చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.
కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో
తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):
ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి. సూచనః
పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.
మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”
ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.
గోంగూర సాగు: ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.
పాలకూర: పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.
తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.
బచ్చలికూర : బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.
చుక్క కూర: చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
కొత్తిమీర: కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.
పుదీన: పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.
మెంతి కూర: దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.
బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258
ఎన్. గోపాల్‌క్రిష్ణన్ అనే అభ్యుదయ రైతు గుడ్లు, నిమ్మకాయలతో మొక్కల పెరుగుదలకు హార్మోన్ తయారు చేశారు. తమిళనాడులో అనేక మంది దీనిని ఉపయోగించి లాభాలు పొందుతున్నారు. ఆయన దీని తయారీ విధానం గురించి రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
కావల్సిన వస్తువులు – తయారీ విధానం
20-25 నిమ్మకాయలు
250 గ్రాముల బెల్లం
10-15 కోడి లేక బాతు గుడ్లు ఒక బకెట్‌లో నిమ్మకాయల రసాన్ని తీయాలి. దీనిలో బెల్లాన్ని కరగబెట్టాలి. ఈ రసంలో గుడ్లు మునిగేటట్లు ఉంచి గాలి చొరబడకుండా బకెట్‌కు మూత పెట్టి నీడలో పది రోజుల పాటు ఉంచాలి. గుడ్లు పెంకుతో సహా రసంలో కరిగి రబ్బరు బంతుల్లా తయారవుతాయి. పది రోజుల తరువాత రబ్బరు బంతుల్లా మారిన గుడ్లను చేతులతో నలిపి దాన్ని బాగా కలియబెట్టాలి. తరువాత దీనికి అంతే మొత్తంలో మరోసారి బెల్లం రసాన్ని కలపాలి. ఉదాహరణకు బకెట్‌లో రెండు లీటర్ల రసం ఉందంటే దానికి మరో రెండు లీటర్ల బెల్లం రసాన్ని కలపాలి. తిరిగి బకెట్‌కు గట్టిగా మూత పెట్టి మరో పది రోజులు ఉంచాలి. పది రోజుల తరువాత దీన్ని పంటల మీద ఉపయోగించవచ్చు. 10Ð15 మి.లీ. రసాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి పంటల మీద స్ప్రే చేయాలి.
ఏ పంటలకు ఉపయోగపడుతుంది? ఈ సేంద్రియ హార్మోన్‌ను వరి, గోధుమ, అరటి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు అన్నింటి మీద స్ప్రే చేయవచ్చు. పిచికారి వేళలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఉదయం, సాయంత్రం పొద్దు మునిగే ముందు పిచికారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనికి పంచగవ్య, వర్మివాష్‌లను కూడా కలిపి వాడవవచ్చు. ద్రావణం తయారు చేసేటప్పుడు మూతకు చిన్న చిన్న రంధ్రాలు పెడితే మంచిది. దీనిని ఆరు మాసాల వరకు నిలువ చేసుకోవచ్చు.
జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)
200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
10 కిలోల పేడ (నాటు ఆవు)
5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
పొలం గట్టు మట్టి…పిడికెడు
రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.
జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.
జీవామృతం తయారీ విధానం: ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.
పంటలపై జీవామృతం పిచికారీ ఇలా… 3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి): మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి. నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు). 6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి): మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి. రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి. నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి. ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి. జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.
కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్‌పామ్ తదితర ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచుతామని, తెలంగాణా రాష్ట్రంలో సహజ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో సోమవారం మెగా రైతుమేళాకు ఆయన హాజరై ప్రసంగించారు. ‘రసాయన రహితంగా ఉండే సహజ సాగు ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభించాం. రైతులకు శిక్షణ ఇచ్చి మరింత మంది దీన్ని అనుసరించేలా కార్యక్రమాలు చేపడతాం. మే 4-9వ తేదీ మధ్య గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన 12 అంశాలపై అవగాహన కల్పిస్తాం’ అని తెలిపారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి రైతులకు ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా శిక్షణ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగును పెద్దఎత్తున పెంచుతామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో.. కూరగాయల పంటలపై అఖిలభారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్‌లో భాగంగా తెలంగాణలో ఉద్యాన రంగాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగు.. లక్ష ఎకరాలకు పడిపోయిందని, వెంటనే ఈ విస్తీర్ణం పెరగాలన్నారు. విశ్వవిద్యాలయానికి మిరప, ఔషధ మొక్కల ఏఐసీఆర్పీ కేంద్రాలను మంజూరు చేయాలని ఆయన ఐకార్‌ను కోరారు. సమావేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుధాకర్ పాండే, భారత కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ రాజేశ్‌కుమార్, దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.