జామపండు: ప్రకృతి ప్రసాదించిన అమృత ఫలం

విశిష్టమైన సువాసన, అద్భుతమైన రుచి, అపరిమితమైన పోషక విలువలు కలగలిసిన పండు జామ. తక్కువ ధరకే లభించే ఈ పండును సామాన్యుడి ఆరోగ్యాన్ని కాపాడే “పేదవారి ఆపిల్” గా అభివర్ణిస్తారు. అన్ని వయసుల వారికీ ఎంతో మేలు చేసే సహజ పోషకాహార గని.

జామ పోషకాల సమృద్ధి :
జామపండులో విటమిన్లు, ఖనిజాలు, ఆహారపు పీచు, ప్రోటీన్ మరియు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ‘C’కి ఇది అత్యుత్తమ సహజ వనరు. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

జామపండులోని పీచు జీర్ణక్రియను సులభతరం చేయడంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని పొటాషియం, కాల్షియం, భాస్వరం మరియు ఇతర ఖనిజాలు శరీరంలోని వివిధ జీవక్రియలకు సహకరిస్తాయి.

జామపండులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన స్వేచ్ఛా రాడికల్స్‌తో పోరాడి కణాల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. అందువల్ల, జామపండును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు.

జామపండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు సులభంగా లభిస్తాయి. జామపండు శరీరానికి అవసరమైన అనేక పోషకాల సమాహారం. ఇందులో విటమిన్ ‘C’ అత్యధిక పరిమాణంలో ఉంటుంది; ఇది ఆపిల్ మరియు నారింజ వంటి పండ్ల కంటే కూడా అనేక రెట్లు అధికంగా లభిస్తుంది. అలాగే, ఇందులోని ఆహారపు పీచు (Dietary Fiber) జీర్ణ వ్యవస్థ సరైన రీతిలో పనిచేయడానికి ఒక అత్యుత్తమ ఇంధనంగా తోడ్పడుతుంది. వీటితో పాటు పొటాషియం, కాల్షియం, భాస్వరం మరియు ఇనుము (Iron) వంటి అవసరమైన ఖనిజ లవణాలు జామపండులో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీర కణాల క్షీణతను అడ్డుకోవడంలో మరియు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

జామపండుతో లభించే 6 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు

  1. శక్తివంతమైన సహజ రోగనిరోధక కవచం
    జామపండులోని విటమిన్ C రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జామపండు బ్యాక్టీరియా మరియు వైరస్‌ల దాడి నుంచి శరీరాన్ని సమర్థవంతంగా రక్షిస్తుంది. ఇది జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అందువల్ల, పిల్లల సరైన ఎదుగుదలకు మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది ఒక అద్భుతమైన సహజ రక్షణ కవచంగా తోడ్పడుతుంది.
  2. జీర్ణక్రియ సమర్థవంతం – మలబద్ధకానికి చెక్
    అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామపండు పేగుల కదలికలను క్రమబద్ధీకరించి, మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్తి మరియు గ్యాస్ట్రిక్ వంటి జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించడంలో విశేషంగా సహాయపడుతుంది. అంతేకాకుండా, పేగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా (Probiotics) వృద్ధి చెందడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.
  3. మధుమేహ (డయాబెటిస్) నియంత్రణ
    జామపండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI) కలిగిన పండు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. జామపండులోని పీచు పదార్థం వల్ల చక్కెర శరీరంలోకి శోషించబడే వేగం గణనీయంగా తగ్గుతుంది. అందుకే, డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారు తమ పోషకాహార లేదా ఆరోగ్య నిపుణుల సలహాతో దీనిని మితమైన పరిమాణంలో తీసుకోవడం చాలా శ్రేయస్కరం.
  4. గుండె ఆరోగ్యం & కొలెస్ట్రాల్ నియంత్రణ
    జామపండులో ఉండే పొటాషియం మరియు కరిగే పీచు (Soluble Fiber) గుండెకు కొండంత అండ. జామపండులోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేసి, రక్తపోటును (BP) నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులోని పీచు పదార్థం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, రక్తప్రసరణను సులభతరం చేస్తుంది. ఫలితంగా, గుండెపోటు మరియు పక్షవాతం (Stroke) వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి.
  5. నిత్య యవ్వన చర్మ సౌందర్యం
    జామపండులోని యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C చర్మంలో కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తిని పెంచడానికి దోహదపడతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని సమర్థవంతంగా అడ్డుకుని, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నిరోధిస్తూ చర్మాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
  6. రక్తహీనత (అనీమియా) నివారణకు సహకారం
    జామపండులోని విటమిన్ C, మనం తీసుకునే ఇతర ఆహారాలలోని ఇనుమును (Iron) శరీరం సరిగ్గా గ్రహించేలా (Absorption) చేస్తుంది. అందువల్ల, ఆకుకూరలు మరియు పప్పు ధాన్యాలతో పాటు జామపండును తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరిగి, అనీమియా (రక్తహీనత) మరియు అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.

జామపండును ఉపయోగించాల్సిన సరైన విధానం
ప్రకృతి సూచన: స్థానికంగా, చౌకగా లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడమే సంపూర్ణ ఆరోగ్యానికి తొలిమెట్టు.

రోజుకు ఒక మీడియం సైజ్ జామపండును తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. పిల్లలు, గర్భిణులు, శారీరక శ్రమ చేసేవారు మరియు వృద్ధులు – ఇలా ప్రతి ఒక్కరూ దీనిని నిర్భయంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్ సమయంలో జామపండును తాజాగా కోసి తినడం వల్ల శరీరానికి అందులోని గరిష్ట పోషకాలు లభిస్తాయి.

ముగింపు:
జామపండు రుచి, పోషక విలువ మరియు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎంతో విలువైన పండు. ఇందులో విటమిన్ C, పీచు, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మధుమేహ నియంత్రణకు సహకరించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం, బరువు నియంత్రణకు సహాయపడడం మరియు రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

ప్రతిరోజూ సమతుల్య ఆహారంతో పాటు జామపండును మితమైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను పొందవచ్చు.

ప్రత్యేకంగా పిల్లలు, గర్భిణులు, పెద్దలు మరియు వృద్ధులకు ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. స్థానికంగా సులభంగా లభించే ఇలాంటి పోషక పండ్లను తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరళమైన మరియు ప్రభావవంతమైన మార్గం.

ఏవో ఖరీదైన పండ్ల వెనుక పడకుండా, మనకు అందుబాటులో ఉండే జామపండును క్రమం తప్పకుండా తింటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం.

“రోజుకో జామపండు – పరిపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధం!”

బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

వండని వంట… కడుపులో చల్లటి భోజనం

మామూలుగా ఎండాకాలంలో ఏమి తినాలనిపియదు. నీళ్లు బాగా తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, కాసేపటికి నీరసం వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో దీన్ని బాగా తినొచ్చు.

కావాల్సిన వస్తువులు: ఒక సగం కీర, చిన్న దోసకాయ ముక్క, మూడు నాలుగు క్యారెట్ ముక్కలు అంటే చిన్న క్యారెట్ ఒకటి, చిన్న బీట్రూట్ ముక్క రెడ్ కలర్ ఉండొద్దు అనుకుంటే బీట్రూట్ వేయకుండా ఉండొచ్చు. ఒక టమాటా, ఒక చిన్న కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని….

చేసుకునే విధానం: అన్ని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది గట్టిగా లేకుండా కొంచెం లూస్‌గా ఉంటేనే బాగుంటుంది. ఉదయము, మధ్యాహ్నము ఎప్పుడైనా మనం దీన్ని తినొచ్చు. అమృత ఆహారం అనలేము, ఎందుకంటే సాల్ట్ కలుస్తుంది కాబట్టి. ఉప్పు లేకుండా కూడా బాగానే ఉంటుంది.
అన్నం తింటేనే కడుపు నిండుతుంది అనుకునేవాళ్ళు కరెక్ట్‌గా ఒక ముద్ద అన్నాన్ని పిసికి, దీంట్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది

కీర లేకున్నా టమాటా, ఉల్లిగడ్డ, పెరుగు…. వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… అమృత ఆహారము

ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఆహారము ‘అమృత ఆహారము’.

ఈ అమృతాహారం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి. దీని తయారీ విధానము మొదట్లో ఇది కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ, ఒకసారి చేసుకుంటే చాలా సులువు. దీనికి సంబంధించి మూడు భాగాలుగా ఈ ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని మనము డివైడ్ చేసుకుందాం. దానివల్ల మీకు కొంచెం సులువు అవుతుంది.

మొదటి భాగం: కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవి అవసరము. మనకు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువ ధర పెట్టాలని ఏం లేదు, మనకు అందుబాటు ధరలలో ఏవైతే దొరుకుతాయో, అవి ఎన్ని ఎక్కువ రకాలు దొరుకుతాయో అన్ని.

ఒకవేళ రెండు మూడు రకాలు దొరికినాయి అనుకోండి, అంటే రెండు కూరగాయలు – ఒక ఆకుకూర – రెండు రకాల పండ్లు, అట్లా అయినా పర్వాలేదు. వాటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

రెండవ భాగం: మొలకలు అంటే, పప్పు ధాన్యాలకు సంబంధించి పెసలు, ఉలువలు, శనగలు, పల్లీలు, బొబ్బర్లు,
రాజ్మా, కాబూలీచెన ఇట్లాంటివి. అంటే రెండు పలకల నుండి మొలకలు వచ్చేవి ఏవైనా గాని, అవి కూడా అందుబాటులో ఉన్నవి ముందే తయారు చేసుకొని మొలకగట్టి రెడీగా ఉంచుకోవాలి.

మూడవ భాగం: ధాన్యము, చిరుధాన్యాలకు సంబంధించి అంటే బియ్యము దంపుడు బియ్యం అయితే మంచిది, ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, జొన్నలు, గోధుమలు, ఇందులో ఏవి అందుబాటులో ఉంటే అవి. ఉదయం నానబెట్టి రాత్రికి ఇడ్లీ పిండి రుబ్బినట్టు రుబ్బి పక్కన పెట్టుకుంటే, పొద్దునకి పులుస్తది. ఈ పులిసిన పేస్ట్ లోంచి ఒక మనిషికి రెండు స్పూన్ల చొప్పున అవసరం అయితది.

ఇప్పుడు ఈ మూడు భాగాలను ఒక భాగంగా తయారు చేసి, మనం ఎట్లా ఆహారంగా తీసుకోవాలో చూద్దాం.
మనము తినగలిగినన్ని కూరగాయ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకొని, దాంట్లోకి రెండు చెంచాల పేస్టు, ఒక చెంచా మొలకలు కలుపుకొని తినొచ్చు.

ఉదయము ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆకలి కూడా ఎక్కువగా వేయదు. మనము తినగలిగినంత అమృతారాన్ని తినొచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. మధ్యాహ్నముా, రాత్రికి కూడా ఇదే ఆహారాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అట్లా తీసుకోలేకపోతే, మనం భోజనం చేసేముందు కొంత, అంటే ఒక రెండు మూడు చెంచాలు ఈ అమృత ఆహారాన్ని తీసుకొని, తర్వాత భోజనాన్ని కంటిన్యూ చేయొచ్చు.

ఇది అనేక ఆరోగ్య సమస్యలను నిర్మూలిస్తుంది, రాకుండా చేస్తుంది. కాబట్టి మిత్రులు దీన్ని ప్రయత్నం చేయొచ్చు.

మేము ఒక నెల నుంచి తింటున్నాము.

ప్రాణం తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ కొత్తలో ఎవరికైనా తినడం కష్టం అనిపిస్తే, కొంచెం బెల్లం ముక్క లేదంటే ఒక రెండు చెంచాల పెరుగు, కొన్ని ఎక్కువ పండ్ల ముక్కలు మనకు ఇష్టమైనవి వేసుకొని తినొచ్చు. తినే ముందు కొన్ని నువ్వులు కొన్ని అవిసెలు దీంట్లో కలుపుకొని తింటే, అప్పుడు పంటికి పచ్చివి చాలా టేస్ట్ అనిపిస్తాయి.
మేము ఇద్దరమే తింటాం కాబట్టి మాకు వారానికి అవసరమైనటువంటి పండ్ల ముక్కల్ని కూరగాయ ముక్కలు ఒకసారి కట్ చేసి పెట్టుకుంటున్నాము. దాన్యాలకి సంబంధించినటువంటి పేస్టును కూడా ఒకేసారి రుబ్బి ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటున్నాము. తినడానికి రెండు మూడు గంటల ముందు ఫ్రిజ్ లోంచి మన అవసరం నిమిత్తం ఎంతయితే తినాలో అంత క్వాంటిటీని వేరే గిన్నెలోకి తీసుకొని బయటపెట్టి దాన్ని బ్రేక్ ఫాస్ట్‌కి తీసుకుంటున్నాం.

ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే Ameya Krishi Vikasa Kendram YouTube Channel / అమేయ కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్‌లో దీనికి సంబంధించిన వీడియో ఉన్నది మిత్రులు గమనించగలరు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క…. అనాస

అనాస ఒక మీటరు వరకు ఎత్తు పెరిగే బహువార్షిక మొక్క. కాండం దృఢంగా ఉండి, ఆకులు పొడవుగా, ముళ్ళు కలిగి ఉంటాయి. పండ్లు ఎరుపు, పసుపు మిశ్రమ రంగు కలిగి, రసంతో నిండి ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిని పిలకమొక్కలు, క్రౌన్స్ మరియు స్లిప్స్ ద్వారా వ్యాప్తి చేస్తారు.

సాధారణ నామం : పైనాపిల్ శాస్త్రీయ నామం : అనానాస్ కామోసస్ కుటుంబం: అనోనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • అనాస పండ్లు మరియు ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. అనాస పండులో “బ్రోమోలిన” అనే ప్రోటీన్‌ని విడగొట్టే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని బాగా పెంపొందిస్తుంది.
  • అనాస పండ్లలో ఎక్కువగా విటమిన్ ‘ఎ’ మరియు ‘సి’ లభిస్తాయి.
  • పక్వానికి రాని పండు జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపునొప్పిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది.
  • ఇది మూత్రకోశవ్యాధులకు మంచి ఔషధం, బాగా పండిన పండు చలవ చేస్తుంది.
  • దీనిలోగల అధిక పీచు పదార్థం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పండ్లరసం జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడటమే గాక మూత్రమును కూడా సులువుగా జారీ చేస్తుంది.
  • ఆకులు స్త్రీలలో ఋతుక్రమాన్ని క్రమబద్ధం చేస్తాయి. గుండె జబ్బులు, జ్వరం, కోరింత దగ్గు నివారణలో ఉపయోగపడుతుంది. దీనిని క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆకుకూరల సాగు

భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.

మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”

ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.

గోంగూర సాగు:
ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

పాలకూర:
పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.

తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.

బచ్చలికూర :
బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.

చుక్క కూర:
చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

కొత్తిమీర:
కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.

పుదీన:
పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.

మెంతి కూర:
దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.

బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258

Read More

వండని వంట… ఉల్లి – నిమ్మ పచ్చడి

రెండు ఉల్లిగడ్డలు, రెండు నిమ్మకాయలు, ఉప్పు, కారం, పసుపు ఉంటే చాలు. అయిదే నిమిషాల్లో తయారు చేసుకోగలిగే చతుర్రుచుల (పులుపు, కారం, ఉప్పు, ఉల్లిఘాటు) పచ్చడి రెడీ!

ఉల్లిగడ్డలను సన్నగా తరిగి గిన్నెలో పెట్టుకోవాలి. వీటిలో నిమ్మ రసం పిండుకోవాలి. కొద్దిగ పసుపు కలిపి అన్ని ముక్కలకు పట్టేలా స్పూన్‌తో కలపాలి. ఎవరి రుచిని బట్టి వారికి కావలసినంత కారం, ఉప్పు అదే గిన్నెలో వేసి, స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ‘ముంతకిందిపప్పు’ అని, జాతరలలో కలుపుతారు కద, అలా బాగా కలుపుకోవాలి.

వేడి వేడి అన్నంలో, ఈ ‘ఉల్లి – నిమ్మ’ పచ్చడి వడ్డించుకుని తింటే, వండిన వంటలన్నీ బలాదూర్!

ఉల్లిపాయలలో పీచు, నిమ్మరసంలో ‘సి’ విటమిన్ పసుపులో ఆరోగ్యం అన్ని కలగలిపిన సహజ పచ్చడిది.

వేడి చెయ్యనక్కర లేదు, వేపడం కూడా అవసరం లేదు, వండవలసిన అవసరం అసలే లేదు. నిముషాల వ్యవధిలో తయారు చేసుకోవచ్చు.

వంటలు చేసుకునే స్టూడెంట్స్, సింగిల్‌గా ఉంటున్న ఉద్యోగులు, సమయం తక్కువ ఉన్నవారు, నేచురల్ పద్ధతిలో ఇలా ట్రై చెయ్యడం బెటర్. పోషకాలు, ఫ్లేవర్లు మాత్రమే కాకుండా, చాలా ముఖ్యమైన జీవశక్తి పూరితమైన పచ్చడి ఉల్లి – నిమ్మ పచ్చడి

  • రచన : కావూరి మారుతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… వెజ్ మిక్స్

  1. పండిన టొమాటోలు రెండు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర తరుగుతో సహా అన్నీ ఒక గిన్నెలో వేసుకుని, ఉప్పు వేసి చేత్తో గట్టిగా పిసుకుతున్నట్లు కలిపితే, అన్నీ చక్కగా కలిసిపోతాయి… వేడి వేడి అన్నంలో అయితే భలే ఉంటుంది!
  2. పైన చెప్పిన అన్నీ పెరుగులో కలిపి కూడా తినవచ్చు. రైతాలా ఉంటుంది.
  3. కూర దోసకాయ ముక్కలు సన్నగా తరిగి, పైన చెప్పిన పదార్థాలు అన్నీ కలిపినా, అది కూడా ఒక కూర లాగానే ఉంటుంది.
  4. పైన చెప్పిన అన్ని పదార్థాలు మరియు కీర దోస ముక్కలు కలిపినా, అది కూడా కూర లాగా తినవచ్చు.
  5. ఎండుమిరప కాయలు, ఉప్పు ..చింత పండు గుజ్జులో కలిపి తింటే బావుంటుంది. మనకు అనుకూలంగా ఉల్లిగడ్డ తరిగి వేసుకోవచ్చు. కొంచెం నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కలుపుకోవచ్చు. లేక పోయినా చాలా బావుంటుంది.
  6. పచ్చి మిరప కాయలు, ఉప్పు, కొంచెం చింత పండు మంచిగా నూరుకుని, కూర దోసకాయలు ముక్కలుగా తరిగి దానిలో వేసి కచ్చా పచ్చాగా దంచి, ఒక పచ్చడి లాగ తినొచ్చు.
  7. మనం పచ్చిగా తినగలిగే అన్ని కూరగాయ ముక్కలు (క్యారెట్, దోసకాయ, టొమాటో, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తి మీర) అన్ని ఉప్పుతో కలిపి చేత్తో గట్టిగా కలిపి పెరుగుతో అయినా, లేకుండా అయినా తినొచ్చు.
    పల్లీల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఆప్షనల్.
    ఇవన్నీ… సైడ్ డిష్ లాగ తినొచ్చు….లేదా ఎమర్జెన్సీ కూరలుగా కూడా పనికొస్తాయి.
  • ప్రశాంతి

Read More

వండని వంట… పండు మిర్చి పచ్చడి

వండని వంటలు అంటే, పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు పచ్చళ్ళు ఆహారంగా తయారు చేసుకోవడం.

ధాన్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలు మొదలగునవి ఉడికించినా, వేపినా, ఫ్రై చేసినా, వాటిలో ఉన్న జీవశక్తి నాశనం అవుతుంది, మృతాహారాన్ని తినవలసి వస్తుంది. మృత ఆహారం అంటే చనిపోయిన ఆహారం అని అర్థం.

మృతాహారం తింటే, మన శరీరానికి జీవశక్తి లభించదు. మనలో జీవశక్తి లోపిస్తే, వ్యాధి కారక శక్తులు ప్రవేశిస్తాయి. కోవిడ్ వైరస్ చెప్పిన పాఠాల్లో, అది ముఖ్యమైన పాఠం కద!

అమృతాహారాన్ని తినవలసిన మనుషులు, మృతాహారం తినడం వైపు పయనించారు! మృతాహారం, వ్యాధి కారకం!

వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని తినడం మంచిది.
అమృతాహారాన్ని తయారు చేసుకుని భుజిస్తే, మన ఆయురారోగ్యాలు పదిలంగా ఉంటాయి!

అమృతాహారం అంటే, చనిపోని ఆహారం అని అర్థం!

మిద్దెతోట, పెరటితోటల్లో మిర్చి ఉత్పత్తి ఎక్కువ వస్తున్నప్పుడు, మధ్య మధ్య పండు మిరపకాయలతో రోటి పచ్చడి తయారు చేసుకోవాలి. అది బయటి ఉష్ణోగ్రతల వద్ద కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ అవసరం లేదు.
పెరటితోట మిద్దెతోట అంటే, పురుగుమందుల వాడకం లేని, సహజ ఉత్పత్తి అని కద! అప్పుడే అది అమృతాహారం అవుతుంది.

కాసిన్ని పండు మిరపకాయలను తెంపుకుని, క్లాత్‌తో శుభ్రంగా తుడిచి, తొడిమలు తీసేసి ముక్కలు ముక్కలుగా కోసి, ఆ పండుమిరపకాయలకు తగినంత కొత్త చింతపండు, తగినంత ఉప్పు (రాక్ సాల్ట్ అయితే బెటర్), వెల్లుల్లి పాయలను, కొద్దిగా పసుపు, జీలకర్రను వేసుకొని, రోటిలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చడి బయట వాతావరణంలో కూడా, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాకపోతే ఉప్పు తగినంత కలుపుకోవాలి. ఈ పచ్చడి తయారీలో నీటి తేమ తగలకుండా తయారు చేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు. పోపు పెట్టడం అంటే, కాలిన నూనెను తినడం అవుతుంది. కాకపోతే అన్నం తినేటప్పుడు పచ్చి నూనెను – అదీ చెక్క గానుగ నూనెను కొద్దిగా వేసుకొని తినవచ్చు.
పాతకాలపు పండుమిరపకాయల పచ్చడినే, నూనె తాలింపు పెట్టకుండా వాడుకోవచ్చును!
నిల్వ పచ్చడి అంటేనే, ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

శారీరక శ్రమ చేసేవారు కాస్తా ఎక్కువ సార్లు తిన్నా పరవాలేదు కానీ, నీడపట్టున పనులు చేసేవారు రుచి కోసం అప్పుడప్పుడు తినడం మంచిది.

పండుమిరపకాయల్లో చింతపండుకు బదులుగా టొమాటో పండ్లను కూడా వేసుకొని పచ్చడి తయారు చేసుకోవచ్చు కానీ, ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవచ్చు. బయట నిల్వ ఉండదు. ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు మూడు రోజుల పాటు వాడుకోవచ్చు.

మొదటిసారిగా చేసుకునేవారు, కొద్ది మొత్తంలో చేసుకుని, ఉప్పు, కారం, పులుపు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని, తరువాత మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. రోలు రోకలి లేనివారు మిక్సీలో వేసి తిప్పుకోవాలి.

మిక్సీలో వేసి తిప్పితే, పదార్ధం ఉష్ణోగ్రతకు గురౌతుంది, ఆ కారణంగా పదార్ధంలో ఎంతో కొంత జీవశక్తి లాస్ అవుతుంది. కనుక రోలు రోకలి వాడటం బెటర్. రోళ్ళు, రోకళ్ళు పట్టణాలలో అక్కడక్కడ రోడ్ల పక్కన పెట్టి అమ్ముతున్నారు. కొనుక్కుని తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పటికీ ఉపయోగపడుతుంది.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More