జై జవాన్ – జై కిసాన్
వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం సైన్యం, నౌకా, వైమానిక దళాల్లో పనిచేస్తూ త్వరలో పదవీ విరమణ పొందనున్న అధికారులకు కల్పించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఏటా సైన్యంలో పదవీ విరమణ పొందే అధికారులు వివిధ వృత్తుల్లో స్థిరపడుతున్నారు. వ్యవసాయ రంగంలో అవకాశాలు మెండుగా ఉండటంతో దానిపై అవగాహన కల్పించి పరిశ్రమల స్థాపన దిశగా వారిని ప్రోత్సహించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ‘జైజవాన్ – జైకిసాన్’ పేరిట ఎంపిక చేసినవారికి నాలుగు నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది. 43 మందితో కూడిన తొలి బృందానికి శిక్షణను బుధవారం హైదరాబాద్లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మెనేజ్)లో సంస్థ డైరెక్టర్ జనరల్ హనుమాన్ సింగ్, హైదరాబాద్ ఆర్టిలరీ సెంటర్ లెఫ్టినెంట్ కర్నల్ ఆకాశ్ గెరా ప్రారంభించారు. పంటల సాగు, ఉత్పత్తి, ఆహార శుద్ధి, మార్కెటింగ్లతో పాటు పరిశ్రమలు, వ్యాపార నిర్వహణ, వ్యవస్థాపకతపై వచ్చే డిసెంబరు 26 వరకు నిపుణులతో శిక్షణ ఇస్తామని హనుమాన్ సింగ్ తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలున్న సైనికాధికారులు శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా, నాయకులుగా ఎదగాలని కర్నల్ ఆకాశ్ గెరా ఆకాంక్షించారు.

