వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక, ఎరువుల వినియోగం తగ్గేలా కసరత్తు.
ప్రయోగాత్మకంగా అంతర పంటలు
వ్యవసాయ శాఖపై సమీక్షలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు
ఏటా మూడు పంటలు పండేలా... 365 రోజులూ సాగు భూములు పచ్చగా ఉండేలా రాష్ట్రంలో మూడు పంటల విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వరి రైతులకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు అన్వేషించాలన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు. 'వరిలో అంతర పంటలుగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే ఉపాధి హామీ నిధులతో వాటిని ఏర్పాటుచేయాలి. వరి పంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వా, ఉద్యాన సాగు దిశగానూ ప్రయత్నించాలి' అని సూచించారు.
వేసవిలోనూ సాగుకు సన్నద్ధం..
వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలి. అనంతపురం లాంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు సాగుచేసి మిగిలిన 8 నెలలు భూములను ఖాళీగా వదిలేస్తున్నారు.. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది. అందుకే ఆ కాలంలోనూ ఏదో ఒక పంట సాగుచేసే పరిస్థితులు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ‘వచ్చే వేసవిలో జల వనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లో సాగు చేసేలా రైతుల్ని సన్నద్ధం చేయాలి. 19 మండలాలు జలాశయాలపై, 57 మండలాలు చెరువులపై, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకుని దిగుబడులు సాధించాలి’ అని అన్నారు.
ఎరువుల వినియోగం తగ్గాలి..
ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి భూసారం కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగు పెరగాలన్నారు. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్- మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖలో మూడు సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. రైతులకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని చంద్రబాబు సూచించారు.
పంట కాలం ముందుకు జరిపేలా కార్యాచరణ
గత 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 14 తుపాన్లను ఎదుర్కొందని, అక్టోబరులో ఐదు, నవంబరులో ఆరు, డిసెంబరులో మూడు తుపాన్లు ప్రభావం చూపాయని వ్యవసాయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అక్టోబరులో వచ్చే తుపాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయని వివరించారు. విపత్తుల ముప్పు తప్పేలా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. తుపాన్ల నుంచి ఖరీఫ్ పంటలను రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేలా కార్యాచరణ మొదలు పెట్టినట్లు వివరించారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశామన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా సాగునీరు విడుదల చేశామని తెలి పారు. జులై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, పత్తి సాగు చేస్తుండగా.. వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతోందని.. కందులు సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. పర్చూరు ఏఎంసీలో హెడ్డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభించడంతో రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెడ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.