మనది వ్యవసాయక దేశం. అయినాకానీ వివిధ రకాల కారణాల వలన వ్యవసాయ రంగం నుంచి వేరే రంగాలకు వలసలు బాగా పెరిగినవి కాబట్టే ఒకప్పుడు వ్యవసాయరంగంలో 90% పైగా ఉన్న ప్రజలు ప్రస్తుతానికి సుమారు 70% మాత్రమే వ్యవసాయరంగంలో కొనసాగుతున్నారు. ఈ 70% మంది వ్యవసాయరంగంలో కొనసాగుతున్నా కూడా వారందరూ తృప్తిగా వ్యవసాయం చేస్తున్నారా? అంటే సమాధానం కాదు అని వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కొసాగుతున్న చాలామంది రైతులు చాలావరకు వేరే అవకాశాలు లేకనే తప్పనిసరి పరిస్థితులలో వ్యవసాయం చేస్తున్నారని చెప్పవచ్చు. పంటల సాగు లాభసాటిగా లేకపోవడం, వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తూ ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఆరుగాలం కష్టించి పండించిన పంటను నష్టపోవలసి రావడం, అన్నీ అనుకూలంగా ఉండి పంట దిగుబడులు బాగా వస్తే సరైన ధరలు లభించకపోవడం లాంటి వివిధ రకాల కారణాల వలన వ్యవసాయ రంగాన్ని వీడి వేరే రంగాలకు వలసలు జరిగినవి. కాని ఇటీవల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరగడం, ఆరోగ్యాలను కాపాడుటలో సేంద్రియ ఆహారం మరియు వ్యవసాయం ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయనే విషయాల మీద అవగాహన పెరగడముతో ఇటీవల కాలంలో ఇతర రంగాలలో ఉన్న వారి ఆలోచనలు వ్యవసాయ రంగంవైపు మళ్లి ఆ దిశగా ఆలోచించడం మొదలయ్యింది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆర్ధికంగా ఎదిగిన వారు, కాలుష్యం లేని ప్రశాంత జీవనానికి, ఆరోగ్యకర ఆహారానికి వ్యవసాయరంగమే, అదీను సేంద్రియ సాగే సరైనదారి అని గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. కొత్తగా ఉద్యోగ వ్యాపార రంగాల నుంచి వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టే వారు ఆదాయం కోసం కాకుండా ఆరోగ్యం కోసం వ్యవసాయరంగంలోకి అడుగుపెడుతున్నారు కాబట్టి ఇలాంటి వారికి సంవత్సరం పొడవునా స్వచ్ఛమైన ఆహారం లభించటంతో పాటు, ఎక్కువ మంది పనివారి అవసరం లేని పద్ధతుల గురించి అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యక్షంగా ఒక పొలాన్ని సిద్ధం చేసి చూపించినట్లయితే బాగా ఉపయోగకరంగా ఉంటుందని భావించి తాడేపల్లిలో సుమారు మూడు ఎకరాల స్థలంలో చాలా రకాల పంటలతో ఫుడ్‌ ఫారెస్ట్‌కి అక్బర్‌ రూపకల్పన చేస్తున్నాడు.

అక్బర్‌కి వ్యవసాయం అన్నా, మన పురాతన విత్తనాలన్నా మక్కువ ఎక్కువ. తన మక్కువ తీర్చుకోవడంతో పాటు చాలామందికి ఉపయోగపడాలనే లక్ష్యంతో మూడు సంవత్సరాల క్రితం తాడేపల్లిలోని సియం. క్యాంపు ఆఫీసుకు వెళ్ళే దారిలో సుమారు మూడు ఎకరాల పొలంలో వివిధ రకాల పంటలు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ఫుడ్‌ ఫారెస్ట్‌ని సృష్టిస్తున్నాడు. అక్బర్‌ ప్రధాన లక్ష్యం ఒక కుటుంబం తమకు అవసరమయిన ఆహారాన్ని తామే సొంతంగా పండించుకుంటూ, 365 రోజులు ఏదో ఒక ఆహారాన్ని తమ పొలం నుంచే పొందడంతో పాటు అవకాశం ఉంటే తాము వినియోగించగా మిగిలిన ఆహార పదార్థాలను ఇతరులకు అమ్మకం చేసి ఆదాయాన్ని పొందడము, ఈ లక్ష్యంతోనే అక్బర్‌ ముందుకు సాగుతున్నాడు.

ఈ వ్యవసాయ క్షేత్రంలో మూడు సంవత్సరాల క్రితం పంటల సాగు మొదలు పెట్టాడు. ఈ పద్ధతి పాటించే రైతులు తమ ఆహారం సొంతంగా పండించుకోవడంతో పాటు అవకాశం ఉన్నంతలో ఆదాయం కూడా పొందాలనే లక్ష్యం ఉంది కాబట్టి సుమారు 500 వరకు అరటి మొక్కలు నాటించాడు. అరటిలో చక్రకేళి, కర్పూర, కూర అరటి. ఈ మూడు రకాల నాటు పిలకలను తెలిసిన రైతు వద్ద నుంచి సేకరించి నాటించాడు. అరటితో పాటు బొప్పాయి, మునగ, మూడు రకాల జామ, బత్తాయి, నారింజ, రామాఫలం, సీతాఫలం, రెండు రకాల సపోటా, వివిధ రకాల మామిడి, యాపిల్‌బేర్‌ మొక్కలతో పాటు కొన్ని వేప చెట్లను కూడా పెంచుతున్నాడు. వేప ఆకులు మరియు వేప విత్తనాలతో సేంద్రియ సాగులో వినియోగించే వివిధ రకాల కషాయలు, ద్రావణాలు తయారు చేసుకోవడానికిగాను వేప చెట్లను పెంచుతున్నాడు. పండ్ల చెట్ల మధ్యలో ఖాళీ ఉన్న చోట బెడ్‌లు చేసి ఆ బెడ్‌లపై గోంగూర, మెంతికూర, తోటకూర లాంటి ఆకుకూరలతో పాటు బెండ, మిరప, వంగ లాంటి కూరగాయలు కూడా సాగు చేస్తున్నాడు.

పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తున్నాడు కాబట్టి ఎలాంటి రసాయనాలకు తావు లేకుండా మొక్కలకు పోషకాలను అందించడానికి వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసుకున్న సొంత ఎరువు, జీవామృతం లాంటి వాటిని అందిస్తున్నాడు. చీడపీడల నివారణకు వేప కషాయం, సీతాఫలం ఆకుల కషాయం లాంటి వాటిని ఉపయోగించడంతో పాటు లింగాకర్షక బుట్టలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కలుపు నివారణ కొరకు నాటు కోళ్ళను పెంచుతున్నాడు. మొదటలో 4 కోళ్ళను కొనుగోలు చేసి వాటిని అభివృద్ధి పరచగా ప్రస్తుతానికి సుమారు 30 నాటుకోళ్ళు అయినాయి. నాటుకోళ్ళు పండ్ల మొక్కల మధ్య తిరుగుతూ కలుపు విత్తనాలను, కలుపు ఇగుళ్లను తింటుంటాయి. కాబట్టి కలుపు సమస్య ఎదురు కావడంలేదు. అవసరమయితే బ్రష్‌కట్టరును అప్పుడప్పుడు ఉపయోగించి కలుపు నివారించుకుంటున్నాడు. నాటుకోళ్ళ వలన కలుపు నివారణతో పాటు నాటుకోళ్ళ ఎరువు మొక్కలకు మంచి పోషకాలను అందిస్తుంది. నాటుకోళ్ళు నివాసం కొరకు తక్కువ ఖర్చుతో అంటే కేవలం 2000/-ల ఖర్చుతో 30 కోళ్ళు ఉండటానికి వీలుగా చిన్న షెడ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు.

కొత్తగా వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టే వారికి ప్రయోజనకరంగా ఉండటంతో పాటు మన పురాతన విత్తనాలను సంరక్షించాలనే తలంపుతో అక్బర్‌ ఈ ఫుడ్‌ ఫారెస్ట్‌ని సృష్టిస్తున్నాడు.

మరిన్ని వివరాలు 99666 43666 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

వ్యవసాయ వ్యర్థాలతో ఎరువు

పొలంలో సేకరించిన వ్యవసాయ వ్యర్థాలలో కర్రలను పందిర్ల కోసం, స్టేకింగ్‌ కోసం ఉపయోగించుకుంటూ మిగతా వ్యర్థాలను ఒక కుప్పలాగా పోసుకుంటాడు. ఆకుప్పపై కర్ర సహాయంతో రంధ్రాలు ఏర్పాటు చేసి ఆ రంధ్రాలలో క్రమం తప్పకుండా జీవామృతం, బయోసాయిల్‌ నీటిని పోస్తుంటారు. ఈ రెండు కూడా వ్యవసాయోత్పత్తులను మంచి పోషకాలుగల సేంద్రియ ఎరువుగా మారుస్తాయి కాబట్టి ఆ ఎరువుని తాను సాగు చేసే పంటకు అందిస్తుంటాడు.