ఏపీ మష్రూమ్ మిషన్‌కు కార్యాచరణ
ఆంధ్రరాష్ట్రంలో రూ. 12,960 కోట్లతో ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31 అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రాజెక్టు అమల్లో భాగంగా 40% రాయితీ అందిస్తారు. పొదుపు సంఘాల మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పుట్టగొడుగులను కూడా వ్యవసాయ ఉత్పత్తిగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని అధికారులు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఏడాదికి లక్ష టన్నుల ఉత్పత్తి సాధించాలని సీఎం నిర్దేశించారు. రాయలసీమ ఉద్యానహబ్‌లో భాగంగా ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన వాతావరణానికి అనుకూలమైన మిల్కీ, వరి గడ్డి ఆధారిత రకాల నుంచి బటన్ మష్రూమ్ రకాల సాగును ప్రోత్సహిస్తారు. రోజుకు 10 టన్నుల సామర్థ్యంతో కూడిన యూనిట్లతో పాటు చిన్న యూనిట్లకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పాలసీ కింద ఏపీ మష్రూమ్ మిషన్ ద్వారా ప్రోత్సాహకాలిస్తారు. పుట్టగొడుగుల ఉత్పత్తిలో (ఏటా 45 వేల టన్నులతో) బిహార్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్త ఉత్పత్తిలో 11% ఆ రాష్ట్రానిదే. బటన్, ఆయిస్టర్, మిల్కీ రకాల సాగులో అగ్రస్థానంలో ఉంది. బిహార్ తర్వాత స్థానాల్లో ఒడిశా, మహారాష్ట్ర, హరియాణ, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. దేశీయ ఉత్పత్తిలో వైట్‌బటన్ వాటా అధికం. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ముందంజలో ఉంది. 2023-24 గణాంకాల ప్రకారం అక్కడ ఏడాదికి 16 వేల టన్నులు ఉత్పత్తి అవుతోంది.
ఏపీ పుట్టగొడుగుల మిషన్
వార్షిక ఉత్పత్తి లక్ష్యం: 67,500 టన్నులు
అవసరమైన స్థలం: 81 కోట్ల చదరపు అడుగులు
యూనిట్ల సంఖ్య (ఒక్కోటి 5 వేల అడుగులు):1,62,000
మొత్తం పెట్టుబడి అంచనా: రూ. 12,960 కోట్లు
రాయితీ (40%): రూ. 5,184 కోట్లు
కేంద్రం వాటా (60%): రూ. 3,110 కోట్లు
రాష్ట్ర వాటా (40%): రూ. 2,074 కోట్లు

