నాణ్యమైన గొర్రెలు/మేకల మంద అభివృద్ధి కావాలంటే
ఆరోగ్యమైన మరియు జన్యుపరంగా మంచి నాణ్యత కలిగిన మందను అభివృద్ధి చేయాలంటే గొర్రెల/మేకల పెంపకందార్లు ప్రతి ఏటా “ఏరివేత”ని అవలంబించాలి. నాసిరకం జీవాలని ఎప్పటికప్పుడు గుర్తించి మందనుండి వేరుచేసి, ఆరోగ్యమైన జీవాలని మాత్రమే ఉంచడం వలన పోషణ ఖర్చు తగ్గి, జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.
పుట్టిన ఆడ జీవాల(పిల్లలు)లో ఆరోగ్యంగా, మంచి శరీర బరువు కలిగి ఉండి, జాతి లక్షణాలున్న వాటిని మందలో ఉంచుకోడానికి ఎంపిక చేసుకోవాలి. బలహీనంగా ఉండి, పెరుగుదల లేని, ఆరోగ్యంగా లేని పిల్లల్ని, తల్లి పాలు సరిగా అందని వాటిని గుర్తించి ఏరివేయాలి. పుట్టిన పిల్లలకి పాలివ్వలేని తలుల్ని వేరుచేసి, ఆరోగ్యంగా, పాలిచ్చే శక్తి కలిగిఉన్న తల్లుల్ని మాత్రమే మందలో ఉంచాలి. మంద సగటు బరువు కంటే తక్కువ బరువున్న జీవాల్ని, బలహీనంగా ఉన్నవాటిని, ఎదుగుదల లోపాలున్నవాటిని, ముసలివాటిని గుర్తించి ఏరివేయాలి. సకాలంలో ఎదకు రాని, చూలి నిలవని వాటిని, తరచుగా ఈడుసుకుని పోయే జీవాల్ని, పొదుగు వాపు సోకిన జీవాల్ని మందనుండి తీసివేయాలి.
ఇక మగ జీవాల (పిల్లల) విషయానికొస్తే అధిక శరీర బరువు కలిగివుండి, జాతి లక్షణాలున్న 3-4 మగ జీవాల పిల్లల్ని మందలో ఉంచి, మిగితా వాటిని వేరు చేసి 6-7 మాసాలు పోషించి, మాంసం కొరకు అమ్మివేయాలి. మంచి జాతి లక్షణాలున్న మరికొన్నింటిని 12-18 నెలలు పోషించి పునరుత్పత్తి కోసం (విత్తనపు పొటేళ్లుగా) అమ్మివేయాలి. రెండు సంవత్సరాల పాటు మందలో ఉన్న పొట్టేలు/పోతులను తొలగించివేయాలి. లేనిచో మందలో “ఇన్ బ్రీడింగ” సమస్య తలెత్తి, మంద నాణ్యత జన్యుపరంగా క్షీనిస్తుంది. కాబట్టి పొట్టేలు / పోతులను ప్రతి రెండేళ్లకోసారి మార్చుకోవాలి.
వంగిపోయిన కాళ్ళు, వెడల్పుగా ఉన్న భుజాలు, దవడ లోపాలు (పెద్దగా లేదా చిన్నగా ఉండడం), పగిలిన నోరు మొదలగు జన్యుపరమైన లోపాలున్న జీవాల్ని ఏరివేయాలి. మంద పరిమాణం. వసతి, మేత వనరులు మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఏటా 10-20% జీవాల్ని ఏరివేయటం మంచిది.
డా. జె. సాయి ప్రసన్న, డా. సరిన్ కున్నత్, సహ ఆచార్యులు, పశు జన్యుశాస్త్ర మరియు ప్రజనన విభాగం, పీవీ నరసింహ రావు తెలంగాణ పశువైద్య విశ్వా విద్యాలయం, హైదరాబాద్. ఫోన్: 8008910925

