దేశ ఆహార భద్రతను స్వామినాథన్ తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు
మన వ్యవసాయ రంగం పోషకాహార భద్రత, పంటల్లో భిన్నత్వం, వాతావరణాన్ని తట్టు కునే పంటలు, టెక్నాలజీలు ఈ నాలుగు చతుర్విధ లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్. స్వామినాథన్ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామినాథన్‌కు నివాళిగా ప్రత్యేక నాణేన్ని, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ‘వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను, మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగించుకుని కరవును, వేడిని, వరదలను తట్టుకునే పంటలను అభివృద్ధి చేయాలి. రియల్ టైమ్‌లో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ప్రతి జిల్లాలో అందుబాటులోకి తేవాలి. తద్వారా పంటల దిగుబడిని, తెగుళ్ల నివారణను, సాగు విధానాలను పర్యవేక్షించాలి. భూములకు సరిపడే పంటలను నిర్ణయించాలి. పంటల మార్పిడిపై పరిశోధనలు జరగాలి. సౌర విద్యుత్తు ఆధారిత మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ రంగానికి దివంగత స్వామినాథన్ చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. ఆయన మన దేశానికి ఓ రత్నం లాంటి వారని పేర్కొన్నారు. దేశ ఆహార భద్రతను తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆలోచనలు నేటి వ్యవసాయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తు న్నాయి’ అని పేర్కొన్నారు.


ఎం.ఎస్.స్వామినాథన్ శత జయంతి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీతో ఎంఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సౌమ్యా స్వామినాథన్, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తదితరులు

