సీమ పందుల పెంపకంరైతుల ఆర్థిక సాధికారతకు శాస్త్రీయ ప్రత్యామ్నాయం

గ్రామీణ తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కూలీలు, మహిళా స్వయం సహాయక బృందాలు (Self Help Groups – SHGs) తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చే పశు సంపద కోసం అన్వేషిస్తున్న తరుణంలో ‘సీమ పందుల పెంపకం’ ఒక ఆశాజనకమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తోంది. దేశీయ (నాటు) పందులతో పోలిస్తే సీమ జాతులు వేగంగా బరువు పెరగడం, ఎక్కువ పిల్లలు ఈనడం (అధిక లిట్టర్ సైజు), తక్కువ మేతతో ఎక్కువ మాంసం ఉత్పత్తి చేయడం (మెరుగైన ఫీడ్ కన్వర్షన్ ఎఫిషియెన్సీ – FCE) వంటి లక్షణాలతో ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారత పశు గణాంకాల (Basic Animal Husbandry Statistics – BAHS 2025) ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే మాంస ఉత్పత్తి సుమారు 2.46 శాతం వృద్ధి చెందింది. అయితే, పంది జనాభా వృద్ధి రేటు గత రెండు దశాబ్దాలుగా మందగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను, ఆధునిక వ్యాధి నివారణ చర్యలను, ప్రభుత్వ తోడ్పాటును సమన్వయం చేసుకుంటే పందుల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శక్తివంతమైన సాధనంగా మారగలదు.

సీమ మరియు సంకరీకరణ జాతుల పందులు
మన దేశంలో సంప్రదాయకంగా పెంచే నాటు (దేశీయ) పందుల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా విదేశాల నుంచి తీసుకువచ్చి మన వాతావరణ పరిస్థితులకు అలవాటు చేసిన సీమ జాతులు (Exotic Breeds) అధిక ఉత్పాదకతను కలిగి ఉంటాయి. వీటిని దేశీయ పందులతో సంకరీకరణ చేసి, స్థానిక వాతావరణానికి అలవాటుపడే మేలుజాతి సంకర రకాలను (Crossbred Varieties) కూడా వివిధ రాష్ట్రాల పశువైద్య విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయి.

ప్రధాన సీమ జాతులు

  • లార్జ్ వైట్ యార్క్‌షైర్ (Large White Yorkshire) — పూర్తి తెలుపు రంగు, మేని మీద ‘ఫ్రెకిల్స్’ అనే నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. ఒక్కో ఈతకు 11–12 పిల్లలు పుట్టే అధిక లిట్టర్ సైజు, మంచి మాతృత్వ లక్షణాలు దీని ప్రత్యేకత. మగ పంది 300–400 కిలోలు, ఆడ పంది 230–320 కిలోల వరకు బరువు పెరుగుతుంది.
  • ల్యాండ్‌రేస్ (Landrace) — పొడవైన శరీరం, తక్కువ కొవ్వు, అధిక మాంస దిగుబడినిచ్చే జాతి.
  • డ్యూరాక్ (Duroc) — ఎర్రటి రంగు, గట్టి శరీర నిర్మాణం, శీఘ్ర పెరుగుదల కలిగిన జాతి; సంకరీకరణకు మేలు జాతిగా వాడతారు.
  • హ్యాంప్‌షైర్ (Hampshire) — నాణ్యమైన మాంసం, చురుకైన స్వభావం కలిగిన జాతి.

తెలంగాణకు అనువైన సంకర జాతులు:
పి.వి.నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం (PVNRTVU) ‘శిక్షణ’ పోర్టల్ ప్రకారం, తెలంగాణలో పెంపకానికి అనువైనవిగా ఈ కింది సంకర జాతులను గుర్తించారు

SVVU–T17 — శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం (SVVU), తిరుపతి అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్‌ను స్థానిక దేశీయ పందితో సంకరీకరణ చేసి 75% సీమ వారసత్వంతో రూపొందించారు. 8 నెలల వయసుకు సగటున 70–75 కిలోల బరువు, ఒక్కో ఈతకు 8–12 పిల్లలు లభిస్తాయి; ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, పేద రైతు కుటుంబాలకు జీవనోపాధి వనరుగా విస్తృతంగా వాడుతున్నారు (SVVU, 2021).

రాణి (Rani) — ఐ.సి.ఏ.ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం, గౌహతి 2016లో విడుదల చేసిన సంకర జాతి. సీమ జాతి హ్యాంప్‌షైర్‌ను ఈశాన్య భారత దేశీయ జాతి ఘుంగ్రూతో సమాన (50:50) వారసత్వంతో సంకరీకరణ చేశారు; ఆరు తరాలుగా జాతి లక్షణాలను స్థిరీకరించారు. 8 నెలల వధ వయసుకు సుమారు 75 కిలోల బరువు, 1.98 సెం.మీ. వెన్ను కొవ్వు మందం లభిస్తుంది; డ్యూరాక్‌తో సంకరీకరించి ‘ఆశ’ అనే మరో రకాన్ని కూడా అభివృద్ధి చేశారు (ICAR-NRCP, 2016).

TANUVAS KPM Gold — తమిళనాడు పశు వైద్య, జంతు శాస్త్రాల విశ్వవిద్యాలయం (TANUVAS) కింద పి.జి.ఆర్.ఐ.ఏ.ఎస్., కట్టుపాక్కంలో అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్ (75%)ను తమిళనాడు దేశీయ పందితో (25%) సంకరీకరణ చేసి 2017లో విడుదల చేశారు. అధిక వ్యాధి నిరోధకత, 3% లోపు పాలు మాన్పే వయసు మరణాల రేటు, ఒక్కో ఈతకు సగటున 8.1 పిల్లలు దీని ప్రత్యేకతలు; స్థానిక వాతావరణ పరిస్థితులకు బాగా అలవాటుపడింది (TANUVAS, 2017).

ఐ.సి.ఏ. ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం (ICAR-National Research Centre on Pig – ICAR-NRCP), గౌహతి ఈ సీమ, సంకర జాతులను దేశీయ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో, రైతులకు మేలుజాతి కూనలను (piglets) సరఫరా చేయడంలో, శిక్షణలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

శాస్త్రీయ పెంపక యాజమాన్య పద్ధతులు
గృహ నిర్మాణం (షెడ్ నిర్మాణం): పందుల షెడ్డు ఎత్తైన ప్రదేశంలో, మంచి గాలి, వెలుతురు ఉండేలా నిర్మించాలి. ఈనే పందులకు వేరుగా ఫారోయింగ్ పెన్‌లు, పిల్లల కోసం క్రీప్ ఏరియా, వ్యాధి సోకిన పందులను వేరుచేసేందుకు ఐసొలేషన్ పెన్ ఏర్పాటు చేసుకోవాలి. నేల సులభంగా కడగగలిగేలా సిమెంట్‌తో వాలుగా ఉండాలి, తద్వారా మురుగునీరు సులభంగా బయటకు పోతుంది.

సంతానోత్పత్తి యాజమాన్యం: ఆడ పందులకు 8 నెలల వయసు, సుమారు 90–100 కిలోల బరువు వచ్చాక మొదటిసారి సంతానోత్పత్తికి ఉపయోగించాలి. గర్భధారణ కాలం సగటున 114 రోజులు (3 నెలలు, 3 వారాలు, 3 రోజులు) ఉంటుంది. పిల్లలను 6–8 వారాల వయసులో పాలు మాన్పించడం (weaning) శాస్త్రీయ పద్ధతి. సంతానోత్పత్తికి రెండు వారాల ముందు ఆడ పందికి కొంచెం ఎక్కువ దాణా ఇవ్వడాన్ని ‘ఫ్లషింగ్’ (Flushing) అంటారు; ఇది రోజుకు 0.7–0.9 కిలోల బరువు పెరుగుదలను, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

మేత యాజమాన్యం
పందుల పెంపకంలో మొత్తం ఖర్చులో 70–75 శాతం మేత ఖర్చే ఉంటుంది. కాబట్టి వయసు, శరీర బరువును బట్టి శాస్త్రీయంగా మేత మార్చడం లాభదాయకతను నిర్ణయిస్తుంది.

దశలవారీ మాంసకృత్తుల (ప్రొటీన్) అవసరం
దశ/ వయసు ప్రోటీన్ % శక్తి (ME, కిలో క్యాలరీలు/కిలో మేత)
2–5 కిలోల బరువు పిల్లలు 24% 3,500
5–15 కిలోల బరువు 22% 3,500
15–35 కిలోల బరువు (గ్రోయర్) 18% 3,300
35–90 కిలోల బరువు (ఫినిషర్) 14% 3,300
గర్భిణి ఆడ పందులు 14% 3250
పాలిచ్చే ఆడ పందులు 15% 3300
కోడె పందులు (boars) 14% 3250

క్రీప్ ఫీడ్ మరియు తొలిదశ మేత
పుట్టిన 45 నిమిషాల్లోపే పిల్లలకు మొదటి పాలు (కొలొస్ట్రమ్) తాగించడం చాలా ముఖ్యం; ఇందులో వ్యాధి నిరోధక శక్తినిచ్చే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు), విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 10వ రోజు నుంచి పాలు మాన్పించిన 2 వారాల వరకూ 18–20% ప్రొటీన్‌తో కూడిన క్రీప్ ఫీడ్ ఇవ్వాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమం కలిపి తయారుచేసే ఈ దాణా వల్ల మాన్పించే సమయంలో ఒత్తిడి తగ్గి, త్వరగా బరువు పెరుగుతాయి.

గ్రోయర్ మరియు ఫినిషర్ దాణా
గ్రోయర్ దశలో మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమంతో కూడిన సమతుల్య దాణా ఇవ్వాలి. ఫినిషర్ దశలో మార్కెట్ బరువుకు తీసుకురావడానికి శక్తినిచ్చే దాణాతో పాటు నువ్వుల చెక్క వంటివి చేర్చవచ్చు.

పదార్థం పరిమాణం (100 కిలోల దాణాలో)
మొక్కజొన్న 55 భాగాలు
వేరుశనగ చెక్క 20 భాగాలు
గోధుమ తవుడు 15 భాగాలు
చేపల పొడి 8.5 భాగాలు
ఖనిజ మిశ్రమం 1.5 భాగాలు
ఉప్పు 0.5 భాగాలు
ఈ మిశ్రమం ద్వారా మొత్తం 22% ప్రొటీన్ లభిస్తుంది.

గర్భిణి, పాలిచ్చే ఆడ పందుల మేత:
గర్భిణి ఆడ పందికి రోజుకు 1.8–1.9 కిలోల దాణా ఇస్తే గరిష్ఠ జనన బరువు (Birth Weight), మాన్పే బరువు (Weaning weight) లభిస్తాయి. ఈనడానికి 4–5 రోజుల ముందు దాణాను సగానికి తగ్గించి, మలబద్ధకం రాకుండా గోధుమ తవుడు వంటి లఘువిరేచన పదార్థాలు చేర్చాలి. పాలిచ్చే ఆడ పందికి రోజుకు 3.5 కిలోల దాణాతో పాటు ప్రతి పిల్లకు అదనంగా 0.2 కిలోల చొప్పున, 14–23 లీటర్ల నీరు అవసరం.

నీటి అవసరం (రోజుకు):
వర్గం నీరు (లీటర్లలో)
కోడె పంది (boar) 45–50
ఈనే ఆడ పంది 18–22
పాలు మాన్పిన పిల్లలు 3.5–4
పాలిచ్చే ఆడ పంది 14–23

చౌక, స్థానిక మేత వనరులు
దాణా ఖర్చు తగ్గించుకోవడానికి అజొల్ల, వరి తవుడు (75% వరకు), బ్రూవరీ వ్యర్థాలు (15% వరకు), అరటి వ్యర్థాలు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు, హోటల్ వంటగది వ్యర్థాలు వంటి స్థానిక వనరులను సమతుల్యంగా వాడుకోవచ్చు. అయితే, గార్బేజ్ ఫీడింగ్‌లో మాంసం ముక్కలను ఇవ్వకూడదు — ఇవి వ్యాధులను వ్యాప్తి చేయడంతో పాటు గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. పులిసిన లేదా నిల్వ ఉంచిన ఆహారాన్ని ఇస్తే సాల్మొనెల్లోసిస్ వంటి వ్యాధులు వచ్చి మరణాలకు దారితీయవచ్చు కాబట్టి ఉడికించిన వ్యర్థాలనే ఇవ్వాలి.

వ్యాధి వర్గం: బాక్టీరియా వ్యాధులు

ప్రధాన వ్యాధులు : బ్రూసెల్లోసిస్

ముఖ్య లక్షణాలు: గర్భస్రావం, వంధ్యత్వం

నివారణ / నియంత్రణ : సోకిన పందులను వేరుచేయాలి, పరీక్షలు నిర్వహించాలి. జూనోటిక్ వ్యాధి.

వ్యాధి : *లెప్టోస్పైరోసిస్

ముఖ్య లక్షణాలు: జ్వరం, విరేచనాలు, గర్భస్రావం

నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, ఎలుకల నియంత్రణ, అవసరమైన టీకాలు

వ్యాధి : స్వైన్ ఎరిసిపెలాస్

ముఖ్య లక్షణాలు: అధిక జ్వరం, చర్మంపై వజ్రాకార మచ్చలు

నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు, యాంటీబయోటిక్ చికిత్స

వ్యాధి : అట్రోఫిక్ రైనైటిస్, సాల్మొనెల్లోసిస్, పాశ్చురెల్లోసిస్

ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ సమస్యలు, విరేచనాలు

నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, బయోసెక్యూరిటీ, వెటర్నరీ చికిత్స

వైరస్ వ్యాధులు: *

వ్యాధి : క్లాసికల్ స్వైన్ ఫీవర్ (CSF)

ముఖ్య లక్షణాలు: జ్వరం, ఆకలి తగ్గడం, అధిక మరణాలు

నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు వేయాలి

వ్యాధి : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)

ముఖ్య లక్షణాలు: అకస్మిక మరణాలు, అధిక మరణాల రేటు

నివారణ / నియంత్రణ : ప్రస్తుతం సమర్థవంతమైన టీకా లేదు. కఠినమైన బయోసెక్యూరిటీ పాటించాలి.

వ్యాధి: ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD)

ముఖ్య లక్షణాలు: నోరు, కాళ్లపై బొబ్బలు

నివారణ / నియంత్రణ : టీకాలు, వ్యాధిగ్రస్త పందులను వేరుచేయాలి

వ్యాధి : స్వైన్ ఇన్‌ఫ్లుఎంజా

ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ, జీర్ణకోశ సమస్యలు

నివారణ / నియంత్రణ : మంచి నిర్వహణ, అవసరమైన టీకాలు

*పరాన్నజీవి వ్యాధులు *

వ్యాధి : సార్కాప్టిక్ మేంజ్

ముఖ్య లక్షణాలు: తీవ్రమైన దురద, చర్మ సమస్యలు

నివారణ / నియంత్రణ : ఐవర్‌మెక్టిన్ చికిత్స, పరిశుభ్రత

వ్యాధి : రౌండ్‌వార్మ్, విప్‌వార్మ్, కిడ్నీ వార్మ్, లంగ్ వార్మ్

ముఖ్య లక్షణాలు: ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం

నివారణ / నియంత్రణ : ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి

వ్యాధి : ట్రైకినోసిస్

ముఖ్య లక్షణాలు: జూనోటిక్ వ్యాధి

నివారణ / నియంత్రణ : పంది మాంసాన్ని పూర్తిగా ఉడికించి తీసుకోవాలి

జూనోటిక్ వ్యాధులపై జాగ్రత్తలు
బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మొనెల్లోసిస్, ట్రైకినోసిస్ వంటి వ్యాధులు పందుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందువల్ల చేతి తొడుగులు ఉపయోగించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.

బయోసెక్యూరిటీ చర్యలు
• కొత్తగా కొనుగోలు చేసిన పందులను 2–3 వారాలు క్వారంటైన్‌లో ఉంచాలి.
• షెడ్డును, పరికరాలను, తాగునీటి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రపరచి క్రిమిసంహారక మందులు ఉపయోగించాలి.
• ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి.
• టీకాల షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలి.
• అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించి, అనుమానాస్పద మరణాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

రైతులకు సూచన: “చికిత్స కంటే నివారణే ఉత్తమం.” పరిశుభ్రమైన నిర్వహణ, సమతుల్య పోషకాహారం, సమయానికి టీకాలు, క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయడం ద్వారా పందుల ఆరోగ్యాన్ని కాపాడి అధిక లాభాలు పొందవచ్చు.

ప్రభుత్వ పథకాలు — విధానాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పందుల పెంపకాన్ని ఒక వ్యవస్థాపక అవకాశంగా ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.

జాతీయ పశు సంపద మిషన్ (National Livestock Mission – NLM)

పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకంలోని వ్యవస్థాపకత అభివృద్ధి ఉప-పథకం (Entrepreneurship Development Sub-Mission) కింద, పందుల పెంపక క్షేత్రాల ఏర్పాటుకు షెడ్ నిర్మాణం (ఈనే పందుల షెడ్, కోడె పందుల యూనిట్, ఫారోయింగ్ పెన్), మేలుజాతి పిల్ల పందుల కొనుగోలు, పరికరాలు, బీమా, పశు వైద్య సహాయం వంటి అంశాలపై 50% వరకు మూలధన రాయితీ లభిస్తుంది. వ్యక్తులు, రైతు ఉత్పత్తి సంఘాలు (FPO), స్వయం సహాయక బృందాలు (SHG), రైతు సహకార సంస్థలు (FCO), ఉమ్మడి బాధ్యతా బృందాలు (JLG) ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముగింపు
సీమ, సంకర జాతుల పందుల పెంపకం తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలం, తక్కువ కాలంలో ఎక్కువ రాబడినిచ్చే గ్రామీణ ఉపాధి మార్గంగా విస్తరిస్తోంది. అయితే, శాస్త్రీయ యాజమాన్యం, దశలవారీ సమతుల్య మేత, కచ్చితమైన టీకా కార్యక్రమం, కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలు పాటించకుండా చేపడితే — ముఖ్యంగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వంటి టీకా లేని వ్యాధుల నేపథ్యంలో — నష్టాలు తప్పవు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణ సదుపాయాలు, విశ్వవిద్యాలయాల విస్తరణ సేవలను సద్వినియోగం చేసుకుంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే, తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు సీమ పందుల పెంపకం ద్వారా నిలకడైన ఆదాయాన్ని, నిజమైన ఆర్థిక సాధికారతను సాధించగలరు. ఇందుకు పశు విస్తరణ విద్య, క్షేత్రస్థాయి శిక్షణలు, పశు వైద్యుల మార్గదర్శకత్వం అనునిత్యం అందుబాటులో ఉండటం అత్యవసరం.
.
డా. ఎం. అరవింద్ (పీజీ స్కాలర్), పశువైద్య & పశుసంవర్థక శాఖ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, సెల్‌: 8499884669.

Read More

ఎల్ నినోను ఎదుర్కొందాం: పట్టురైతులకు రక్షక కవచం

మెట్ట, పాక్షిక మెట్ట పట్టురైతుల కొరకు ప్రత్యేక మార్గదర్శిని

ఎల్ నినో అంటే ఏమిటి? దీని చరిత్ర ఏంటి?
పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని”ఎల్ నినో” (El Niño) అంటారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పవనాల గతి తప్పి, భారతదేశంలో రుతుపవనాలు బలహీనపడతాయి. ఫలితంగా తీవ్ర వర్షాభావం, కరవు మరియు మితిమీరిన వేడిగాలులు (హీట్‌వేవ్స్) ఏర్పడుతాయి.

గత చరిత్ర:
• 1997-1998: దేశవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన కరవును మిగిల్చింది.
• 2015-2016: అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి.
• 2023-2024: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పట్టుపరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది.

2026–2027 ఎల్ నినో కాలక్రమం (Timeline of the 2026–2027 El Niño Event)
ఒక బలహీనమైన లా నినా (La Niña) వేగంగా ముగిసిన తర్వాత, రాబోయే ఎల్ నినో (El Niño) యొక్క ప్రారంభ సంకేతాలను ప్రధాన అంతర్జాతీయ వాతావరణ సంస్థలు మొదటిసారిగా 2026 మార్చి నుండి మే నెలల మధ్య ముందస్తుగా అంచనా వేశాయి. భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలను దాటడంతో, ఎల్ నినో పరిస్థితులు 2026 జూన్ నాటికి అధికారికంగా ప్రారంభమయ్యాయని వాతావరణ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ (NOAA) మరియు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO)తో సహా అంతర్జాతీయ వాతావరణ నిపుణులు, ఈ ఎల్ నినో ప్రభావం మరింత ఉధృతమై 2026 చివరి నాటికి ఒక చారిత్రాత్మక “అత్యంత బలమైన” లేదా “సూపర్” ఎల్ నినోగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిపుణుల ఖచ్చితమైన విశ్లేషణల ప్రకారం, ఈ వాతావరణ మార్పులు 97% నిశ్చితత్వంతో 2027 వసంతకాలం (మార్చి–ఏప్రిల్) ప్రారంభం వరకు కొనసాగుతాయి, దీనివల్ల దక్షిణ భారతదేశంలో సుదీర్ఘమైన కరవు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది.

ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండే ముఖ్య జిల్లాల జాబితా
దక్షిణ భారతదేశంలో ఈ క్రింది మెట్ట మరియు పాక్షిక మెట్ట జిల్లాలు ఎల్ నినో బారిన పడే అవకాశం చాలా ఎక్కువ:
• ఆంధ్రప్రదేశ్: అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అన్నమయ్య.
• కర్ణాటక: కోలార్, బల్లాపూర్ స్థానంలో చిక్కబల్లాపూర్, రామనగర, తుమకూరు, చిత్రదుర్గ.
• తమిళనాడు: ధర్మపురి, కృష్ణగిరి, ఈరోడ్, తిరుప్పూర్.

ఎల్ నినో వల్ల పట్టుపరిశ్రమకు కలిగే నష్టాలు
• మల్బరీ తోటల క్షీణత: నేలలో తేమ తగ్గి, ఆకుల దిగుబడి మరియు పోషకాలు పడిపోతాయి.
• అధిక ఉష్ణోగ్రత: పట్టుపురుగుల పెరుగుదలకు కావాల్సిన 24°C – 27°C కంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువవుతుంది.
• తక్కువ తేమ (Low Humidity): గాలిలో తేమ తగ్గి పురుగులు నిర్जలీకరణానికి గురవుతాయి.
• తెగుళ్లు మరియు పురుగుల దాడి: త్రిప్స్ (Thrips), తెల్లదోమ మరియు ఉజి ఈగ (Uzi fly)ల ఉధృతి పెరుగుతుంది.
• వ్యాధులు: పట్టుపురుగులకు పచ్చరోగం (Grasserie), ఫ్లాచెరీ (Flacherie) వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి.

  1. మల్బరీ తోటల యాజమాన్యం (నీటి పొదుపు చర్యలు)
    • బిందు సేద్యం (Drip Irrigation): డ్రిప్ పద్ధతి ద్వారా 40% నీటిని ఆదా చేస్తూ వేర్లకు నేరుగా నీరు అందించవచ్చు.
    • లోతైన చారలు (Deep Trenching): వరుసల మధ్య 30 సెం.మీ లోతు కందకాలు తవ్వి వర్షపు నీటిని నిల్వ చేయాలి.
    • మల్చింగ్ (Organic Mulching): కొబ్బరి పీచు లేదా ఎండిన గడ్డిని తోటలో పరచడం ద్వారా భూమిలోని తేమ ఆవిరి కాకుండా చూడవచ్చు.
    • కత్తిరింపుల మార్పు (Pruning Shifts): వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగానే మల్బరీ కొమ్మల కత్తిరింపులు చేపట్టాలి.
  2. పట్టుపురుగుల పెంపక గృహాల (Rearing Room) నిర్వహణ
    • పైకప్పు రక్షణ: రేకుల లేదా కాంక్రీట్ రూఫ్‌లపై కొబ్బరి ఆకులు లేదా గడ్డిని దట్టంగా పరచాలి.
    • తడి గునె సంచులు (Wet Gunny Bags): కిటికీలు, తలుపులకు తడి బస్తాలను వేలాడదీసి గది ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.
    • తీవ్రమైన క్రిమిసంహారక చర్యలు: వేడి వల్ల వచ్చే బ్యాక్టీరియాను అరికట్టడానికి ‘క్లోరిన్ డయాక్సైడ్’తో గదిని శుద్ధి చేయాలి.
    • పడకల సాంద్రత తగ్గించడం (Bed Thinning): ట్రేలలో పురుగుల సంఖ్యను తగ్గించి గాలి ధారాళంగా ఆడేలా చూడాలి.
    • ఆకుల నిల్వ: కోసిన మల్బరీ ఆకులను తడి గుడ్డ కింద, చల్లని ప్రదేశంలో భద్రపరచాలి.

తక్షణ వాతావరణ కార్యాచరణ పట్టిక
సమస్య: అధిక వేడి.
*తక్షణ చర్య: నేలపై ఇసుక పోసి నీరు చల్లడం; గోడలపై నీరు కొట్టడం.
లభించే ప్రయోజనం ఉష్ణోగ్రత 3°C నుండి 5°C వరకు తగ్గుతుంది

పొడి గాలి (<70% తేమ)
హ్యూమిడిఫైయర్లు లేదా తడి బొగ్గుల వాడకం
గూళ్లు కట్టడానికి తగిన తేమ లభిస్తుంది

ఆకుల కొరత
ఆకులను వర్గీకరించి, చిన్న పురుగులకు ముందుగా మేత వేయడం
నాణ్యమైన మేత వృథా కాకుండా ఉంటుంది

ఉజి ఈగ దాడి
కిటికీలు, తలుపులకు నైలాన్ నెట్ (జాళి) అమర్చడం
ఉజి ఈగలు గదిలోకి రాకుండా 100% నివారించవచ్చు

అత్యవసర సహాయం కొరకు సంప్రదించండి
• సెంట్రల్ సిల్క్ బోర్డు (CSB): రాయితీ డ్రిప్ కిట్ల కొరకు మీ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించండి.
• కృషి విజ్ఞాన కేంద్రం (KVK): అత్యవసర తెగుళ్ల నివారణ సలహాల కొరకు.

• రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ: ప్రభుత్వ కరవు ఉపశమన పథకాల సమాచారం కొరకు.

రూపకర్తలు (Prepared by):
● డా. కె. శ్రీనివాస్, సైంటిస్ట్ ‘బి’ రీసెర్చ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ సబ్ యూనిట్, బీదర్ (REC SU, Bidar)
● డా. రమ్య వి., సైంటిస్ట్ ‘బి’ ప్రoతీయ పట్టుపరిశ్రమ పరిశోధనా కేంద్రం, అనంతపురం (RSRS, Anantapur)

Read More

శాస్త్రీయ పద్ధతుల ద్వారా పశువుల ఎంపిక

రైతు సోదరులు, పశుపోషణలో సరైన జంతువులను ఎంపిక చేసుకోవడం అనేది లాభనష్టాలను శాసించే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. నాణ్యమైన, ఆరోగ్యకరమైన పశువులను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసుకోవాలి.

  1. పాడి పశువుల ఎంపిక (ఆవులు మరియు గేదెలు)
    పాడి పరిశ్రమలో అధిక పాల దిగుబడి మరియు నిరంతర ఆదాయం కోసం ఆవులు, గేదెలను ఎంచుకునేటప్పుడు ఈ క్రింది శారీరక, ఉత్పాదక లక్షణాలను గమనించాలి:

ఆ. శారీరక నిర్మాణం (Body Conformation)
• త్రిభుజాకార శరీరం (Wedge Shape): మంచి పాడి పశువు వెనుక భాగం వెడల్పుగా, ముందు భాగం (తల మరియు మెడ) సన్నగా ఉండి, పక్క నుండి చూస్తే త్రిభుజాకారంలా కనిపించాలి. ఇది పాలు ఇచ్చే సామర్థ్యానికి ప్రతీక.
• చర్మం మరియు కళ్లు: చర్మం పల్చగా, మెరుస్తూ, పట్టుకుంటే వదిలేసేలా వదులుగా ఉండాలి. కళ్లు చురుగ్గా, స్పష్టంగా ఉండాలి.
• వెన్నెముక మరియు కాళ్లు: వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్లు బలంగా, నిలబడే పద్ధతి సరిగ్గా ఉండి, గిట్టలు ఎలాంటి పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.

బి. పొదుగు మరియు చనుమొనల లక్షణాలు (Udder and Teats)
• పొదుగు పరిమాణం: పొదుగు పెద్దదిగా, వెనుక కాళ్ల మధ్య భాగంలో బాగా అమర్చబడి ఉండాలి. పాలు పితికిన తర్వాత పొదుగు పూర్తిగా ముడుచుకుపోవాలి (ఇది పొదుగులో కొవ్వు తక్కువగా, పాల గ్రంథులు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది).
• పాల నరాలు (Milk Veins): పొదుగు ముందరి భాగం నుండి పొట్ట కింది వరకు సాగే పాల నరాలు లావుగా, వంకరలు తిరిగి స్పష్టంగా కనిపించాలి.
• చనుమొనలు: నాలుగు చనుమొనలు సమానమైన పొడవు, లావు కలిగి, ఒకదానికొకటి సమాన దూరంలో చతురస్రాకారంలో అమరి ఉండాలి. పొదుగు గట్టిగా ఉండకూడదు (పొదుగు వాపు వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకోవాలి).

సి. వయస్సు మరియు ఈత (Age and Lactation)
• ఈత: మొదటి లేదా రెండవ ఈతలో ఉన్న పశువులను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.
• వయస్సు నిర్ధారణ: పశువు నోటిలోని పళ్లను చూసి వయస్సును శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు. 4 నుండి 6 శాశ్వత పళ్లు (దాదాపు 3 నుండి 5 సంవత్సరాల వయస్సు) ఉన్న పశువులు కొనుగోలుకు అనువైనవి.

డి. ఇతర ముఖ్యాంశాలు
• వీలైతే పశువును కొనేముందు వరుసగా మూడు పూటల పాలు పితికి చూసి, సగటు పాల దిగుబడిని లెక్కించాలి.
• తెలంగాణ వాతావరణానికి గేదెలలో ముర్రా (Murrah) లేదా స్థానిక గ్రేడెడ్ ముర్రా, ఆవులలో జెర్సీ క్రాస్ (Jersey Cross), హెచ్.ఎఫ్ క్రాస్ (HF Cross) లేదా దేశవాళీ జాతులైన గిర్ (Gir), సాహివాల్ (Sahiwal) అనుకూలమైనవి.

  1. గొర్రెలు మరియు మేకల ఎంపిక (Sheep and Goat Selection)
    మాంసం ఉత్పత్తి మరియు పిల్లల ద్వారా లాభాలు పొందడానికి జీవాల ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరం.

ఆ. పోతు జీవాల ఎంపిక (Breeding Rams / Bucks)
మంద అభివృద్ధి అంతా పోతు జీవం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని ఎంపిక అత్యంత కీలకం.
• లక్షణాలు: పోతు జీవం చురుగ్గా, పొడవుగా, ఎత్తైన శరీరంతో, వెడల్పాటి ఛాతి కలిగి ఉండాలి.
• ప్రజనన అవయవాలు: రెండు వృషణాలు (Testicles) సమాన పరిమాణంలో, బాగా అభివృద్ధి చెంది, కిందికి వేలాడుతూ ఉండాలి. వృషణాలలో ఎలాంటి వాపులు లేదా గడ్డలు ఉండకూడదు.
• వయస్సు: 1 నుండి 1.5 సంవత్సరాల వయస్సు (రెండు పళ్ల ప్రాయం) ఉన్న పోతులను మాత్రమే ప్రజననం (దాటించడం) కోసం వాడాలి.

బి. ఆడ జీవాల ఎంపిక (Ewes / Does)
• శరీర రూపురేఖలు: ఆడ జీవాల వెనుక భాగం వెడల్పుగా ఉండాలి, ఇది సులభంగా ఈనడానికి తోడ్పడుతుంది. నోరు, దవడలు సరిగ్గా అమరి ఉండి మేతను సులభంగా నమలగలగాలి.
• సంతానోత్పత్తి చరిత్ర: త్వరగా ఎదకు వచ్చేవి, తక్కువ వ్యవధిలో ఈనేవి మరియు ఒకే ఈతలో రెండు పిల్లలను (ముఖ్యంగా మేకలలో) కనే హిస్టరీ ఉన్న తల్లుల నుండి వచ్చిన పిల్లలను ఎంచుకోవాలి.
• పొదుగు ఆరోగ్యం: పొదుగును తాకి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. చనుమొనలు మూసుకుపోయి ఉండకూడదు.

సి. వయస్సు మరియు జాతులు
• వయస్సు: 1 నుండి 2 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ జీవాలు మొదటి ఈతకు సిద్ధంగా ఉంటాయి.
• తెలంగాణకు అనువైన జాతులు:
o గొర్రెలు: నెల్లూరు (జోడిపి, బ్రౌన్), నల్లగొండ స్థానిక జాతులు.
o మేకలు: మహబూబ్‌నగర్ లోకల్, ఉస్మానాబాదీ, తలచ్చేరి/బీటల్ క్రాస్ జాతులు.

  1. పెరటి కోళ్ల ఎంపిక (Backyard Poultry Selection)
    తక్కువ పెట్టుబడితో ఇళ్ల వద్ద, పెరట్లో కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం మరియు పోషకాహారం పొందవచ్చు.

ఆ. పిల్లల (Chicks) మరియు పెరిగే కోళ్ల ఎంపిక
• చురుకుదనం: కోడిపిల్లలు చురుగ్గా కదులుతూ, శబ్దాలకు త్వరగా స్పందిస్తూ ఉండాలి. కళ్లు ప్రకాశవంతంగా, గుండ్రంగా ఉండాలి.
• శరీర నాణ్యత: పొట్ట భాగం మెత్తగా ఉండాలి (సరిగ్గా కరగని సొన వల్ల పొట్ట గట్టిగా ఉండకూడదు). ఈకలు పొడిగా, శుభ్రంగా ఉండాలి. కాళ్లు బలంగా, నిటారుగా ఉండి ఎలాంటి వైకల్యాలు ఉండకూడదు.
• నాభి (Navel): పిల్లల నాభి భాగం పూర్తిగా ఎండిపోయి, మూసుకుపోయి ఉండాలి. తడి నాభి ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

బి. గుడ్లు పెట్టే కోళ్ల ఎంపిక (Layers)
• కలగిరి (Comb) మరియు గడ్డం (Wattles): గుడ్లు పెట్టే కోడి యొక్క కలగిరి/శిఖ పెద్దదిగా, ఎర్రగా, వెచ్చగా మరియు మెరుస్తూ ఉంటుంది. గుడ్లు పెట్టని కోళ్లలో ఇది చిన్నదిగా, తెల్లగా మారుతుంది.
• శరీర సామర్థ్యం (Pelvic Bones): కోడి వెనుక భాగంలోని తుంటి ఎముకల (Pelvic bones) మధ్య కనీసం 2 నుండి 3 వేళ్ల వెడల్పు స్థలం ఉండాలి. అలాగే తుంటి ఎముకకు, రొమ్ము ఎముక చివరి భాగానికి (Keel bone) మధ్య 3 నుండి 4 వేళ్ల ఖాళీ ఉంటే అది ఎక్కువ గుడ్లు పెట్టే మంచి కోడి అని అర్థం.
• గుభ్రం (Vent): గుడ్లు పెట్టే కోడి యొక్క గుభ్రం (మల విసర్జన ద్వారం) వెడల్పుగా, తేమగా మరియు గుండ్రంగా ఉంటుంది.

సి. మాంసం కోళ్ల ఎంపిక (Broilers/Cockerels)
• తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే సామర్థ్యం, వెడల్పాటి రొమ్ము భాగం మరియు బలమైన తొడలు ఉన్న కోళ్లను మాంసం కోసం ఎంచుకోవాలి.

డి. తెలంగాణకు అనువైన పెరటి కోళ్ల రకాలు
• రాజశ్రీ (Rajasri), వనరాజ (Vanaraja), గ్రామప్రియ (Gramapriya) మరియు స్థానిక నాటు కోళ్లు పెరటి పెంపకానికి, తెలంగాణ వాతావరణానికి ఎంతో అనుకూలమైనవి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి, తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి.

రైతులకు సాధారణ ఆరోగ్య సూత్రాలు (Health Check-list)
ఏ జంతువు లేదా పక్షిని కొనుగోలు చేసినా ఈ క్రింది ఉమ్మడి ఆరోగ్య లక్షణాలను తప్పక గమనించాలి:

  1. ఆకలి మరియు నెమరు: జంతువు మేతను బాగా తింటూ, చురుగ్గా నెమరు వేస్తూ ఉండాలి.
  2. మలమూత్ర విసర్జన: పేడ లేదా విసర్జితాలు సాధారణ రంగు, గట్టిదనం కలిగి ఉండాలి (సారగా/డయేరియా ఉండకూడదు).
  3. కళ్ల నుండి నీరు: కళ్లు, ముక్కు మరియు నోటి నుండి ఎలాంటి అసాధారణ జిగట స్రావాలు కారకూడదు.
  4. టీకాల రికార్డు: కొనుగోలు చేసే ముందే సదరు పశువులకు/జీవాలకు సకాలంలో టీకాలు (FMD, PPR, గాలికుంటు, పిడుగు రోగం, కోళ్లలో ఆర్‌.డి.వి వంటివి) వేశారో లేదో కనుక్కోవాలి.
    ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులను పాటించి పశుసంపదను ఎంపిక చేసుకుంటే పశుపోషణలో నష్టాలు రాకుండా నివారించవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

కోళ్లలో మైకోప్లాస్మోసిస్ వ్యాధి / దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి (సి.ఆర్.డి)

మైకోప్లాస్మా జాతి సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల సమూహాన్ని “మైకోప్లాస్మోసిస్” అంటారు. ఈ జాతి సూక్ష్మజీవులు సుమారుగా 17 రకాలున్నప్పటికీ, 2-3 రకాలు మాత్రమే కోళ్లలో వ్యాధిని కలిగిస్తాయి. అవి మైకోప్లాస్మా గాలిసెప్టికం(అన్ని రకాల పక్షులకు), మైకోప్లాస్మా సైనోవి (సాధారణ కోళ్ళు, టర్కీలు, పావురాలు), మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ (ప్రధానంగా టర్కీలకు). ఈ వ్యాధిలో ప్రధానంగా శ్వాసకోశ సంబందిత లక్షణాలు గమనిస్తాము మరియు దీర్గకాలికంగా ఉంటుంది. అందువలన దీనిని దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి లేదా క్రానిక్ రేస్పిరెటరి డిసీజ్ (సి.ఆర్.డి) అని అంటారు.

అన్ని వయస్సు కోళ్ళకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. శీతాకాలం వంటి చల్లగా వుండే మాసాల్లో మరియు ఇతర వ్యాధులైనటువంటి ఇ.కోలి, పాశ్చురేల్లోసిస్, ఇన్ఫేక్ట్చువస్ బ్రోoకిటిస్, కొక్కెర తెగులు సోకినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి ఉదృతంగా ఉంటుంది. వ్యాధి సోకిన కోడి ద్వారా, కలుషితమైన గాలి ద్వారా ఆరోగ్యకరమైన ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంది. షెడ్ లో కోళ్ళు కిక్కిరిసి వుండి, గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేకుండా ఉన్నప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన లిట్టర్, కోళ్ళ మూత్రం ద్వారా, కలుషితమైన దాణా,  త్రాగునీటి ద్వారా, ఇతర పక్షులు, కోడి పిల్లల బాక్సులు, పరికరాలు, గ్రుడ్ల ట్రే ల ద్వారా, టీకాలు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో పని మనుషుల ద్వారా , బ్రీడింగ్ ఫారాలలో వ్యాధి గ్రస్త పుంజుల వీర్యం ద్వారా, తల్లి కోడి అండాశయం నుండి గ్రుడ్డు ద్వారా కోడిపిల్లలకు వ్యాపిస్తుంది.

లక్షణాలు:
మైకోప్లాస్మా గాలిసెప్టికం బారిన పడిన బ్రాయిలర్ కోళ్లలో 4 వారాల తరువాత మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి బారిన పడిన లేయర్ కోళ్లలో వ్యాధి మెల్లగా వ్యాపిస్తుంది. సూక్ష్మక్రిమి కోళ్ళ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 11-18 రోజుల్లో లక్షణాలు కనబడతాయి. ప్రప్రథమంగా శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అందులోను మొదటగా శ్వాసనాళo పైభాగం ఆశించడం వలన శ్వాస తీసుకోవడం కష్టతరమై కోళ్ళు తల పైకెత్తి గాలి పీల్చుకుంటాయి. అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు కూతలు కూడా వినబడుతాయి. ఆ తర్వాత సుక్ష్మక్రిమి గాలిగదులు, శ్వాసనాళం కింది భాగాన్ని ఆశించినప్పుడు గాలి గదులు వాచిపోతాయి. శ్వాసనాళంలో నెమ్ము చేరడం వలన గురక శబ్దం వస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు నుండి నీరు కారుతూ ఉంటుంది. చిన్న పిల్లలలో 30% వరకు మరణాలు సంభవిస్తాయి. గ్రుడ్ల ఉత్పత్తి 20-30% తగ్గిపోతుంది. మేత వినియోగం తగ్గటం వలన పెరిగే కోళ్లలో పెరుగుదల రేటు తగ్గి బరువు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో నీళ్ళ విరోచనాలుంటాయి. ఇంకా పెరికార్దిటిస్, పెరిటోనిటిస్, పెరిహేపటైటిస్ తరచుగా కనబడతాయి.

మైకోప్లాస్మా సైనోవి తరచుగా 4-12 వారాల కోడిపిల్లలకు, అలాగే 10-12 వారాల టర్కీకోళ్ళకు సోకుతుంది. ఇది ప్రధానంగా కీళ్ళను ప్రభావితం చేయడం వలన కీళ్ళ వాపులు, కీళ్ళ మధ్యలో మరియు టేండాన్ పొరలలో తెల్లటి చిక్కటి ద్రవం చేరి, కోళ్ళు కుంటుతూ ఉంటాయి.

మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ వ్యాధి బారిన పడిన టర్కీ కోళ్ళలో శ్వాస కష్టమవటం, తక్కువ శరీర పెరుగుదల, మెడ మరియు కాళ్ళ కీళ్ళలో వాపు, గ్రుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం, పొదిగే గ్రుడ్ల నుండి పిల్లల ఉత్పత్తి తగ్గటం, అధిక మరణాలు సంభవించడం వంటివి గమనిస్తాము.

పోస్ట్ మార్టెం చేసి చూస్తే:
శ్వాసనాళం ఫైభాగంలో రక్తస్రావాలు ఉంటాయి. తెల్లటి జిగట పదార్ధం కనబడుతుంది. గాలి గదులు మందమై కందిపోయి జున్ను లాంటి పదార్ధం పేరుకొని ఉంటుంది. గుండె, కాలేయం మీద పలుచని పొర ఏర్పడుతుంది.
చికిత్స : వ్యాధి గ్రస్త కోళ్ళకు థయాముటిన్, టైలోసిన్ వంటి యాంటిబయోటిక్ మందులను త్రాగే నీళ్ళలో లేదా ఇంజక్షన్ రూపంలో 5-7 రోజులు వాడాలి. ఇవే కాకుండా ఆక్సిటెట్రాసైక్లిన్, క్లోర్టెట్రాసైక్లిన్ ను టన్ను దాణాలో 200-400 గ్రా. చొప్పున కలిపి కూడా వాడవచ్చు.

నివారణ :

  • పెద్ద కోళ్ళు, కోడి పిల్లలు ఒకే షెడ్లో కాకుండా వేర్వేరు షెడ్లలో ఉంచాలి. ఈ షెడ్లు దూరంగా, ఎడంగా ఉండాలి.
  • కొత్తగా పిల్లలు తెచ్చే ముందు, షెడ్లను పొటాషియం పెర్మంగానేట్ మరియు ఫార్మలిన్ ద్రావణంతో ఫుమిగేషన్ చేసి 2-3 వారాలు ఖాళీగా ఉంచాలి.
  • కోళ్ళ ఫారాలలో కోళ్ళు కిక్కిరిసి, గుమికూడి ఉండకుండా చూడాలి. అందుకొరకు సరిపోను స్థలం కేటాయించాలి.
  • అధిక చలి మరియు గాలి, వెలుతురు లోపం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కావున గాలి,వెలుతురు సక్రమంగా ప్రసరించేలా చూడాలి.
  • టీకాలు, ఏలికపాముల మందు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో కోళ్ళు ఒత్తిడికి గురికాకుండా చూడాలి.
  • పాత లిట్టర్ తొలగించి, అమోనియా వాయువును నివారించాలి.
  • వ్యాధితో మరణించిన కోళ్ళను కాల్చి వేయాలి. వ్యాధి సోకిన వాటిని వెంటనే వేరు చేయాలి.
  • వాహనాలు, దాణా బస్తాలు, క్రేట్లు, పరికరాల ద్వారా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి.
  • కోళ్ళ షెడ్లు మరియు పరికరాలను శుభ్రం చేయడానికి ప్రతిపాదిత క్రిమిసంహారణిలైనటువంటి ఫినోలిక్ ఆమ్లం, క్రెసాలిక్ ఆమ్లం, హైపోక్లోరైట్, 10% ఫార్మలిన్, 0.1% గ్లుటరాల్దిహైడ్, బ్లీచింగ్ పౌడర్ ను వాడాలి.

డా. టి. విజయ నిర్మల శాస్త్రవేత్త (పశువైద్య విభాగం), డా. ఎన్. శ్రీ విద్య రాణి శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా. బి.ఎస్. కాంతి శ్రీ శాస్త్రవేత్త (గృహ విజ్ఞాన విభాగం), డా. ఎస్. ఫిరోజ్ హుస్సేన్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. ఎం.బాలకృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట, వై.ఎస్.ఆర్. కడప జిల్లా-516173, డా. గోవిందరాజులు, ఎ.డి.ఆర్., ఆర్.హెచ్.ఆర్.ఎస్., తిరుపతి & డా. సి.హెచ్. రూత్, విస్తరణ సంచాలకులు, వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ : 8121136184

Read More

ఎల్‌ నినో (El Nino) ప్రభావం మరియు పశువుల సంరక్షణ – సమగ్ర నివేదిక

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ మార్పు. దీని ప్రభావం వల్ల భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు మరియు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయంతో పాటు పాడి మరియు మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, మరియు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పశువులపై ఎల్‌నినో చూపే ప్రభావాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, మరియు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య, నివారణ చర్యల గురించి కింద వివరంగా వివరించబడింది:

  1. పశువులపై ఎల్‌ నినో చూపే తీవ్ర ప్రభావాలు

ఎ. ఉష్ణోగ్రత మరియు హీట్ స్ట్రెస్:
• ఎల్‌నినో సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6°C వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
• పశువులకు వాతావరణంలో ఉష్ణోగ్రత-తేమ సూచిక 68 కంటే తక్కువగా ఉంటే సురక్షితం. కానీ ఎల్‌నినో వల్ల ఈ సూచిక 79 కంటే ఎక్కువగా నమోదై, పశువులు భయంకరమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతాయి.
• మనుషుల లాగా పశువులకు చెమట పట్టే సామర్థ్యం చాలా తక్కువ. కాబట్టి వేడిని తట్టుకోవడానికి పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పశువు శరీరంలోని శక్తి మాంసం, పాలు ఉత్పత్తికి బదులుగా శ్వాస తీసుకోవడానికే వృథా అవుతుంది.

బి. రోగనిరోధక వ్యవస్థ క్షీణత మరియు వ్యాధులు:
• ఎల్‌నినో సమయంలో వాతావరణ ఒత్తిడి వల్ల పశువుల శరీరంలో కార్టిసోల్ మరియు ఏసీటీఎచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి.
• వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమారలు, మరియు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
• అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా మరియు వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి.

సి. పాడి ఆవులు, గేదెలపై ప్రభావం:
• ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
• తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోయి పాలు పలచబడతాయి.
• ప్రత్యుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఈస్ట్రోజెన్, ఎల్‌హెచ్ హార్మోన్ల స్థాయిలు పడిపోయి అండాల నాణ్యత దెబ్బతింటుంది.
• ఆవులు సైలెంట్ హీట్‌కు గురవుతాయి మరియు గర్భస్థ పిండాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
• ఒక పరిశోధన ప్రకారం, ఎల్‌నినో వల్ల కలిగే హీట్ స్ట్రెస్ సమయంలో ఆవులలో పిండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చల్లటి వాతావరణంలో సజీవ పిండాల శాతం 59.2% ఉండగా, ఎల్‌నినో సమయంలో అది 38.2%కి పడిపోయినట్లు గుర్తించారు.

డి. మాంసం కోసం పెంచే పశువులపై ప్రభావం:
• సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరగడం ఆగిపోతుంది.
• తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గ్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది.
• దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది.

ఇ. నీరు మరియు పశుగ్రాస కొరత:
• ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.
• చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు ప్రబలుతాయి.

  1. నివారణ మరియు యాజమాన్య చర్యలు

ఎ. పశుగ్రాస నిర్వహణ:
• ముందస్తు ప్రణాళిక: రాబోయే కరువు పరిస్థితులను (ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస ప్రణాళిక చేసుకోవాలి.
• సైలేజ్ తయారీ: వర్షాకాలంలో లేదా పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన గడ్డిని వృథా చేయకుండా “సైలేజ్” లేదా ఎండుగడ్డిగా నిల్వ చేసుకోవాలి.
• దాణా మరియు మేత కొలతలు: 400-500 కేజీల బరువుండే పశువుకు రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి (వరి గడ్డి లేదా జొన్న), 3-5 కేజీల దాణా విధిగా అందించాలి. పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలి.
• ప్రభుత్వ పథకాల వినియోగం: ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద, ప్రకృతి వ్యవసాయం కింద ఖాళీ భూముల్లో పచ్చగడ్డిని పెంచాలి. హరిత గోపాలం పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి.
• పొలాల గట్లపై పెరిగే సహజమైన గడ్డిని నాశనం చేయకుండా పశువుల కోసం భద్రపరచుకోవాలి.

బి. దాణాలో మార్పులు మరియు సప్లిమెంట్లు:
• పశువులు ఎండ సమయంలో మేత తినలేవు, కాబట్టి వాతావరణం చల్లగా ఉండే ఉదయం (6-7 గంటలకు) మరియు సాయంత్రం (4-6 గంటలకు) సమయాల్లో మేత మేపాలి.
• మేతలో పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి.
• వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
• పశువులకు మినరల్ మిక్చర్ మరియు ఉప్పు ఎక్కువగా ఉండే దాణా అందించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, మరియు ఎల్-కార్నిటైన్ కలిగిన పోషకాలు పశువులకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.

సి. నీటి నిర్వహణ:
• ఒక ఆవుకు రోజుకు కనీసం 40-60 లీటర్ల శుభ్రమైన తాగునీరు అవసరం, ఎండాకాలంలో ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. పశువులకు ఎల్లప్పుడూ చల్లటి, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.
• వ్యవసాయ క్షేత్రాల్లో పల్లపు ప్రాంతాల్లో ఫార్మ్ పాండ్స్ తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

డి. వసతి మరియు శీతలీకరణ:
• పశువుల పాకల పైకప్పుకు ఆస్బెస్టాస్ లేదా జింక్ రేకులు వాడకూడదు, ఇవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కప్పులపై గడ్డి లేదా కొబ్బరి ఆకులు వేసి ఉంచాలి.
• గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. పాకలలో వేడిని తగ్గించడానికి ఫాగర్లు, మిస్ట్ డ్రాప్స్, లేదా స్ప్రింక్లర్లు తో పాటు ఫ్యాన్లు ఉపయోగించి సూక్ష్మ వాతావరణాన్ని చల్లగా ఉంచాలి. క్లోజ్డ్ హౌస్ పద్ధతిని వాడితే కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇ. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్:
• ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ముందే పశువులకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, మరియు జబ్బవాపు లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
• పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు త్రాగించాలి. పాకల్లోకి పేలు, గోమారలు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి.
• పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
• ఉరుములు, పిడుగులు పడే సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకూడదు. అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పశువులను బలవంతంగా లాగడం చేయకూడదు.
పై విధానాలను సూక్ష్మస్థాయిలో ప్రణాళికబద్ధంగా పాటిస్తే, ఎల్‌నినో లాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సైతం పశుగ్రాస కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం పశువైద్యాధికారిని సంప్రదించడం అత్యంత కీలకం.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప. Ph: 94945 88885

Read More

ఎల్ నినో పరిస్థితుల్లో రైతు ఆదాయ స్థిరత్వానికి వ్యూహాలు: అనుకూల పంటల ఎంపిక మరియు వ్యవసాయ రికార్డుల నిర్వహణ

భారతదేశ జనాభాలో సుమారు 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, మొత్తం శ్రామిక శక్తిలో 54.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో కూడా సుమారు 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, దాదాపు 55 శాతం మంది వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 86 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కమతాలు చిన్న మరియు సన్నకారు వర్గాలకు చెందుతాయి.

తెలంగాణ వ్యవసాయం నీటిపారుదల మరియు వర్షాధార వ్యవసాయ వ్యవస్థల సమ్మేళనంగా ఉండి, వర్షపాతం వ్యవసాయాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటీవలి సంవత్సరాల్లో సాగునీటి వసతులు పెరిగినప్పటికీ, వాతావరణ మార్పులు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకునే ప్రతి పంట నిర్ణయం కుటుంబ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షపాతం అస్థిరంగా ఉండే సంవత్సరాలలో పంటల ఎంపిక మరింత కీలకంగా మారుతుంది. ఎల్నినో (Elnino) వంటి వాతావరణ పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసి వ్యవసాయ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో సాధారణంగా రుతుపవనాల బలహీనత, సగటు కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2025-26 సంవత్సరానికి కూడా వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశాలపై వివిధ వాతావరణ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన పంటలు మరియు వాటిపై ఎల్ నినో ప్రభావం
వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2025 వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో వరి పంట 50.57 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో పత్తి 34.52 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఈ గణాంకాలు రాష్ట్ర వానాకాల పంటల సరళిలో వరి మరియు పత్తి పంటల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఎల్నినో వంటి వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైనే ఆధారపడకుండా, నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న కందులు, పెసర వంటి పప్పుధాన్యాలు లేదా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో (2014-15 మరియు 2015-16) తెలంగాణలో ప్రధాన పంటల నికర ఆదాయంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి.

2015-16 తీవ్రమైన ఎల్ నినోలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. వరి (-14007.72), మొక్కజొన్న – 11373.53), పత్తి (-10908.38), కందులు (-9818.09), పెసర (-5207.97) పంటలన్నింటిలోనూ నికర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎంతగా దెబ్బతింటాయో సూచిస్తుంది. అదే విధంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వర్షాభావాన్ని తట్టుకొని రైతులకు నష్టాలను తగ్గించే అవకాశాన్ని కల్పించాయి. దీనినిబట్టి ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో అన్ని పంటలు ఒకే విధంగా ప్రభావితమవలేదని గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలలో వరి అత్యధిక నష్టాలను చవిచూడగా, కొన్ని ప్రత్యామ్నాయ పంటలు లాభాలను మరియు తక్కువ నష్టాలను నమోదు చేశాయి.

అదేవిధంగా పంటల ఎంపికలో కూడా ఒకే సూత్రం అందరికీ వర్తించదు. రైతు నేల స్వభావం, నీటి వనరులు, గత అనుభవం, మార్కెట్ పరిస్థితులు మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా తీసుకోవడానికి వ్యవసాయ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గత సంవత్సరాలలో ఏ పంటకు ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఆదాయం లభించింది, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట మెరుగ్గా నిలిచింది వంటి వివరాలు రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

దీనికోసం రైతు పొలంలో జరిగే వివిధ కార్యకలాపాలకు వేర్వేరు రికార్డులు అవసరం. రైతు నిర్వహించుకోదలచిన ముఖ్యమైన రికార్డు రకాలు ఇవి:

  1. వ్యవసాయ దినచర్య రికార్డు
  2. పంటల వారీ ఖర్చు-ఆదాయ రికార్డు
  3. ఎరువుల వినియోగ రికార్డు
  4. పురుగుమందుల వినియోగ రికార్డు
  5. కార్మికుల వినియోగ రికార్డు
  6. యంత్రాల వినియోగ రికార్డు
  7. నీటి వినియోగ రికార్డు
  8. దిగుబడి రికార్డు
  9. పశుసంవర్ధక రికార్డు
  10. నిల్వ మరియు విక్రయాల రికార్డు

ప్రస్తుతం తెలంగాణలోని అభ్యుదయ రైతులు కొంతమంది ప్రధానంగా కాగితపు రికార్డుల ద్వారానే వ్యవసాయ సమాచారాన్ని నమోదు చేసి భద్రపరుస్తున్నారు. అయితే, కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన వివిధ ఆధునిక పద్ధతులను కూడా వినియోగించి వ్యవసాయ రికార్డులను మరింత సమర్థవంతంగా భద్రపరచుకోవచ్చు. వీటిలో సంప్రదాయ కాగితపు పద్ధతులతో పాటు డిజిటల్ రికార్డు పద్ధతులు, స్మార్ట్ఫోన్ ఆధారిత పద్ధతులు మరియు ప్రభుత్వ డిజిటల్ వేదికలు ముఖ్యమైనవి. ఈ పద్ధతుల వివరాలు క్రింది చిత్రంలో చూపించబడ్డాయి.

వివిధ వ్యవసాయ రికార్డుల పద్ధతులు
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం గల అనుకూల పంటలను ఎంపిక చేసి సాగు చేయడం రైతుల ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వాతావరణ మార్పులు మరియు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో ముఖ్యమైన వ్యూహంగా నిలుస్తుంది. అదే సమయంలో, పంటల ఎంపిక, ఖర్చులు, దిగుబడులు, ఆదాయం మరియు వనరుల వినియోగానికి సంబంధించిన వ్యవసాయ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచడం ద్వారా రైతులు గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ సాగు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా మరియు సమర్థవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల, అనుకూల పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ రికార్డుల నిర్వహణ కూడా వాతావరణ అనిశ్చితులను ఎదుర్కొంటూ స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాభివృద్ధికి కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

డా. డి. ఎ. రజిని దేవి, సహాయ ప్రొఫెసర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల,రాజేంద్రనగర్
డా. కె. శేఖర్, సహాయ ప్రొఫెసర్, సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్: 9032128184

Read More

పొదుగు వాపు వ్యాధి (మాస్టైటిస్) కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

మాస్టైటిస్ అంటే క్షీర గ్రంధి లేక పొదుగు యొక్క వాపు. ఇది పొదుగు యొక్క భౌతిక, రసాయన మరియు సూక్ష్మజీవుల మార్పులను కలుగజేస్తుంది. ఇది ప్రధానంగా పాలలో సోమాటిక్ కణాల పెరుగుదల మరియు క్షీర కణజాలంలోని రోగ లక్షణ మార్పుల ద్వారా గుర్తించబడుతుంది. ఇది పాడి పరిశ్రమలో అత్యంత సాధారణమైన మరియు ఆర్థికంగా నష్టాన్ని కలిగించే వ్యాధులలో ఒకటి. ఇది పాల నాణ్యతను మరియు ఉత్పత్తిని తగ్గేలా చేస్తుంది. మాస్టైటిస్ అనే పదము గ్రీకు పదం. “మాస్టో” అంటే క్షీర గ్రంధిని సూచిస్తుంది మరియు “ఐటిస్” అంటే వాపు అని అర్థం.

పొదుగు వాపుకు ముందస్తు కారణాలు

  • సాధారణంగా పొదుగు వాపు ఎక్కువ ఈతలు ఈనిన పశువులలో చూడవచ్చు.
  • తక్కువ దిగుబడి నిచ్చే వాటికంటే అధిక దిగుబడినిచ్చే పాడి ఆవులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.
  • అన్య దేశ మరియు సంకరజాతి ఆవులకు పొదుగు వాపు ఎక్కువగా వస్తుంది.
  • పొదుగు నుండి అసంపూర్ణంగా పాలు పితకడం
  • జన్యుపరమైన కారణాలు అనగా పొడవాటి చనులు, కిందకు ఉండే పొదుగు
  • గాయాలు గల చనులు, పొదుగు వ్యక్తిగత అపరిశుభ్రత, అపరిశుభ్ర మైన పరిసరాలు మొదలైనవి పొదుగు వాపు కు దోహదపడతాయి.

కారణాలు
పొదుగు వాపుకు కారణాలుగా వివిధ రకాల సూక్ష్మక్రిములు సూచింపబడతాయి. అవి బ్యాక్టీరియా (సూక్ష్మజీవులు), వైరస్ (సూక్ష్మతి సూక్ష్మక్రిములు), ఫంగస్ (శిలీంద్రాలు) మరియు మైకోప్లాస్మా.
పొదుపు వాపుకు కారణమయ్యే అతి ముఖ్యమైన బ్యాక్టీరియాలు- స్టెఫిలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ అగలక్షియే, స్ట్రెప్టోకోకస్ జూఎపిడెమికస్, స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్, క్లెబ్సియెల్లా, మైకోబాక్టీరియం బోవిస్, ఎస్చేరిచియా కోలై, బ్రూసెల్లా అబోర్టస్; సూడోమోనాస్ మొదలగునవి
మాస్టైటిస్కు కారణమయ్యే శిలీంధ్ర జీవులు- ట్రైకోస్పోరాన్, ఆస్పెర్‌గిల్లస్ ఫ్యూమిగాటస్, ఆస్పెర్‌గిల్లస్ మిడులస్; కాండిడా జాతులు.

వ్యాప్తి విధానం
చనుల యొక్క రంద్రాల ద్వారా ఇన్ఫెక్షన్ క్షీర గ్రంధికి చేరుకుంటుంది పొదుగు మరియు పర్యావరణం లో నివసించే సూక్ష్మ క్రిములు వంటివి అనుకూలమైన పరిస్థితులలో వృద్ది చెంది కణజాలాలపై దాడి చేయటం వలన చాలా హానికరమైన ప్రభావం ఏర్పడుతుంది. ఆవు యొక్క చర్మ ఉపరితలం మీద అనేక క్రిములు నివాసం కలిగి ఉండవచ్చు మరియు అక్కడ నుండి ఆ క్రిములు పాలు పితికే వారి ద్వారా కలుషితం చెంది వ్యాధి వచ్చే అవకాశం ఉండవచ్చు. పాలు పితికే వారి చేతులు, బట్టలు మరియు పాలు పితికే యంత్రాల కప్పుల ద్వారా వ్యాధి సోకిన పొదుగు భాగం నుండి వ్యాధి సోకని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన గ్రంధి నుండి వచ్చే స్రవాలు, నేలను కలుషితము చేయడం ద్వారా వ్యాధి సంక్రమణ చెందుతుంది.

పొదుపు వాపు రకాలు
1) వ్యాధి లక్షణాల ఆధారంగా
a) క్లినికల్ మాస్టైటిస్
ఇందులో పొదుగు వాపు లక్షణాలైన వాపు, వేడి, ఎరుపు రంగు, తీవ్రమైన నొప్పి ఉంటుంది.
b) సబ్ క్లినికల్ మాస్టైటిస్
ఈ రకంలో పొదుగు నందు ఎటువంటి బాహ్య లక్షణాలు కనపడవు కానీ పాలలో మార్పులు అంటే సోమాటిక్ కణాలు, తెల్ల రక్తకణాలు (ల్యూకోసైట్లు) మరియు ఎపితీలియల్ కణాలలో మార్పు, పాల పిహెచ్ (PH)లో మార్పులు గమనించవచ్చు.
2) పొదుగు వాపు తీవ్రత ఆధారంగా
a) తేలికపాటి మాస్టైటిస్
పాలలో స్వల్ప మార్పులు, పలుకులు లేదా గడ్డ కట్టడం గమనించవచ్చు.
b) తీవ్రమైన మాస్టైటిస్
పాలలో మార్పులు మరియు పొదుగులో వాపు మరియు నొప్పితో పాటు మరింత స్పష్టమైన మార్పులు గమనించవచ్చు.
c) అతితీవ్రమైన మాస్టైటిస్
శారీరక సంబంధ సంకేతాలైన జ్వరం, ఆకలి లేకపోవటం మరియు తీవ్రమైన పొదుపు వాపు వంటి లక్షణాలను గమనించవచ్చు.
3) కాలవ్యవధి ఆధారంగా
a) అతి తీవ్రమైన మాస్టైటిస్
తీవ్రమైన లక్షణాలతో ఆకస్మికంగా ప్రారంభమవుతుంది తరచుగా శారీరక సంబంధమైన అనారోగ్యానికి దారితీస్తుంది.
b) తీవ్రమైన మాస్టైటిస్
గుర్తించదగిన లక్షణాలతో త్వరగా ప్రారంభమవుతుంది
c) సబక్యూట్ (తక్కువ తీవ్రమైన) మాస్టైటిస్
తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటాయి ఇది తీవ్రమైన మాస్టైటిస్ కంటే తక్కువ తీవ్రమైనది
d) దీర్ఘకాలిక మాస్టైటిస్
నిరంతర వాపు కలిగి ఉండి సమయానుకూలంగా వ్యాధి లక్షణాలు కనబడతాయి.
4) కారణ కారక ఆధారంగా
a) సంక్రమించే (కంటేజియస్) మాస్టైటిస్
ఇది ప్రధానంగా పాలు పితికే ప్రక్రియలో ఒక ఆవు నుండి మరొక ఆవుకు వ్యాప్తిస్తుంది. కలుషితమైన పాలు పితికే పరికరాలు, చేతులు మరియు బెడ్డింగ్ వస్తువుల ద్వారా పాలు పితికే సమయంలో వ్యాప్తిస్తాయి.
వ్యాధికారకాలు: స్టెఫిలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ అగలక్షియే మరియు మైకోప్లాస్మా జాతులు.
b) పర్యావరణ (ఎన్విరాన్మెంటల్) మాస్టైటిస్
ఇది ఆవు పరిసరాలలో ఉన్న కలుషితమైన బెడ్డింగ్ వస్తువులు, నేల, నీరు మరియు ఎరువు వంటి వాటి వల్ల సంభవిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా పాలు పితికే సమయాల మధ్య సంక్రమిస్తాయి వ్యాధికారకాలు: ఎస్చరీషియా కోలై, క్లెబ్సియెల్లా మరియు స్ట్రెప్టోకోకస్ యుబేరిస్.

వ్యాధి అభివృద్ధి చెందే ప్రక్రియ
ఇది మూడు దశలుగా వివరించవచ్చు. సూక్ష్మ క్రిములు చనుల ద్వారా చొరబడుట, ఇన్ఫెక్షన్ మరియు వాపు కలుగజేయుట.

  1. మొదట వ్యాధికారక సూక్ష్మ క్రిములు చనుమొనల చివర నుండి పాల గ్రంధిలోనికి చొరబడతాయి.
  2. ఇన్ఫెక్షన్ దశ అంటే వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెంది, క్షీర కణజాలంపై దాడి చేస్తాయి.
  3. వాపు దశలో పొదుగు యొక్క వాపు, పాలలో మార్పులు అంటే పాలుగడ్డ కట్టడం, విరిగిపోవడం అనే లక్షణాలు కలిగి ఉండవచ్చు.

పొదుగు వాపు లక్షణాలు
పొదుగుకు సంబంధించిన లక్షణాలు:

  • ఉద్దరoవాపు లేదా పొదుగు వాపు
  • గ్రంధి భాగం బాగా ఉబ్బిపోవడం
  • ఉష్ణోగ్రత పెరగడం, స్పర్శకు వేడిగా ఉండటం, ఎరుపు రంగులో మారడం
  • తీవ్రమైన నొప్పి
    పాలలో మార్పులు
  • పాలు నీరు లాగా ఉండటం
  • పాలు గడ్డకట్టడం లేదా రక్తపు చుక్కలు గమనించవచ్చు
  • కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వాసన కూడా గమనించవచ్చు.
    తీవ్రమైన మాస్టైటిస్ లో కనిపించే ఇతర శారీరక సంభందిత లక్షణాలు
  • జ్వరము
  • ఆహారం తినకపోవడం
  • నీరసంగా ఉండటం
  • దాహం ఎక్కువగా ఉండటం
  • డిహైడ్రేషన్
  • పాల ఉత్పత్తి తగ్గిపోవడం చూడవచ్చు.

మాస్టైటిస్ నిర్ధారణ పద్ధతులు
క్లినికల్ మాస్టైటిస్ ను కళ్ళతోనే పాలలో కలిగే మార్పుల ద్వారా గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను పరీక్షల ద్వారానే నిర్ధారించుకోవాలి.

  1. భౌతిక పరిశీలన (ఫిజికల్ ఎగ్జామినేషన్): పొదుగు భాగాన్ని పరిశీలించి, వాపు, ఉష్ణోగ్రత, నొప్పిని గుర్తించడం. పాల ప్రవాహాన్ని గమనించడం. పాల రంగు, వాసన, గడ్డలు కట్టడం లాంటి లక్షణాలను పరిశీలించడం.
  2. క్యాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ (CMT): పాలలో సోమాటిక్ కణజాలాన్ని అంచనా వేయటానికి ఉపయోగిస్తారు. పాలకు ఒక రియేజెంట్ ను జతచేసి దాని చిక్కదనాన్ని (జెల్ ఫార్మేషన్) గమనించడం ద్వారా మాస్టైటిస్ ను గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను గుర్తించడానికి ఈ టెస్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది చాలా సరళమైన, త్వరిత పరీక్ష. తక్కువ ఖర్చుతో ఫీల్డ్‌లోనే నిర్వహించగలిగే పరీక్ష.

కావాల్సిన పరికరాలు:

  • CMT ప్లేట్ (4 కువెట్లు ఉన్న ప్లాస్టిక్ ట్రే)
  • స్పెషల్ రియేజెంట్ (CMT, లిక్విడ్ ఆధారిత డిటర్జెంట్)
  • పాల నమూనాలు (ప్రతి ఉద్ధర భాగం నుంచి)

పరీక్ష పద్ధతి:

  1. గేదె యొక్క పొదుగు నాలుగు భాగాల నుండి పాలను CMT ప్లేట్‌లో ఒక్కో కువెట్లలో తీసుకోవాలి
  2. ప్రతి పాల నమూనాలోకి CMT రియేజెంట్ ను కలపాలి (సమాన 1:1 నిష్పత్తిలో)
  3. ప్లేట్‌ను సున్నితంగా 10 సెకన్లపాటు కలియబెట్టాలి
  4. జెల్ ఫార్మేషన్ స్థాయి (చిక్కదనం) ఆధారంగా ఫలితాన్ని గమనించాలి

ఫలితాల వివరణ:
రియాక్షన్ ఫలితాలు సోమాటిక్ సెల్ కౌంట్ అంచనా
పలుచగా ఉండి పాలలో ఎటువంటి మార్పు లేకపోవటం నెగటివ్ <200,000 కణాలు/ml చిక్కగా సబ్ క్లినికల్ మాస్టైటిస్ 200,000 – 500,000 స్పష్టమైన జెల్ పాజిటివ్ (క్లినికల్ మాస్టైటిస్) >500,000
చాలా గట్టి గడ్డలు శక్తివంతమైన పాజిటివ్ >1,000,000

జాగ్రత్తలు:
పరిశుభ్రమైన వాతావరణంలో చేయాలి
తాజా పాల నమూనాలను మాత్రమే ఉపయోగించాలి
వాసన లేదా రంగు మార్పుతో పాటు ఫలితాన్ని అర్థం చేసుకోవాలి

  1. పాల కల్చర్ మరియు సెన్సిటివిటీ టెస్ట్ (ABST): పాలు శుభ్రంగా సేకరించి, ల్యాబ్ లో కల్చర్ చేసి మాస్టైటిస్ కలిగించే బ్యాక్టీరియా ఏవో గుర్తించవచ్చు. తగిన యాంటీబయాటిక్ ను ఎంచుకునేందుకు ఈ టెస్ట్ చాలా దోహదపడుతుంది.
  2. సొమాటిక్ కణజాలం కౌంట్ (సొమాటిక్ సెల్ కౌంట్) (SCC): పాలలో తెల్ల రక్త కణాల సంఖ్య ఆధారంగా ఇన్ఫెక్షన్ తీవ్రతను అంచనా వేయవచ్చు. రెండు లక్షల కణాల కంటే ఎక్కువగా ఉంటే మాస్టైటిస్ ను సూచిస్తుంది.
  3. ఎలక్ట్రికల్ కండక్టివిటీ టెస్ట్: పాలలో ఉన్న అయాన్ల పరిమాణం మార్పు ఆధారంగా పాలు మాస్టైటిస్ వలన ప్రభావితమైందో లేదో చెప్పగలదు. ఇది వేగమంతమైన ఫీల్డ్ టెస్ట్.
  4. పాల యొక్క పీహెచ్ (PH) పరీక్ష: మాస్టైటిస్ ఉన్న పాలలో పిహెచ్ పెరుగుతుంది. 6.6 కంటే ఎక్కువగా ఉంటుంది.
  5. తర్మోగ్రఫీ: ఇన్ఫ్రారేడ్ కెమెరాలతో పొదుగుభాగం ఉష్ణోగ్రతను అంచనా వేయడం ద్వారా గుర్తించవచ్చు. పొదుగు వాపు వ్యాధి సంభందమైన మార్పులను తేలికగా గుర్తించవచ్చు.

చికిత్స:
(A) యాంటీబయాటిక్స్ (Antibiotics)
• ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే బ్యాక్టీరియాలను వృద్ధిచెందకుండా, యాంటీబయాటిక్ లను ఉపయోగిస్తారు. ఇవి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ (ABST) ఆధారంగా ఇచ్చినట్లయితే చికిత్సకు అగు ఖర్చులు తగ్గించుకోవచ్చు.

ఇంట్రామామరీ యాంటీబయాటిక్స్ (పొదుగులోకి ప్రత్యక్షంగా ఇవ్వడం):
o Cloxacillin
o Amoxicillin
o Cephalosporins

సిస్టమిక్ యాంటీబయాటిక్స్ (ఇంజెక్షన్లు రూపంగా):
o Enrofloxacin
o Penicillins
o Oxytetracycline
o Cephalosporins

(B) యాంటీ-ఇన్ఫ్లమేటరీ మందులు (Anti-inflammatory drugs)
• పొదుగు యొక్క వాపు మరియు నొప్పి తగ్గించడానికి ఈ మందులు వాడతారు.
ఉదాహరణలు:
o Flunixin meglumine
o Meloxicam

తీవ్రమైన కేసులలో శస్త్రచికిత్స:
వ్యాధి తీవ్రంగా ఉండి, చీముతో ఉన్నప్పుడు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వ్యాధిని నివారించడానికి, ఆ పొదుగు భాగాన్ని తొలగించడం అవసరమవుతుంది.

నివారణ మరియు నియంత్రణ:

  • ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నియంత్రిoచడానికి వ్యాధిసోకిన పశువులను వేరుచేయాలి.
  • పశువైద్యులు సూచించిన విధంగా వ్యాధి సోకిన పశువులకు చికిత్సను క్రమం తప్పకుండా అందించాలి.
  • మాస్టైటిస్ ఉన్న పశువులను రోజుకు 3-4 సార్లు పాలను పూర్తిగా పిండాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
  • పాలు పితికే ప్రాంతాలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచాలి.
  • బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి సరైన వెలుతురు, గాలి మరియు మంచి పారిశుధ్యాన్ని పాటించాలి.
  • పశువులకు శుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • గడ్డి లేదా ఇసుక వంటి శుభ్రమైన మరియు పొడి బెడ్డింగ్ పదార్థాలను ఉపయోగించాలి.
  • విటమిన్లు మరియు ఖనిజ లవణాలతో కూడిన సమతుల్య పోషకాహారాన్ని అందించడం ద్వారా పశువు యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.
  • పాలు పితికే ముందు, తరువాత పొదుగును శుభ్రంగా కడిగి, మెత్తని పొడి గుడ్డతో తుడవాలి.
  • పాలు పితికేవారు చేతులు శుభ్రంగా కడుక్కొని పాలను పిండాలి.
  • పాలు పితికిన తర్వాత చనుమొనల ద్వారం దాదాపు ఇరవై నిమిషాలు తెరుచుకొని ఉంటుంది. ఈ సమయంలో సూక్ష్మక్రిములు పొదుగు లోనికి చొరబడి వ్యాధిని కలుగజేస్తాయి. అందువలన, పాలు పితికిన తర్వాత చనుమొనలను క్రిమిసంహారక ద్రావణంలో ముంచడం వల్ల పొదుగు వాపును నివారించవచ్చు. ఈ పద్ధతిని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు. దీని ద్వారా పొదుగు వాపుకు ప్రధాన కారణాలైన సూక్ష్మక్రిములు చనుమొనల నుంచి లోనికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది. పోవిడోన్ ఐయోడిన్ లేదా క్లొర్‌హెక్సిడిన్ ఉత్పత్తులను టీట్ డిప్పింగ్ కొరకు ఉపయోగించవచ్చు.
  • తరచుగా CMT పరీక్షలు నిర్వహించడం ద్వారా సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను గుర్తించి చికిత్స చేయడంతో పొదుగు వాపును అరికట్టవచ్చు.
  • డ్రై కౌ థెరపీ (Dry Cow Therapy) పాటించడం ద్వారా పొదుగు వాపును నివారించవచ్చు.
    డ్రై కౌ థెరపీ అనేది పశువు పాలివ్వడం ఆపిన తర్వాత (లాక్టేషన్ ముగిసినప్పుడు), తదుపరి ప్రసవానికి ముందు ఉన్న డ్రై పీరియడ్ (సుమారు 60 రోజుల పాటు ఉంటుంది) సమయంలో పొదుగు లోనికి యాంటిబయాటిక్ లను వాడడం. ఈ చికిత్స ద్వారా:
    • డ్రై పీరియడ్ లోఉన్న మాస్టిటిస్ ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి
    • కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు
    • తదుపరి లాక్టేషన్‌కి మేలైన పాల ఉత్పత్తి కలుగుతుంది.
    డ్రై కౌ థెరపీ రకాలు
  1. బ్లాంకెట్ డ్రై కౌ థెరపీ (BDCT): ఇందులో ఇన్ఫెక్షన్ స్థితితో సంబంధం లేకుండా, పాలిచ్చే కాలం చివరిలో అన్ని పశువులకు యాంటీబయాటిక్స్‌ చికిత్స చేయడం జరుగుతుంది.
  2. సెలెక్టివ్ డ్రై కౌ థెరపీ (SDCT): కేవలం ఇన్ఫెక్షన్ ఉన్న లేదా అనుమానం ఉన్న పశువులకు మాత్రమే యాంటిబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది.

Dr పి. రేవతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్టుమెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్సు, ప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్. Ph: 9966038791
Dr ఆర్. సుధాకర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, వెటర్నరీ డిస్పెన్సరీ, దేవగుడి (మం), వై.యస్.ఆర్ కడప (జిల్లా), ఆంధ్రప్రదేశ్.

Read More

సింగి (మార్పు) చేపల పెంపకంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

ఎటిరోనుస్టిస్ ఫాజిల్స్ (Heteropneustes fossilis) ను సాధారణంగా “స్టింగింగ్ క్యాట్‌ఫిష్” లేదా “సింగి” చేపగా తెలుగులో సింగి చేపను ‘మార్పు’ అని పిలుస్తారు. ఇది కాకుండా, సాధారణంగా ఈ జాతికి చెందిన క్యాట్‌ఫిష్ రకాలను తెలుగులో ‘జల్లెలు’ లేదా ‘నల్ల జల్లెలు’ అని కూడా అంటారు. ఈ చేపలు ముళ్లు తక్కువగా ఉండి, రుచికి చాలా బాగుంటాయి.

అధిక పోషక విలువలు మరియు ఔషధ గుణాల కారణంగా ఈ చేపలకు వినియోగదారులలో మంచి ఆదరణతో పాటు మార్కెట్లో అధిక డిమాండ్ కూడా ఉంది. అందువల్ల దీనిని అధిక విలువ కలిగిన ఆహార చేపలుగా పరిగణిస్తారు. మార్కెట్లో ఈ చేప ధర కిలోకు రూ.500-800 వరకు ఉండే అవకాశం ఉంది.

ప్రత్యేకంగా RAS మరియు బయోఫ్లాక్ సాగు విధానాల్లో ఆక్వాకల్చర్ విభిన్నీకరణకు ఈ చేప ఒక మంచి అవకాశవంతమైన జాతిగా గుర్తింపు పొందుతోంది. అయితే, సింగి చేపల పెంపకంలో ప్రధాన సమస్య నాణ్యమైన పిల్లల (సీడ్) లభ్యత తగినంత లేకపోవడమే.

జాతీయ మంచినీటి చేపల పెంపక సంస్థ, భువనేశ్వర్ వారు సింగి క్యాట్‌ఫిష్ హ్యాచరీ, చేప పిల్లల ఉత్పత్తి మరియు గ్రో-అవుట్ కల్చర్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. అంతేకాకుండా, ఈ సంస్థ దేశవ్యాప్తంగా రైతులు మరియు ఇతర భాగస్వాములకు సింగి చేపల కృత్రిమ ప్రజననం, చేప పిల్లల ఉత్పత్తి మరియు పెంపక సాంకేతికతలను ప్రదర్శించడం, విస్తరించడం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

తల్లి చేపల పెంపకo నిర్వహణ:
బ్రూడర్ చేపలను చిన్న చెరువులు (100–200 చదరపు మీటర్లు) లేదా సిమెంట్ ట్యాంకులు (50–100 చదరపు మీటర్లు)లో ప్రతి చదరపు మీటరుకు 3–4 చేపల సాంద్రతతో పెంచుతారు. బంధీ పరిస్థితుల్లో (captivity) పరిపక్వత సాధించేందుకు బ్రూడర్లకు అత్యుత్తమ నీటి నాణ్యత మరియు సరైన పోషకాహారం అవసరం.

ట్యాంక్ విధానంలో తల్లి చేపల పెంపకానికి 4–6 సెం.మీ మట్టిపొర ఉన్న సిమెంట్ ట్యాంకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. బ్రూడర్లకు రోజుకు రెండు సార్లు 30–35% ప్రోటీన్ కలిగిన ఫిష్‌మీల్ ఆధారిత ఆహారాన్ని శరీర బరువులో 3-4% మోతాదులో అందిస్తారు.

తల్లి చేపల పెంపక చెరువులు లేదా ట్యాంకుల్లో నీటి నాణ్యతను సరైన స్థాయిలో ఉంచాలి. ఇందుకు నీటి ఉదజని 7.8–8.5, నీటిలో కరిగిన ఆక్సిజన్ 4–6 పి పి యం, మొత్తం కాఠిన్యం 80–180 పి పి యం, మొత్తం ఆల్కలినిటీ 80–180 పి పి యం స్థాయిలో ఉండేలా ప్రతి రెండు వారాలకు 20–30% నీటిని మార్చాలి. సహజ ఆహారం ఉత్పత్తి కావడం మరియు నీటి నాణ్యత మెరుగుపడేందుకు బ్రూడర్ చెరువులకు కాలానుగుణంగా ఎరువులు వేయాలి.

తల్లి చేపల ఎంపిక:
ఎటిరోనుస్టిస్ ఫాజిల్స్ లేదా సింగి చేప ఒక సంవత్సరం వయస్సులో లైంగిక పరిపక్వతను పొందుతుంది. సాధారణంగా వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)లో ప్రజననం చేస్తుంది.

60–200 గ్రాముల బరువు కలిగిన బ్రూడ్ చేపలు కృత్రిమ ప్రజనానికి అనుకూల పరిమాణంగా పరిగణిస్తారు. ద్వితీయ లైంగిక లక్షణాల ఆధారంగా మగ మరియు ఆడ చేపలను గుర్తించవచ్చు.

ప్రజనన కాలంలో మగ చేపలో పొడవుగా ఉన్న జనన పాపిల్లా కనిపిస్తుంది. ఆడ చేపలో పొట్ట ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎంపిక చేసిన బ్రూడర్లను ముందుగానే సేకరించి, ప్రజనన కార్యక్రమం కోసం వేర్వేరుగా ట్యాంకుల్లో ఉంచుతారు.

ప్రేరేపిత ప్రజననం:
సింగి చేపల ప్రజననానికి సాధారణంగా ఓవప్రీమ్ / ఓవా టైడ్, / ఓవా -ఎఫ్ హెచ్, గోనోప్రో, స్పాన్ ప్రో వంటి సింథటిక్ హార్మోన్లు ఉపయోగిస్తారు. బ్రూడర్ల శరీర బరువుకు కిలోకు 1.0–1.5 మి.లీ హార్మోన్ మోతాదును ఇస్తారు.
మగ : ఆడ నిష్పత్తిని 2 : 1 గా నిర్వహిస్తారు. సింగి చేపల్లో సహజ స్పానింగ్ కనిపిస్తుంది. హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చిన 10–14 గంటల తరువాత, బ్రూడర్ పరిస్థితి మరియు హార్మోన్ ప్రతిస్పందన ఆధారంగా స్పానింగ్ జరుగుతుంది.
కొంతమంది రైతులు గుడ్ల సేకరణ కోసం “డ్రై స్ట్రిప్పింగ్” పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఈ విధానంలో మగ చేపలను త్యాగం చేసి వీర్య ద్రావణం తయారు చేయాల్సి ఉంటుంది. ఇది మగూర్ చేపల పద్ధతికి సమానంగా ఉంటుంది.

60–200 గ్రాముల బరువు ఉన్న ఆడ చేపలో సాధారణంగా 5,000–18,000 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఫలదీకరణ పొందిన గుడ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అడుగుభాగంలో స్థిరపడతాయి. ఫలదీకరణం కాని గుడ్లు తెల్లటి రంగులో ఉండి నీటి పైభాగంలో తేలుతాయి. హ్యాచరీ పరిస్థితుల్లో సాధారణంగా 70–90% ఫర్టిలైజేషన్ రేటు కనిపిస్తుంది.

గుడ్ల ఇంక్యూబేషన్ మరియు హ్యాచింగ్:
ఫలదీకరణ పొందిన గుడ్లను ప్రవహించే నీటి వ్యవస్థ కలిగిన టబ్బులు లేదా ట్యాంకుల్లో ఇంక్యూబేట్ చేస్తారు. మెరుగైన హ్యాచింగ్ కోసం నీటి ప్రవాహం మరియు స్వల్ప గాలివేత కొనసాగిస్తారు.

నీటి ఉష్ణోగ్రత ఆధారంగా 16–20 గంటల్లో హ్యాచింగ్ జరుగుతుంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద flow-through వ్యవస్థలో 60–80% వరకు హ్యాచింగ్ శాతం కనిపిస్తుంది.

ఫలదీకరణం కాని గుడ్లు మరియు చనిపోయిన గుడ్ల పొరలను వెంటనే తొలగించాలి. కొత్తగా పుట్టిన లార్వాలో పెద్ద యోక్ సాక్ ఉంటుంది. ఇది 2–3 రోజులలో పూర్తిగా శోషించబడుతుంది.

లార్వా పెంపకం:

నీటి నాణ్యత నిర్వహణ:
కొత్తగా బయటకు వచ్చిన హ్యాచ్‌లింగ్స్ పొడవు సుమారు 2–3 మి.మీ. ఉండి, పెద్ద యోక్ సాక్‌ను కలిగి ఉంటాయి. రెండు రోజుల తరువాత ఆరోగ్యకరమైన లార్వాలు ట్యాంక్ మూలల వైపు ఈదుతూ గుంపులుగా ఉండటం ప్రారంభిస్తాయి.
8–12 రోజుల వయస్సు తరువాత గాలి ద్వారా శ్వాస ప్రారంభమవుతుంది. అందువల్ల లార్వా పెంపక ట్యాంకుల్లో నీటిలో కరిగిన ఆక్సిజన్ సరైన స్థాయిని నిలుపుకునేందుకు నిరంతర స్వల్ప గాలివేత అవసరం.
లార్వా ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. రోజుకు రెండు సార్లు 30–50% నీటిని మార్చడం మంచిది. నీటి లోతును 30–50 సెం.మీ. వరకు ఉంచాలి.
లార్వాలను ఇండోర్ ట్యాంకుల్లో 15–20 రోజుల పాటు ప్రతి చదరపు మీటరుకు 1000–2000 లార్వాల సాంద్రతతో పెంచాలి.

లార్వా ఆహార నిర్వహణ:
జూప్లాంక్టన్‌లు (ట్యూబిఫెక్స్, కోపీపాడ్), మోయినా, ఆర్టీమియా ప్రధాన లార్వా ఆహారంగా ఉపయోగిస్తారు. ప్రారంభ దశలో మిశ్రమ జంతు ప్లవకాలు చాలా మంచి ఆహారంగా పనిచేస్తాయి.
15వ రోజు నుండి క్రమంగా ప్రత్యక్ష ఆహారాన్ని తగ్గిస్తూ, 35% క్రూడ్ ప్రోటీన్ మరియు 8% క్రూడ్ లిపిడ్ కలిగిన తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వడం వల్ల లార్వా వృద్ధి మరియు జీవన శాతం మెరుగుపడుతుంది.
లార్వాలకు రోజుకు 2–3 సార్లు అవసరానికి అనుగుణంగా ఆహారం ఇవ్వాలి. కనీసం 15 రోజుల పెంపకం తరువాత వీటిని ఫింగర్లింగ్ ఉత్పత్తి కోసం మట్టి చెరువులు లేదా సిమెంట్ ట్యాంకులకు మార్చవచ్చు. ఇండోర్ ట్యాంక్ పెంపకంలో సాధారణంగా 60–80% జీవన శాతం కనిపిస్తుంది.

ఫింగర్లింగ్ ఉత్పత్తి
ఫింగర్లింగ్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సిమెంట్ ట్యాంకుల్లో 2–3 సెం.మీ మందంతో మట్టిపొర ఉండాలి. నీటి లోతు 30–50 సెం.మీ.గా నిర్వహించాలి.
సింగి ఫ్రైలను ప్రతి చదరపు మీటరుకు 100–200 సాంద్రతతో ట్యాంకులు లేదా చెరువుల్లో నిల్వ చేస్తారు. వీటికి 30% క్రూడ్ ప్రోటీన్ మరియు 6% క్రూడ్ లిపిడ్ కలిగిన తయారుచేసిన ఆహారాన్ని రోజుకు 2–3 సార్లు, శరీర బరువులో 4–6% లేదా తృప్తి స్థాయిలో అందిస్తారు.
2–3 నెలల పెంపకంలో ఇవి 2–3 గ్రాముల బరువుకు చేరుకుంటాయి. ఈ పరిమాణం వచ్చిన తరువాత వీటిని నేరుగా గ్రో-అవుట్ చెరువుల్లో నిల్వ చేయవచ్చు.

గ్రో-అవుట్ కల్చర్ దశ:
చిన్న పరిమాణం (200–1000 చదరపు మీటర్లు) మరియు తక్కువ లోతు (0.75–1.0 మీటర్ నీటి లోతు) కలిగిన మట్టి లేదా లైనింగ్ చెరువులు గ్రో-అవుట్ కల్చర్‌కు అనుకూలంగా ఉంటాయి.
ప్రతి హెక్టారుకు 20,000–40,000 చేపల సాంద్రతతో నిల్వ చేస్తారు. మెరుగైన జీవన శాతం (60–80%) మరియు గరిష్ట ఉత్పత్తి (2.0–3.0 టన్నులు/హెక్టారు) కోసం 2–3 నెలల వయస్సు గల ఫింగర్లింగ్‌లను నిల్వ చేయడం ఉత్తమం.

ప్రీ-స్టాకింగ్ నిర్వహణ

స్థల ఎంపిక, చెరువు నిర్మాణం మరియు సిద్ధం
చెరువు స్థల ఎంపిక ఇతర కార్ప్ మరియు క్యాట్‌ఫిష్ జాతుల మాదిరిగానే ఉంటుంది. పంట కాలమంతా నీటిని నిల్వ ఉంచగల సామర్థ్యం ఉన్న నేలను ఎంపిక చేయాలి.
సాధారణంగా మట్టి నేలలు చెరువు నిర్మాణానికి అత్యంత అనుకూలం. ఇసుక నేలలను నివారించాలి. ఒకవేళ చెరువు నేల ఇసుకగా ఉంటే, నీటి చొరబాటును నివారించేందుకు HDPE లైనింగ్ షీట్లను ఉపయోగించవచ్చు.
సులభమైన నిర్వహణ మరియు సులభమైన చేపల సేకరణ కోసం చెరువులు చిన్న పరిమాణంలో, సాధారణంగా అర ఎకరానికి తక్కువగా ఉండటం మంచిది. చెరువు గట్లు 1:2 నుంచి 1:3 వంపుతో ఉండాలి.
వర్షాకాలంలో చేపలు బయటకు వెళ్లకుండా చెరువు ప్రక్కలను రాళ్లతో బలపరచాలి. నీటి లోతు సుమారు 1 మీటర్ వరకు ఉంచాలి.
నేల మరియు నీటి విశ్లేషణ ఫలితాల ఆధారంగా లైమింగ్ మరియు ఎరువుల వినియోగం చేయాలి.

పోస్ట్-స్టాకింగ్ నిర్వహణ:

నీటి నాణ్యత నిర్వహణ:
సాగు వాతావరణాన్ని మంచి స్థితిలో ఉంచేందుకు నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించడం, అవసరమైనప్పుడు నీటిని మార్పిడి చేయడం మరియు వాటర్ ప్రోబయోటిక్స్ ఉపయోగించడం అత్యంత అవసరం.
నీటి నాణ్యత ప్రమాణాలను సరైన స్థాయిలో నిలుపుకోవడానికి అవసరమైనప్పుడు 20–30% నీటిని కొత్త నీటితో భర్తీ చేయాలని సూచిస్తారు.

ఆహారం మరియు ఆహార నిర్వహణ
సింగి ఒక సర్వభక్షక క్యాట్‌ఫిష్. అయినప్పటికీ, ఫిష్‌మీల్ ఆధారిత ఆహారం (30% క్రూడ్ ప్రోటీన్ మరియు 8% క్రూడ్ లిపిడ్) ఉపయోగించడం ఉత్తమం.
సింగి ఫింగర్లింగ్‌లకు రోజుకు రెండు సార్లు, శరీర బరువులో 3–4% మోతాదులో ఆహారం అందిస్తారు. సాధారణంగా ఫ్లోటింగ్ ఫీడ్స్ ఉపయోగించడం వల్ల ఆహార వినియోగ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ఆహార వృథా తగ్గుతుంది.

ఆరోగ్య నిర్వహణ:
నాణ్యతలేని సీడ్ మరియు నాణ్యత లేని నీరు చేపల పెంపకంలో వ్యాధులకు ప్రధాన కారణాలు. సింగి చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధులు:
• ఎర్రమచ్చల వ్యాధి
• వాజాల కుళ్ళు
• కురుపుల వ్యాధి
ఈ వ్యాధులు చేపల వృద్ధి మరియు జీవన శాతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
బాక్టీరియా సంబంధిత వ్యాధుల నివారణకు ఆక్సి టెట్రాసైక్లిన్ ను ఆహారంలో శరీర బరువుకు కిలోకు 50–80 మి.గ్రా మోతాదులో 5 రోజుల పాటు ఇవ్వాలని సూచిస్తారు.
• కురుపుల వ్యాధి నియంత్రణ కోసం సిఫాక్స్ హెక్టారు-మీటరుకు 1000 మి.లీ మోతాదులో 3–5 రోజుల పాటు ఉపయోగించడం సిఫారసు చేయబడింది.

చేపల ఉత్పత్తి మరియు పట్టుబడి:
సింగి చేపలు సుమారు 10 నెలల పెంపక కాలంలో 80–100 గ్రాముల మార్కెట్ పరిమాణానికి చేరుకుంటాయి. చేపల సేకరణ కోసం చెరువులోని నీటిని పూర్తిగా తొలగించి, చేపలను చేతితో సేకరిస్తారు. 10 నెలల పెంపక కాలంలో హెక్టారుకు 2.0–3.0 టన్నుల వరకు ఉత్పత్తి సాధించవచ్చ.

ముగింపు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్వా రైతులు అనుభవిస్తున్న చేపల ఉత్పత్తి సరిగా లేకపోవడం, రొయ్యల పెంపకంలో నాణ్యత లేని రొయ్య పిల్లలు, అధిక మేత రేట్లు మరియు ఆశించిన రీతిలో రొయ్యల ఉత్పత్తి లేకపోవడం వలన ఆక్వా రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. కావున మార్కెట్లో అధిక ధరలు పలికే చేప రకమైన మార్పు చేపల పెంపకం చేపట్టి ఆక్వా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందగలరు.

  1. జె. భాను సందీప్, పి.హెచ్. డి. స్కాలర్, డిపార్టుమెంటు ఆఫ్ ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిషరీస్ కాలేజ్, కలకత్తా.
    1. కే. వీరాంజనేయులు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం), కృషి విజ్ఞాన కేంద్రం, పందిరిమామిడి.
    2. జె. గిరి కిషోర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆక్వాటిక్ అనిమల్ హెల్త్ మేనేజ్ మెంట్, ఫిషరీస్ కాలేజ్, కలకత్తా. Phone: 9553364265
Read More

అధిక పోషక పదార్థాలు గల ‘నాడెప్ కంపోస్ట్

నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.

కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.

కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :

  • పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
  • పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
  • జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
  • నీరు – 1350-1400 లీ.
    కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
  • మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
  • రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
  • మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.

పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.

కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.

ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.

Read More

‘ఎల్ నినో’ ముప్పు: వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లు – నివారణ చర్యలు

ప్రస్తుతం 2026లో ఎల్ నినో (El Niño) అధికారికంగా ప్రారంభమైందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), అమెరికాకు చెందిన నోవా (NOAA) శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇది రాబోయే శరదృతువు (Autumn) నాటికి మరింత బలపడి, ప్రమాదకరమైన “సూపర్ ఎల్ నినో” (Super El Niño) స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.

ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) యొక్క మధ్య మరియు తూర్పు భాగాలలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరగడం అనే ఒక వాతావరణ దృగ్విషయం. ఇది సాధారణంగా ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది మరియు 9-12 నెలల నుండి కొన్నిసార్లు 2 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు గాలుల నమూనాలను మారుస్తుంది. ఇది El Niño–Southern Oscillation (ENSO) అనే పెద్ద వాతావరణ వ్యవస్థలో ఒక దశ. ENSO లో మూడు దశలు ఉన్నాయి:

  1. El Niño (వేడి దశ),
  2. La Niña (చల్లని దశ) మరియు
  3. Neutral (సాధారణ స్థితి).

ఎల్ నినో లక్షణాలు:
• సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల (+0.5°C లేదా అంతకంటే ఎక్కువ)
• గాలుల నమూనాలలో మార్పులు
• వర్షపాత నమూనాలలో మార్పులు
• దక్షిణ అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు
• ఆస్ట్రేలియా మరియు భారతదేశంలో కరవు పరిస్థితులు

ముఖ్య గమనిక: ఎల్ నినో మాత్రమే వర్షపాతాన్ని నిర్ణయించదు. ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD), స్థానిక వాతావరణ వ్యవస్థలు వంటి ఇతర అంశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందువల్ల, కొన్నిసార్లు ఎల్ నినో ఉన్నప్పటికీ మంచి వర్షాలు కురవవచ్చు (IOD పాజిటివ్‌గా ఉంటే).
భారతదేశంలో వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావాలు

భారతదేశ వ్యవసాయం వర్షంపై చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై (south-west monsoon). ఎల్ నినో సంభవించిన సంవత్సరాల్లో రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం మరియు కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకు 2002, 2009 మరియు 2015 లలో ఎల్ నినో కారణంగా వర్షపాత కొరత ఏర్పడింది.

  1. వర్షపాత కొరత (Drought): ఎల్ నినో సమయంలో వర్షపాతం తగ్గడం వల్ల కరవు పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోయే అవకాశం ఉంది.
  2. పంట ఉత్పత్తి తగ్గడం: వరి, జొన్నలు, గోధుమలు, పప్పుధాన్యాలు మొదలైన ముఖ్యమైన పంటల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల రైతులకు నష్టం వాటిల్లుతుంది.
  3. నీటిపారుదల సమస్య: జలాశయాలు (రిజర్వాయర్లు) మరియు భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతాయి. దీనివల్ల పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం కష్టమవుతుంది.
  4. కీటకాలు మరియు తెగుళ్ల పెరుగుదల: వాతావరణ మార్పుల కారణంగా కొన్ని రకాల కీటకాలు మరియు వ్యాధులు/తెగుళ్లు పెరుగుతాయి. ఇది పంటల నాణ్యతను మరియు ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.

నివారణ చర్యలు

  1. కరవు తట్టుకునే పంటలు: రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైన తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం ఉత్తమం.
  2. నీటి సంరక్షణ: వర్షపు నీటి నిల్వ (వాటర్ హార్వెస్టింగ్), వ్యవసాయ కుంటల నిర్మాణం చేయడం.
  3. సరైన పంట ప్రణాళిక: వాతావరణ సమాచారం ఆధారంగా పంట ఎంపిక మరియు విత్తే సమయాన్ని నిర్ణయించడం.
  4. సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత: బిందు (డ్రిప్) మరియు తుంపర (స్ప్రింక్లర్) నీటిపారుదల పద్ధతులను ఉపయోగించడం నీటి పొదుపునకు సహాయపడుతుంది.
  5. పంట బీమా (Crop Insurance): పంట నష్టం నుండి రక్షణ పొందడానికి బీమాను ఉపయోగించుకోవడం.

రైతులకు వ్యవసాయ సలహాలు మరియు ముందస్తు జాగ్రత్తలు
జూన్ నెల ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి కీలకమైన సమయం. భారత వాతావరణ శాఖ (IMD) మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ముందస్తు అంచనాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నెల వాతావరణం మరియు రైతులు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల సంక్షిప్త సమాచారం:

వ్యవసాయ భూమి సిద్ధం చేయడం మరియు విత్తడం
• నేలను సిద్ధం చేయడం: తొలకరి జల్లులు మరియు ప్రారంభంలో కురిసే వర్షాలను ఉపయోగించుకుని భూమిని లోతుగా దుక్కి దున్ని సిద్ధం చేసుకోండి. ఇది మట్టిలో తేమను పట్టి ఉంచడానికి సహాయపడుతుంది.
• విత్తడానికి తొందరపడవద్దు: కనీసం 50 నుండి 60 మి.మీ. మేర మంచి వర్షం పడి, మట్టిలో తగినంత పదును (తేమ) ఏర్పడే వరకు విత్తే కార్యక్రమాన్ని ప్రారంభించవద్దు.
• కరవును తట్టుకునే రకాల ఎంపిక: వర్షపాత కొరత సూచనలు ఉన్నందున, తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే మరియు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు మరియు రకాలను (ఉదాహరణకు: జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది మొదలైనవి) ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
• భూగర్భ జలాల సద్వినియోగం: వర్షాల అస్థిరత ఉన్నందున వ్యవసాయ కుంటలు (ఫార్మ్ పాండ్స్), బోర్‌వెల్ మరియు బిందు సేద్యం (Drip Irrigation) పద్ధతిని ఉపయోగించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి.

సారాంశం
ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఎల్ నినో పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇది వాతావరణ మార్పులకు ఒక ముఖ్యమైన సూచిక. “2026 లో పూర్తి కరవు లేదా పూర్తిగా మంచి వర్షాలు కురుస్తాయని ఖచ్చితంగా చెప్పలేం – కానీ ‘అస్థిర వాతావరణం’ అనేది మాత్రం నిజం.” ఎల్ నినో అనేది ఒక సహజ వాతావరణ ప్రక్రియ అయినప్పటికీ, దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయం మరియు ఆహార భద్రతపై ఇది పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, విజ్ఞాన ఆధారిత వ్యవసాయం, వాతావరణ సమాచారం మరియు సరైన ప్రణాళికల ద్వారా మనం దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు.

“ఎల్ నినోను నిరోధించడం సాధ్యం కాదు, కానీ దాని ప్రభావాలను తగ్గించడం మన చేతుల్లోనే ఉంది”

డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU)

Read More
  • 1
  • 2