వండని వంట… పచ్చిమిర్చి పచ్చడి

పచ్చిమిర్చిని కూరల్లో కారం కోసం వాడతాం కదా. కానీ, ఒక కూరగాయగా కూడా వాడుకోవచ్చు.

పచ్చిమిర్చిని తింటే, కడుపులో మంట వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రకృతి ఆహారంలో, ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చిమంచిదని చెప్తారు. ఎందుకంటే పచ్చిమిర్చి ఎండిన తర్వాత, దానికి కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని పచ్చిమిర్చి మంచిదని చెప్తారు.

సరే ఆ సంగతి వదిలేసి, పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సులభంగా తయారు చేయవచ్చు.

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, వాటికి సరిపడా చింతపండు, ఉప్పు, ఇంగువ.
నీటిలో కడిగి శుభ్రం చేసి, తేమ లేకుండా తుడిచిన పచ్చిమిర్చిని, ఉప్పును రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి దంచి, కొంచెం దంచిన తర్వాత, దానికి చింతపండు కలిపి దంచుకోవాలి. కావలసిన వారు జీలకర్ర వేసుకోవచ్చు.

ఆఖరున ఇంగువ కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇది అన్నం లోకి, రొట్టెలు, టిఫిన్స్ అన్నింటిలోకీ బాగుంటుంది.

ఆ పచ్చడికి కొత్తిమీర కలిపి చేస్తే , ‘పచ్చిమిర్చి కొత్తిమీర’ పచ్చడి అవుతుంది.

పచ్చిమిర్చి, ఉప్పు, ఇంగువ మాత్రమే కలిపి చేస్తే, అది ‘పచ్చిమిర్చి కారం’ అవుతుంది.

ఈ పచ్చడికి ఉల్లిపాయ కలిపి చేస్తే, ఉల్లిపాయ పచ్చడి అవుతుంది. ఎల్లిపాయ అయినా వేసుకోవచ్చు.
ఒకే విధానంతో రకరకాల పచ్ౘ్ళ్లు చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… అల్లం కారం

అల్లం కారం… వేపకుండా, వేడిచెయ్యకుండా తయారు చేసుకోగల వంటకం…

మామూలుగా అందరి ఇండ్లలో నెలకు సరిపడా అల్లమెల్లిగడ్డ రుబ్బుకునే అలవాటు ఉంటది.

జనరల్‌గా అల్లం ఎల్లిగడ్డ రుబ్బుకున్న మొదటి రోజు నుంచి, పది రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కారం చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటది. నోటికి రుచి లేకుండా ఉన్నపుడు, జ్వరంగా అనిపించినప్పుడు, ఏమి తినాలనిపియ్యనప్పుడు అల్లంకారం చేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం లాగా, అల్లంకారంతో తింటే, కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటది. ఇన్‌స్టంట్‌గా అయిపోతది.

ఈ కారం ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కలిసిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రుబ్బుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టు నుంచి మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం సమపాళ్లలో కలుపుకోవాలి. అయితే అల్లమెల్లిగడ్డ పేస్టు రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. పేస్టు, ఉప్పు, కారం మంచిగా కలిపి, దాంట్లోకి సరిపడా పచ్చడి నూనె వేసుకోవాలి. అంతే అల్లం కారం రెడీ అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినపుడు కూడా దీన్ని ఒక డిష్‌గా పెట్టొచ్చు.

రచన : శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడల్లం పచ్చడి

ప్రకృతి మానవాళికి ప్రసాదించిన ఒక మంచి ఆహారం ‘మామిడి అల్లం’ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది అల్లం జాతికి చెందిన దుంప. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చూడ్డానికి అల్లం దుంపలా వున్నా, గిచ్చి చూస్తే పచ్చి లేత మామిడికాయ వాసనతో చిన్న పాటి వగరుతో వుంటుంది.

మామిడి అల్లాన్ని ఉపయోగించి ‘వండనివంట’గా రోజువారీగా ఉపయోగపడే రోటి పచ్చడి చేసుకోవచ్చు.
కొన్ని రోజులు నిల్వ వుండే ఆవకాయ పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు.

మామిడల్లంతో రోటి పచ్చడి తయారీ…
మామిడల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చేర్చి చింత పండు లేదా నిమ్మ రసం కలిపి కచ్చాపచ్చాగా నూరుకుని, అన్నంలోకి లేదా రోటీలోకి తింటే చాలా బావుంటుంది.. (అవసరం అనుకున్న వారు ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే మరింత రుచి.. )
ఈ పచ్చడి ఏరోజుకారోజు చేసుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ వుండదు.

రెండవ పద్దతి ‘మామిడి అల్లం – ఆవకాయ’
మామిడల్లాన్ని కడిగి తేమ లేకుండా ఆరబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కోసుకున్న ముక్కలకు కొద్దిగ ఆవపిండి, కొద్దిగ కారం, సరిపడ ఉప్పు కలిపి, నువ్వుల నూనె కూడా సరిపడా కలిపి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలపాలి. తరువాత నిమ్మ రసం కలిపి వూరనివ్వాలి. ఇది అచ్చు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిలా వుంటుంది. కొన్ని రోజులు ఫ్రిజ్ సహాయం లేకుండా నిల్వ వుంటుంది. ఫ్రిజ్‌లో దాస్తే మరింత తాజాగా వుంటుంది. అభిరుచినిబట్టి తాలింపు అదనం. గింజలు తీసిన పచ్చిమిర్చి ముక్కలు, కారెట్ ముక్కలు, మామిడి పొడి కూడా కలిపి మిక్సెడ్ పచ్చడి చేయవచ్చు.

  • రచన : సుబ్బారెడ్డి మేడపాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… వెజ్ మిక్స్

  1. పండిన టొమాటోలు రెండు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర తరుగుతో సహా అన్నీ ఒక గిన్నెలో వేసుకుని, ఉప్పు వేసి చేత్తో గట్టిగా పిసుకుతున్నట్లు కలిపితే, అన్నీ చక్కగా కలిసిపోతాయి… వేడి వేడి అన్నంలో అయితే భలే ఉంటుంది!
  2. పైన చెప్పిన అన్నీ పెరుగులో కలిపి కూడా తినవచ్చు. రైతాలా ఉంటుంది.
  3. కూర దోసకాయ ముక్కలు సన్నగా తరిగి, పైన చెప్పిన పదార్థాలు అన్నీ కలిపినా, అది కూడా ఒక కూర లాగానే ఉంటుంది.
  4. పైన చెప్పిన అన్ని పదార్థాలు మరియు కీర దోస ముక్కలు కలిపినా, అది కూడా కూర లాగా తినవచ్చు.
  5. ఎండుమిరప కాయలు, ఉప్పు ..చింత పండు గుజ్జులో కలిపి తింటే బావుంటుంది. మనకు అనుకూలంగా ఉల్లిగడ్డ తరిగి వేసుకోవచ్చు. కొంచెం నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కలుపుకోవచ్చు. లేక పోయినా చాలా బావుంటుంది.
  6. పచ్చి మిరప కాయలు, ఉప్పు, కొంచెం చింత పండు మంచిగా నూరుకుని, కూర దోసకాయలు ముక్కలుగా తరిగి దానిలో వేసి కచ్చా పచ్చాగా దంచి, ఒక పచ్చడి లాగ తినొచ్చు.
  7. మనం పచ్చిగా తినగలిగే అన్ని కూరగాయ ముక్కలు (క్యారెట్, దోసకాయ, టొమాటో, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తి మీర) అన్ని ఉప్పుతో కలిపి చేత్తో గట్టిగా కలిపి పెరుగుతో అయినా, లేకుండా అయినా తినొచ్చు.
    పల్లీల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఆప్షనల్.
    ఇవన్నీ… సైడ్ డిష్ లాగ తినొచ్చు….లేదా ఎమర్జెన్సీ కూరలుగా కూడా పనికొస్తాయి.
  • ప్రశాంతి

Read More