ఉల్లి రైతులపై విరుచుకుపడ్డ కేంద్ర ప్రభుత్వం

ఆగస్టు 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించి, తక్షణం అమల్లోకి తెచ్చింది. 2022లో గోధుమ ఎగుమతుల్ని, గోధుమ పిండి ఎగుమతుల్ని నిషేధించి, సాధారణ బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించారు. నూకల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేశారు. 2023 ఫిబ్రవరి 14వ తేదీన కేంద్రప్రభుత్వం 2022-23 సంవత్సరానికి వ్యవసాయ ఉత్పత్తుల రెండవ ముందస్తు అంచనాలను ప్రకటించింది. రికార్డు స్థాయిలో 130.8 మిలియన్‌ టన్నుల బియ్యం, 112.2 మిలియన్‌ టన్నుల గోధుమలు ఉత్పత్తయినట్లు సగర్వంగా చెప్పారు. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తయినప్పుడు వాటి ఎగుమతులపై ఉక్కు పాదం మోపి, వాటి ధరల్ని తొక్కి పెట్టి, రైతుల్ని సంక్షోభంలోకి పెట్టారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో బియ్యం వినియోగం 112 మిలియన్‌ టన్నులు, గోధుమ వినియోగం 99.8 మిలియన్‌ టన్నులు మాత్రమే. 19 మిలియన్‌ టన్నుల బియ్యం, 13 మిలియన్‌ టన్నుల గోధుమలు మిగులు ఉన్నా వాటి ఎగుమతుల్ని తొక్కి పెట్టి, ధరల్ని దించి, సేకరణ బాధ్యతల నుండి తప్పుకుని, అన్నదాతల ఆదాయాలను దాదాపు లక్ష కోట్ల రూపాయల మేరకు తగ్గించటం ప్రభుత్వ విదానాలను తేటతెల్లం చేసింది. జులై నెలలో బాస్మతీ, ఉప్పుడు బియ్యం మినహా బియ్యం ఎగుమతుల్ని నిషేధించి రైతు వ్యతిరేక వైఖరిని ప్రభుత్వం ప్రదర్శించింది. అనావృష్టి, అతివృష్టి వివిధ రాష్ట్రాల్లో వరి ఉత్పత్తులను ప్రభావితం చేసి, కొరత ఏర్పడ వచ్చనే అనుమానంతో బియ్యం ఎగుమతుల్ని నిషేధించామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. తాజాగా అమెరికా ప్రభుత్వ వ్యవసాయ శాఖతోపాటు దేశంలో విశ్లేషకుల అంచనా ప్రకారం వరి విస్తీర్ణం 47 మిలియన్‌ హెక్టార్ల నుండి 46.5 మిలియన్‌ హెక్టార్లకు మాత్రమే తగ్గుతుందనీ, బియ్యం ఉత్పత్తి గత సంవత్సరంకన్నా ఒక మిలియన్‌ టన్నులు మాత్రమే తగ్గవచ్చని తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో బియ్యం ఎగుమతుల్ని అనుమతించి, ఎగుమతి సుంకాన్ని 25 శాతానికి పెంచితే ఉభయతారకంగా ఉండేది. వచ్చే ఖరీఫ్‌ పంట మార్కెట్‌కి వచ్చినప్పుడు ధాన్యం ధరలు తగ్గకుండా ఉంటాయి. ఆగస్టు 31వ తేదీన జరిపే సవిూక్షలో నిషేధాన్ని ఎత్తివేస్తారని ఆశిద్దాం.

ఉల్లిపై తొందరపాటు చర్య

బియ్యం విషయంలో తప్పుడు అంచనాలను, భయాల ఆధారంగా ఎగుమతుల్ని నిషేధించినట్లుగానే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడం కూడా రైతు వ్యతిరేక చర్యే. ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్రలో రైతు సంఘాలు ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. వాస్తవానికి ఆగస్టు 19వ తేదీన నాసిక్‌ జిల్లాలోని ‘లాసల్‌గావ్‌’ మార్కెట్‌లో ఉల్లి హోల్‌సేల్‌ ధర క్వింటాలుకి రూ. 2300గా ఉంది. రిటైల్‌ ధర సగటున రూ. 30.72లు కిలోకి ఉంది. నాణ్యమైన ఉల్లికి హర్యానాలో కిలోకి రూ. 53/-లుగా ఉండగా, మధ్యప్రదేశ్‌లో నాసి రకం ఉల్లికి కిలో ధర రూ. 10/-లుగా ఉండి ఉల్లిలో నీటి శాతంలో ఉండే వ్యత్యాస్యాన్ని బట్టి ధరల్లో తేడాలుంటాయి. టోకు ధర కిలోకి రూ. 23లుంటే ఎగుమతి ధర కిలోకి రూ. 25గా ఉంది. ఇదేవిూ ఆందోళనకరమైన పరిస్థితి కాదు. 2022 జులై నుండి 2023 జూన్‌ వరకు దేశంలో 31.12 మిలియన్‌ టన్నుల ఉల్లిగడ్డలు ఉత్పత్తయినట్లు అంచనా. 1.91 మిలియన్‌ హెక్టార్లలో ఉల్లి పంట సాగయింది. సగటున హెక్టారుకి 16.3 టన్నుల దిగుబడి వచ్చింది. దేశంలో ఒక్కొక్క కుటుంబానికి సగటున నెలకు 5 కిలోల ఉల్లిగడ్డల్ని వినియోగిస్తున్నారు. దేశంలో షుమారుగా 33 కోట్ల కుటుంబాలున్నాయి. సంవత్సరానికి దేశీయ ఉల్లి వినియోం 21 మిలియన్‌ టన్నులుగా లెక్క కట్టవచ్చు. అయినా మిగులు 10 మిలియన్‌ టన్నులకు పైగానే ఉంటుంది. ఏప్రిల్‌, మే మాసాల్లో వచ్చిన అకాల వర్షాల వల్ల ఉల్లిగడ్డల్ని కొంత తేమతోనే నిలవపెట్టారు. నిల్వలో కొంత మేరకు ఉల్లి గడ్డలు కుళ్ళిపోవటంవల్ల రైతులు నష్టపోయారు. సెప్టెంబరు మాసంలో కొంత మేరకు ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. కాని ప్రభుత్వ నిర్ణయంవల్ల ఎగుమతులు తగ్గుతాయని భావిస్తున్నారు. ఫలితంగా ధరలు కూడా తగ్గవచ్చు. ప్రభుత్వ సంస్థ ‘నేఫెడ్‌’ షుమారుగా 3 మిలియన్‌ టన్నుల ఉల్లిగడ్డల్ని నిల్వ ఉంచింది. రోజుకి ఐదు వేల టన్నుల చొప్పున ఈ సంస్థ ఢిల్లీ మార్కెట్‌లో కిలో 25 రూపాయల రేటుకి అమ్మటం ద్వారా ఉల్లిగడ్డల ధరల్ని అదుపులో ఉంచాలని నిర్ణయించింది.

ఉత్పత్తిలో పెరుగుదల

ఉల్లి, వెల్లుల్లి వాడకంవల్ల తామస గుణం పెరుగుతుందని కొందరి నమ్మకం. 1961లో దేశంలో ఉల్లి వాడకం తక్కువగా ఉండేది. తలసరి ఉల్లి వినియోగం కేవలం 2.61 కిలోలు మాత్రమే. సంవత్సరానికి 2.61 కిలోలంటే నెలకు 218 గ్రాములే. కాని కాలక్రమేణా ఉల్లి వాడకం పట్ల ఆసక్తి పెరిగింది. ఉల్లిని వాడితే కూరల రుచి బాగుంటుందనీ, ఆరోగ్యం మెరుగవుతందనీ నమ్మకం పెరిగింది. 2020 నాటికి ఉల్లి తలసరి వాడకం 15 కిలోలు దాటింది. 60 సంవత్సరాల్లో తలసరి వాడకం ఆరు రెట్లుకన్నా ఎక్కువ పెరగటంవల్ల గిరాకీ పెరిగింది. 2020లో దేశంలో ఉల్లి ఉత్పత్తి 26.09 మిలియన్‌ టన్నులుగా అంచనా వేయబడ్డది. 2021లో 26.64 మిలియన్‌ టన్నులు,  2022లో 31.69 మిలియన్‌ టన్నులు, 2023లో 31.01 మిలియన్‌ టన్నులుగా అంచనా వేయబడ్డాయి. కాని ఈ ఉత్పత్తి పెరుగుదలకు విస్తీర్ణం పెరగటం ముఖ్యకారణమైంది. 2018-19లో సగటు దిగుబడి హెక్టారుకి 19.7 టన్నులుగా ఉంది. 2019-20లో దిగుబడి హెక్టారుకి 19.2 టన్నులకు తగ్గింది. 2020-21లో ఇంకా తగ్గి 16.4 టన్నులుగా నమోదైంది. 2021-22, 2022-23లో దిగుబడి 16.2 టన్నులకు తగ్గింది. 2015-16 నుండి 2018-19 వరకు సగటు దిగుబడి 20 టన్నులుగా ఉన్నది క్రమంగా 20 శాతం వరకు తగ్గింది. వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడిన అననుకూలత వల్ల దిగుబడులు తగ్గాయి. ఐతే విస్తీర్ణం పెరుగుతూ ఉండటంవల్ల ఉత్పత్తి పెరిగింది. 2014-15 నుండి 2021-22 మధ్య సగటు విస్తీర్ణం 1.4 మిలియన్‌ హెక్టార్లు కాగా, సగటు ఉత్పత్తి 24 మిలియన్‌ టన్నులుగా ఉంది. 2021-22లో ఉల్లి విస్తీర్ణం 1.62 మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది. 2022-23లో మరింత పెరిగి 1.91 మిలియన్‌ హెక్టార్లకు చేరింది. ఉత్పత్తి పెరుగుతుండటంవల్ల సెప్టెంబరు, 2021 నుండి ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. ఉల్లి సాగుకి మూడు సీజన్లున్నాయి. ఖరీఫ్‌ పంటను జులై-ఆగస్టులో విత్తి, అక్టోబరు నుండి నవంబరు నెలల్లో ఉల్లిగడ్డలను తీస్తారు. సుమారు 20 శాతం ఉత్పత్తి ఈ మాసాల్లో లభిస్తుంది. ఈ పంట అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో వినిమయదారుల అవసరాలను తీరుస్తుంది. రెండవ పంటను అక్టోబరు-నవంబరు నెలల్లో విత్తి, జనవరి నుండి మార్చి మధ్య తీస్తారు. 15 శాతం పంట ఈ సీజనులో లభిస్తుంది. జనవరి నుండి మార్చి వరకు ఈ పంట వినిమయదారుల అవసరాలను తీరుస్తుంది. డిసెంబరు-జనవరి మాసాల్లో నాటే రబీ పంట ముఖ్యమైనది. మొత్తం ఉత్పత్తిలో 65 శాతం రబీ పంట ద్వారా లభిస్తుంది. ఈ పంటను మార్చి నుండి మే మాసాల మధ్య తీస్తారు. ఎండాకాలంలో వచ్చే ఈ పంట ఏప్రిల్‌ నుండి సెప్టెంబరు వరకు వినిమయదారుల అవసరాలు తీరుస్తుంది. వేసవిలో వచ్చే ఈ పంటలో నీటి శాతం తక్కువగా ఉండి, నిల్వపెట్టడానికి అనువుగా ఉంటుంది. ఈ సంవత్సరం వేసవికాంలో వర్షాలు పడటంవల్ల నీటి శాతం ఎక్కువగా ఉన్న ఉల్లిగడ్డలనే నిల్వ చేయటంవల్ల, నిల్వలో కొంతమేరకు ఉల్లిగడ్డలు పాడయినట్లు వార్తలు వచ్చాయి. జూన్‌ మాసంలో ఉల్లిధరలు, 1.65 శాతం పెరిగాయి. జులై మాసంలో ధరలు 11.72 శాతం పెరిగాయి. జూన్‌ నుండి సెప్టెంబరు వరకు ఉల్లి ధరల్లో కొంత పెరుగుదల ఉండటం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కొత్త పంట ఈ సమయంలో రాదు కాబట్టి నిల్వ ఖర్చుల కారణంగా ధరలు పెరుగుతుంటాయి. ఇదేవిూ ఆందోళన చెందాల్సి విషయం కాదు. 

ద్రవ్యోల్బణంపై చింత

ప్రపంచ వ్యాప్తంగా ద్రవోల్బణం 5 శాతానికి పైగా ఉంది. భారతదేశంలో రిటైల్‌ స్థాయిలో ద్రవ్యోల్బణం జూన్‌, 2023లో 4.87 శాతంగా ఉంది. కాని జులై నెలలో 7.44 శాతానికి పెరిగింది. అధిక వర్షాల వల్ల కూరగాయ పంటలు దెబ్బతిని, వాటి ధరలు కిలోకి వంద రూపాయలు దాటాయి. టమోటా ధర కిలోకి రెండు వందలు దాటింది. ఐతే ఇది తాత్కాలికమే. 15 రోజుల తర్వాత టమోటా ధర రూ. 60లకు తగ్గింది. క్రమంగా ఇతర కూరగాయల ధరలు తగ్గవచ్చు. వాటితోపోలిస్తే ఉల్లి ధర తక్కువగా పెరిగింది. ఒక కుటుంబం తమ అవసరాలకు నెలకు ఇరవై వేలు ఖర్చు పెడుతుంటే, అందులో ఆహారానికి ఖర్చు పెట్టేది ఎనిమిది వేల రూపాయలుంటుంది. అందులో కూరగాయలకు వెచ్చించేది ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలే. కూరగాయాల ఖర్చులో ఉల్లికి ఖర్చు పెట్టేది 13 శాతం మాత్రమే. ఉల్లి ధర పన్నెండు శాతం పెరిగితే దాని ప్రభావం మొత్తం రిటైల్‌ ద్రవ్యోల్బణంలో ఒకటి రెండు పాయింట్లు మించి ఉండదు. సెప్టెంబరులో ఉల్లి ధర రూ. 60లకు చేరుతుందనే భయంతో ప్రభుత్వం హడావుడిగా ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించడం సమంజసం కాదు. దేశంలో ఉత్పత్తయ్యే ఉల్లిలో 10 నుండి 15 శాతం మాత్రమే ఎగుమతి అవుతుంది. 2020-21లో 1.58 మిలియన్‌ టన్నులు, 2021-22లో 1.54 మిలియన్‌ టన్నులు, 2022-23లో 2.53 మిలియన్‌ టన్నులు ఎగుమతయ్యాయి. ఎగుమతులు కొంచెమే అయినా దేశంలో ఉల్లి ధరలు నిలబడటానికి ఊతమిస్తున్నాయి. బంగ్లాదేశ్‌, మల్లేషియా, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలు మనదేశంనుండి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఎగుమతుల విషయంలో ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 2019లో ఎగుమతి ధర ఒక కనీస స్థాయిలోనైనా ఉంటేనే ఎగుమతుల్ని అనుమతించే విధానం ఉండేది. 2020 సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు ఎగుమతుల్ని పూర్తిగా నిషేధించారు. 2021 జనవరి 1వ తేదీ నుండి ఉల్లి ఎగుమతుల్ని స్వేచ్ఛగా చేసుకోవచ్చని అనుమతించారు. ఉల్లి విత్తనాల ఎగుమతిపై మాత్రం 2023 చివరి వరకు కొన్ని ఆంక్షలను విధించారు. తాజాగా విధించిన 40 శాతం ఎగుమతి సుంకం డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుంది. దీనివల్ల రెండు పరిణామాలు ఏర్పడవచ్చు. భారత్‌ నుండి ఉల్లి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవచ్చు. లేదా చాలా వరకు తగ్గవచ్చు. ఉల్లి దిగుమతులపై ఆధారపడే దేశాలు కొంత మేరకు ఎక్కువ ధర చెల్లించవచ్చు. కాని దీర్ఘకాల ఒప్పందాలు చేసుకున్న కంపెనీలకు అనేక ఇబ్బందులు ఎదురు కావచ్చు. భారత్‌ నుండి దిగుమతి చేసుకునే దేశాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు. కాని ఖరీఫ్‌ పంట మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ధరలు తగ్గవచ్చు. ఐదారు మిలియన్‌ టన్నుల ఉత్పత్తిపై కిలోకి రూ. 15 రూపాయల చొప్పున ఉల్లి రైతుల ఆదాయాలు 9,000 కోట్ల రూపాయల వరకు తగ్గవచ్చు. అంతేకాకుండా క్రిందటి రబీ పంటలో మిగిలిన ఐదారు మిలియన్‌ టన్నుల నిల్వపై లభించే ఆదాయం కూడా అదే విధంగా మరో 9000 కోట్ల రూపాయల మేరకు తగ్గవచ్చు. ఇలా మొత్తం దేశంలోని ఉల్లి రైతులు రూ. 15,000 నుండి 20,000 కోట్ల రూపాయలు నష్టపోవచ్చు. ఆ మేరకు వినిమయదారులు లాభించవచ్చు. ఎగుమతులున్నప్పటికంటే ఎగుమతులు లేనప్పుడు వినిమయదారులకు కిలోకి రూ. 15లు తక్కువ ధరకు నాలుగైదు నెలలపాటు లభించవచ్చు. ఇలా వినిమయదారుల ప్రయోజనాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించినప్పుడల్లా రైతులు నష్టపోతున్నారు. ఏదైనా ఉత్పత్తి బాగా తగ్గినప్పుడు ఎగుమతుల్ని నియంత్రివచ్చు. కాని రికార్డు స్థాయిలో, గోధుమ, ఉల్లి ఉత్పత్తులు పండినప్పుడు ఎగుమతి ఆంక్షల్ని విధించడం సమంజసం కాదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం రైతుల ప్రయోజనాలను బలిపెట్టకూడదు.

పునరాలోచన అవసరం 

ఊహాజనితమైన అంచనాల ఆధారంగా తొందరపాటు చర్యలు చేపట్టటం సమంజసం కాదు. అహ్మద్‌నగర్‌, నాసిక్‌లలో రైతులు ఎగుమతి సుంకాలను ఎత్తివేయాలని ఆందోళన చేస్తున్నారు. కూరగాయల ధరలు పెరిగాయి. కాబట్టి శుద్ధి చేసిన కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. వాటి ఎగుమతిని కూడా నిషేదించే ప్రమాదం ఉంది. ఉల్లి ధరలు తగ్గితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, బీహార్‌లలో ఉల్లి పండించే రైతులతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి రైతులు కూడా నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్‌లో 0.75 మిలియన్‌ టన్నులు, తెలంగాణాలో 0.30 మిలియన్‌ టన్నుల ఉల్లి ప్రతి సంవత్సరం ఉత్పత్తవుతున్నది. ఒక్కోసారి ఉల్లి బాగా పండినప్పుడు రైతులకు రవాణా ఖర్చులు కూడా రావు. కిలోకి ఐదు రూపాయలు కూడా గిట్టని సందర్భాలున్నాయి. రైతుకి కిలోకి రూ. 25 నుండి 30 రూపాయలు లభించడం ఎప్పుడో కాని జరగదు. ఆ సమయంలో ఎగుమతిపై అదిక మొత్తంలో సుంకాలు వేయడం, నిషేధించడం న్యాయం కాదు. కొరతలేని సమయాల్లో కూడా ద్రవ్యోల్బణం నెపంతో రైతుల్ని దెబ్బతీయడం వాంఛనీయంకాదు. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలతో ప్రభుత్వాలు దుందుడుకు చర్యలకు పాల్పడినప్పుడు రైతులు ఐక్యంగా ఉద్యమించాలి. అహేతుకంగా రైతుల ఆదాయాలను దెబ్బతీసే ప్రయత్నాలను వ్యతిరేకించకుంటే ప్రభుత్వం మరిన్ని రైతు వ్యతిరేక చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది.          

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌),

ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

ఉల్లి సాగులో మెలకువలు

ఉల్లిగడ్డ అలియేసీ కుటుంబానికి చెందిన ద్వి వార్షిక మొక్క అధిక ఔషధ గుణములు మరియు కొన్ని రకాల చికిత్సలకు ఉపయోగ పడుతుంది. ఇది సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే మొక్క కానీ ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో కూడా పెరుగును. దీర్ఘకాలిక పగటి కాంతి ఉల్లిపాయలో లశునము ఊరడానికి సహకరిస్తుంది కానీ ఉష్ణోగ్రత మొక్క పుష్పించడానికి దోహదపడుతుంది. ఉల్లిపాయను దాదాపు ప్రపంచంలోని అన్ని సంస్కృతుల ప్రజలు వంటలలో నిత్యావసర పదార్థంగా వాడతారు. ఇది వంటకి రుచి, సువాసనని అందిస్తుంది. దీన్ని సలాడ్‌ రూపంలో కూడా తీసుకుంటారు. ఉల్లిపాయలో వివిధ రకాల విశిష్ట రసాయన పదార్థాలున్నాయి. అవి ఫ్లవోనోయిడ్స్‌, ఆంథోసైయానిన్స్‌, ఫ్రక్టో ఒలిగో శకరైడ్‌, ఆర్గానో-సల్ఫర్‌లు ఔషధంగా ఆరోగ్యాన్ని పెంచి రుగ్మతలు, డయాబెటిస్‌ నుండి కాపాడతాయి. భారతదేశం నుండి వివిధ దేశములకు ఎగుమతి అయ్యే ఫలములు, కూరగాయలలో ఉల్లిగడ్డ ద్వారా వచ్చే ఆదాయపు వాటా శాతము 26%. చైనా ప్రపంచంలోనే ఉల్లి సాగులో మొదటి స్థానంలో ఉంటే భారత దేశం రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఉల్లిపాయలు అధికంగా పండే రాష్ట్రం మహారాష్ట్ర కాగా తదనంతర స్థానంలో కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులు ఉల్లి సాగుకు అనుకూలమైనవి. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకపోవడం, తెగుళ్లు, చీడల బెడద, ఉల్లిపాయను సాగుచేసే విస్తీర్ణం తక్కువ ఉండటం ఇలాంటి వివిధ కారణాల వల్ల రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే ఉల్లిపాయ దిగుబడి ఆశించినంత స్థాయిలో లేదు. కానీ ఆధునిక సాంకేతికత, నూతనంగా విడుదల అయిన ఉల్లి వంగడాలు, ఉత్పత్తిలో మెలకువలు సంక్షిప్త కీటక, వ్యాధి నివారణ, సాగులో మెలకువలు పాటించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చు.

సాగు చేయు ప్రాంతాలు, సమయం

తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిపాయను ఖరీఫ్‌ (ఆగష్టు – నవంబర్‌) మరియు రబి (ఏప్రిల్‌ – జూన్‌) రెండు కాలములలో సాగు చేస్తారు కాని అధికంగా ఉత్పత్తి అయ్యేది రబీ కాలంలోనే. తెలంగాణలో ఉల్లిని సాగుచేసే ప్రాంతాలు వరుసగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌. ఉల్లిగడ్డ లశుణం సరిగ్గా పెరగకపోవడానికి గల కారణాలు ఉల్లిగడ్డ లశునము సరిగ్గా ఎదగక ముందే పుష్పించడం, దుంప పగుళ్లు వచ్చుట, సరైన ఉల్లిగడ్డ విత్తన రకమును ఎంచుకోవడములో తప్పిదం, నిస్సారమైన భూమి, ప్రతికూల పర్యావరణ కారకములు, ఉల్లిగడ్డ నిల్వచేయడంలో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడం.

నేలలు, వాతావరణం

భూ సారము అధికంగా ఉండి, సరి అయిన మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక నేలలు మరియు చల్లని వాతావరణము ఉల్లిపాయలో సరయిన పెరుగుదలకు దోహదపడే అంశాలు. దీర్ఘకాలిక కాంతి ఉండి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు దుంప ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. ఉష్ణమండల తెలంగాణ ప్రాంతాలలో దీర్ఘకాల కాంతి వంగడాలను పెంచుకోవడానికి అనుకూలమైనవి. అధిక ఉష్ణోగ్రత స్వల్ప ఆర్ద్రత ఉండే వాతావరణంలో దుంప త్వరగా ఎదుగుతుంది. ఉల్లిగడ్డ శీతకాలాపు పంట, దుంపల కోసం, ఆకు కోసం సాగు చేస్తారు. 

సరైన వంగడాలు: N 2-4-1, ఆర్కా నికేతన్‌, అగ్రి ఫౌండ్‌ లైట్‌ రెడ్‌, పూస రెడ్‌, భీమా రాజ్‌ మరియు భీమా రెడ్‌ అనేవి రబి సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైన రకాలు.

విత్తనం ఎంపిక, నారుమడి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉల్లిగడ్డను విత్తనము ద్వారా గాని, లేదా చిన్న దుంపల ద్వారా గాని సాగు చెయ్యవచ్చు. నారు మొక్కలు చాలా అనువైనవి నారు మొక్కలను ముందుగా నిర్మించుకున్న నారుమడిలో విత్తనాలను తగినంత దూరములో విత్తుకోవాలి. బెడ్‌లను భూమి నుంచి 10-15 సెం.మీ. ల ఎత్తులో నిర్మించుకోవాలి ప్రతి రెండు బెడ్‌ ల మధ్య కనీస నిడివి 50సెం.మీ. లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల అంతరకృషి సులభతరమగును రెండు విత్తన వరసల మధ్య దూరము 4-5 సెం.మీ.లు ఉండేట్లు చూసుకోవాలి. నారుకుళ్లు తెగులును అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని 4-6 వారాల వయసున్న నారు మొక్కలను ప్రధాన నాటుకోవాలి. 

నీరు, యాజమాన్యం

ఉల్లిమొక్క నీటి ఎద్దడిని దుంప ఊరే దశ, దుంప అభివృద్ధి చెందే దశలో అస్సలు తట్టుకోలేదు. పంట పరిపక్వత దశకు చేరుకున్న తరవాత అధిక నీరు ఇచ్చినట్లయితే ద్వితీయ వేర్లు వస్తాయి తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పంట కోసే రెండు వారాల ముందు నుండి నీటి సరఫరా ఆపి వేయాలి. ఉల్లి సాగులో నీటిని తుంపర సేద్యము, బిందు సేద్యము ద్వారా అందించినచో సంప్రదాయ పద్ధతి లో సాధించే దానికన్నా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. బిందు సేద్యము ద్వారా నీటిలో కరిగే పోషకాలను వాడటం సరైన లాభాలను ఆర్జించవచ్చు. పశు సంబంధిత వ్యర్ధాలు, పంట వ్యర్ధాలు, పచ్చి రోట్ట ఎరువులను వాడటం, పంట మార్పిడి, మృత్తికా పరీక్ష అనంతరం సూచించిన మోతాదులో నియమిత ఫర్టిలైజర్‌ ను అందించటం మేలైనది. ఒక హెక్టార్‌ భూమికి సుమారు 40 టన్నుల పశవుల ఎరువు వాడటం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. 

కలుపు నివారణ: ఉల్లి మొక్క వేరు వ్యవస్థ చిన్నధి అందువల్ల కలుపు ను అస్సలు తట్టుకోలేదు. సరైన సమయములో కలుపు ను నియంత్రన చర్యలు చేపట్టాలి. 

అంతర పంటల సాగు

ఒకే  సంవత్సరంలో వరసగా కేవలము ఉల్లిగడ్డ ను సాగు చేయకూడదు. దీనివల్ల భూమి యొక్క సారము తగ్గిపోవును, చీడ పీడల ఉధృతి అధికమగును. రసాయనిక ఎరువులు వాడటానికి బదులుగా ఇతర జాతి పంటలను పండించడం ద్వారా నేల సారవంతంగా మారును. ఉల్లి స్వల్పకాలపు పంట కాబట్టి రెండు ఋతువుల మధ్య అంతర పంట సాగు చెయ్యవచ్చు. బెండి, ముల్లంగిల మధ్య అంతర పంటగా ఉల్లిని సాగు చేయడము ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. అన్నిటికంటే బీట్‌రూట్‌తో ఉల్లిని 15 సెం.మీ.ల వ్యవధితో సాగు చేసినప్పుడు అధిక లాభాలు గణించవచ్చు.

పంట పరిపక్వత దశ,  కోయు విధానం

నిల్వ చేసే ఉల్లిపాయలను కోత కోయడానికి మెడ విరుపు దశ,అత్యంత ముఖ్యమైనది. దాదాపుగా 75% పై ఆకులు నేలకు ఒరగడం ఇది మొక్క పూర్తిగా కోతకు వచ్చిందని సూచిస్తుంది. కోతకు 2-3 వారాల సమయం ముందు నీరు అందించడం ఆపాలి. కోత కోసే సమయం లో సమయంలో దుంపలను భూమి నుండి లాగి ఆకుల చివరలను కత్తిరించాలి. కోసిన దుంపలను వ్యవసాయ భూమి లోనే 2-3 వారాలు దుంపల పై ఉన్న పొలుసులు పూర్తిగా పొడిగా అయ్యే అంత వరకు ఆరనివ్వాలి.  ఆకు పచ్చని ఉల్లి పాయల కోసం దుంపలను భూమి నుండి లాగి కాడలను 15 సెం.మీ. లు ఉండే విధంగా కత్తిరించాలి.

చీడ పీడలు, తెగుళ్లు నివారణ

ఉల్లిలో చీడపీడలు, తెగుళ్లు కూడా అధికమే, కేవలం తామర పురుగుల ద్వారా 50% పంట నష్టం జరుగుతుంది. తామర పురుగులు పొడిగా వేడిగా ఉండే వాతావరణంలో అధిక నష్టాన్ని కలుగ చేస్తాయి. ఇవే కాకుండా మొక్కలకు నీరు పెట్టేటప్పుడు, ఆచ్ఛాదన, నాటుపెట్టే సమయం వల్ల  కూడా తామర పురుగుల ఉధృతి పెరుగును. వివిధ రకాల సేంద్రియ కషాయాలు మరియు ద్రావణాలతో తామర పురుగుల ఉధృతిని అరికట్టవచ్చు బవేరియా బస్సియానా అనబడే శిలీంద్రంను వాడటం ద్వారా అనేక రకాల చీడలను అరికట్ట వచ్చు. అస్పెర్గిల్లస్‌నైజర్‌ మరియు ఫ్యూసేరియం అనే శిలీంద్ర జాతులు విత్తనము ద్వారా దుంపలలో కూడా వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఆర్థ్రత వున్న పరిస్థితులలో నారుకుళ్ళు తెగులు ద్వారా 75-80 శాతము నష్టం కలుగును. ఎదుగుదల థలో అధిక నీటి వల్ల నారుకుళ్లు, ఊదారంగు మచ్చ  వ్యాధి సోకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తగిన మోతాదులో నీటిని అందించడం వలన అరికట్టవచ్చు.              

డా. బి. అశోక్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వెజిటబుల్‌ సైన్స్‌, మల్లారెడ్డి యూనివర్సిటి, బి. గౌతమి, పిహెచ్‌.డి. స్కాలర్‌, ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీ. 

Read More