సేంద్రీయ కర్బనం పెంచితేనే నేల ఆరోగ్యం పదిలం
ఒక్కోసారి మట్టిలోని కార్బన్‌ను సేంద్రియ పదార్థంగా వ్యవహరిస్తుంటారు. సేంద్రియ పదార్థానికి కార్బన్ మూల పదార్థం కాబట్టి, నేలలో ఉండే కార్బన్‌కి సేంద్రియ పదార్థ సాంద్రతకి అనులోమ సంబంధం ఉంటుంది.
సేంద్రియ పదార్థం – సేంద్రియ కర్బనం :
నేలలో ఉండే కార్బన్ గురించి ప్రస్తావించినప్పుడు సేంద్రియ పదార్థంలో కార్బన్ శాతం ఎంత అనే అర్థంలోనే చూడాలి. నేలల్లో ఉండే సేంద్రియ పదార్థం సేంద్రియ కర్బనం స్థాయికి రెట్టింపుగా ఉంటుంది.

సేంద్రియ పదార్థం అంటే ఏమిటి?
మట్టిలో సేంద్రియ పదార్థం పరిమాణం సాధారణంగా తక్కువగానే ఉన్నప్పటికీ, నేల యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలపై ఇది ఎంతో కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా మట్టి బరువులో సేంద్రియ పదార్థం సుమారు 1–6 శాతం వరకు ఉంటుంది. పరిమాణంలో తక్కువగా ఉన్నప్పటికీ, నేల ఆరోగ్యం, సారవంతత మరియు పంటల ఉత్పాదకతను నిర్ణయించే ముఖ్యమైన అంశాల్లో సేంద్రియ పదార్థం ఒకటి.
సేంద్రియ పదార్థంలో ప్రధానంగా మొక్కల మరియు జంతువుల అవశేషాలు, సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశి (biomass), వాటి విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే స్థిరమైన సేంద్రియ పదార్థాలు (హ్యూమస్) ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగస్‌లు, ఆల్గే, ప్రోటోజోవా వంటి సూక్ష్మజీవులు, అలాగే వానపాములు మరియు ఇతర నేలజీవులు సేంద్రియ పదార్థం విచ్ఛిన్నం మరియు పునర్వినియోగంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సేంద్రీయ కర్బనం అంటే ఏమిటి?
సేంద్రీయ కర్బనం అనేది నేలలోని సేంద్రియ పదార్థంలో ఉండే ప్రధాన మూలకం. మొక్కల అవశేషాలు, వేర్లు, సూక్ష్మజీవుల అవశేషాలు, జంతు వ్యర్థాలు మరియు వాటి విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే హ్యూమస్ వంటి పదార్థాలు నేలలో సేంద్రీయ కర్బనానికి ప్రధాన వనరులు.

సేంద్రీయ పదార్థంలో సుమారు 58 శాతం కర్బనం ఉంటుందని సాధారణంగా పరిగణిస్తారు. అందువల్ల నేలలోని సేంద్రియ పదార్థ స్థాయిని అంచనా వేయడానికి సేంద్రీయ కర్బనం (SOC) ఒక ముఖ్యమైన సూచికగా ఉపయోగిస్తారు.
వ్యవసాయ భూమికి సేంద్రీయ కర్బనం (Organic Carbon) జీవనాడి వంటిది. నేల ఆరోగ్యాన్ని, సారాన్ని మరియు పంటల ఉత్పాదకతను నిర్ణయించే ముఖ్యమైన సూచికల్లో ఇది ఒకటి. సాధారణంగా, ఆరోగ్యవంతమైన నేలలో సేంద్రీయ కర్బనం తగిన స్థాయిలో ఉంటుంది. నేలలోని సేంద్రీయ కర్బనం శాతాన్ని ఆధారంగా చేసుకుని నేలలను ఈ విధంగా వర్గీకరించవచ్చు:
- 0.30% కంటే తక్కువ – అత్యంత తక్కువ సేంద్రీయ కర్బనం ఉన్న నేల
- 0.30–0.50% – తక్కువ సేంద్రీయ కర్బనం ఉన్న నేల
- 0.50–0.75% – మధ్యస్థ సేంద్రీయ కర్బనం ఉన్న నేల
- 0.75–1.00% – అధిక సేంద్రీయ కర్బనం ఉన్న నేల
- 1.00% కంటే ఎక్కువ – అత్యంత అధిక సేంద్రీయ కర్బనం ఉన్న నేల
సేంద్రీయ కర్బనం స్థాయి పెరుగుతున్న కొద్దీ నేల భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మెరుగుపడి, నేల ఆరోగ్యం మరియు పంటల ఉత్పాదకతకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.

భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించిన 70 సంవత్సరాల సమాచారాన్ని పరిశీలిస్తే, నేలలో సేంద్రీయ కర్బనం స్థాయి 1.00% నుండి 0.30%కి పడిపోయినట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు:
• అధికంగా మరియు నిరంతరంగా సాగు చేయడం (Intensive cultivation)
• నీటిపారుదల ఆధారిత సాగు
• రసాయన ఎరువులపై అధికంగా ఆధారపడటం (అసమతుల్య పోషకాల నిర్వహణ)
• సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు, కంపోస్టు వినియోగం తగ్గడం
• పంట అవశేషాలను నేలలో కలపకుండా కాల్చివేయడం లేదా తొలగించడం

వ్యవసాయ నేలల్లో సేంద్రీయ కర్బనం క్షీణించే ధోరణి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో నేల సారం, ఉత్పాదకత గణనీయంగా తగ్గి, అనేక ప్రాంతాలు భూమి క్షీణత (Land degradation)కు గురయ్యే ప్రమాదం ఉంది. నేల సేంద్రీయ కర్బనాన్ని కోల్పోయినప్పుడు దాని భౌతిక, రసాయనిక మరియు జీవసంబంధ లక్షణాలు క్రమంగా దెబ్బతిని, నేల ఆరోగ్యం మరియు పంటల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, నేల ఆరోగ్య నిర్వహణలో సేంద్రీయ కర్బనం పరిమాణాన్ని పెంచడం అనేది నేల యాజమాన్య చర్యలన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది.

నేలలో సేంద్రీయ కర్బనాన్ని పెంచే దిశగా చేపట్టవలసిన ప్రధాన చర్యలు:
- వ్యవసాయ భూమిని అవసరమైన మేరకే తేలికగా మరియు పరిమితంగా దున్నాలి, తద్వారా నేల నిర్మాణం మరియు సేంద్రీయ పదార్థం సంరక్షించబడతాయి.
- నేలను తరచుగా ప్రత్యక్ష సూర్యరశ్మికి గురికాకుండా చూడాలి, ఇందుకోసం పంట అవశేషాలు, కవర్ క్రాప్స్ లేదా ఇతర సహజ కవచాలను వినియోగించాలి.
- నేల ఉపరితలాన్ని సాధ్యమైనంత వరకు సేంద్రీయ అవశేషాలతో కప్పి ఉంచాలి (మల్చింగ్), తద్వారా నేల తేమ సంరక్షణతో పాటు సేంద్రీయ కర్బనం పెరుగుదలకు దోహదపడుతుంది.
- నేలలో సహజంగా జరిగే పోషక చక్రాలను ప్రోత్సహించాలి, తద్వారా పోషకాల పునర్వినియోగం మరియు నేల సారం సహజంగా కొనసాగుతుంది.
- పంటలు నేల నుంచి తీసుకునే పోషకాలను సకాలంలో తిరిగి అందిస్తూ, నేలలో పోషకాల సమతుల్యతను కాపాడాలి. ఇందుకోసం నేల పరీక్ష ఆధారిత సమగ్ర పోషక యాజమాన్యాన్ని అనుసరించాలి.
- నేల జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి, తద్వారా ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు, వానపాములు మరియు ఇతర నేల జీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయి.
- నేల కోతను మరియు అదుపులేని నీటి ప్రవాహాన్ని నివారించాలి, తద్వారా సేంద్రీయ కర్బనం సమృద్ధిగా ఉండే పైమట్టి నష్టాన్ని తగ్గించి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చు.
- పచ్చిరొట్ట ఎరువుల సాగు (Green manuring) – జనుము, జీలుగు, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను పెంచి పూత దశలో నేలలో కలపాలి.
- జీవ ఎరువుల వినియోగం – రైజోబియం, అజోస్పిరిల్లం, ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా (PSB), మైకోరైజా వంటి జీవ ఎరువులను అవసరానికి అనుగుణంగా ఉపయోగించాలి.
- మల్చింగ్ (Mulching) – పంట అవశేషాలు, గడ్డి, ఆకులు లేదా ఇతర సేంద్రియ పదార్థాలతో నేల ఉపరితలాన్ని కప్పడం ద్వారా తేమను సంరక్షించి, సేంద్రీయ పదార్థం చేరికను పెంచాలి.
- సమతుల్య పోషక యాజమాన్యం (Integrated Nutrient Management) – సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు మరియు రసాయన ఎరువులను నేల పరీక్ష ఆధారంగా సమతుల్యంగా వినియోగించి, నేల సేంద్రియ పదార్థం మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రోత్సహించాలి.
- ప్రత్యామ్నాయ పంట పద్ధతులు: పలు కారణాల వల్ల నేలలో సేంద్రీయ కర్బనం తగ్గి ఎడారిగా మారుతోంది. ఇటువంటి సందర్భంలో వెంటనే నేలను సాంప్రదాయ వార్షిక పంటల నుండి మార్చి, తక్కువ నేలను కదిలించే మరియు ఎక్కువ వేరు వ్యవస్థ కలిగిన వృక్ష ఆధారిత వ్యవసాయానికి మారాలి. బహువార్షిక వృక్ష ఆధారిత వ్యవసాయంలో పెంచే పంటలు విస్తారమైన వేరు వ్యవస్థను కలిగి ఉండి, వార్షిక పంటలతో పోలిస్తే వాతావరణంలోని కర్బనాన్ని అధికంగా నేలలో స్థిరీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఉదాహరణకు: 1. మెట్ట తోటల పెంపకం 2. వ్యవసాయ అటవీ పద్ధతులు 3. అటవీ పంటలు 4. బహువార్షిక మేత పంటలు మొదలైనవి.

బి. చంద్ర శేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం) మరియు జి. సతీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్టాటిస్టిక్స్), పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258










