కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 9600/- సబ్సిడీ
తెలంగాణా రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో ఎకరంలో ఆరుటన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో 40 శాతం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యానశాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో ఏటా 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.33 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈఏడాది 10 వేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, సస్యరక్షణ, పోషక యాజమాన్యం కోసం రూ.24 వేలు ఖర్చవుతుందని ఉద్యానశాఖ గుర్తించింది. ఇందులో 40 శాతం.. అంటే రూ. 9600 సాయం అందించేందుకు సిఫార్సు చేయగా.. మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. సాగు ప్రారంభించిన వెంటనే నారు, విత్తనాలను ఉద్యానశాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేస్తే వారికి 40 శాతం సబ్సిడీ సాయం రూ.9600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు 2.50 ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు. సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు, హైదరాబాద్ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లలో ఉద్యానశాఖ సాగు చేస్తోంది. ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది.

