ఒకసారి దావోస్‌లో మాట్లాడే సమయంలో గ్లోబల్ వార్మింగ్‌లో ప్రకృతి వ్యవసాయం కూడా ముఖ్యం అని చర్చ వచ్చింది. ఆ చర్చ సమయంలో ఏం చేయాలని ముందుచూపుతో ఆలోచించి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ గారిని పిలిపించి మాట్లాడి శిక్షణా తరగతులు నిర్వహించి, రిటైర్డ్ ఐఏఎస్ విజయకుమార్ గారిని సిఈఓగా నియమించి, ప్రకృతి వ్యవసాయాన్ని సపోర్టు చేయడం వలన ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం అవలంభించే ప్రకృతి వ్యవసాయం చూడటానికి వస్తున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి ప్రపంచానికే ఆదర్శంగా మనం తయారు కాబోతున్నాం. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారాన్ని అందించాలని చెప్పడం జరిగిందని, అమరావతిలో పురుగు మందులు లేని ఆహారాన్ని అందించేలా చూడటానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో ఉపన్యసించారు.
ప్రతి వ్యక్తికి కొన్ని సరదాలు / అలవాట్లు / వ్యాపకాలు ఉంటాయి. ప్రస్తుతం సమాజంలో వ్యక్తుల అలవాట్లను గమనించినట్లయితే చాలావరకు తమకు, సమాజానికి నష్టం కలిగించేవిగానే ఉన్నాయి. ఉదాహరణకు కొంతమందికి డ్రైవింగ్ సరదాగా ఉండవచ్చు. అనవసరమైన డ్రైవింగ్ వలన ఇంధనము రూపంలో డబ్బు ఖర్చు అవటంతోపాటు ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవచ్చు. ఇంకొంతమంది ప్రొగత్రాగడానికి, డ్రగ్స్‌కు, అల్కహాలుకు, బెట్టింగుల లాంటి అలవాట్లను సరదాగా మొదలు పెట్టి చివరకు వాటికి బానిసలు అయ్యి ఎంతో నష్టపోతుంటారు. ఇంకా కొంతమంది ఫోన్ల వాడకం సరదాగా మొదలు పెట్టి అది అలవాటుగా మారి చివరకు ఫోన్లకు కూడా బానిసలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవిధంగా చెప్పుకుంటూపోతే సమాజంలో అనేక రకాల సరదాలు, అలవాట్ల వలన తాము నష్టపోవడంతోపాటు సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మన సరదాలు, మన అలవాట్లు మనతో పాటు తోటి వారికి ఉపయోగపడేవిగా, మన ఆరోగ్యాన్ని కాపాడేవిగా, శారీరక శ్రమకు అవకాశం ఉండేవిగా ఉండాలి. అప్పుడు అన్ని రకాలుగా ఫలితాలు ఉంటాయి. అలాంటి సరదాలలో/అలవాట్లలో ఇంటిపంట మొదటి వరుసలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది ఇంటిపంటవైపు అడుగులు వేశారు, వేస్తున్నారు. ఈ కోవకు చెందుతారు హైదరాబాద్ రాంపల్లి, నేతాజీనగర్‌లో టెర్రస్‌గార్డెన్ పెంచుతున్న ఎలిజబెత్.
ఎలిజిబెత్ రెండున్నర సంవత్సరాల క్రితం సరదా కోసం ఇంటి పంటను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆ ఇంటి పంట తమ ఆరోగ్యాలను కాపాడటంతో పాటు తన పరిచయాలను కూడా పెంచి ఒక మంచి సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సరదాకోసం మొదలు పెట్టిన ఇంటి పంట ద్వారా రెండున్నర సంవత్సరాలలో నైపుణ్యాన్ని పెంచుకొని తక్కువ కాలంలో తోటి వారికి అవగాహన కల్పించే స్థాయికి ఎలిజబెత్ ఎదిగింది. ఎలిజబెత్ ప్రస్తుతం తన అనుభవాలను తోటి వారికి పంచడంతో పాటు ఉద్యాన శాఖ వారు ఇంటి పంటపై ఏర్పాటు చేసే అవగాహన సదస్సుల ద్వారా కూడా తన అనుభవాలను తోటి ఇంటి పంటదారులకు తెలియచేస్తున్నారు.
తన ఇంటి పంటలో పునాస మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, పందిరిమామిడి, అల్‌టైమ్ మామిడి లాంటి మామిడి మొక్కలు, యాపిల్ బేర్ 5 మొక్కలు, నేరేడు రెండు రకాలు, దానిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్, అంజూర, అరటి, స్టార్‌ఫ్రూట్, జీడిమామిడి, టేబుల్ నిమ్మ, తీపినిమ్మ, బత్తాయి, చింత మొదలగు పండ్ల మొక్కలతో పాటు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటు మందార, గులాబి లాంటి మొక్కలు కూడా పెంచుతున్నారు.
తమ ఇంటిపంటలో ఉన్న మొక్కలను ప్రతిరోజూ గమనిస్తూ పిండినల్లి లాంటి చీడపీడలను బ్రష్‌తో, పేనుబంకను (ఎఫిడ్స్) గంజి+ఇంగువ+పసుపు ద్రావణంతో నివారించుకుంటున్నారు. ప్రతి 10 రోజులకు మ్యాజిక్ కంపోస్టు (వివరాలను బాక్సు చూడగలరు)ను అందిస్తున్నారు. తీగజాతి కూరగాయలకు 3 జి కటింగ్ (వివరాలకు బాక్సు చూడగలరు) చేస్తూ ఎక్కువ దిగుబడి పొందుతున్నారు. కాకర, సొర, బీర లాంటి తీగ జాతి కూరగాయలు మగ, ఆడపూలు విడివిడిగా ఉంటాయి కాబట్టి రెండుకంటే ఎక్కువ మొక్కలు వేస్తున్నారు. తన ఇంటి పంటలో ఉన్న మొక్కలలో కొన్నింటిని తోటి ఇంటిపంట దారుల వద్ద నుంచి సేకరించి అభివృద్ధి చేసినవి ఉన్నాయి అని తనకు మొక్కలు అందచేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా తాను కూడా ఇతరులకు విత్తనాలు, మొక్కలు అందచేస్తూ తోటివారిని ఇంటిపంటవైపు అడుగులు వేయించడంలో తన వంతు కృషి చేస్తున్నారు. తన అనుభవాన్ని వేరే వారికి తెలియపరచడానికి ఏవిధమైన ఇబ్బంది పడకుండా తోటి వారిని ఇంటి పంట వైపు ప్రోత్సహిస్తున్నారు. తమ కుటుంబానికి, తోటి సమాజానికి, పర్యావరణానికి ఉపయోగపడే అలవాటును సరదాగా తీసుకొని కొనసాగిస్తున్న ఎలిజబెత్‌ని నిజంగా అభినందించవలసిందే. మరిన్ని వివరాలు మరియు ఇంటి పంటకు అవసరమైన సలహాలను ఎలిజబెత్ 8142055527కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మ్యాజిక్ ఫార్ములా
200 గ్రాముల ఆవపిండి, 200 గ్రాముల వర్మికంపోస్టు, 200 గ్రాముల వేపపిండి, 50 గ్రాముల తాజా టీ పొడి, తొక్కతో ఉన్న 4 అరటి పండ్ల పేస్టు. వాటన్నింటిని 20 లీటర్ల నీటిలో కలిపి ప్రతి రోజు రెండుసార్ల చొప్పున కట్టెతో 3 రోజులు కలిపితే మ్యాజిక్ కంపోస్టు తయారవుతుంది. 4వ రోజు నుండి ఈ ద్రవ ఎరువును ఉపయోగించుకోవచ్చు. లీటరు ద్రవ ఎరువుకు 10 లీటర్ల నీటిని కలిపి సాయంకాలం పూట మొక్కల పాదులలో అందించాలి. సున్నితమైన మొక్కలకు అయితే ఒక లీటరు ద్రవ ఎరువుకు 15 లీటర్ల నీటిని కలిపి మొక్కల పాదులలో అందించాలి. ఈ ద్రవ ఎరువును ప్రతి 10 రోజులకు ఒకసారి మొక్కలకు అందిస్తే ఫలితం బాగా ఉంటుంది.
మట్టి మిశ్రమం
30 శాతం ఎర్రమట్టి, 30 శాతం వర్మికంపోస్టు లేదా మాగిన ఆవుపేడ, 30 శాతం ఇసుక (కోకోపిట్ తప్పనిసరి కాదు) 10% వేప పిండిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నట్లయితే 30 నుంచి 40 రోజుల వరకు ఎలాంటి పోషకాలు అందించ కుండానే మొక్కలు ఎదుగుతాయి. 40 రోజుల తరువాత పోషకాలు అందించవలసి ఉంటుంది.
అలోవేరాతో అనేక ఉపయోగాలు
ఆలోవేరాని అంగుళం ముక్కలుగా కోసుకుని, ఒక లీటరు నీటిలో ఒక ముక్క వేసి 5 గంటలు నానిన తరువాత ఆ నీటిని మొక్కకు ఒక్కొక్క కప్పు చొప్పున పాదులలో అందిస్తే వర్షాకాలంలో నీరు ఎక్కువ అయినందువలన వచ్చే సమస్య నుండి మొక్క తేరుకుంటుంది. అంతేకాకుండా మల్బరి, గులాబి, మందార లాంటి కొమ్మలను కలబంద జ్యూస్‌లో ముంచి నాటుకున్నట్లయితే త్వరగా వేర్లు అభివృద్ధి చెందుతాయి అని ఎలిజబెత్ తాను పాటించిన పద్ధతులు వివరించారు.
3జి కటింగ్
బీర, సొర, కాకర లాంటి తీగజాతి మొక్కలను 3 జి కటింగ్ చేసినట్లయితే ఎక్కువ ఆడపూలు పుష్పించి దిగుబడి పెరుగుతుందని ఎలిజబెత్ వివరిస్తున్నారు. ఇందుకు గాను తీగజాతి కూరగాయ మొక్క రెండు అడుగులు పెరిగిన తరువాత తల త్రుంచినట్లయితే రెండు ఇగుర్లు వస్తాయి. అవి కూడా ఒక అడుగు వచ్చిన తరువాత మరలా వాటి తలను త్రుంచితే ఈసారి ఒక్కొక్క దానికి రెండు చొప్పున రెండు తీగలకు 4 తీగలు వస్తాయి. మరలా అవి కూడా ఒక అడుగు పెరిగిన తరువాత తల గిల్లినట్లయితే ఈసారి 8 తీగలు వస్తాయి. ఈ 8 తీగలను వదలి వేసినట్లయితే ఎక్కువ బ్రాంచీలు వచ్చి ఆడ పూల శాతం పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుందని ఎలిజబెత్ తన అనుభవాన్ని వివరించారు.
చింత చిగురు పొందడం
ఇంట్లో డ్రమ్ములో చింత చెట్టు పెంచుకొంటూ ముదురు ఆకులని క్రమం తప్పకుండా గిల్లుతూ ఉన్నట్లయితే చింత చిగురు వస్తూ ఉంటుంది. తాను ఆ విధంగానే తన మిద్దె తోటలో పెంచుతున్న చింత చెట్టు నుండి చింత చిగురు పొందుతున్నానని ఎలిజబెత్ వివరించారు.