జంతువులలో గాలికుంటు వ్యాధిని పోలి ఉండే వ్యాధులు మరియు వాటి భేదాత్మక నిర్ధారణ
జంతువులలో కనిపించే అంటువ్యాధులలో గాలికుంటు వ్యాధి ఒక అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది ముఖ్యంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులలో కనిపిస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు నోటిలో పుండ్లు, కాళ్ల వద్ద గాయాలు, జ్వరం మరియు ఆహారం తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే గాలికుంటు వ్యాధి లాంటి లక్షణాలు మరికొన్ని వ్యాధులలో కూడా కనిపిస్తాయి. అందువల్ల సరైన చికిత్స మరియు నియంత్రణ చర్యల కోసం భేదాత్మక నిర్ధారణ చాలా అవసరం.
ఒక నిర్దిష్ట వ్యాధి లేదా పరిస్థితిని, అదే విధమైన లక్షణాలు చూపించే ఇతర వ్యాధుల నుంచి వేరు చేసి గుర్తించడాన్నే భేద నిర్ధారణ లేదా భేదాత్మక నిర్ధారణ అంటారు. ఇందులో మొదట సంభావ్య వ్యాధుల జాబితా తయారు చేసి, తరువాత పరీక్షలు లేదా మూల్యాంకనాలు చేసి ఒక్కో అవకాశాన్ని తొలగిస్తూ చివరికి అత్యంత సంభావ్యమైన నిర్ధారణకు చేరుకుంటారు. జంతువులలో ఒకే విధమైన లక్షణాలు అనేక వ్యాధులలో కనిపిస్తాయి. ఉదాహరణకు గాలికుంటు వ్యాధి, వెసిక్యులర్ స్టొమటైటిస్, నీలినాలుక వ్యాధి వంటి వ్యాధులలో నోటిలో పుండ్లు మరియు కాళ్ల వద్ద గాయాలు కనిపించవచ్చు. అందువల్ల సరైన వ్యాధిని ఖచ్చితంగా గుర్తించడం చాలా అవసరం.
సాధారణంగా భేదాత్మక నిర్ధారణ కోసం చరిత్ర తెలుసుకోవడం (అంటే ఇతర జంతువులకు వ్యాపించిందా, ఇటీవల కొత్త జంతువులు తీసుకొచ్చారా, టీకాలు వేయించారా), క్లినికల్ పరిశీలన (జంతువులో కనిపించే లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం) మరియు ప్రయోగశాల పరీక్షలు (ఎలైసా & పి.సి.ఆర్) వంటి పద్ధతులను పాటిస్తారు.
భేదాత్మక నిర్ధారణ యొక్క ప్రాముఖ్యత
- సరైన వ్యాధి గుర్తింపు – లక్షణాలు ఒకేలా ఉన్నా నిజమైన వ్యాధిని గుర్తించడంలో సహాయపడుతుంది.
- సరైన చికిత్స అందించడం – వ్యాధిని సరిగ్గా గుర్తిస్తే తగిన మందులు మరియు చికిత్స ఇవ్వవచ్చు.
- వ్యాధి వ్యాప్తి నియంత్రణ – అంటువ్యాధులను త్వరగా గుర్తించి ఇతర జంతువులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.
- ఆర్థిక నష్టాన్ని తగ్గించడం – పాల ఉత్పత్తి తగ్గడం, జంతువుల మరణాలు వంటి నష్టాలను తగ్గించవచ్చు. .
- అనవసర చికిత్స నివారణ – తప్పు నిర్ధారణ వల్ల అవసరం లేని మందులు వాడకుండా ఉంటుంది.
- టీకాలు మరియు నివారణ చర్యలకు సహాయం – సరైన వ్యాధి తెలిసిన తర్వాత తగిన టీకాలు మరియు నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు.
- పశుసంపద రక్షణ – రైతుల పశుసంపదను ఆరోగ్యంగా కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
- ప్రయోగశాల పరీక్షల అవసరాన్ని నిర్ణయించడం – ఏ పరీక్షలు చేయాలో నిర్ణయించడానికి సహాయపడుతుంది. ఈ వ్యాసంలో గాలికుంటు వ్యాధిలో ఉండే లక్షణాలు ఏంటి మరియు దానిని పోలిఉండే ఇతర వ్యాధులు, వాటి లక్షణాలు, సరైన వ్యాధిని గుర్తించడం ఎలా అనే వాటి గురించి తెలుసుకుందాము.
గాలికుంటు వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు
- అధిక జ్వరం
- నోటిలో పుండ్లు మరియు బుడగలు
- నాలుకపై గాయాలు
- కాళ్ల గిట్టల వద్ద పుండ్లు
- ఎక్కువగా లాలాజలం కారడం
- కుంటుతూ నడవడం
- పాల ఉత్పత్తి తగ్గడం వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులు
గాలికుంటు వ్యాధి ని పోలిఉండే ఇతర వ్యాధులు:
- వెసిక్యులర్ స్టొమటైటిస్:
కారణం : రేబ్డో విరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులో వైరస్ వల్ల వచ్చే వ్యాధి.
లక్షణాలు
- నోటిలో బుడగలు
- నాలుకపై గాయాలు
- కాళ్ల వద్ద పుండ్లు
- అధిక లాలాజలం
వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
గాలికుంటు వ్యాధితో తేడా – ఇది ముఖ్యంగా గుర్రాలలో కూడా కనిపిస్తుంది, కానీ గాలికుంటు వ్యాధి గుర్రాలలో సాధారణంగా రాదు.
- బోవైన్ వైరల్ డయేరియా:
కారణం – ఫ్లేవి విరిడే కుటుంబానికి చెందిన పెస్టి వైరస్ వల్ల వచ్చే వ్యాధి
లక్షణాలు
- నోటిలో గాయాలు
- విరేచనాలు
- బలహీనత
- జ్వరం
వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద బుడగలు సాధారణంగా ఉండవు మరియు విరేచనాలు ఎక్కువగా కనిపిస్తాయి.
- రిండర్పెస్ట్ పశువుల్లో పారుడు వ్యాధి:
కారణం – పేరామిక్సో విరిడే కుటుంబానికి చెందిన మోర్బిలి వైరస్.
లక్షణాలు
- అధిక జ్వరం
- నోటిలో పుండ్లు
- విరేచనాలు
- నీరసం
వ్యాధికి గురయ్యే జంతువులు ఆవులు, గేదెలు
గాలికుంటు వ్యాధితో తేడా – తీవ్రమైన విరేచనాలు ప్రధాన లక్షణం. కాళ్ల గాయాలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి ఇండియాలో అధికారికంగా నిర్మూలించబడింది.
- నీలినాలుక వ్యాధి :
కారణం – రియో విరిడే కుటుంబానికి చెందిన ఆర్బి వైరస్
లక్షణాలు
- నోటి వాపు
- నాలుక నీలం రంగులో మారడం
- జ్వరం
- కుంటడం
వ్యాధికి గురయ్యే జంతువులు – గొర్రెలు, మేకలు, ఆవులు మరియు జింకలు
గాలికుంటు వ్యాధితో తేడా – గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది మరియు మరియునాలుక నీలం రంగులో ఉండటం ప్రత్యేక లక్షణం.
- కాంటాక్ట్ డెర్మటైటిస్:
కారణం – రసాయనాలు లేదా విషపదార్థాల వల్ల చర్మం దెబ్బతినడం.
లక్షణాలు
- కాళ్ల వద్ద గాయాలు
- చర్మ వాపు
- నడవడంలో ఇబ్బంది
వ్యాధికి గురయ్యే జంతువులు – ఏ జంతువైనా రసాయనాలు మరియు విషపూరిత పదార్థాలను తాకడం లేదా తినడం వల్ల
గాలికుంటు వ్యాధితో తేడా – నోటిలో పుండ్లు ఉండవు. ఇది అంటువ్యాధి కాదు.
- ఫుట్ రాట్:
కారణం – ఫ్యూజోబ్యాక్టీరియం నెక్రోఫోరం మరియు డైకిలోబ్యాక్టార్ నొడోసస్ వంటి బ్యాక్టీరియా.
లక్షణాలు:
- కాళ్లలో వాపు
- నడవడంలో ఇబ్బంది లేదా కుంటడం
- గిట్టల మధ్య దుర్వాసనతో కూడిన పుండ్లు
- తీవ్రమైన నొప్పి మరియు ఇన్ఫెక్షన్
వ్యాధికి గురయ్యే జంతువులు: గొర్రెలు, మేకలు, పశువులు మరియు ఇతర గిట్టలున్న జంతువులు
గాలికుంటు వ్యాధితో తేడా – గాలికుంటు వ్యాధి వల్ల నోటిలో మరియు గిట్టలపై బొబ్బలు ఏర్పడతాయి. కాగా ఫుట్రాట్ ప్రధానంగా గిట్టల ప్రాంతానికే పరిమితమై, కుంటడం మరియు గిట్టలు దెబ్బతినడం కలిగిస్తుంది, గిట్టల మధ్య భాగంలో దుర్వాసనతో కూడిన కుళ్లిన కణజాలాన్ని కలిగిస్తుంది. ఇందులో సాధారణంగా నోటిలో పుండ్లు కనిపించవు.
- మౌత్ రాట్:
కారణం – అవకాశవాద బ్యాక్టీరియా లైన ఏరోమోనాస్, సూడోమోనాస్ మరియు సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా
లక్షణాలు
- నోటిలో దుర్వాసన
- పుండ్లు
- తినకపోవడం
వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పక్షులు మరియు వేరే ఏ జంతువైనా పైన పేర్కొన్న బ్యాక్టీరియా సోకినప్పుడు
గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద గాయాలు ఉండవు. ప్రధానంగా నోటిలోనే సమస్య ఉంటుంది.
ముగింపు
గాలికుంటు వ్యాధిని పోలి కనిపించే అనేక వ్యాధులు జంతువులలో కనిపిస్తాయి. భేద నిర్ధారణ అనేది పశువైద్యంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సరైన భేద నిర్ధారణ లేకపోతే తప్పు చికిత్స జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల క్లినికల్ లక్షణాలు, ప్రయోగశాల పరీక్షలు మరియు జంతువు చరిత్ర ఆధారంగా ఖచ్చితమైన నిర్ధారణ చేయాలి. రైతులు మరియు పశువైద్యులు అప్రమత్తంగా ఉండి సమయానికి చర్యలు తీసుకుంటే పశుసంపదను రక్షించవచ్చు. దీని ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడి రైతులకు ఆర్థిక రక్షణ లభిస్తుంది.
డా.తనూజ నాదెళ్ళ, సహాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ గాలికుంటు వ్యాధి సహకార కేంద్రం, వి.బి.ఆర్.ఐ., విజయవాడ. ఫోన్: 9121000747


