడి పాల దిగుబడిపై ఎలా ప్రభావం చూపుతుంది. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
భారతదేశంలో పాడి పరిశ్రమ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒకటి. చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్ద స్థాయి డెయిరీ రైతుల వరకు లక్షలాది కుటుంబాలు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే పశువుల నుంచి అధిక పాల దిగుబడి పొందాలంటే వాటి ఆరోగ్యం, పోషణ, నివాస వాతావరణం మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతల ప్రభావం గురించి రైతులకు బాగా అవగాహన ఉంటుంది. కానీ వర్షాకాలంలో కూడా పశువులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని చాలా మంది రైతులు గుర్తించరు. అధిక తేమ, బురద, నీటి నిల్వలు, తక్కువ సూర్యకాంతి, మేత నాణ్యతలో మార్పులు మరియు వ్యాధుల వ్యాప్తి వంటి అంశాలు పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా పాల ఉత్పత్తి తగ్గడం, పునరుత్పత్తి సమస్యలు పెరగడం, చికిత్స ఖర్చులు అధికమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
వర్షాకాలంలో పాల దిగుబడి ఎందుకు తగ్గుతుంది?
- అధిక తేమ ప్రభావం
వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి చెమట ద్వారా వేడిని బయటకు పంపుతాయి. కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరైపోవడం కష్టమవుతుంది. దీంతో శరీరంలో వేడి నిల్వ ఉంటుంది, శక్తి వినియోగం పెరుగుతుంది, ఆకలి తగ్గుతుంది మరియు పాల ఉత్పత్తి తగ్గుతుంది. అధిక తేమ ఉన్న రోజుల్లో పాల దిగుబడి 5–15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. - మేత వినియోగం తగ్గడం
పాల ఉత్పత్తికి అవసరమైన శక్తి ప్రధానంగా మేత ద్వారా లభిస్తుంది. వర్షాకాలంలో పశువులు తక్కువ మేత తింటాయి, ఆకలి తగ్గుతుంది మరియు మేత నాణ్యత మారుతుంది. పశువు తినే ఆహారం తగ్గితే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. - తడి మరియు బురద వాతావరణం
బురదతో కూడిన ప్రదేశాల్లో పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి. దీంతో ఎక్కువ శక్తి ఖర్చవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది మరియు విశ్రాంతి తగ్గుతుంది. విశ్రాంతి సరిగా లేకపోతే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. - వ్యాధుల పెరుగుదల
వర్షాకాలం అనేక వ్యాధులకు అనుకూలమైన కాలం. ప్రధానంగా పొదుగు వాపు వ్యాధి, కాలిపుండ్ల వ్యాధి (Foot Rot), జ్వరాలు, చర్మ వ్యాధులు మరియు పరాన్నజీవుల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన పశువు పాల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది. - పొదుగు వాపు వ్యాధి ప్రభావం
వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే సమస్య పొదుగు వాపు వ్యాధి. పొదుగు వాపు వ్యాధి వల్ల పాలు తగ్గుతాయి, పాల నాణ్యత పడిపోతుంది పొదుగు వాపు వ్యాధి మరియు చికిత్స ఖర్చు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పాల ఉత్పత్తి 30 శాతం వరకు తగ్గవచ్చు. - పరాన్నజీవుల దాడి
వర్షాకాలంలో పేలు, ఈగలు, పురుగులు మరియు అంతర్గత పరాన్నజీవులు వేగంగా పెరుగుతాయి. ఇవి రక్తహీనత, బలహీనత మరియు ఆకలి మందగించడం వంటి సమస్యలకు కారణమవుతాయి. - కలుషితమైన మేత
వర్షాల కారణంగా మేతలో శిలీంధ్రం (ఫంగస్/ బూజు) పెరిగే అవకాశం ఉంటుంది. ఫంగస్ కలిగిన మేత విషపూరిత పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది మరియు పాల దిగుబడిని తగ్గిస్తుంది. - తాగునీటి సమస్య
వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ స్వచ్ఛమైన నీరు లభించకపోవచ్చు.
కలుషిత నీటి వల్ల కడుపు సమస్యలు, ఇన్ఫెక్షన్లు మరియు ఆకలి తగ్గడం జరుగుతాయి.
వర్షాకాల ఒత్తిడి లక్షణాలు
రైతులు గమనించాల్సిన ముఖ్య లక్షణాలు:
• పాల ఉత్పత్తి తగ్గడం
• మేత తక్కువగా తినడం
• నీరసం
• ఎక్కువసేపు నిలబడటం
• బరువు తగ్గడం
• పొదుగు సమస్యలు
• జ్వరాలు
• తరచుగా వ్యాధులు రావడం
రైతులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు
- షెడ్ నిర్వహణ
వర్షాకాలంలో మంచి షెడ్ నిర్వహణ అత్యంత కీలకం. నీరు నిల్వ కాకుండా చూడాలి, డ్రైనేజీ (పారుదల) ఏర్పాటు చేయాలి, నేలను ఎత్తుగా ఉంచాలి మరియు గాలి ప్రసరణ ఉండాలి - పొడి పరుపు ఏర్పాటు
పశువులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఎప్పుడూ పొడిగా ఉండాలి. వరి పొట్టు, పొడి గడ్డి మరియు చెక్క పొట్టు ఉపయోగించవచ్చు. - పరిశుభ్రత పాటించాలి
రోజువారీగా పేడ తొలగించాలి, నేలను శుభ్రపరచాలి మరియు క్రిమిసంహారకాలు ఉపయోగించాలి - పొదుగు వాపు వ్యాధి నివారణ
పాలు పితికే ముందు పొదుగులను శుభ్రం చేయాలి మరియు పాలు పితికిన తర్వాత టీట్ డిప్పింగ్ చేయాలి. పశువుల పొదుగు పరిశుభ్రతకు మరియు మాస్టిటిస్ (పొదుగు వాపు) వ్యాధిని నివారించడానికి పాలు పితికే ముందు మరియు తరువాత పొదుగును క్రిమిసంహారక ద్రావణంలో ముంచడాన్ని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు.ఇది బ్యాక్టీరియాను నాశనం చేసి, పాల నాణ్యతను పెంచుతుంది。 - నాణ్యమైన మేత మరియు శుభ్రమైన తాగునీరు అందించాలి
వర్షాకాలంలో సైలేజ్ (Silage), ఎండుగడ్డి మరియు సమతుల్య దాణా అందించాలి. సైలేజ్ అనేది పాడి పశువులకు పెట్టే ఒక రకమైన పచ్చటి, రసవంతమైన పశుగ్రాసం. పచ్చి మేత పుష్కలంగా లభించే సమయంలో దానిని సేకరించి, చిన్న ముక్కలుగా కత్తిరించి, గాలి చొరబడని గుంతల్లో భద్రపరుస్తారు. పశువులకు రోజుకు అనేకసార్లు నీరు ఇవ్వాలి, నీటి తొట్లను శుభ్రంగా ఉంచాలి - ఖనిజ మిశ్రమాలు
పాలిచ్చే పశువులకు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు జింక్
అవసరం. ఖనిజ మిశ్రమాలను క్రమం తప్పకుండా ఇవ్వాలి. - పరాన్నజీవుల నియంత్రణ
క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ (Deworming), పేలు నివారణ, ఈగల నియంత్రణ చేయాలి. - టీకాలు వేయించాలి
వర్షాకాలానికి ముందు గాలికుంటు వ్యాధి (Foot and Mouth disease), గురక వ్యాధి (Hemorrhagic Septicemia), జబ్బవాపు రోగం (Black Quarter) వంటి వ్యాధుల టీకాలు వేయించాలి.
ముగింపు
వర్షాకాలంలో అధిక తేమ, బురద, వ్యాధులు, పరాన్నజీవులు మరియు మేత నాణ్యతలో మార్పులు పశువులపై ఒత్తిడిని పెంచి పాల దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ ఒత్తిడిని ముందుగానే గుర్తించి సరైన నిర్వహణ చర్యలు తీసుకుంటే రైతులు నష్టాలను నివారించగలరు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – “ఆరోగ్యకరమైన పశువు మాత్రమే అధిక పాలు ఇస్తుంది.” వర్షాకాలంలో పశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రైతు మాత్రమే స్థిరమైన ఆదాయం మరియు అధిక పాల దిగుబడిని సాధించగలడు.
డా. అలియా తహ్సీన్, ఎం.వి.ఎస్.సి., పీహెచ్.డి
పశుసంవర్ధక ఉత్పత్తుల సాంకేతిక శాస్త్రం
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 8885189834

