వర్మి కంపోస్టు తయారీలో మెళకువలు

నేల నాణ్యతను, భూ ఫలదతను కాపాడటానికి, ప్రస్తుత విస్తృత వ్యవసాయ సాగు విధానంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించడం ఎంతో అవసరం. పశువుల గెత్తము లభ్యత నానాటికి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కొని వేసుకోవటం లాభదాయకం కాదు. కనుక, ప్రత్యామ్నాయంగా కంపోస్టు ఎరువులను సులభపద్ధతుల్లో తయారు చేసుకొని వేసుకోవటం ఎంతో అవసరం. దీని వల్ల వరిసరాల పరిశుభ్రత కూడా వస్తుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వలన వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర వహిస్తాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ మొట్టమొదటిగా 1881లో ప్రపంచానికి తెలియజేశారు.

వర్మికంపోస్టుకు అనువైన వానపాములు – రకాలు
వానపాములు వెన్నెముక లేని జీవులు. ఇందులో 3600 రకాలు ఉన్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని రెండు రకాలుగా విభజించడం జరిగింది.

  1. బొర్రోయింగ్ అనగా బొరియలు చేయు రకము నేలను గుల్లచేసి భూమి లోపలి పొరలలో ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉంది. నీటి ఎద్దడిని బాగా తట్టుకుని 90 శాతం మట్టిని 10 శాతం వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. 8 నుండి 10 అంగుళాల పొడవు ఉండి సుమారు 15 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఈ రకం వానపాము వర్మి కంపోస్ట్ తయారీకి అంతగా పనికి రాదు.

ఉదా: ఫెరిటిమా ఎలాంగేటా, ఫెరిటిమా ఏసియాటికా మొదలగునవి

  1. నాన్ బొర్రోయింగ్ అనగా బొరియలు చేయని రకము భూమి పై పొరలలో ఉంటూ బొరియలు చేయని రకము. ఇది వర్మి కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా వుండి మట్టిలో గల సేంద్రియ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. ఇవి 90 శాతం వ్యర్థ పదార్థాలను 10 శాతం మట్టిని ఆహారంగా తీసుకొని నాణ్యమైన కంపోస్ట్ గా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. కనుక రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవిత కాలము సుమారు రెండున్నర సంవత్సరాలు.
    ఉదా: ఐసీనియా ఫొటెడ, యుడ్రిలస్ యూజిని మొదలగునవి.

వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్ధాల సద్వినియోగం: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మి క్యాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మి కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగంలేక, వదలివేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్తా చెదారం, కొబ్బరి పీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్ధాలను తిని, కాలుష్య నివారణకు తోడ్పడటమేగాక విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి, కదలికల వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడే శక్తి పెరుగుతుంది.

వర్మి కంపోస్టు తయారీ విధానం:
తొట్టి సైజు : షుమారు 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు.
తొట్టి తయారీ : సిమెంటు తొట్టిని 3 అడుగుల వెడల్పు x 1.5 అడుగుల ఎత్తులో వీలైనంత పొడవుగా తయారు చేసుకోవాలి. సిమెంటు వరలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఈ సిమెంటు తొట్టి అడుగుభాగం నున్నగా, గట్టిగా ఉండేటట్లు ప్లాస్టరింగ్ చేయాలి. నీరు తొట్టిలో నిలబడకుండా, తొట్టికి ఒక వైపున చిన్న రంధ్రం ఏర్పాటు చేయాలి. సిమెంటు తొట్టికి ఎండ తగలకుండా, చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్టు చేయవలసిన వ్యర్థపదార్థాలన్నిటినీ (చెత్త, ఆకులు, పంటకోసాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చిమొక్కలు మొదలైనవి) సుమారు ఒక నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి, అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. ఆ తరువాత పాక్షికంగా కుళ్లిన ఈ వ్యర్ధపదార్ధాలను తెచ్చి, వర్మి కంపోస్టు తొట్టిలో వేసి కంపోస్టు చేసుకోవాలి. అయితే తొట్టిలో వీటిని వేయబోయే ముందు తొట్టి అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెం.మీ. మందాన తయారు చేసుకోవాలి, ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి, సమానంగా తొట్టి అంతా పలుచగా పరచి వెయ్యాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక, దాని మీద పాక్షికంగా కుళ్లబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్ధాలను వెయ్యాలి. తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడను (10 సెం.మీ. మందాన) ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరపైన వెయ్యాలి. పచ్చిపేడను వెయ్యకూడదు. వానపాములను (చదరపు మీటరకు వెయ్యి/1 కిలో చొప్పున) వర్మీ కంపోస్టు తొట్టిలోకి వదలాలి. వర్మికంపోస్టుకు అనువయిన వానపాములు బరియలు చేయని రకాలు: ఐసీనియా ఫోటెడా, యూడ్రిలస్ యూజిని ముఖ్యమైనవి. పాత గోనె సంచులను గాని (లేదా) వరిగడ్డిని గాని తొట్టిపైన కప్పాలి. ప్రతి రోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదు. రెండు-మూడు నెలల్లో మంచి, సస్య పోషణ గల వర్మీ కంపోస్టు తయారవుతుంది. సిమెంటు తొట్టి నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయటానికి 4-5 రోజుల ముందు, తొట్టిలో నీరు చల్లరాదు. ఇలా చేయటం వల్ల, వానపాములు తేమను వెదుక్కుంటూ తొట్టి అడుగు భాగానికి చేరతాయి. కనుక తయారైన కంపోస్టును తీసుకోవచ్చు. తొట్టిలో నుండి కంపోస్టును బయటకు తీసి, శంఖాకారంగా గుట్టలు, గుట్టలుగా పోసి, ముతక జల్లెడతో జల్లించి, పంట పొలాలకు వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు, పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈవిధంగా ఒక తొట్టి నుండి 4 సార్లు కంపోస్టు చేసుకోవచ్చు. దీని వల్ల షుమారు 3 టన్నుల కంపోస్టు లభిస్తుంది.

వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు :

  • నేల ఉత్పాదకతకు కావాల్సిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి.
  • వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది.
  • మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది.
  • వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభం, ఖర్చు తక్కువ
  • రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది.
  • పలు రకాల ఎంజైములు, హార్మోన్లు, అమైనోఆమ్లములు తయారై, మొక్కలు చురుకుగా పెరగడానికి తోడ్పడతాయి.
  • రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగుమందులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి, లాభం చేకూరుతుంది.
  • భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజసిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది.
  • కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచీ, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం పెరుగుతుంది.
  • సేంద్రియ వ్యర్ధాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల, మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకు తోడ్పడుతుంది.
  • దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది.

వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్ధాలను బట్టి, స్థానిక వాతావరణం పరిస్థితులను బట్టి, తయారైన కంపోస్టులోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండవచ్చు. నత్రజని 1.5 నుండి 2.0 శాతం, భాస్వరం 0.5 నుండి 1.5 శాతం, పొటాషియం 0.5 నుండి 1.00 శాతం ఉంటుంది. ఇవికాక కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మాంగనీసు, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నింటికి ఎకరానికి 1.0 నుండి 1.5 టన్నుల చొప్పున వర్మీ కంపోస్టు వేయవచ్చు. కుండీలలోని మొక్కలకు 200 గ్రా. చొప్పున వేయవచ్చును.

వర్మీ వాష్: వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మి క్యాస్టింగ్స్ నుండి తయారయ్యే ద్రవాన్ని “వర్మీ వాష్” అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు, అమైనో అమ్లములు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

తయారీ విధానం: వానపాములు ఉండడానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర (కుండ) లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రం ఏర్పాటు చేసి, దానిని దూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతో ఆపైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు, రాళ్ళతో నింపాలి. దీనిమీద బాగా మాగిన సేంద్రియపదార్ధాన్ని పాత్రలో నాలుగింట మూడు వంతుల వరకు నింపాలి, ఇందులో వీలయినన్ని ఎక్కువ (150 నుండి 200) వానపాములు వదలాలి. పాత్రలో ఎల్లప్పుడు 50-60 శాతం తేమ ఉండేటట్లు ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోయాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాక్షన్ వంటి ద్రవం బొట్టు బొట్టుగా స్రవించడం మొదలవుతుంది. దీనిని సేకరించాలి. ఇలాగే మరో రెండు సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీనినే వర్మి వాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రియ పదార్ధమంతా వర్మి క్యాస్టింగ్గా మారి పోయినప్పుడు, దానిని తీసివేసి కొత్తగా సేంద్రియ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరల క్యాస్టింగ్స్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతి పలుమార్లు ఆచరించడం వల్ల అవసరమైనంత వర్మివాష్ లభిస్తుంది.

పోషక విలువలు: నత్రజని – 500 పి.పి.యం., భాస్వరం – 390 పి.పి.యం., పొటాషియం- 460 పి.పి.యం. కాల్షియం-540 పి.పి.యం.. మెగ్నీషియం-110 పి.పి.యం., ఇనుము-273 పి.పి.యం., మాంగనీసు- 180 పి.పి.యం., జింకు – 180 పి.పి.యం., రాగి-21 పి.పి.యం.

వెర్మి కల్చర్: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మికల్చర్ అంటారు. వానపాములను ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయడానికి 1:1 నిష్పత్తిలో పేడ మరియు ఎండిన ఆకులను కలుపుకోవాలి. ఇలా కలుపుకొన్న, ప్రతీ 10 కిలోల వ్యర్థ పదార్ధాలకు 50 వానపాములు చొప్పున వదులుకుని, నీడలో పెట్టుకొని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తే (ఉష్ణోగ్రత 15-30° సెంటీగ్రేడ్, తేమ శాతం 70-80%) రెండు నెలల్లో వానపాముల సంఖ్య వంద రెట్లు పెరుగుతుంది.

డా.ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా.కె. లక్ష్మణ, ప్రధాన శాస్త్రవేత్త(విస్తరణ), డా.కే. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం. మొబైల్ నెంబర్ : 9440123223

Read More

మొక్క ఎదగుదల, పంట దిగుబడికి ఇ కో ఎంజైమ్

ఇకో ఎంజైమ్ తయారీ విధానం: 10 లీటర్ల నీరు, పండ్లు, కూరగాయలు, పూలు వీటిలో ఏవైన 3 కిలోలు, బెల్లం 1 కిలో. వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ లేదా తొట్టిలో 10:3:1 నిష్పత్తిలో తీసుకొని బెల్లం కరిగే వరకు కలియ తిప్పి దానిపై మూత ఉంచి 3 నెలల పాటు ఊరబెట్టాలి. మూడు నెలల తరువాత ఊరిన ద్రావణాన్ని శుభ్రంగా వడబోస్తే కావలసిన ఇ కో ఎంజైమ్ తయారైనట్లే. దీనిని ప్లాస్టిక్ సీసాలలో నిలవబెట్టుకోవచ్చు. తయారైన 1 లీటరు ఇ కో ఎంజైమ్‌ని 50 లీటర్ల నీటితో కలిపి పంటలపై పిచికారి చేసుకుంటే తక్కువ ఖర్చుతో మొక్క ఎదుగుదల, పంట దిగుబడి బాగుంటుంది.

Read More

పురుగుల నివారణకు సహవాస పంటగా… వెల్లుల్లి

వెల్లుల్లితో మానవుల అనుబంధం 7000 సంవత్సరాలు. ఇది ఒక ఔషధ గడ్డ మొక్క. సులభంగా సాగు చేయవచ్చు. వెల్లుల్లిని పాయల ద్వారా ప్రవర్థనం చేస్తారు. సేంద్రియ పదార్థమెక్కువగా ఉన్న భూముల్లో వెల్లుల్లి బాగా పెరుగుతుంది. ఇది 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. 0.75 నుండి 1.0 అడుగు వరకు విస్తరిస్తుంది. ఏప్రిల్-మేలో పుష్పిస్తుంది. పూత ఎరుపు తెలుపు రంగులో ఉంటుంది. పూలు అందంగా ఉంటాయి. సీతాకోక చిలుకల నాకర్షిస్తాయి. వెల్లుల్లి వార్షిక, హెర్బల్ మొక్క. ఆకులు సువాసన కలిగి ఉంటాయి. ఆకులు ఆకుపచ్ౘ్ రంగులో సన్నగా గడ్డిలాగా ఉంటాయి..

సాధారణ నామం : గార్లిక్ శాస్త్రీయ నామం : అల్లియం సెటైవం కుటుంబం: అమరిల్లిడేసి

ఉపయోగాలు : ఆరోగ్యరంగంలో … ఆయుర్వేద రంగంలో

  • వెల్లుల్లి చాలా శక్తివంతమైన ఔషధ మొక్క. అనేక వ్యాధుల చికిత్సలో దీనిని 5000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నారు. అనేక శాస్త్రీయ అధ్యయనాల తర్వాత వెల్లుల్లి తన ప్రాశస్త్యాన్ని తిరిగి సంతరించుకుంది.
  • ట్యూమర్, క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. ఉదర, కోలన్, ఊపిరితిత్తులు, రెక్టం క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. శక్తివంతమైన సహజ ఆంటిబయాటిక్, యాంటిసెప్టిక్, యాంటివైరల్, యాంటిఇన్‌ఫెక్షన్, జీర్ణాశయ, ఉదర పారసైట్లపై పోరాడుతుంది.
  • శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధులు, బ్రోంకైటిస్ నుండి కాపాడుతుంది. పసుపుతో కలిసి వాతావరణ కాలుష్యం, పొగాకు పొగ నుండి, జలుబు, జ్వరం నుండి రక్షిస్తుంది. కొలెస్టరాల్‌ని అధికంగా తగ్గిస్తుంది. నోటి పుళ్ళు, గొంతునొప్పి, అలసట, ప్లేగ్, కలరా, రాబీస్ నుండి కాపాడుతుంది.
  • హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించి తగ్గిస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది.
  • తగ్గిన శక్తి, ధైర్యాన్ని తిరిగి తెస్తుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. శరీరావయవాలను చలి నుండి కాపాడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

వ్యవసాయరంగంలో
పురుగుల నివారణ :

  • వెల్లుల్లి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించి నష్టం కలిగించే ట్రెబోలియం కాస్టేనియంని అతితక్కువ గాఢతలో వికర్షించింది. పెద్ద పురుగులు, లార్వాలపై ఫ్యూమిగెంట్, కాంటాక్టు చర్యలను ప్రదర్శించి, పెద్ద పురుగులలో గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించింది. అభివృద్ధి ప్రక్రియలలో జోక్యం చేసుకుని లార్వాలు ప్యూపాలుగా, ప్యూపాలు పెద్ద పురుగులుగా మారడాన్ని నిరోధించింది. యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. (ముఖేష్‌కుమార్ బేబే, 2013)
  • వెల్లుల్లి నీరు మరియు మిథనాల్ ద్రావణాలు (1000 పిపియం) పొగాకులద్దె పురుగు లార్వాలను 81% మరియు 64% చంపాయి (మెరిగ, అతని అనుచరులు, 2012)
  • వెల్లుల్లిని అనేక సంవత్సరాలుగా ప్రధాన పంటగా పురుగుల నివారణకు సహవాస పంటగా సాగు చేస్తున్నారు.
  • క్యాబేజి వరుసల మధ్య వెల్లుల్లి లేదా ఉల్లి అంతర పంటగా నాటితే పురుగులను వికర్షిస్తాయి. కనుక చిన్న కమతాల రైతులు వెల్లుల్లి లేదా ఉల్లిని క్యాబేజి పంటలో అంతర పంటగా వేసి పురుగుల తాకిడిని తగ్గించవచ్చు. (దేబ్రా, మిషెక్, 2014)
  • వెల్లుల్లి పొడి, వెల్లుల్లి ద్రావణం, వెల్లుల్లి నూనె పిచికారి పురుగులను నివారిస్తుంది. గార్లిక్ నూనె యాంటి బాక్టీరియల్, యాంటిఫంగల్, కీటకనాశన లక్షణాలు కలిగి ఉంది. గార్లిక్ నూనెని మినరల్ ఆయిల్, సబ్బు ద్రావణంతో కలిపితే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది (లేరాగోమెజ్, సైంటిస్ట్, సియంపిఆర్, కేరళ)

వెల్లుల్లి గడ్డ ద్రావణం :
కావలసిన పదార్థాలు : తరిగిన వెల్లుల్లి 85 గ్రా., మినరల్ ఆయిల్ (కిరోసిన్ లేదా వెజిటబుల్ ఆయిల్) 50 మి.లీ., సబ్బు ద్రావణం 10 మి.లీ., నీరు 950 మి.లీ., ప్లాస్టిక్ బాటిల్ 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని వెజిటబుల్ ఆయిల్‌కి కలపాలి. ఈ మిశ్రమాన్ని 24 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత దీనికి నీరు, సబ్బు ద్రావణం కలిపి కలియత్రిప్పి బాటిల్‌లో నిల్వ ఉంచాలి.

ఉపయోగించే విధానం : ఒక భాగం ఎమల్షన్‌ని 19 భాగాల నీటికి కలపాలి (50 మి.లీ. ఎమల్షన్‌ని 950 మి.లీ. నీరు కలపాలి. పిచికారి చేసే ముందు బాగా కదిపి ఉదయం వేళ పంటపై పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : ప్రత్తి బోల్‌వర్మ్, ఆర్మీవర్మ్, కాటన్ స్టెయినర్, ఉల్లి, తామర పురుగులు, పొటాటో మాత్, రూట్ నాట్ నెమటోడ్, చెరకు కాండం తొలుచు పురుగు, బాక్టీరియా తెగుళ్ళు, ఆంత్రాక్నోస్, బూజు తెగులు, వరి అగ్గితెగులు, కాయకుళ్ళు తెగుళ్ళు, బూడిద తెగులు, త్రుప్పు తెగుళ్ళు.

వెల్లుల్లి నూనె :
కావలసిన పదార్థాలు : వెల్లుల్లి 100 గ్రా., మినరల్ ఆయిల్ 2 చెంచాలు, నీరు 10.5 లీటర్లు, సబ్బు ద్రావణం 10 మి.లీ., మూత ఉన్న పాత్ర 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఈ ముక్కలను మినరల్ ఆయిల్‌లో ఒక రోజు నానబెట్టాలి. అరలీటరు నీరు, సబ్బుద్రావణం కలిపి బాగా కలియ త్రిప్పాలి.
ఉపయోగించే విధానం : వడపోసిన ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలపాలి. స్ప్రేయర్లో నింపి నూనె నీటిపై తేలకుండా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. మొక్క పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు : క్యాబేజి వర్మ్, పచ్చదీపపు పురుగులు, స్క్వాష్ బగ్స్, తెల్లదోమలు (ప్రకాష్, రావు ;1997)

గార్లిక్ ఆయిల్ ఎమల్షన్ :
కావలసిన పదార్థాలు : గార్లిక్ ఆయిల్ 50 మి.లీ., నీరు 950 మి.లీ., సబ్బు ద్రావణం 1 మి.లీ.

తయారు చేసే విధానం : సబ్బు ద్రావణాన్ని నూనెకి కలిపి బాగా కలపాలి. నీరు కలిపి బాగా కలియ త్రిప్పాలి.

ఉపయోగించే విధానం : నూనె నీటిపై తేలకుండా తయారు చేసిన వెంటనే పిచికారి చేయాలి. ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : బోల్‌వర్మ్, పొటాటోట్యూబర్‌మాత్, వరి అగ్గి తెగులు, వరి గోధుమ మచ్చ తెగులు, రూట్‌నాట్ నెమటోడ్ (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1999)

వెల్లుల్లి ద్రావణం నివారించే పురుగులు, తెగుళ్ళు

  • వేరుశనగలో నులి పురుగులు, స్ట్రాబెర్రీ వెస్ట్రన్ ఫ్లవర్ తామర పురుగులు
  • వెల్లుల్లి ద్రావణం ఆల్టర్నేరియా, బోట్రైటిస్, మాగ్నపోర్థె, ఫ్యుజేరియం శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది.
  • వరిలో అగ్గితెగులు, ఫైటోఫ్తోరా ఇన్‌ఫెస్టాన్స్ (పొటాటోలేట్ బ్లెåట్)
  • దోస పంటలో బూడిద తెగులు, బూజుతెగుళ్ళను నివారించింది.
  • టమాటలో ఆకుతొలుచు పురుగు, కందిలో ఎర్రనల్లి, నులి పురుగులు
  • వెల్లుల్లి, మిరప ఆకు ద్రావణాలు క్యాబేజి పంటనాశించే ప్లుటెల్లా క్ౙెలోస్టెల్లా, బ్రెవికారినెబ్రాసికె, హెలుల్లా అండాలిస్, ట్రైకోప్లూసియాని పురుగులను రసాయన పురుగుమందు “అటాక” కన్నా తక్కువ ఖర్చులో నివారించాయి. గార్లిక్ ద్రావణం అత్యధిక ఖర్చు : లాభం నిష్పత్తి (1:16)ని నమోదు చేసింది. అటాక్ పిచికారి చేసిన ప్లాట్లలో ఖర్చు : లాభం నిష్పత్తి 1:9.2 మాత్రమే. అందువలన వెల్లుల్లి ద్రావణాన్ని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. (బైడు, మోచయ్య, 2016).
  • గోధుమ గింజల నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని వెల్లుల్లి, పసుపు ద్రావణాలు సమర్ధవంతంగా నివారించాయి (సజ్ౙద్ ఆలీ, అతని అనుచరులు, 2014)
  • వెల్లుల్లి పొడి, ద్రావణం, నూనె నిల్వ ఉంచిన అలసంద గింజలను కాల్లొసోబ్రూకస్ మాక్యులేటస్ కల్గించే నష్టం నుండి కాపాడాయి (డెన్లోమె, 2010)
  • గార్లిక్ ద్రావణం {+1% సబ్బు ద్రావణం పీచ్ పొటాటో పేనుబంక, మైజస్ పెర్సికెని నివారించింది (డాన్స్‌విక్ౙ్, అతని అనుచరులు, 2011)
  • వెల్లుల్లి, వేప, పొగాకు, కలబంద ద్రావణాలు పురుగుల నివారణకుపయోగిస్తాయి. వీ\న్నింటిలో వెల్లుల్లి ద్రావణం అతి సమర్ధవంతంగా పనిచేస్తుంది (మెలెస్, అతని అనుచరులు, 2012)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

నేల సారవంతానికి ‘గార్బేజ్ ఎంజైమ్‌’

గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.

తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.

కావలసిన పదార్థాలు :

  • మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
  • కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
  • నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
  • నీరు Ð 10 పాళ్ళు

పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.

ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.

  • ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
  • పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
  • దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
  • పశుపోషణకు, కోళ్ళ పెంపకానికి ఉపయోగించవచ్చు.
  • ఇల్లు, మరుగుదొడ్డి పరిశుభ్రతకు వాడవచ్చు.
Read More

అధిక పోషక పదార్థాలు గల ‘నాడెప్ కంపోస్ట్

నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.

కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.

కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :

  • పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
  • పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
  • జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
  • నీరు – 1350-1400 లీ.
    కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
  • మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
  • రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
  • మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.

పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.

కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.

ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.

Read More

వివిధ పంటలపై ‘పంచగవ్య’ ప్రభావం

‘పంచ’ అంటే అయిదు. ‘గవ్య’ అంటే గోమాత నుండి లభించే పదార్థాలు. గోమాత నుండి లభించే ఐదు ఉత్పత్తులను – పాలు, పెరుగు, పేడ, మూత్రం, నెయ్యి – సరైన నిష్పత్తిలో కలిపి పులియబెడితే వచ్చే ఉత్పత్తినే “పంచగవ్య’ అంటారు. పంచగవ్య ఒక సమర్థవంతమైన సేంద్రియ ఎరువు. ఇది పురుగులకు వికర్షిణిగా పనిచేస్తుంది. పంచగవ్యపై జరిపిన అనేక అధ్యయనాలలో 3 శాతం ద్రావణం సమర్థవంతంగా మొక్కల పెరుగుదలకు, పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా కాపాడటానికి పని చేస్తుందని తేలింది. వివిధ మొక్కలకు వివిధ నిష్పత్తులతో ప్రయోగాలు చేయవచ్చని సూచించబడింది.
పంచగవ్య మొక్కల పెరుగుదలకే కాకుండా, చీడపీడలకు తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. దీనిని అన్ని రకముల మొక్కలపై వాడుకోవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్ఠం.

మామిడి : ఆ అధిక ఆడ పుష్పాలతో పూత సాంద్రతను పెంచుతుంది. ఆ పండ్లు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏర్పడతాయి. క్రమం లేకుండా లేదా సంవత్సరం విడిచి సంవత్సరం పండ్లు ఏర్పడటం ఉండదు. ఆ గది ఉష్ణోగ్రత వద్ద పండ్ల నిల్వగుణాన్ని 12 రోజులు పెంచుతుంది. ఆ పండ్ల రుచి, వాసన అద్భుతం.

జామ : అధిక టోటల్ సాల్యుబుల్ షుగర్స్ ఆ పండ్ల నిల్వ గుణం 5 రోజులు పెరుగుతుంది.

పసుపు : దిగుబడులు 22% పెరుగుతాయి. ఆ అతి పొడవాటి చిల్ల కొమ్మలు. ఆ ¢డైనేజి నష్టాన్ని తగ్గిస్తుంది. ఆ తల్లి, చిల్ల కొమ్మల నిష్పత్తిని తగ్గిస్తుంది. ఆ పురుగులు, తెగుళ్ళను తగ్గించే తూనీగ, సాలీడులను వృద్ధి చేస్తుంది. ఆ తల్లి, విత్తన కొమ్మలకు ఎక్కువ ధర లభిస్తుంది. ఆ కుర్కుమిన్ పరిమాణాన్ని పెంచుతుంది.

నిమ్మ : సంవత్సరం పొడవునా పూత ఏర్పడేలా చేస్తుంది. ఆ పండ్లు పుష్టిగా, మంచి వాసన కల్గి ఉంటాయి. ఆ నిల్వ గుణం 10 రోజులు పెరుగుతుంది.

అరటి : సాగు నీటిలో కలిపి పారించడం, పిచికారి చేయడంతోపాటు 3% ద్రావణాన్ని (100 మి.లీ.) మగపూవుని తొలగించిన తర్వాత గెల చివర పాలిథిన్ సంచిలో పోసి కట్టాలి. గెల పరిమాణం ఒకే మాదిరిగా ఉంటుంది. గెల కోత సాధారణ పంటలలో కన్నా ఒక నెల ముందే జరుగుతుందని గమనించడమైనది. గెల పైభాగంలో, అడుగు భాగంలో వున్న హస్తాల పరిమాణం ఒకే మాదిరిగా వుంటుంది.

మల్లె : అరుదైన సువాసన, పరిమళం. ఆ మొగ్గ తొలుచు పురుగు ఆశించదు. ఆ సంవత్సరం పొడవునా పూత వస్తుంది.

Read More

క్రిమిసంహారిణిగా ‘పంచగవ్య’

పంచగవ్యను ప్రకృతి వ్యవసాయంలోనే కాక రసాయన సేద్యం చేస్తున్న పొలాల్లో క్రిమి సంహారిణిగా వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు రైతులు.

పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు
ఆవుపేడ : 7 కిలోలు; ఆవు మూత్రం : 7 లీటర్లు; ఆవు పెరుగు : 2 లీటర్లు; ఆవు పాలు : 2 లీటర్లు; ఆవు నెయ్యి : 1 కిలో; లేత కొబ్బరి నీరు : 3 లీటర్లు; లేదా కల్లు : 3 లీటర్లు; బాగా మగ్గిన అరటిపండ్లు :12; నీరు : 15 లీటర్లు; నల్లబెల్లం : 1 కిలో

తయారు చేయు విధానం : మట్టి కుండలో వేసిన పేడలో నెయ్యివేసి బాగా కలిపి పెట్టాలి. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నాలుగు రోజులు చేయగా పేడంతా నేతి వాసన వస్తుంది. 5వ రోజున మూత్రం, పాలు, పెరుగు, కల్లు, కొబ్బరి నీరు, బెల్లం, నీరు బాగా కలియబెట్టాలి. ఆ తరువాత అరటి పండ్లు మెత్తగా పిసికి ఈ మిశ్రమంలో కలియ తిప్పాలి. ఈ మిశ్రమం పోసిన మట్టి పాత్ర గాని ప్లాస్టిక్ డ్రమ్ముగాని వెడల్పాటి మూతికలిగి ఉండాలి. మూత బెట్టకుండా గుడ్డతో మూతిబిగించాలి. (లేకపోతే ఈగలు, క్రిములు మిశ్రమంలో పడతాయి) ఈ విధంగా 15 రోజులు వేసిన తరువాత మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడబోయాలి. ఈ మిశ్రమాన్ని ఆరు నెలల వరకు వాడవచ్చు. పాత్ర మూత వదులుగా వుండాలి. ఒకవేళ పంచగవ్య గట్టిపడితే తగినంత నీరు కలుపుకుని వాడుకోవాలి. పంచగవ్య మొక్క పెరుగుదలకే కాకుండా చీడపీడలను దరిచేరనీయదు. అన్ని రకాల మొక్కలపై వాడుకొనవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్టం.

Read More

‘సంజీవని’ సేంద్రియ ఎరువు

ఎకరం పొలానికి సంజీవని సేంద్రియ ఎరువు తయారీకి కావలసినవి: 2 టన్నుల (ట్రాక్టర్) చివికిన పశువుల ఎరువు. ఆవులు / గేదెలు / ఎద్దుల ఎరువు ఏదైనా పనికొస్తుంది.

4 టన్నుల (2 ట్రాక్టర్ల) మట్టి, 50 కిలోల వేప పిండి, 80 కిలోల వేరుశనగ / ఆముదం / కానుగ చెక్క (కొంచెం నూనె ఉన్నది కావాలి), 50 కిలోల బెల్లం (తక్కువ ధరకు దొరికే బంక / నల్లబెల్లం సరిపోతుంది), అన్నీ కలిపి 18 కిలోల మేరకు 9 రకాల ధాన్యాలు. గింజలో రెండు బద్దలుండే పప్పు జాతి, ఒకటే గింజ ఉండే ధాన్యం రకాలు కలిసి ఉండాలి. కొర్రలు, రాగులు, జొన్నలు, పెసలు, కందులు, బుడ్డ శనగలు, ఉలవలు, మినుములు, సజ్జలు వంటివి వాడొచ్చు.

7-8 టన్నుల ముడిపదార్థాలను వాడితే.. 21 రోజులకు సుమారు 12 టన్నుల సంజీవని ఎరువు తయారవుతుంది. ఏ పంటకైనా ఒకసారి ఈ సంజీవని ఎరువు వేస్తే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు పోషకాలను అందిస్తుంది. ఏ పొలం కోసం ఈ ఎరువును తయారు చేస్తున్నామో.. ఆ పొలంలోని నేల రకానికి భిన్నమైన రకానికి చెందిన మట్టిని ఈ ఎరువు తయారీకి ఉపయోగించడం ముఖ్యం. అంటే.. ఎర్రమట్టి భూములకు నల్లరేగడి మట్టి, నల్లరేగడి భూములకు ఎర్ర మట్టి, ఇసుక నేలలకు బంక మట్టి, బంక నేలలకు ఇసుక (తువ్వ) మట్టి వాడాలి.

సంజీవని ఎరువును తయారు చేసే పద్దతి:
తొమ్మిది మీటర్ల పొడవు, మీటరు వెడల్పుతో నీడన బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్లను ఏర్పాటు చేసేటప్పుడు నేలపై మట్టిని కొద్దిగా తొలగించాలి.

ముందుగా బెల్లం పానకం తయారు చేసుకోవాలి.

సేకరించుకున్న మట్టిని ఒక పొరలాగా వేసుకొని, పానకం చల్లాలి. దానిపై పశువుల ఎరువును 2, 3 అంగుళాల మందాన చల్లాలి. వేరుశనగ / ఆముదం / కానుగ చెక్కను చల్లాలి. దానిపై మళ్లీ బెల్లం పానకం చల్లాలి. ఇలా అనేక దొంతర్లుగా వేస్తూ బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్డుపై రోజుకోసారి తగినంత నీరు చల్లుతుండాలి. ఆరో రోజు బెడ్డులో మట్టిని కలియ తిప్పి. పైన చదునుగా చేయాలి.

నవధాన్యాలను నీళ్లలో ఒక గంటపాటు నానబెట్టి ఆ తరువాత బెడ్లపైన చల్లాలి. గింజలు కనిపించకుండా మట్టిని ఎగదోయాలి. మట్టికి తడి ఉండేలా చూసుకోవాలి.

21 రోజుల వరకు బెడ్లపైన ఉన్న గింజలు / మొలకలను పక్షులు, కోళ్లు తినకుండా దోమతెర లాంటి గుడ్డనుగాని, వలను గాని,షేడ్ నెట్ను గాని ఏర్పాటు చేసుకోవాలి.

22వ రోజుకు నవధాన్యాలు బెడ్లపైన మొలిచి ఏపుగా పెరుగుతాయి. సంజీవని ఎరువు వాడకానికి సిద్ధమవుతుంది. సంజీవని ఎరువు ఎలా వాడాలంటే..

బెడ్లలో తయారైన ఎరువును ఒక వరుస నుంచి కలియబెడుతూ కుప్పగా చేసుకుంటూ, దాన్ని గంపలతో అప్పకటిప్పుడు పంటలకు వేసుకోవాలి. పండ్ల చెట్లకు ఇరువైపులా కొమ్మల కింద భూమిని నులివేర్లు బయటకు కనపడే వరకు తవ్వి ఈ ఎరువును గాడిలో పోసి పైమట్టిని కప్పాలి. కూరగాయల మొక్కల వద్దనే సంజీవని ఎరువు వేసి మట్టితో కప్పాలి.

డ్రిప్ ఉంటే.. డ్రిప్పర్ల దగ్గర వేయాలి. కూరగాయల మొక్కలకు 4 కిలోల చొప్పున వేయాలి. ఏడాది వయసున్న పండ్ల మొక్కలకు 10 కిలోలు వేయాలి. ఆపై ప్రతి ఏడాది వయసుకు 10 కిలోల చొప్పున వేయాలి. ఉదా: రెండేళ్ల మొక్కకు 20 కిలోలు.

వేరుశనగ పంటకైతే.. విత్తనం వేశాక 40 రోజుల్లోపు కలుపు తీసి.. పైరుపై సంజీవని ఎరువును చల్లి నీటి తడి అందిస్తే చాలా చక్కగా పంట ఎదుగుతుంది.

కూరగాయ పంటను తొలగించి మళ్లీ కూరగాయలను పండించాలనుకుంటే.. గతంలో ఉన్న మొక్కల స్థానంలో కాసింత వేప ద్రావణం చల్లి మొక్కను నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వరి పొలంలో దమ్ము చేయడానికి ముందు నల్ల నేలైతే ఎకరానికి 4-5 టన్నులు, ఇతర భూములైతే 5-6 టన్నుల సంజీవని ఎరువు వాడాలి.

పొలానికి వేయగా మిగిలిన సంజీవని ఎరువును బస్తాల్లో నింపి నిల్వ చేసుకోవచ్చు. బెల్లం పానకం చల్లి, కలియదిప్పి పొలానికి వేసుకోవచ్చు. టన్ను ఎరువులో 5 కిలోల పేడ, 5 కిలోల బెల్లంను 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.

Read More

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

వ్యవసాయ రంగంలో బయోచార్ (Biochar) అనేది ఇప్పుడు ఒక కొత్త సంచలన పదం. ఒకే రకమైన పంటలు సాగు, వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం మరియు పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకంతో భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటుతోంది. ఇదే కొనసాగితే భూములు సాగుకు పనికిరావు. దీనికి పరిష్కారంగా పంట వ్యర్థాలతో తయారుచేసే బయోచార్ (జీవ బొగ్గు) నేలలో సేంద్రియ కార్బన్ ను పెంచుతుంది.

సాధారణంగా పంట కోతలు పూర్తయ్యాక రైతులు పంట వ్యర్ధాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా, నేలలో ఉండే మిత్రపురుగులు, మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఫలితంగా భూసారం క్షీణించి, సేంద్రియ కార్బన్ (Organic Carbon) శాతం పడిపోతోంది. అయితే, ఈ సమస్యకు పంట వ్యర్థాలతోనే అద్భుతమైన పరిష్కారం కనుగొనవచ్చు. పత్తి, కంది, మిరప, ఆముదం మరియు మొక్కజొన్న వంటి పంటల సేంద్రియ వ్యర్థాలను తగలబెట్టకుండా, ఒక ప్రత్యేక పద్ధతిలో ‘బయోచార్’ (జీవ బొగ్గు) గా మార్చవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ పద్ధతి ద్వారా నేలకు అధిక మొత్తంలో సేంద్రియ కార్బన్ను అందించి, భూసారాన్ని మళ్లీ పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం సాగుచేసే పంటలలో ఎక్కువగా రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటోంది. ఈ సమస్యను తగ్గించడానికి మరియు నేల సారాన్ని పెంచడానికి బయోచార్ ఉపయోగకరంగా ఉంటుంది.

బయోచార్: బయోచార్ అనేది ప్రాథమికంగా ‘కాల్చిన’ వ్యవసాయ వ్యర్థం. బయోమాస్ అనే సేంద్రియ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద నిదానంగా మండించడం (పైరోలైసిస్) ద్వారా తయారయ్యే నల్లటి కార్బన్ పదార్థాన్ని బయోచార్ అంటారు. ఇది రంధ్రాలు (సచ్చిద్రత) కలిగి ఉన్న, అత్యధిక కార్బన్ గల ఒక స్థిరమైన పదార్థాన్ని సృష్టిస్తుంది, దీనిని నేల లక్షణాలను మెరుగుపరచడానికి మట్టిలో కలపవచ్చు.

నేలలో బయోచార్ (ప్రత్యేక పద్ధతిలో తయారుచేసిన బొగ్గు) ఉపయోగించడం వల్ల భూసారం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా, నీటిని మరియు పోషకాలను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇసుక నేలలు, ఎర్ర నేలలు, మరియు సేంద్రియ కార్బన్ లోపించిన భూముల్లో బయోచార్ వాడకం వల్ల ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి.

అంతేకాదు, ఇది నేలలో గాలి ప్రసరణను మెరుగుపరిచి, పంటల వేర్లు లోతుగా, బలంగా పెరగడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రసాయన లేదా సేంద్రియ ఎరువుల ద్వారా అందించే పోషకాలు త్వరగా కరిగి వృథా కాకుండా, మొక్కకు అవసరమైనప్పుడు అందేలా ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో బయోచార్ కీలక పాత్ర పోషిస్తుంది.

బయోచార్ వల్ల కలిగే ప్రయోజనాలు

  1. నేల ఉదజని సూచిక (pH) సర్దుబాటు :
    బయోచార్ క్షార గుణాన్ని (alkaline) కలిగి ఉంటుంది మరియు ఆమ్ల నేలల్లో నేల ఉదజని సూచిక స్థాయిని పెంచుతుంది. ఇది పోషకాలు మరియు ఖనిజ లవణాలల లభ్యతను, వాటి వినియోగ సామర్థ్యాన్ని
    పెంచుతుంది.
  2. నేల కాటయాన్ ఎక్స్ఛేంజ్ యజ్ కెపాసిటీ (CEC) పెరుగుదల :
    బయోచార్ తక్కువ పరిమాణంలో ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అత్యధిక నెగటివ్ ఛార్జ్ (negatively charged) కలిగి ఉంటుంది. ఇది నేలలోని పాజిటివ్ ఛార్జ్ కలిగిన కాటయాన్లను (positively charged cations) పట్టి ఉంచుతుంది, తద్వారా కాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ (CEC) ని మరియు నేల సారాన్ని పెంచుతుంది.
  3. బయోచార్ నేలకు పోషకాలను జోడిస్తుంది
    ఇది బయోచార్ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల లోని పోషకాల పరిమాణం మరియు దానిని తయారు చేయడానికి ఉపయోగించిన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. పశువుల ఎరువు మరియు కంపోస్ట్ లాగే, బయోచార్ను నేలలో వేయడానికి ముందు దానిలోని పోషకాల పరిమాణాన్ని పరీక్షించాలి, ఎందుకంటే పోషకాల పరిమాణం చాలా భిన్నంగా ఉంటుంది మరియు బయోచార్ అప్లికేషన్లు పెద్ద మొత్తంలో (bulky) ఉంటాయి. బయోచార్లో ఏవైనా విషపూరిత అయాన్లు (toxic ions) ఉన్నాయా అనేదానిని కూడా
    పరీక్షించాలి.
  4. నేలలో కార్బన్ పరిమాణం పెరుగుదల :
    బయోచార్లో 80% వరకు కార్బన్ బ్లాక్ (carbon black) ఉంటుంది. దీనిని మట్టిలో కలపడం వల్ల కార్బన్ పరిమాణం మరియు C:N నిష్పత్తి (కార్బన్-నైట్రోజన్ నిష్పత్తి) పెరుగుతాయి. బయోచార్లోని కార్బన్ శాతం
    అనేది ప్రధానంగా పైరోలైసిస్ ప్రక్రియ మరియు ఉపయోగించిన ముడి పదార్థాల కార్బన్ పరిమాణంపై
    ఆధారపడి ఉంటుంది.
  5. బయోచార్ నేలలో సూక్ష్మజీవుల క్రియాశీలతను మరియు వైవిధ్యాన్ని పెంచుతుంది :
    బయోచార్లో ఉండే అధిక రంధ్రాల గుణం, దాని నీటి మరియు పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యంతో కలిసి నేలలోని సూక్ష్మజీవులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పిస్తుంది. ఇది పొలాన్ని ఖాళీగా విడిచిపెట్టినప్పుడు (fallow) మరియు కరవు కాలంలో కూడా సూక్ష్మజీవులు మనుగడ సాగించేలా చేస్తుంది. బయోచార్ కొన్ని సూక్ష్మజీవులకు తగిన శక్తి వనరును కూడా అందిస్తుంది. సూక్ష్మజీవుల క్రియాశీలత పెరగడం వల్ల మొక్కలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాల పునరుత్పత్తి (nutrient re-cycling) పెరగడం, పోషకాలు కొట్టుకుపోవడం తగ్గడం, మొక్కలకు పోషకాలు మరింత సులభంగా లభించేలా చేయడం, గాలి నుండి నైట్రోజన్ ను గ్రహించడం, నేలలో కార్బన్ను నిలిపి ఉంచడం మరియు జోడించడం, తెగుళ్లు మరియు వ్యాధులను తగ్గించడం. ఇది కృత్రిమ ఎరువులు మరియు పురుగుమందుల అవసరాన్ని సాధారణంగా తగ్గిస్తుంది, తద్వారా వాణిజ్యపరమైన మరియు పర్యావరణపరమైన అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి.
  6. నేలలోని విషపూరిత పదార్థాలను తగ్గించడం ద్వారా బయోరెమిడియేషన్ (Bioremediation) పెరిగిన సూక్ష్మజీవుల క్రియాశీలత నేలలోని విషపూరిత పదార్థాలను మరియు పురుగుమందుల అవశేషాలను విచ్చిన్నం చేస్తుంది. బయోచార్ కొన్ని పురుగుమందులను ‘చీలేట్స్’ (chelates) చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని నిష్క్రియం చేస్తుంది, తద్వారా సూక్ష్మజీవులు వాటిని జీర్ణం చేసుకోగలుగుతాయి.
  7. నేల ఆకృతి మెరుగుపడటం (Improvement of soil structure)
    బయోచార్ చేర్చిన నేలలో పెరిగే CEC (కాటయాన్ ఎక్స్ఛేంజ్ కెపాసిటీ), సూక్ష్మజీవుల మరియు వేర్ల క్రియాశీలత.. నేల కణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని (soil aggregates) మరింత స్థిరమైన, నీరు చొరబడగలిగే భౌతిక ఆకృతిని ఏర్పరచడంలో సహాయపడతాయి. ఇది నేలలోకి నీరు ఇంకడాన్ని మరియు నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. రంధ్రాలు (porous) కలిగిన నేల మెరుగైన వాయు మార్పిడికి తోడ్పడుతుంది; దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లడం, ఆక్సిజన్ లోపలికి రావడం మరియు మెరుగైన నైట్రోజన్ మార్పిడి జరిగి వేర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
  8. వ్యవసాయ కాలుష్యం తగ్గింపు (Agricultural pollution reduction)
    నేలలో పోషకాలను నిలిపి ఉంచే సామర్ధ్యం పెరగడం వల్ల, కరిగిపోయే ఎరువులు మరియు రసాయనాలు భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోవడం (leaching) తగ్గుతుంది. పెరిగిన సూక్ష్మ జీవుల క్రియాశీలత మరియు చెలేషన్ ప్రక్రియ పురుగుమందులను నిష్క్రియం చేస్తాయి. భౌతిక ఆకృతి మెరుగుపడటం వల్ల నీటి ప్రవాహం

(runoff) మరియు నేలకోత (erosion) తగ్గుతాయి. సాధారణంగా ఎరువులు మరియు రసాయనాల వాడకం తగ్గడం వల్ల వ్యవసాయ కాలుష్య ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

  1. కార్బన్ నిక్షిప్తం (Carbon Sequestration)
    బయోమాస్ కార్బన్ ను బయోచార్గా మార్చడం ద్వారా అసలు కార్బన్లో 50% వరకు కుళ్ళిపోవడానికి నిరోధకత కలిగిన ఒక స్థిరమైన రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. ఇది శతాబ్దాల పాటు నేలలోనే ఉండిపోతుంది, మిగిలిన 50% ఆహారం మరియు శక్తి కోసం ఉపయోగించవచ్చు. దీనికి భిన్నంగా, వ్యర్థాలను కాల్చడం ద్వారా కేవలం 3% కార్బన్ మాత్రమే, మరియు జీవసంబంధమైన కుళ్ళిపోవడం (biological decomposition) ద్వారా 20% కంటే తక్కువ కార్బన్ మాత్రమే నిక్షిప్తమవుతుంది. కాబట్టి వ్యవసాయ నేలల్లో కార్బన్ ను నిక్షిప్తం చేయడానికి మరియు నేలలపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి భారీ అవకాశం ఉంది. గమనిక: పునరుత్పాదక కార్బన్ పదార్థం నుండి బయోచార్ను తెలివిగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించాలి. బయోదార్ను నేల సవరణగా చేర్చేటప్పుడు రైతు బయోదార్ యొక్క లక్షణాలను మరియు నేల యొక్క స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బయోచార్ స్వయంగా ఒక కాలుష్య కారకంగా మారకుండా ఉండటానికి దానిని మట్టిలో బాగా కలపాలి.

జాగ్రత్తలు

  1. నేరుగా ఎక్కువ మోతాదులో వేయకూడదు
  2. కంపోస్ట్ లేదా పశువుల ఎరువుతో కలిపి వేయడం మంచిది
  3. పొడి రూపంలో వాడేటప్పుడు గాలి ద్వారా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  4. నేల పరీక్ష ఆధారంగా మోతాదు నిర్ణయించాలి

సిఫార్సు మోతాదు

  • ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్లు వరకు వేసుకోవచ్చు
  • సేంద్రియ ఎరువులతో కలిపి వేయాలి
    బయోచారును సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘన జీవామృతం, వర్మీకంపోస్ట్ వంటి వాటితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంలో బయోచారుకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుంది.

డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

సాయిల్ హెల్త్ పాలసీపై మేథోమథనం

దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నేలల సమస్యలను గుర్తించి వాటిని అధికమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ, సంతోష్‌నగర్, హైదరాబాద్‌లో జరిగిన భారత్ సాయిల్ హెల్త్ పాలసీపై జరిగిన వర్క్‌షాప్‌లో రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ప, ద్మశ్రీ పురస్కార గ్రహీత డా. యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు. నేలలో సేంద్రియ కర్బనం పెరగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చిరొట్ట పైర్ల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, జీవామృతం, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడేటట్లు చేయడం, పంట మార్పిడి విధానాలు అమలు చేయడం, మిశ్రమ సాగు పంటలను ప్రోత్సహించడం విధిగా చేయాలని వేంకటేశ్వరరావు తెలియచేశారు ఈ సదస్సులో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, రైతులు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి శాస్త్రవేత్తలు పాల్గొని నేలల సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

Read More