అమరావతిలో పురుగుమందులు లేని ఆహారం అందేలా చూస్తాం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు

ఒకసారి దావోస్‌లో మాట్లాడే సమయంలో గ్లోబల్‌ వార్మింగ్‌లో ప్రకృతి వ్యవసాయం కూడా ముఖ్యం అని చర్చ వచ్చింది. ఆ చర్చ సమయంలో ఏం చేయాలని ముందుచూపుతో ఆలోచించి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ గారిని పిలిపించి మాట్లాడి శిక్షణా తరగతులు నిర్వహించి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ విజయకుమార్‌ గారిని సిఈఓగా నియమించి, ప్రకృతి వ్యవసాయాన్ని సపోర్టు చేయడం వలన ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం అవలంభించే ప్రకృతి వ్యవసాయం చూడటానికి వస్తున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి ప్రపంచానికే ఆదర్శంగా మనం తయారు కాబోతున్నాం. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారాన్ని అందించాలని చెప్పడం జరిగిందని, అమరావతిలో పురుగు మందులు లేని ఆహారాన్ని అందించేలా చూడటానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో ఉపన్యసించారు.

Read More

సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు

కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్‌పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్‌ఐపిహెచ్‌ఎం 3 నెలల సర్టిఫికెట్‌ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.
నూటికి నూరు శాతం రసాయనాలు లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్‌ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్‌ఐపిహెచ్‌ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 థలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపిహెచ్‌ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్‌ఐపిహెచ్‌ఎంలో 10 రోజుల తుది థ శిక్షణ ఉంటాయి.
ఇంటర్‌ లేదా టెన్త్‌ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ, పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500./-లు శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ. 305/-లు అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్‌ 22 లోగా పోస్టు/మెయిల్‌ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్‌ డా.కె. దామోదరాచారి (9542638020)ని సంప్రదించవచ్చు.
అడ్రస్‌:
To
The Director, Plant Health Management,
National Institute of Plant Health Management (NIPHM),
Rajendranagar, Hyderabad – 500 030
mail: dirphmniphm-ap@nic.in or asomicroniphm2019@gmail.com

Read More

ప్రకృతి, సేందియ్ర వ్యవసాయంలో తెగుళ్లు, పురుగుల జీవ నియంత్రణ మందులు

ట్రైకోడెర్మావిరిడి (శిలీంద్రము)

పంటలకు హానీ చేసే శిలీంద్రాలను నాశనం చేసి, పంటలను తెగుళ్ళు రాకుండా కాపాడును.

వాడే పద్ధతి: 100 కిలోల సేంద్రియ ఎరువు, అరకిలో నల్లబెల్లం, 1 కిలో ట్రైకోడెర్మావిరిడి, 5 కిలోల వేపపిండి, చెట్టు నీడన గానీ, పాకలో గానీ, పొరలు పొరలుగా ఎరువు, వేపపిండి, ట్రైకోడెర్మావిరిడి వేస్తూ బెల్లపు నీరు చిలకరించి, గుట్టలో తగిన తేమ ఉండేటట్లు చూడాలి. గుట్టపైన తడిపిన గోనె సంచి కప్పి నాలుగు రోజులుంచితే ఎరువంతయు బూజు పట్టినట్లు అగును. చేలో తేమ ఉన్నప్పుడు ఈ ఎరువు వేరు వ్యవస్థ దగ్గరగా, సాయంత్రపు సమయంలో చల్లాలి. పండ్లతోటలలో సంవత్సరానికి కనీసం రెండుసార్లు, ఇతర పంటలకు ఒకసారి చల్లాలి. అవసరమైతే మోతాదు పెంచుకోవచ్చును. చెట్లు/మొక్కల మొదళ్లలో 1 శాతం శిలీంద్రం కలిపిన నీరు పోయాలి.

విత్తనశుద్ధి: 10 గ్రా. ట్రైకోడెర్మావిరిడి, 10 మి.లీ. నీటిలో పేస్టుగా చేసి విత్తనాలకు పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి. పసుపు దుంపలు, చెరకు ముచ్చెలు, నారు వగైరాలకు అరకిలో శిలీంద్రం 50 లీటర్లు నీటిలో కలిపి అందులో అరగంట ఉంచి నాటాలి.

నివారించు తెగుళ్లు: ఎండుతెగులు, వేరు, నారుకుళ్లు తెగులు, మాగుడు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లు, దుంపకుళ్లు, పొడ తెగుళ్లు నివారణకు అన్ని పంటలకు వాడుకోవచ్చు.

సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ (బ్యాక్టీరియా)

వాడే పద్ధతి: పైన ట్రైకోడెర్మావిరిడి భూమికి వెదజల్లే పద్ధతి దీనికి కూడా పాటించాలి. పంటపై పిచికారీ చేసినప్పుడు 1 కిలో, 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కానీ రెండు రోజుల ముందు 1 కిలో నల్లబెల్లం, 2 లీటర్ల నీటిలో కలిపి తయారు చేసిన పానకంలో 1 కిలో సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ నానవేసి, పిచికారి చేసిన మంచి ఫలితాలుంటాయి.

విత్తనశుద్ధి: 10 గ్రాములు, కిలో విత్తనానికి, దుంపలు, చెరకు ముచ్చెలు, నారు వగైరాలకు అరకిలో సూడోమోనాస్‌ 50 లీటర్ల నీరు కలిపిన ద్రావణంలో అరగంట ఉంచి విత్తాలి.

నివారించే తెగుళ్లు: ఎండు తెగులు, అగ్గితెగులు, నారుకుళ్లు, ఆకుమచ్చ, పొడతెగులు వగైరాలు పంచగవ్యలో కలిపి సాయంత్రం సమయంలో పిచికారీ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి.

బవేరియా బాసియానా (శిలీంద్రం)

అన్ని పంటలపై వచ్చే శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, గొంగళి పురుగు, కాయతొలిచే పురుగు, కొమ్మ, కాండం తొలిచే పురుగులపై సమర్ధవంతంగా పనిచేసే శిలీంద్రము, పంచగవ్యలో కలిపి వాడినప్పుడు దీని సామర్థ్యం బాగా పెరిగింది.

వాడే పద్ధతి: మొక్క పెరిగే థలో 2 కిలోల బవేరియా బాసియానా 100 లీటర్ల నీటిలో కలిపి, దానికి 3 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి. మొక్కల అన్ని భాగాలు తడిచేటట్లు పిచికారీ చేయాలి. వంగలో మొక్క పెరిగే థలో 2 సార్లు పిచికారీ చేసిన కొమ్మ, కాయ తొలిచే పురుగులు రాలేదు. ప్రస్తుతం చాలా మంది వంగరైతులు వాడుతున్న మందు బవేరియా బాసియానా 2 కిలోలు మరియు 3 లీటర్ల పంచగవ్య సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి.

వర్టిసీలియం లెకానీ (శిలీంద్రం)

అన్ని పంటలపై వచ్చే పేనుబంక, నల్లి, తెల్లదోమ, రసం పీల్చే పురుగులపై సమర్ధవంతంగా పనిచేయును. పంచగవ్యలో కలిపి వాడినప్పుడు సామర్థ్యం పెరిగినది.

వాడే విధానం: 2 కిలోల వర్టిసీలియం లెకాని 3 లీటర్లు పంచగవ్య, 100 లీటర్ల నీటిలో కలిపి సామర్థ్యం పెంచి సాయంత్రం సమయంలో పైరంతా తడిచేటట్లు పిచికారీ చేయాలి. మొదటి సారి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

మెటారైజియం (శిలీంద్రం)

చెదలు, చీమలు, దోమలు, వేరుపురుగు, ఈగలు వగైరా సమర్థవంతంగా నివారించే శిలీంద్రం.

వాడే పద్ధతి: ట్రైకోడెర్మా విరిడిలాగా 100 కిలోల కంపోస్టు, 5 కిలోల వేపపిండి, అర కిలో బెల్లపు నీరు, 2 కిలోల మెటారైజిమ్‌ కలిపి చేలో తగు తేమ ఉన్నప్పుడు భూమిపై వెదజల్లాలి. 2 కిలోల మెటారైజిమ్‌, 100 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయవచ్చు. మొదటి సారి వాడినప్పుడు వారంలో రెండుసార్లు పిచికారీ చేసిన మంచి ఫలితాలు వచ్చును. పంచగవ్యలో కలిపి పైరుపై చల్లవచ్చును.

ట్రైకోడెర్మా హార్జియానమ్‌ (శిలీంద్రం)

ట్రైకోడెర్మా విరిడి భూమిలోపల వాడితే ఇది భూమిపైన కాయకుళ్ళు రాకుండా వాడే శిలీంద్రం. దీనిని కూడా అరకిలో బెల్లం పానకంలో 2 కిలోల ట్రైకోడెర్మా హార్జియానమ్‌ 48 గంటలు నానబెట్టి వాడిన మంచి ఫలితాలు వచ్చును.

డా. ఎన్‌. కృష్ణ ప్రియ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌, ఊటుకూర్‌, కడప.

Read More

వరి పంటలో సహజ ఎరువుల యాజమాన్యం, రసాయనరహిత సమగ్ర సస్యరక్షణ పద్ధతులు

మన తెలుగు రాష్ట్రాలలో ఖరీఫ్‌లో పండించే పంటలలో వరి ప్రధాన పంట. వరిని ఖరీఫ్‌ పంటగా ఆంధ్రప్రదేశ్‌లో  12.5 లక్షల హెక్టార్లలో మరియు తెలంగాణలో 25.8 లక్షల హెక్టార్లలో  పండిస్తున్నారు. రసాయన సేద్యంతో నష్టపోయిన రైతులు అధిక శాతం ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లుతున్నారు గోఆధారిత సహజ ఎరువులు వాడుతూ ప్రకృతిలో లభ్యమయ్యే సహజ కషాయాలతో రైతులు భూసారాన్ని కాపాడుకుంటూ, చీడపీడల బెడద నుంచి ఉపశమనం పొందుతున్నారు. రాబోయే ఖరీఫ్‌లో  వరి పంటలో పాటించవలసిన సహజ ఎరువుల వినియోగం మరియు రసాయన రహిత సస్యరక్షణ పద్ధతులను గురించి తెలుసుకుందాం.

1) వరి పంట పండించే ముందర మే నెలలో భూసారాన్ని మరియు కర్బన శాతం పెంచే పచ్చిరొట్ట పేర్లను (అపరాలు, జనుము, జీలుగ, పిల్లిపెసర, గడ్డిజాతి పంటలను) వేసుకుని 40-75 రోజుల వ్యవధిలో కోసుకుని భూమిలో కలియదున్నటం ద్వారా లేదా తినడానికి పశువుల మేతగా వాడుకోవచ్చు.

2) వరిలో తక్కువ కాలపరిమితి, అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకుని ఖరీఫ్‌ లో వేసుకుంటే, రబీ వరి పంటకు తొందరగానే వెళ్ళవచ్చు. ఆలస్యమైనచో రబీలో అకాలవర్షాలు మరియు వడగండ్ల బెడద ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి రబీలో కూడా తక్కువ కాలపరిమతి రకాలు నవంబర్‌ లో వేసుకుని, తొందరగా పంట కోత తీయవచ్చు. ఈ పద్ధతిలో ప్రకృతి వైపరీత్యాలు తప్పించుకునే అవకాశం ఉంది.

3) బీజామృతంతో విత్తనశుద్ధి, నారుమడి శుద్ధి 5 లీటర్లు / 25-30 కిలోల విత్తనానికి, నారుమడికి వాడవచ్చు. ఈ పద్ధతి భూమిలో సూక్ష్మ జీవులను పెంచడంతో పాటు, విత్తనాలను, మొక్కలను చీడపీడల నుంచి కాపాడతాయి.

4) నీటిపారుదల క్రింద వరిని వరుసలలో విత్తే పద్ధతి, డ్రం సీడర్‌ పద్ధతిలో లేదా శ్రీ పద్ధతిలో వేసుకుంటే మంచిది. వర్షాధారంగా వేసే వరిలో నేరుగా వరుసలలో విత్తే పద్ధతిని (డైరెక్ట్‌ సీడింగ్‌) అనుసరించాలి. ఈ పద్ధతులలో భూమి అతి తక్కువగా కదుపబడుతుంది.

సహజ ఎరువుల యాజమాన్యం

1000-1500 కిలోల ఘన జీవామృతం కలిపిన పశువుల ఎరువు ఎకరానికి దుక్కిలో లేదా కరిగడిలో వేసుకోవాలి. అచ్చం ఘనజీవామృతాన్ని ఎకరానికి 400 కిలోలు రెండు సార్లుగా నాటిన 20 రోజులకీ, 40 రోజులకి వేసుకోవాలి. తరువాత ద్రవజీవామృతమును ఎకరానికి 800 లీటర్లు నాలుగు సార్లు నాటిన 30, 50,65 మరియు 80 రోజులకు సమభాగంగా చేసి (200 లీటర్లు ప్రతిసారి) భూమికి అందజేయాలి. పైపాటుగా 50 లీటర్ల ద్రవజీవామృతాన్ని 100 లీటర్ల నీటికి కలిపి నాలుగు సార్లు నాటిన 20, 35, 50 మరియు 65  రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి.

గోఆధారిత సహజ ఎరువులతో పాటు, అజోల్లా ఎకరానికి 10-15 కిలోలు నాటిన 7 రోజులకు వేసిన ఎడల నత్రజని స్థిరీకరణతో పాటు కలుపు నివారణ కూడా జరుగుతుంది, సేంద్రీయ ఆచ్ఛాదన (మల్చ్‌) వలె ఉపయోగపడుతుంది, నీటి అవసరాన్ని తగ్గించి భూమిలో కర్భన శాత వృద్ధికి తోడ్పడుతుంది.

పంట ఎదుగుదల మరియు పిలకల అభివృద్ధికి, పంచగవ్య ఎకరానికి నాలుగు లీటర్లు పిలక థలో, సప్తధాన్యాంకుర కషాయం 250 మి.లీ. 100 లీటర్ల నీటికి కలిపి గింజ పాలు పోసుకునే థలో పిచికారీ చేస్తే, గింజ నాణ్యత మరియు దిగుబడి పెరుగుతుంది.

సస్యరక్షణ పద్ధతులు (రసాయన రహిత)

వరి పంట నాటే సమయంలో మొక్కల కొనలు తుంచుకోవాలి. పొలంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ వెడల్పున తూర్పు – పడమర దిశగా కాలిబాటలు (అల్లీస్‌) ఏర్పాటు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. బంతి / కంది / మొక్కజొన్న / కూరగాయలతో పాటు. గ్లైరిసీడియా వంటి మొక్కలను గట్ల మీద మరియు కంచే పంటగా వేసుకోవాలి. పసుపు పచ్చ జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు, లైట్‌ ట్రాప్స్‌ (దీపపు ఎరలు) అమర్చడం వంటి పద్ధతులను అనుసరించాలి. మురుగు నీరు నిలువకుండా చూసుకోవాలి. ఇతర పంటల అవశేషాలు ఉంటే తొలగించాలి.

వరి పంటను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు పాటించవలసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు

పురుగుల నివారణ:

కాండం తొలుచు పురుగు: నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచడం, ట్రైకోగ్రామా గుడ్ల పరాన్నజీవులను ఎకరానికి నాలుగు కార్డుల చొప్పున 25వ రోజునుండి ప్రతి 10 పదిరోజులకు ఒక్కసారి చొప్పున 5సార్లు వదలాలి.

ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను పెట్టాలి.  ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. పురుగు నివారణకు 5% వేప కషాయం (శ్రీఐచజూ) 5 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. పిలక థలో మరియు అంకురం థలో 3 లీటర్ల అగ్నాస్త్రంను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఆకుముడుత పురుగు: తాడుతో మొక్కలపై లాగడం ద్వారా ఆకు గూడులు, పురుగులు పడిపోతాయి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి.  5% వేప కషాయం లేదా నీమాస్త్రం పంట తొలిథలో ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేయాలి.

సుడిదోమ: పొలంలో కాలిబాటలు తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని  జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చాలి. తూటికాడ కషాయం 5-6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారి చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.

ఉల్లికోడు: ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. అగ్నాస్త్రం 5 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తాటాకు తెగులు (హిస్పా): నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచి నాటుకోవాలి. తొలిథలో ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. తరువాత థలో ఎకరానికి 6 లీటర్ల బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

వరి ఆకు నల్లి: గట్ల మీద బంతి మొక్కలు నాటుకోవాలి. పంట మీద ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం వంద లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

పచ్చదోమ: పసుపు మరియు తెల్లని  జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర) ను పెట్టాలి. ఎకరానికి 5 లీటర్ల వావిలాకు కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

కంపునల్లి (గంధీ బగ్‌): ఉదయం పూట ఎకరానికి 5% వేప కషాయం 5 లీటర్లు లేదా అగ్నాస్త్రంను  3 లీటర్లు చొప్పున 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ల నివారణ:

అగ్గి తెగులు: బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి. గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. మారేడు పత్రం మరియు తులసి ఆకుల కషాయాన్ని ఎకరానికి 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

పొడ తెగులు: పొలంలో నీరు తక్కువగా ఉంచాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి లేదా పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి  ఎకరానికి పిచికారి చేయాలి.

బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు: ఎండిన అల్లం మరియు పాలతో కూడిన కషాయం 6 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి  ఎకరానికి పిచికారి చేయాలి. తరువాత ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

కాండం కుళ్ళు తెగులు: మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బీజామృతంతో విత్తనశుద్ధి, నారుశుద్ధి చేయాలి. పైన వివరించిన విధంగా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువలతో చేసిన కషాయాన్ని వాడి తెగులును నివారించవచ్చు.

టుంగ్రో వైరస్‌ తెగులు: గట్ల మీద కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి.  5% వేప కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

ఆకుమచ్చ తెగులు: పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

మానిపండు తెగులు: వరినాట్లు సకాలంలో వేసుకోవాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

పైన వివరించిన కొన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్‌లో భాగంగా రైతు సాధికార సంస్థ వారు రూపొందించిన ప్రణాళికలోని అంశాల నుంచి వారికి కృతజ్ఞతలతో సేకరించడమైనది. ఈ పద్ధతులు కొన్ని వ్యవసాయ పరిశోధన పరంగా ద్రువీకరించబడాలి. సేంద్రియ రైతులు స్వతహాగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు. రసాయన రహిత పద్ధతులు కావున పంటలకు నష్టం ఉండదు. నాణ్యత గల దిగుబడులు సాధించడానికి దోహదపడతాయి.   

డా. ఎస్‌.ఎమ్‌. విద్యాశేఖర్‌, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ఫోన్‌: 98494 42221; డి.ఎల్‌.ఏ. గాయత్రి, ఎమ్‌. శ్రీనివాసరావు, వి.కే. సింగ్‌, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, హైదరాబాద్‌ మరియు రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో.

Read More