రైతు పొలంలో మైకోరైజా తయారీ

మర్రి చెట్టు క్రింద మట్టిలో సూక్ష్మజీవులతో పాటు మైకొరైజా కూడా ఉంటాయి. ఈ మట్టిని సేకరించాలి. శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలలోని మట్టిని సేకరించాలి. అటవీ క్షేత్రాల్లో పెరిగే గడ్డి మొక్కలను పీకి వేర్లను కత్తిరించి సేకరించాలి. వీటన్నింటిలో మైకోరైజా ఉంటాయి.

మైకోరైజా తయారు చేసుకోవడానికి ముందుగా మీటరు వెడల్పు, 2 అ. లోతు, వీలుని బట్టి పొడవు నిర్ణయించుకున్న గొయ్యి తవ్వాలి. దానిలో ఒక ప్లాస్టిక్ కవర్ పరచి తవ్విన మట్టికి కొంత పశువుల ఎరువు కలిపి నింపుకోవాలి. స్వయంగా మైకోరైజా (వ్యామ్) స్పోర్లు సేకరించడం సాధ్యం కాకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కిలో ప్యాకెట్లుగా దొరికే వ్యామ్‌ని కల్చర్ (తోడు)గా వాడుకుని మైకోరైజాను తయారు చేసుకోవచ్చు. సేకరించిన మైకోరైజాను సిద్ధం చేసుకున్న గోతిలో మట్టిలో కలుపుకొని అందులో మెంతులు, తృణ ధాన్యాలు, వరి, పెసర, అలసంద, గింజలను చల్లి నీరు పెట్టాలి. గింజలు మొలకెత్తిన వెంటనే వాటి వేర్లకు అతుక్కుని మైకోరైజా వృద్ధి చెందుతుంది. గోతిలో వేసిన మట్టిలో 6వ వంతు మైకోరైజా కల్చర్ ఉండేటట్లు చూడాలి. గింజలను ఒక రోజు నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. గింజలను కలగలిపి విత్తి నీరు పెట్టాలి. పెరుగుతున్న మొక్కలలో మూడు నెలల్లో మైకోరైజా వృద్ధి చెందుతుంది. మైకోరైజా వినియోగించుకోవాలనుకున్నపుడు 10 రోజుల ముందు నీరు నిలిపి మొక్కలను కోసి వేసి, మొక్కల వేర్లను పెకిలించి చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన వేర్లను, మట్టిని పారతో తిరగేసి ప్లాస్టిక్ సంచుల్లో ఎత్తి పెట్టుకోవాలి.

ఏ పంటలకు వాడవచ్చు
సిద్ధం చేసుకున్న మైకోరైజాను అన్ని ఉద్యాన పంటల్లో వాడవచ్చు. కూరగాయల నారుమళ్ళలో కలపవచ్చు. మైకోరైజాకు తోడుగా వర్మికంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వాడవచ్చు. మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనం విత్తేటప్పుడు మొదటి పొరగా మట్టి వేసి విత్తనం వేసే ప్రదేశంలో మైకోరైజా పొడిని పోసి, విత్తనం విత్తి, పైభాగంలో మళ్ళీ మట్టి పొరను అమర్చాలి. మొలచిన గింజల్లో అంకురం తొడిగిన వెంటనే మైకోరైజా శిలీంద్రం వేరును అంటిపెట్టుకుని విస్తరించడం మొదలవుతుంది. మొక్కలు నాటాలనుకున్నపుడు వేరుభాగం చుట్టూ మైకోరైజా చల్లి నాటుకుంటే సరిపోతుంది. పాదులలో తొలుత మట్టి నింపి ఒక పార మైకోరైజా మట్టి వేసి పై భాగం మట్టితో నింపాలి. మిరప, ఇతర కూరగాయల మొక్కలు నాటుకునేటప్పుడు వేర్లను తడిపి వాటిని మైకోరైజా పొడిలో అద్ది నాటుకుంటే సరిపోతుంది. మైకోరైజా వాడిన మొక్కలు బలంగా, ఏపుగా పెరగడంతో పాటు బెట్టను తట్టుకుంటాయి.

ట్రైకోడెర్మా, జీవన ఎరువులు కలిపి సత్తువ కల్గించిన పశువుల ఎరువు
ఒక టన్ను బాగా చివికిన పశువుల ఎరువుకు 1కి. ట్రైకోడెర్మా హార్జియానం, 1 కి. అజటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, 1 కి. ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా, 1 కి. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 1 కి. పెసీలోమైసిస్ కలిపి, కుప్పపై నీరు చల్లి పాలిథిన్ షీట్ లేదా కొబ్బరి మట్టలతో కప్పి 15-20 రోజులుంచాలి. ఈ సత్తువ కలిగించిన పశువుల ఎరువును భూమిలో వేయడానికి ముందు 10 టన్నుల పశువుల ఎరువుతో కలపాలి.

Read More

మొక్క వేర్ల పెరుగుదలను పెంచే ట్రైకోడెర్మా, సూడోమోనాస్

సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.

తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్‌కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్‌కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.

తయారీ విధానం : ప్రెజర్‌కుక్కర్‌లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్‌లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్‌ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్‌లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్‌తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్‌ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.

వాటి మదర్ కల్చర్లను  వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
Read More