ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.
అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.
ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.
రైతు వ్యర్థంగా భావించే వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు, పప్పుధాన్యాల కాండాలు, కూరగాయ పంటల అవశేషాలు భూమికి అమూల్యమైన సహజ సంపద. వీటిలో సేంద్రియ పదార్థం, విలువైన పోషకాలు, నేల సారాన్ని పెంచే కార్బన్ సమృద్ధిగా ఉంటాయి. వాటిని కాల్చేస్తే ఈ సంపద మొత్తం నష్టపోతుంది. అదే శాస్త్రీయంగా వినియోగిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఎరువుల వినియోగం సమర్థవంతమవుతుంది, సాగు ఖర్చు తగ్గుతుంది.
రైతులు పంట అవశేషాలను కాల్చడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. ఒక పంట కోసిన వెంటనే మరో పంట వేయాల్సిన అవసరం, కూలీల కొరత, అవశేషాలను తొలగించడానికి అయ్యే అధిక ఖర్చు, యంత్రాల లభ్యత లేకపోవడం వంటి సమస్యలు వారిని ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి. కానీ తాత్కాలికంగా సమయం ఆదా చేసినా, దీర్ఘకాలంలో నేల సారాన్ని, పంట ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే పంట అవశేషాలను కాల్చడం కంటే వాటిని కంపోస్టు, వర్మీ కంపోస్టు, మల్చింగ్, పశువుల మేత, బయోగ్యాస్ లేదా బయోచార్ రూపంలో వినియోగించడం ఉత్తమ పరిష్కారం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బయోచార్ సాంకేతికత నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నీటి నిల్వను పెంచడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది. పంట అవశేషాలను సమస్యగా కాకుండా విలువైన వనరులుగా మార్చుకునే ఈ సాంకేతికత రైతులకు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయానికి కొత్త దిశను చూపుతోంది.
బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.
ప్రస్తుతం వాతావరణ మార్పులు, నేల సారం క్షీణించడం, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బయోచార్ ఒక స్థిరమైన పరిష్కారంగా గుర్తింపు పొందుతోంది. ఇది నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వాతావరణ అనుకూల మరియు సుస్థిర వ్యవసాయానికి కూడా కీలకమైన సాంకేతికతగా నిలుస్తోంది.
డ్రమ్ పద్ధతిలో బయోచార్ తయారి చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో తక్కువ ఖర్చుతో బయోచార్‌ను 200 లీటర్ల సామర్థ్యం గల పాత ఇనుప డ్రమ్ సహాయంతో తయారు చేయవచ్చు. ముందుగా డ్రమ్ అడుగు భాగంలో మరియు కింది ప్రక్కవైపున కొద్దిపాటి గాలి ప్రవేశించేలా చిన్న రంధ్రాలు చేయాలి. అనంతరం పొడి పంట అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి డ్రమ్‌లో గట్టిగా నింపాలి. తరువాత డ్రమ్‌కు మూత బిగించి, మూత అంచులను బంకమట్టితో మూసివేయాలి. దీంతో డ్రమ్‌లోకి గాలి ప్రవేశించడం నియంత్రించబడుతుంది.
ఆ తర్వాత డ్రమ్‌ను పొయ్యి లేదా ఇటుకలతో ఏర్పాటు చేసిన మంటపై ఉంచి వేడి చేయాలి. సుమారు 20-25 నిమిషాల తర్వాత మూత అంచుల వద్ద నుంచి నీలిరంగు వాయువు విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో డ్రమ్‌లో ఉష్ణోగ్రత 300-400°C వరకు చేరుకొని పైరోలిసిస్ ప్రక్రియ పూర్తవుతుంది.
నీలిరంగు వాయువు విడుదల తగ్గిన తర్వాత మంటను ఆర్పివేయాలి. అనంతరం డ్రమ్‌ను జాగ్రత్తగా దించి నేలపై ఉంచాలి. వెంటనే అడుగు భాగంలోని రంధ్రాలను కూడా బంకమట్టితో మూసివేయాలి. దీంతో గాలి లోపలికి ప్రవేశించకుండా నిరోధించబడి, పంట అవశేషాలు పూర్తిగా బూడిదగా మారకుండా కార్బన్ రూపంలో నిల్వ చేయబడతాయి.
డ్రమ్‌ను సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మూతను తీసి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను చిన్న ముక్కలుగా లేదా పొడి రూపంలో తయారు చేయాలి. అనంతరం దీనిని కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి కొంతకాలం ఉంచిన తర్వాత పొలంలో ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. బయోచార్ తయారీలో ఆక్సిజన్ ప్రవేశం పరిమితంగా ఉండాలి. గాలి ఎక్కువగా ప్రవేశించినట్లయితే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.
డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921
గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.
పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్): ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.
పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.
ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్: పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.
డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.
కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు: పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.
రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.
వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.
పశువైద్య సేవలు – ఈ-సంజీవని: దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.
మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు. దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు. అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.
ముగింపు డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి. ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.
డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.), డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం, పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088
ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది.
ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.
సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.
తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్‌కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్‌కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.
తయారీ విధానం : ప్రెజర్‌కుక్కర్‌లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్‌లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్‌ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్‌లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్‌తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్‌ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.
వాటి మదర్ కల్చర్లను వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
ఉద్యాన పంటల్లో చెట్లచుట్టూ కలుపు తీయాలన్నా, పాదులు చేయాలనా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఎక్కువ మంది కూలీలు అవసరం. పంటలకు ధరలున్నప్పుడు రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలీలను పెట్టుకొని కలుపు తీయడం, పాదులు చేయించడం చేస్తారు. అదే ధరలు లేని సమయంలో ఈ పని తలకు మించిన భారం అవుతుంది. పంట దిగుబడికి ఈ పనులు తప్పనిసరి. అలాగే వదిలేస్తే చెట్లు బ్రతకకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.
ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చేందుకు ఒక ప్రత్యామ్నాయ పరికరాన్ని మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం తో తయారు చేసి ఈ పరికారానికి సుదర్శన్ వీడర్ గా పేరు పెట్టారు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణ రావు
ఉద్యానవన పంటల్లో అంతర్ కృషి పరికరం
ఈ పరికరం కోసం ఒక పొడవాటి ఇనుప పైపును తీసుకొని చక్రా కారం లో వంచి కింద బాగాన చిన్న పాటి కర్రులు అమర్చి వెల్డింగ్ ద్వారా అనుసంధానం చేసి పరికరాన్ని తయారు చేశారు, చెట్టు వద్ద 5 నిముషాలలో కలుపు, పాది రెండూ చేసుకోవచ్చు. ఉద్యానవన రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ట్రాక్టర్లు, ఎద్దుల సహాయంతో రైతులు ఉద్యాన పంటల్లో కలుపు తీసే కార్యక్రమం చేస్తుంటారు. అయితే చెట్టు పాది లో అంతర కృషి చేయాలంటే మనుషుల సహాయం అవసరం ఉంటుంది.
ఈ పరికరాన్ని చెట్టుకు అమర్చి ఒక వ్యక్తి చుట్టూ తిరగడం వల్ల గుంటక తరహాలో మడకలు భూమిని చదును చేయడంతో పాటు పాది ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు మిగులుతుంది. శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఒక్క మనిషి గంట వ్యవధిలోనే అర ఎకరా పొలం పూర్తి చేయవచ్చు.
దీనికి 4 వేల వరకు ఖర్చు వస్తుంది. చెట్టు సైజు ని బట్టి పరికరం ధర మారుతుంది.
రైతుల కోరితే వారికి తయారు చేసి ఇస్తారు. ఈ పరికరానికి పేటంట్ చేయడం జరిగింది. పేటెంట్ నెంబర్ :507641-001
ఈ పరికరం కోసం శ్రీ ఆంజనేయ స్మాల్ అగ్రి టూల్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రైతునేస్తం ముప్పా లక్ష్మణరావు, ఫోన్ : 9849140465 లో సంప్రదించగలరు.
ఇకో ఎంజైమ్ తయారీ విధానం: 10 లీటర్ల నీరు, పండ్లు, కూరగాయలు, పూలు వీటిలో ఏవైన 3 కిలోలు, బెల్లం 1 కిలో. వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ లేదా తొట్టిలో 10:3:1 నిష్పత్తిలో తీసుకొని బెల్లం కరిగే వరకు కలియ తిప్పి దానిపై మూత ఉంచి 3 నెలల పాటు ఊరబెట్టాలి. మూడు నెలల తరువాత ఊరిన ద్రావణాన్ని శుభ్రంగా వడబోస్తే కావలసిన ఇ కో ఎంజైమ్ తయారైనట్లే. దీనిని ప్లాస్టిక్ సీసాలలో నిలవబెట్టుకోవచ్చు. తయారైన 1 లీటరు ఇ కో ఎంజైమ్‌ని 50 లీటర్ల నీటితో కలిపి పంటలపై పిచికారి చేసుకుంటే తక్కువ ఖర్చుతో మొక్క ఎదుగుదల, పంట దిగుబడి బాగుంటుంది.
భారతదేశంలో పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక ఆధారంగా నిలుస్తోంది. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతలు మరియు మొబైల్ ఆధారిత సేవలు రైతులకు పశువుల ఆరోగ్య నిర్వహణ, ఉత్పాదకత పెంపు, మార్కెటింగ్ మరియు ఆర్థిక సేవలను సులభతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక రంగంలో సేవలందిస్తున్న ముఖ్యమైన AI ఆధారిత డిజిటల్ వేదికల గురించి తెలుసుకోవడం అవసరం.
పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ రంగాలలో రైతులకు డిజిటల్ సేవలు అందిస్తున్న ముఖ్యమైన ప్రైవేట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు Stellapps, MoooFarm, Animall, Anitra AI, mooPay, AniMeta మరియు AgriTech. ఈ సంస్థలు డిజిటల్ పశు ఆరోగ్య సేవలు, పశువుల కొనుగోలు–అమ్మకాలు, జాతి అభివృద్ధి, పాల ఉత్పత్తి నిర్వహణ, డిజిటల్ చెల్లింపులు మరియు AI ఆధారిత పశుసంపద నిర్వహణ వంటి రంగాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి భారతదేశంలో పశుసంవర్ధక రంగ డిజిటలీకరణకు గణనీయంగా దోహదపడుతున్నాయి.
Stellapps: భారతదేశంలో డైరీ రంగాన్ని డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉన్న ప్రముఖ అగ్రిటెక్ సంస్థ “Stellapps”. ఈ సంస్థ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి పశుపోషకులకు సమగ్ర డిజిటల్ సేవలను అందిస్తోంది. Stellapps అభివృద్ధి చేసిన “mooOn” వంటి స్మార్ట్ సెన్సర్లు పశువుల ఆరోగ్య పరిస్థితి, శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఎద గుర్తింపు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఇవే కాకుండా పాల సేకరణ, పాల నాణ్యత పరీక్ష, శీతలీకరణ గొలుసు నిర్వహణ మరియు రైతులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పశువుల ఆరోగ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది.
MoooFarm ఇది ముఖ్యంగా పాల ఉత్పత్తిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ పశుసంవర్ధక వేదిక. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు తమ పశువుల వివరాలను నమోదు చేసి వాటి ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషణ మరియు ఉత్పత్తి పనితీరును పర్యవేక్షించవచ్చు. MoooFarm టెలీ-వెటర్నరీ సేవలను అందించడం ద్వారా రైతులు నిపుణులైన పశువైద్యులను ఆన్‌లైన్‌లో సంప్రదించే అవకాశం కల్పిస్తుంది. పశువుల గర్భధారణ, ఈస్ట్రస్ చక్రం, టీకాల షెడ్యూల్ మరియు మేత నిర్వహణకు సంబంధించిన సూచనలు రైతులకు సమయానుకూలంగా అందుతాయి. దీనివల్ల పశువుల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుంది.
Animall భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ పశువుల మార్కెట్‌ప్లేస్‌లలో ఒకటి. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు ఆవులు, గేదెలు, మేకలు మరియు ఇతర పశువులను నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. మధ్యవర్తుల అవసరం లేకుండా రైతు నుండి రైతుకే లావాదేవీలు జరగడం దీని ప్రత్యేకత. పశువుల జాతి, వయస్సు, పాల ఉత్పత్తి, ఆరోగ్య స్థితి వంటి వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకతను పెంచుతుంది. Animall రైతులకు మార్కెట్ ధరల సమాచారం, కొనుగోలుదారుల వివరాలు మరియు పశుసంవర్ధకానికి సంబంధించిన వివిధ సలహాలను కూడా అందిస్తుంది. ఫలితంగా రైతులు తమ పశువులకు సరైన ధరను పొందగలుగుతున్నారు.
Anitra AI Anitra AI అనేది కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ పశుసంవర్ధక వేదిక. ఇది పశువుల గుర్తింపు, వాటి విలువ అంచనా, మేత నిర్వహణ మరియు ఆరోగ్య పర్యవేక్షణ వంటి సేవలను అందిస్తుంది. రైతులు తమ పశువుల వివరాలను నమోదు చేయడం ద్వారా వాటి సుమారు మార్కెట్ విలువను తెలుసుకోవచ్చు. అలాగే మేత ఖర్చులను తగ్గించేందుకు సరైన మేత పరిమాణం మరియు పోషకాహార సూచనలు కూడా అందుబాటులో ఉంటాయి. పశువులకు సంబంధించిన వివరాలను క్రమబద్ధంగా నమోదు చేసి, వాటి కొనుగోలు–అమ్మకాలు మరియు ఇతర సేవలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ వేదిక సహాయపడుతుంది. దీంతో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పశుసంవర్ధకాన్ని నిర్వహించి ఉత్పాదకతను పెంచుకోవచ్చు.
mooPay: mooPay అనేది పాడి పరిశ్రమకు ప్రత్యేకంగా రూపొందించబడిన డిజిటల్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్. పశువుల కొనుగోలు, డైరీ అభివృద్ధి మరియు పశుసంవర్ధక కార్యకలాపాల కోసం రైతులకు రుణాలు, బీమా మరియు ఇతర ఆర్థిక సేవలను అందిస్తుంది. mooScore™ వంటి డిజిటల్ క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థల ద్వారా రైతుల ఆర్థిక అర్హతను అంచనా వేసి త్వరితగతిన రుణాలను మంజూరు చేస్తుంది. పాల సేకరణ కేంద్రాల ద్వారా చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అయ్యే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ విధంగా గ్రామీణ పశుపోషకులకు సులభంగా ఆర్థిక సేవలను అందించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతోంది.
AniMeta AgriTech (YourFarm) AniMeta AgriTech (YourFarm) అనేది పశువుల ఆరోగ్యం, పోషణ మరియు ఉత్పాదకత మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తున్న డిజిటల్ అగ్రిటెక్ సంస్థ. ఈ ప్లాట్‌ఫారమ్ కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలను ఉపయోగించి పశువులలో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడుతుంది. రైతులకు మేత నిర్వహణ, పోషకాహార ప్రణాళికలు మరియు సంప్రదాయ చికిత్సలపై సూచనలు అందిస్తుంది. పశువుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా పాల ఉత్పత్తి మరియు మొత్తం ఉత్పాదకతను పెంచడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్రీయ పశుసంవర్ధక పద్ధతుల ప్రాచుర్యానికి AniMeta AgriTech మంచి ఉదాహరణగా నిలుస్తోంది.
కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ వేదికలు పశుసంవర్ధక రంగంలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయి. పశువుల ఆరోగ్య పర్యవేక్షణ, మేత నిర్వహణ, పాల ఉత్పత్తి పెంపు, పశువుల కొనుగోలు–అమ్మకాలు, ఆర్థిక సేవలు మరియు శాస్త్రీయ సలహాలను రైతులకు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీనివల్ల సమయం, శ్రమ మరియు ఖర్చు తగ్గడంతో పాటు పశువుల ఉత్పాదకత, రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో డిజిటల్ సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పశుసంవర్ధక రంగాన్ని మరింత లాభదాయకంగా, స్థిరంగా మరియు ఆధునికంగా తీర్చిదిద్దుకోవచ్చు. అందువల్ల రైతులు ఈ డిజిటల్ సేవలపై అవగాహన పెంచుకొని, వాటిని తమ దైనందిన పశుసంవర్ధక కార్యకలాపాల్లో వినియోగించడం అవసరం.
సరిన్ కె. కున్నత్, అసోసియేట్ ప్రొఫెసర్, పశు జన్యుశాస్త్ర మరియు ప్రజనన విభాగం, పశువైద్య కళాశాల, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్-30. Ph: 9381572408
జె. సాయి ప్రసన్న, సీనియర్ శాస్త్రవేత్త, పశు పరిశోధనా కేంద్రం, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్. Ph: 8008910925
ఉద్యానవనం (Horticulture) వ్యవసాయ రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం. కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు ఉద్యాన పంటల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం వినియోగదారులు ఆరోగ్యకరమైన, రసాయన అవశేషాలు లేని ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ ఉద్యానవనం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఉద్యాన పంటలు అధిక విలువ కలిగిన పంటలు కావడంతో వీటిలో నాణ్యత, రుచి, నిల్వ సామర్థ్యం మరియు మార్కెట్ విలువకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఈ లక్ష్యాలను సాధించవచ్చు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంటల ఎదుగుదలను ప్రోత్సహించడం, దిగుబడిని పెంచడం మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం వంటి అనేక ప్రయోజనాలను సేంద్రియ ఉత్పత్తులు అందిస్తాయి.
ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల అవసరం
ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేలలో సేంద్రియ పదార్థాల శాతం తగ్గిపోతుంది. ఫలితంగా నేల నిర్మాణం దెబ్బతిని, సూక్ష్మజీవుల కార్యకలాపాలు తగ్గి, మొక్కల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వల్ల:
నేల సారవంతత పెరుగుతుంది.
పండ్లు మరియు కూరగాయల నాణ్యత మెరుగుపడుతుంది.
నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
రసాయన అవశేషాలు తగ్గుతాయి.
ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.
జీవామృతం – ఉద్యాన పంటలకు జీవశక్తి జీవామృతం సహజ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన సేంద్రియ ద్రవ ఎరువు. ఇది కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులను కలిగి ఉండి నేల జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది. తయారీకి కావలసిన పదార్థాలు
దేశీయ ఆవు పేడ – 10 కిలోలు
ఆవు మూత్రం – 10 లీటర్లు
బెల్లం – 2 కిలోలు
శనగపిండి – 2 కిలోలు
పొలం మట్టి – 1 కిలో
నీరు – 200 లీటర్లు
ఉద్యాన పంటలలో ప్రయోజనాలు
టమోటా, వంకాయ, మిరప, బెండ వంటి కూరగాయలలో వేగవంతమైన పెరుగుదల.
మామిడి, జామ, బత్తాయి వంటి పండ్ల తోటలలో వేర్ల అభివృద్ధి.
పుష్ప పంటలలో అధిక పుష్పోత్పత్తి.
నేలలో పోషకాల లభ్యత పెరుగుదల.
పంచగవ్య – సహజ వృద్ధి ప్రేరకం
పంచగవ్యలో మొక్కల పెరుగుదలకు అవసరమైన అనేక జీవక్రియాత్మక పదార్థాలు ఉంటాయి. ఉద్యాన పంటలపై ప్రభావం పుష్పించే శాతం పెరుగుతుంది.
పండ్ల పరిమాణం మరియు బరువు మెరుగుపడుతుంది.
పూల రంగు మరియు నాణ్యత పెరుగుతుంది.
కోత అనంతర నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మల్లె, చామంతి, గులాబీ వంటి పుష్ప పంటలలో పంచగవ్య వినియోగం మంచి ఫలితాలను ఇస్తుంది.
వర్మికంపోస్ట్ – సేంద్రియ పోషకాల నిల్వ
వర్మికంపోస్ట్‌ను “బ్లాక్ గోల్డ్” అని కూడా పిలుస్తారు. ఇది మొక్కలకు అవసరమైన స్థూల మరియు సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. ఉద్యాన పంటలలో ప్రయోజనాలు
కూరగాయలలో అధిక దిగుబడి.
పండ్ల తోటలలో నేల ఆరోగ్యం మెరుగుదల.
పూల పంటలలో నాణ్యమైన పుష్పోత్పత్తి.
మొక్కల వేర్ల అభివృద్ధి.
వర్మివాష్
వర్మివాష్‌లో వృద్ధి హార్మోన్లు, ఎంజైములు మరియు సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వినియోగం 5–10 శాతం ద్రావణంగా ఆకులపై పిచికారీ.
నర్సరీ మొక్కల పెరుగుదలలో వినియోగం.
ఆకుల పచ్చదనం మరియు కిరణజన్య సంయోగక్రియ పెరుగుదల.
బీజామృతం ఉద్యాన పంటల విత్తనాలు మరియు నారు శుద్ధి కోసం బీజామృతం ఉపయోగిస్తారు. ప్రయోజనాలు
విత్తన వ్యాధుల నివారణ.
మొలక శాతం పెరుగుదల.
వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు ఉద్యాన పంటలలో వేపగింజల సారం (NSKE) విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ప్రయోజనాలు
తెల్లదోమ, పేను, తామర పురుగుల నియంత్రణ.
పర్యావరణానికి హాని లేకపోవడం.
ప్రయోజనకర కీటకాలకు రక్షణ.
అగ్నాస్త్రం అగ్నాస్త్రం అనేది ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పురుగులను (ఆకుముడుచు పురుగు, కాండం తొలిచే పురుగు, మొదలైనవి) నివారించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన జీవ కీటకనాశిని. పదార్థాలు: • నాటు ఆవు మూత్రం: 10 – 15 లీటర్లు • వేపాకు పేస్ట్: 5 కిలోలు • పచ్చిమిర్చి పేస్ట్: 500 గ్రాములు • వెల్లుల్లి పేస్ట్: 250 – 500 గ్రాములు • పొగాకు: 500 గ్రాములు లేదా 1 కిలో
తయారీ విధానం:
ఒక మట్టి కుండలో ఆవు మూత్రం పోసి, పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలపాలి.
ఈ మిశ్రమాన్ని 5 సార్లు బాగా మరిగించాలి (ఉడకబెట్టాలి).
తర్వాత దీనిని 24 నుండి 48 గంటల పాటు పులియబెట్టాలి (ఫెర్మెంట్ చేయాలి).
చివరిగా, ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.
ఉపయోగించేపద్ధతి: ఒక లీటరు అగ్నాస్త్రం ద్రావణానికి 15 నుండి 20 లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి.
బ్రహ్మాస్త్రం. వ్యవసాయంలో పురుగులను నివారించడానికి ఉపయోగించే సేంద్రియ పురుగుమందు ‘బ్రహ్మాస్త్రం’. కావలసిన పదార్థాలు: • ఆవు మూత్రం: 20 లీటర్లు • ఆకులు (పేస్ట్): 2 కేజీలు (వేప, కానుగ, సీతాఫలం, బొప్పాయి, మరియు దానిమ్మ లేదా జామ ఆకులు)
తయారీ విధానం:
ఒక పెద్ద ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రలో 20 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకోవాలి.
పైన పేర్కొన్న ఆకులను మెత్తగా దంచి లేదా గ్రైండ్ చేసి ఈ మూత్రంలో కలపాలి.
పాత్రను మూతతో గట్టిగా కప్పి, 24 నుండి 48 గంటల పాటు పులియనివ్వాలి.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని కర్రతో తిప్పాలి.
48 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.
ఉపయోగించేపద్ధతి: 1 లీటర్ బ్రహ్మాస్త్ర ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి (1:10 నిష్పత్తిలో) పంటలపై పిచికారీ చేయాలి. • ఇది లార్వాలు, గొంగళి పురుగులు మరియు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. దీనిని 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు
ఫిష్ అమైనో ఆసిడ్ : అనేది మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సేంద్రీయ ద్రవ ఎరువు. దీనిని “మీనామృతం” అని కూడా పిలుస్తారు. ఇందులో నత్రజని (Nitrogen) మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు • చేపల వ్యర్థాలు : 1 కిలో (చేప తలలు, తోకలు, పేగులు) • నల్ల బెల్లం : 1 కిలో (సమాన పద్ధతిలో 1:1 నిష్పత్తి) • ప్లాస్టిక్ డబ్బా: గాలి చొరబడని మూత ఉన్నది
తయారీ విధానం
చేపలను కోయడం: చేపల వ్యర్థాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాలో వేయండి.
బెల్లం కలపడం: బెల్లాన్ని పొడి చేసి, చేప ముక్కలతో బాగా కలపండి.
మూత పెట్టడం: డబ్బా మూతను గాలి చొరబడకుండా గట్టిగా పెట్టండి.
నిల్వ ఉంచడం: దీనిని 30 నుండి 40 రోజుల పాటు నీడలో ఉంచాలి.
గ్యాస్ తీయడం: మొదటి 10 రోజులు రోజూ ఉదయం ఒకసారి మూత కొద్దిగా తీసి గ్యాస్ బయటకు పోయాక మళ్ళీ గట్టిగా పెట్టండి.
వడకట్టడం: 40 రోజుల తర్వాత ముదురు గోధుమ రంగు ద్రవం తయారవుతుంది. దీనిని వడకట్టి గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో నిల్వ చేసుకోండి.
ఉపయోగించేపద్ధతి: స్ప్రే చేయడానికి: 1 లీటరు నీటికి 2 నుండి 3 ml ద్రావణం కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి. • మొదళ్లలో పోయడానికి: 1 లీటరు నీటికి 5 ml కలిపి మొక్కల వేర్ల దగ్గర పోయవచ్చు. • సమయం: ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వాడాలి.
ఉపయోగాలు • మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. • ఆకులు పచ్చగా, బలంగా మారుతాయి. • పూత మరియు కాపు ఎక్కువగా వస్తుంది. • నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.
మొక్కలు మరియు ఇంటి వ్యర్థాల నుండి సేంద్రీయ ఎరువు (Compost) తయారు చేయడం ద్వారా భూమి సారాన్ని అద్భుతంగా పెంచవచ్చు. ఇది మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.
కావలసిన పదార్థాలు • పచ్చి వ్యర్థాలు ( నత్రజని): 1 వంతు (పచ్చి ఆకులు, కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలు, పశువుల పేడ). • ఎండిన వ్యర్థాలు (కర్బనం): 2 నుండి 3 వంతులు (ఎండుటాకులు, వరి గడ్డి, పొట్టు, చెక్క పొట్టు, కట్ చేసిన పత్తి లేదా కంది కట్టెలు). • త్వరగా కుళ్ళడానికి (Microbes): పశువుల పేడ నీళ్ళు (Cow dung slurry) లేదా పాత కంపోస్ట్ ఎరువు. గుంత లేదా కుప్ప పద్ధతి
స్థలాన్ని ఎంచుకోవడం: తోటలో నీడగా ఉండే, నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోండి.
మొదటి పొర (Base Layer): నేలపై 6 అంగుళాల మందంతో ఎండుటాకులు, చిన్న కొమ్మలు లేదా వరి గడ్డిని పరవండి. ఇది గాలి ప్రసరణకు సహాయపడుతుంది.
రెండవ పొర (Green Layer): దీనిపై 6 అంగుళాల పచ్చి వ్యర్థాలు లేదా కూరగాయల తొక్కలను వేయండి.
పేడ నీళ్ళు చల్లడం: దీనిపై పేడ నీళ్ళను చల్లి, కొద్దిగా పాత మట్టిని చల్లండి. ఇది కుళ్ళింపజేసే సూక్ష్మజీవులను పెంచుతుంది.
పొరలు పునరావృతం చేయడం: డబ్బా లేదా కుప్ప 3 నుండి 4 అడుగుల ఎత్తు వచ్చే వరకు ఎండు వ్యర్థాలు, పచ్చి వ్యర్థాల పొరలను ఒకదానిపై ఒకటి మార్చి మార్చి వేయండి. • తేమ శాతం: కుప్పపై అప్పుడప్పుడు నీరు చల్లాలి. పిండిన స్పాంజ్ లాగా తేమ ఉండాలి, కానీ నీరు కారకూడదు. • కలపడం : ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి కుప్పను పారతో బాగా పైకి, కిందకి కలపాలి. దీనివల్ల వ్యర్థాలకు గాలి (ఆక్సిజన్) అంది త్వరగా కుళ్ళుతాయి. • వేడి: కుళ్ళే ప్రక్రియలో కుప్ప మధ్యలో వేడి పుడుతుంది. ఇది కలుపు మొక్కల విత్తనాలను, హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.
ఎరువు తయారీ సమయం వాతావరణాన్ని బట్టి 2 నుండి 4 నెలల్లో నల్లటి, పొడి పొడిగా ఉండే వాసన లేని సేంద్రీయ ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వాడుకోవచ్చు. ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల పాత్ర
సేంద్రియ ఉత్పత్తులు కేవలం పోషకాలను అందించడమే కాకుండా మొత్తం పంట వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కూరగాయలలో నాణ్యత పెరగడం, పండ్లలో తీపి మరియు రుచి మెరుగుపడడం, పుష్ప పంటలలో ఎక్కువకాలం తాజాగా ఉండడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం సేంద్రియ కూరగాయలు మరియు సేంద్రియ పండ్లు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఉద్యాన రైతులు సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.
ముగింపు ఉద్యాన పంటల స్థిరమైన అభివృద్ధికి సేంద్రియ ఉత్పత్తులు కీలకమైనవి. జీవామృతం, పంచగవ్య, వర్మికంపోస్ట్, వర్మివాష్ మరియు వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నాణ్యమైన దిగుబడులను అందిస్తాయి. పెరుగుతున్న సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన రైతులు సేంద్రియ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం అవసరం. సేంద్రియ ఉద్యానవనం రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే మార్గంగా నిలుస్తుంది.
డాక్టర్.టి .తేజస్విని , డాక్టర్ . టీ .థామ్సన్ , డాక్టర్. ఎం.జి.బాల హుస్సేని డాక్టర్ . వైస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం. Ph: 9494963291