ఔషధ చెట్టు తాటిచెట్టు
తాటిచెట్టు దాదాపు 20-30 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక చెట్టు. ఆకులు మాను చివర గుంపుగా, పొడవైన మట్టలతో వర్తులాకారంలో ఏర్పడతాయి. మట్టల అంచులు నల్లని రంపం వలే ఉంటాయి. ఆడ, మగ పూలు గెలల వలె వేర్వేరు చెట్లపై ఏర్పడతాయి. కాయలు గుండ్రంగా, తియ్యని ముంజెలు కలిగి ఉంటాయి. పండిన కాయలు ఎరుపు రంగు గుజ్ౙుతో నిండిన పీచుగల టెంకలు కలిగి ఉంటాయి. ఈ టెంకల నుండి తేగలు వస్తాయి. ఈ చెట్టుని టెంకల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

సాధారణ నామం : టాడీ పామ్, పామైరా పామ్ శాస్త్రీయ నామం : బొరాసెస్ఫ్లాబెల్లిఫర్ కుటుంబం: ఆరికేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- తాటి ఆకులు, వేర్లు, పండ్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. పండ్లలో ఇనుము, ప్రోటీన్లు, సుక్రోస్, గ్లూకోస్, బూడిద, థయమిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ సి, పీచు పదార్థం ఉంటాయి.
- తాటి చెట్టు శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధుల నివారణకు, సులువుగా మూత్ర విసర్జనకు ఉపయోగపడుతుంది. తాటి ఆకులపై ముక్కు పొడుం రంగులో వచ్చే దూది వంటి నూగును దెబ్బల వల్ల కలిగే గాయాలకు కడితే రక్తస్రావాన్ని ఆపుతుంది.
- మధుమేహ వ్యాధికి, నొప్పి లేని పుండ్లకి, చర్మవ్యాధులకు, విషానికి విరుగుడుగా ఉపయోగపడుతుంది. కొద్దిగా పులిసిన ద్రవం (నీరా) మూత్రాన్ని సులువుగా జారీ చేయుటకు, విరేచన కారిగా పనిచేస్తుంది.
వ్యవసాయరంగంలో …
- తాటి చెట్టు తాజారసాన్ని కంబోడియాలో ఆహారధాన్యాలకు బదులుగా ఆహారంగా పందులకు, కోళ్ళకు ఇస్తున్నారు.
- గ్రామీణ ప్రాంతాలలో తాటి చెట్టు ఆకులను ఇళ్ళు, దడుల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
- తాటి చెట్ల కాండాన్ని కలపగా ఉపయోగిస్తారు. కొయ్యని ఇళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తారు (కియుబోరిన్, 1998)*
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

