పాడి పశువుల పునరుత్పత్తిలో ఖనిజలవణాల ప్రాముఖ్యత

పాడిపశువులలో అధిక పాల ఉత్పత్తితో పాటు పునరుత్పత్తి సామర్ధ్యం కూడా రైతులకి ఆదాయాన్ని చేకూరుస్తుంది. లాభదాయకమైన పాల ఉత్పత్తికి మరియు మంచి సంతానోత్పత్తికి సమతుల్య పోషకాహారం అత్యంత అవసరం. పశువుల ఆహారంలో ఖనిజ లవణాల లోపం ఏర్పడితే అవి సకాలంలో ఎదకు రాకపోవడం, పదే పదే పొర్లడం, గర్భధారణ శాతం తగ్గడం, గర్భస్రావాలు మరియు మాయ పడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పచ్చిమేత, పొడిమేత మాత్రమే సరిపోవు, సమతుల్య మోతాదులలో ఖనిజలవణాలు అందించినప్పుడే పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పునరుత్పత్తి లో ఖనిజాలవణాల ప్రాముఖ్యత :
ఖనిజలవణాలు శరీరం పెరుగుదల, ఎముకల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి మరియు పునరుత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఖనిజలవణాలు రెండు రకాలుగా ఉంటాయి.

స్థూల ఖనిజాలు: కాల్షియమ్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సల్ఫర్.

సూక్ష్మ ఖనిజాలు: జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్, కోబాల్ట్, అయోడిన్, ఇనుము.

పశువుల దాణాలో కాల్షియమ్ మరియు ఫాస్ఫరస్ నిష్పత్తి 2:1 ఉండేలా చూసుకోవాలి. వీటి లోపం వలన అండాల ఉత్పత్తి తగ్గుతుంది. కాల్షియమ్ మరియు ఫాస్ఫరస్ పశువులు సకాలంలో ఎదకు రావడానికి సహాయపడుతాయి.

కాల్షియమ్: పశువుల గర్భాశయ కండరాల పనితీరుని మెరుగు పర్చడంలో, ప్రసవ ప్రక్రియను సులభతరం చేయడంలో మరియు ప్రసవానంతరం గర్భాశయం సాధారణస్థితికి రావడంలో కాల్షియమ్ ముఖ్యపాత్ర వహిస్తుంది. కాల్షియమ్ లోపించడం వలన పశువులకు పాల జ్వరం, మాయపడకపోవడం, గర్భాశయ బలహీనత వంటి సమస్యలు వస్తాయి.

ఫాస్ఫరస్: పశువు ఎదకు సకాలంలో రావడంలో మరియు అండాశయాల పనితీరుని మెరుగుపరచడంలోముఖ్యపాత్ర పోషిస్తుంది. గర్భధారణ శాతాన్ని పెంచుతుంది. ఫాస్ఫరస్ లోపించడం వలన మూగ ఎద, ఎదకు రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

జింక్: అండాశయంలో ఆరోగ్యకరమైన అండాలు ఏర్పడేందుకు తోడ్పడుతుంది. ప్రసవం తరువాత గర్భాశయం త్వరగా సాధారణస్థితికి రావడానికి సహాయపడుతుంది. ప్రసవం అనంతరం గర్భాశయ సమస్యలు నివారించి, త్వరగా గర్భం దాల్చేందుకు సహాయపడుతుంది.

రాగి (కాపర్): పునరుత్పత్తి హార్మోన్ల పనితీరుని మెరుగుపరిచి పశువులు త్వరగా గర్భం దాల్చేందుకు తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచి ప్రసవానంతరం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రాగి లోపం వలన గర్భస్రావం, మూగ ఎద వంటి సమస్యలు ఏర్పడుతాయి.
మాంగనీస్: అండం విడుదల సక్రమంగా జరిగేలా చేసి, గర్భం నిలదొక్కుకోవడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది. పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది. మాంగనీస్ లోపం వలన గర్భధారణ శాతం తగ్గుతుంది.

అయోడిన్: శరీర జీవక్రియలను నియంత్రించే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. పిండం మెదడు ఎదుగుదలకు మరియు శరీర అభివృద్ధికి సహాయపడడంలో అయోడిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయోడిన్ లోపం వలన బలహీనమైన దూడలు లేదా చనిపోయిన దూడలు పుట్టే ప్రమాదం ఉంటుంది.

సెలీనియం: విటమిన్ -ఈ తో కలిసి పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈనిన తరువాత మాయ ఆలస్యంగా పడడం వంటి సమస్యలు నివారించి, పశువుల పునరుత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, దూడలు ఆరోగ్యంగా పుట్టడంలో తోడ్పడుతుంది.
కోబాల్ట్ : కోబాల్ట్ చాల తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ రుమేన్ సూక్ష్మజీవుల ద్వారా విటమిన్ బి12 తయారీ, శరీర జీవక్రియ, మంచి శారీరకస్థితి మరియు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో అత్యంత ముఖ్యమైన ఖనిజలవణం.

ఐరన్: ఇనుము (ఐరన్) లోపం వలన ఆకలి తగ్గడం సంభవించవచ్చు. రక్తహీనత మరియు శరీర పోషక స్థితి క్షీణించడం వల్ల ప్రజనన ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇనుము లోపం కారణంగా పశువులు పదే పదే పొర్లడం, ఒక్క గర్భధారణ కోసం ఎక్కువసార్లు సంయోగం అవసరమవడం, గర్భస్రావాలు సంభవించడం జరుగుతుంది.

ఖనిజాలవణాల లోపాల నివారణ చర్యలు :

  1. సమతుల్యమైన దాణా అందించాలి: పశువుల వయస్సు, పాల ఉత్పత్తి మరియు గర్భధారణ దశను బట్టి సమతుల్యమైన ధాణాని ఇవ్వాలి.
  2. ప్రతి రోజు తగిన మోతాదులో ఖనిజాలవణాల మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి.
  3. పశువుల కొట్టంలో ఎల్లప్పుడూ మినరల్ మిక్స్ బ్రిక్స్ ను అందుబాటులో ఉంచాలి.
  4. పోషకవిలువలు అధికంగా ఉన్న నాణ్యమైన మేతను అందించాలి. బూజు పట్టిన లేదా నాసిరకం మేతను ఇవ్వకూడదు.
  5. తగినంత శుభ్రమైన త్రాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
    6.గర్భం ధరించిన మరియు అధిక పాలిచ్చే పశువులకు ప్రత్యేక పోషణను అందించాలి.
  6. పునరుత్పత్తి సమస్యలు పశువులలో గమనించినప్పుడు వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
  7. క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు పశువులకు ఇవ్వడం వలన ఖనిజాలవణాల శోషణ పెరుగుతుంది.

ముగింపు : పాడిపశువుల సంతానోత్పతి విజయవంతంగా ఉండాలంటే సమతుల్య పోషకాహారంతో పాటు ఖనిజలవణాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన పశువులలో పునరుత్పతి సమస్యలను అధిగమించవచ్చు. సమతుల్య పోషకాహారం, నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమం, మినరల్ మిక్స్ బ్రిక్స్ మరియు పశువైద్యుడి సూచనలు పాటించడం ద్వారా పశువులను ఆరోగ్యంగా ఉంచి రైతులు అధిక లాభాలు పొందవచ్చు.

రచయిత: డా సిహెచ్. ప్రజ్ఞ అసిస్టెంట్ ప్రొఫెసర్, పశు జన్యు శాస్ర మరియు ప్రజనన విభాగం పశువైద్యకళాశాల, కోరుట్ల. 9014639814

Read More

ఆవులు మరియు గేదెల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే మార్గాలు – నూతన సాంకేతికతలు

పాడి పరిశ్రమలో లాభాలు ఆర్జించాలంటే పశువుల పాల దిగుబడి ఎంత ముఖ్యమో, వాటి సంతానోత్పత్తి సామర్థ్యం (Breeding Efficiency) కూడా అంతకంటే ముఖ్యం. “ఏడాదికి ఒక దూడ” (One Calf Per Year) అనే లక్ష్యాన్ని సాధించినప్పుడే పాడి రైతు ఆర్థికంగా స్థిరపడగలడు. అయితే, ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం, సకాలంలో ఎదను గుర్తించకపోవడం, మరియు వాతావరణ మార్పుల వల్ల పశువులలో పునరుత్పత్తి సమస్యలు (Reproductive problems) పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతలను (Latest Technologies) ఉపయోగించడం ఎంతో అవసరం.

సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రాథమికాంశాలు
పశువులలో సంతానోత్పత్తిని పెంచడానికి సాంకేతికతలను వాడే ముందు, కొన్ని ప్రాథమిక యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలి.

  1. పౌష్టికాహార యాజమాన్యం (Nutritional Management)
    పశువుల పునరుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి శక్తి, ప్రోటీన్లు మరియు ఖనిజ లవణాలు (Minerals) ఎంతో అవసరం.
    •ఖనిజ లవణాల మిశ్రమం (Mineral Mixture): ఆవులు, గేదెలకు రోజుకు 50-60 గ్రాముల నాణ్యమైన మినరల్ మిశ్రమాన్ని మేతలో కలపాలి. విటమిన్ ఎ, ఇ, మరియు కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ పోషకాలు పశువులు సకాలంలో ఎదకు రావడానికి, గర్భం నిలవడానికి సహాయపడతాయి.
    •గ్రీన్ ఫోడర్ (పచ్చిమేత): పచ్చిమేతలో ఉండే ‘కెరోటిన్’ (Carotene) హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  2. ఎదను సకాలంలో గుర్తించడం (Heat Detection)
    ఎదను సరిగ్గా గుర్తించకపోవడం అనేది సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా గేదెల్లో మూగ ఎద (Silent Heat) ఎక్కువగా ఉంటుంది. ఇవి రాత్రి వేళల్లో ఎద లక్షణాలను చూపిస్తాయి.
    •సాంప్రదాయ పద్ధతి: రోజుకు కనీసం 3-4 సార్లు (ముఖ్యంగా తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో) పశువులను నిశితంగా గమనించాలి. యోని నుండి తీగలు వేయడం, తరచుగా అరుస్తూ ఉండటం, ఇతర పశువులపై ఎక్కడం వంటి లక్షణాల ద్వారా ఎదను గుర్తించవచ్చు.

సంతానోత్పత్తిలో విప్లవాత్మక నూతన సాంకేతికతలు (Latest Technologies)
ప్రస్తుతం పశుగ్రాస రంగాన్ని మరియు పశువైద్యాన్ని ఆధునిక సాంకేతికత పూర్తిగా మార్చేస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చే కొన్ని ముఖ్యమైన టెక్నాలజీలు ఇక్కడ ఉన్నాయి:

  1. ఐఓటి ఆధారిత సెన్సార్లు మరియు స్మార్ట్ కాలర్స్ (IoT Sensors & Smart Collars)
    రైతు ప్రతి నిమిషం పశువును గమనించడం సాధ్యం కాదు. దీనికోసం ఇప్పుడు స్మార్ట్ నెక్ కాలర్స్ (Smart Neck Collars) లేదా కాలి పట్టీలు (Pedometer) అందుబాటులోకి వచ్చాయి.
    •ఈ పరికరాలు పశువుల కదలికలను, శరీర ఉష్ణోగ్రతను మరియు అవి నెమరు వేసే సమయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాయి.
    •పశువు ఎదకు వచ్చినప్పుడు దాని శరీరంలో వచ్చే మార్పులను బట్టి, ఇది రైతు మొబైల్ ఫోన్‌కు “ఎద అలర్ట్” (Heat Alert) మెసేజ్ పంపుతుంది. దీనివల్ల మూగ ఎదను కూడా 100% ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు.
  2. సెక్స్డ్ సార్టెడ్ వీర్యం (Sexed Sorted Semen Technology)
    ఈ సాంకేతికత పాడి పరిశ్రమలో ఒక పెద్ద విప్లవం. సాధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ (AI) చేస్తే పెయ్య దూడ లేదా మగ దూడ పుట్టే అవకాశం 50:50 ఉంటుంది.
    •కానీ ‘సెక్స్డ్ సెమెన్’ సాంకేతికత ద్వారా కేవలం ఆడ దూడలను పుట్టించే X-క్రోమోజోమ్ కలిగిన కణాలను మాత్రమే వేరు చేస్తారు.
    •దీనిని ఉపయోగించడం వల్ల 90% పైగా కేవలం పెయ్య దూడలు (Female Calves) మాత్రమే పుడతాయి. దీనివల్ల మగ దూడల సంఖ్య తగ్గి, పాడి రైతుకు మేలు జరుగుతుంది.
  3. ఐవిఎఫ్ మరియు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (IVF & Embryo Transfer Technology – ETT)
    ఉత్తమ జాతి ఆవు లేదా గేదె నుండి ఎక్కువ దూడలను పెంపొందించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
    •ఒక అత్యధిక పాల దిగుబడి ఇచ్చే ఆవు నుండి అండాలను సేకరించి, ప్రయోగశాలలో ఫలదీకరణం (IVF) జరిపి పిండాలను (Embryos) తయారు చేస్తారు.
    •ఈ పిండాలను తక్కువ పాల దిగుబడి ఇచ్చే సాధారణ ఆవుల (Surrogate mothers) గర్భాశయంలో ప్రవేశపెడతారు. దీనివల్ల ఒకే ఉత్తమ జాతి పశువు నుండి ఏడాదికి 10-15 గరిష్ట నాణ్యత గల దూడలను పొందవచ్చు.

4.హార్మోన్ల వినియోగం మరియు ముగింపు, స్థిర సమయ కృత్రిమ గర్భధారణ (Fixed Time AI – FTAI)
చాలా కాలం పాటు ఎదకు రాని పశువుల కోసం హార్మోన్ల చికిత్స (Synchronization Protocols) ఉపయోగపడుతుంది.
•ప్రొజెస్టెరాన్, జిఎన్ఆర్ హెచ్ (GnRH), పిజిఎఫ్2ఆల్ఫా (PGF2α) వంటి హార్మోన్లను నిర్ణీత రోజుల్లో పశువుకు ఇంజెక్ట్ చేయడం ద్వారా, అవి ఒకే సమయంలో ఎదకు వచ్చేలా చేస్తారు.
•దీనివల్ల ఎద లక్షణాలు స్పష్టంగా కనిపించకపోయినా, నిర్ణీత సమయానికి (Fixed Time) కృత్రిమ గర్భధారణ చేసి పశువు గర్భం దాల్చేలా చేయవచ్చు.

  1. గర్భ నిర్ధారణ పరీక్షల్లో ఆధునికత (Early Pregnancy Diagnosis)
    సాధారణంగా పశువు గర్భం దాల్చిందో లేదో తెలియడానికి 3 నెలలు పడుతుంది. కానీ ఇప్పుడు:
    •అల్ట్రాసౌండ్ స్కాన్ (Ultrasonography): కృత్రిమ గర్భధారణ చేసిన 28 నుండి 30 రోజుల్లోనే గర్భాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.
    •రక్త/పాల పరీక్షలు (PAG Testing): పశువుల రక్తం లేదా పాలలో ఉండే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ గ్లైకోప్రోటీన్స్ (PAG) ఆధారంగా 28 రోజుల్లోనే గర్భాన్ని గుర్తించే కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ పశువు కట్టకపోతే, వెంటనే దానికి మళ్లీ చికిత్స చేసి త్వరగా ఎదకు తీసుకురావచ్చు.

ముగింపు (Conclusion)
ఆవులు మరియు గేదెల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేది కేవలం ఒక పద్ధతిపై ఆధారపడి ఉండదు. సరైన సమతుల్య ఆహారం, మెరుగైన కొట్టాల యాజమాన్యంతో పాటు స్మార్ట్ కాలర్స్, సెక్స్డ్ సెమెన్, ఐవిఎఫ్ వంటి ఆధునిక సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడం ద్వారా పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి, పొదుగు రోగాలు మరియు గర్భకోశ వ్యాధులు తగ్గి, పాడి పరిశ్రమ లాభసాటిగా మారుతుంది.

రచయిత: డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది

పశుసంవర్ధకంలో అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లేకపోవడమే ప్రధాన కారణం.

పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు సమతుల మోతాదులో అవసరం. వీటిని సమతుల ఆహారం లేదా బ్యాలెన్స్‌డ్ ఫీడ్ అంటారు. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పశువుల శక్తి అవసరాలను.
ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేక పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల పశువులు త్వరగా కోలుకుని మళ్లీ సమయానికి గర్భం దాల్చుతాయి. అలాగే పశువులకు క్రమం తప్పకుండా కృమినాశక మందులు వేయించడం, శుభ్రమైన నీరు అందించడం అవసరం.

  1. శక్తినిచ్చే ఆహారం: ధాన్యాలు, మక్కజొన్న, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు వంటి పదార్థాలు పశువులకు శక్తిని అందిస్తాయి. పశువులకు తగిన శక్తి అందకపోతే అవి బలహీనంగా మారి, వేడి లక్షణాలు సరిగా కనిపించవు. గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  2. ప్రోటీన్ల ప్రాముఖ్యత: ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా అవసరం. నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో అండోత్పత్తి సరిగా జరగదు. మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గుతుంది.
  3. ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర: కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా అవసరం. కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి లోపం వల్ల గర్భస్రావాలు, వంధ్యత్వం, పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువులకు ప్రతిరోజూ మినరల్ మిక్చర్ ఇవ్వడం చాలా మంచిది.
  4. విటమిన్ల: ముఖ్యంగా విటమిన్ A, D మరియు E పునరుత్పత్తికి చాలా అవసరం.
    విటమిన్ A లోపం వల్ల వేడి లక్షణాలు తగ్గిపోవచ్చు. విటమి+న్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ E మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి గడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి సహజంగా లభిస్తాయి.
  5. నీటి ప్రాముఖ్యతను: శుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగా కాదు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వేసవికాలంలో మరింత ఎక్కువ నీరు అవసరం.
  6. గర్భధారణ సమయంలో పోషకాహారం : గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే పిల్ల బలహీనంగా పుడుతుంది. అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం.ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది.

  1. పచ్చిమేత ప్రాముఖ్యత :

నాపియర్ గడ్డి, జొన్న గడ్డి, మక్క సైలేజ్, లూసెర్న్ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు ఉంటాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి సమస్యలు తగ్గుతాయి.

రైతు సోదరులారా,
పశువులలో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. సమతుల ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడుతుంది.

పశువుల పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అనుగుణంగా కొన్ని సూచనలను కింద ఇవ్వడం జరిగింది
• పశువులకు సరైన సమయానికి, సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం వల్ల వేడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో చేయగలుగుతారు.
• ప్రసవం తర్వాత ఎక్కువకాలం ఈనకపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటి. సమతుల ఆహారం ఇవ్వడం ద్వారా “సర్వీస్ పీరియడ్” తగ్గుతుంది.
• అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు సాధారణ పశువుల కంటే ఎక్కువ శక్తి మరియు ప్రోటీన్లు అవసరం. లేకపోతే శరీర బరువు తగ్గి పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
• శరీర స్థితి స్కోర్ (Body Condition Score) సరైన స్థాయిలో ఉండాలి. చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా గర్భధారణ శాతం తగ్గుతుంది.
• పొడి దశలో (Dry period) సరైన పోషకాహారం ఇవ్వడం తదుపరి పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
• ప్రసవానికి ముందు “స్టీమింగ్ అప్” పద్ధతిలో క్రమంగా అదనపు కాంసన్‌ట్రేట్ ఆహారం ఇవ్వడం వల్ల ప్రసవం సాఫీగా జరుగుతుంది మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
• గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడటానికి విటమిన్ E మరియు సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
• మినరల్ మిక్చర్ నిరంతరం ఇవ్వడం వల్ల “సైలెంట్ హీట్” సమస్యలు తగ్గుతాయి.
• పచ్చిమేతలో ఉండే సహజ విటమిన్లు మరియు ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.
• వేసవికాలంలో వేడి ఒత్తిడి (Heat stress) వల్ల పశువులలో గర్భధారణ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో చల్లటి నీరు, ఆకుకూర మేత మరియు ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా అవసరం.
• సరైన ఆహారం ఇచ్చిన పశువుల్లో గర్భస్రావాలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి.
• మగ పశువుల్లో కూడా పోషకాహారం చాలా ముఖ్యం. సరైన ప్రోటీన్, జింక్ మరియు విటమిన్లు ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
• కాల్షియం లోపం వల్ల ప్రసవానంతర సమస్యలు, ముఖ్యంగా మిల్క్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
• ఆహారంలో అకస్మాత్తుగా మార్పులు చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతిని పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
• సైలేజ్ మరియు హే వంటి నిల్వ మేతలను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా సంవత్సరమంతా పోషకాహారం అందించవచ్చు.
• కృమినాశక మందులు వేయకపోతే పశువులు తీసుకునే పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. అందుకే క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయాలి.
• పరిశుభ్రమైన మేత మరియు నీరు ఇవ్వడం ద్వారా వ్యాధులు తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.
• పోషకాహారం సరైన స్థాయిలో ఉంటే పశువుల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి సమయానికి అండోత్పత్తి జరుగుతుంది.

అందువల్ల ప్రతి రైతు “పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Dr.K.Archana
Assistant Professor
College of Veterinary Science, Korutla

Read More