తెలంగాణాకు వెన్నెముక రైతులే
హైదరాబాదులో నిన్న ప్రారంభమయిన గ్లోబల్ సదస్సులో ”విలువ ఆధారిత ఉత్పత్తుల గొలుసు విధానం-రైతుల ఆదాయం రెట్టింపు” అనే అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం మీడియాతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”తెలంగాణకు వెన్నెముక రైతులే. జనాభాలో ఎక్కువ మంది జీవనోపాధికి సేద్యం వనరుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు సంక్షేమం, పురోగతికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. గత రెండేళ్లలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. లక్ష కోట్లు వెచ్చించాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయం, దాని అనుబంధ ఆర్థిక వ్యవస్థ దాదాపు 34.6 బిలియన్ డాలర్లు. 2047 నాటికి దీనిని 400 బిలియన్ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. ఆ స్థాయిలో వృద్ధి సాధించడానికి స్పష్టమైన రోడ్ మ్యాప్, రంగాల వారీ వ్యూహంతో పనిచేస్తున్నాం. అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటల్ వ్యవసాయం, డ్రోన్లు, యాంత్రీకరణ, మార్కెట్ లింకేజీలు, ఈ-ట్రేడింగ్ బలోపేతం, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ.. లాజిస్టిక్ వ్యవస్థలు, సహకార సంస్థలు, వ్యవసాయ స్టార్టప్‌ల బలోపేతం, రైతు భరోసా, పంటలబీమా, వ్యవసాయ యంత్రాలకు రాయితీ, ఆహార శుద్ధి జోన్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడతాం. ఇవి రైతుల ఆదాయాలను పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి సహాయపడతాయి. పొలం నుంచి మార్కెట్ వరకు మార్కెట్ ఆధారిత గొలుసు వ్యవస్థలను నిర్మించడం, గిట్టుబాటు ధరలను నిర్ధారించడం, వృథాను తగ్గించడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం’ అని తెలిపారు. చర్చలో భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎ.కె.సింగ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు సలహాదారు శ్రీనివాసన్, ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత మోదడుగు విజయ్ గుప్తా, కోసాంబ్ ఎండీ జె.ఎస్. యాదవ్, ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడింగ్ ఎండీ, సీఈవో రాజేష్ సోమాని, వ్యవసాయ పరిశోధన సంస్థ మాజీ అధిపతి డాక్టర్ సమరేందు మహంతి, మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్ అధ్యకక్షుడు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

