ఈ-నామ్ 2.0పై పూర్తి స్థాయి శిక్షణ అవసరం
కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ-నామ1.0ను ప్రవేశ పెట్టింది. దీన్ని మరింత వృద్ధి పరిచి ఈ ఏడాది ‘ఈ-నామ్ 2.0’ను తీసుకొచ్చింది. అయితే, సిబ్బందికి కనీసం శిక్షణ ఇవ్వకుండా అమలు చేయడంతో పంట నమోదులో తప్పిదాలు (ఎర్రర్) చూపించడం, బిడ్డింగ్ సమస్యలు, ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల లాగిన్లలో ఇబ్బందులు, రైతులకు మంచి ధర వచ్చే అవకాశం లేకపోవడం, ఒక్క రోజులో పూర్తయ్యే అమ్మకాలకు మూడు రోజులు పట్టడం వంటి ప్రధాన సమస్యలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 27న ఈ-నామ్ 2.0 ప్రవేశపెట్టగా లాట్ల కేటాయింపులు జరగకపోవడంతో అధికారులు నిజామాబాద్ మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టగా రైతులు క్వింటాకు రూ. వెయ్యి వరకు నష్టపోయారు. తాజాగా శుక్రవారమూ అదే పరిస్థితి ఎదురైంది. యార్డుకు 30 వేల బస్తాల పసుపు రాగా ఉదయం 8 గంటల నుంచి అధికారులు తీవ్రంగా శ్రమించాక వెయ్యి బస్తాలకు మాత్రమే లాట్లు ఇవ్వగలిగారు. తర్వాత సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తడంతో గత్యంతరం లేక బహిరంగ వేలం ప్రారంభించడంతో వ్యాపారులు పంట కొనుగోలు చేశారు. వేలం విధానంలో సాధారణంగా కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులకు మాత్రమే లాభం ఉంటుంది. వారు నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వస్తుంది. సిబ్బందికి ఈ-నామ్ 2.0 పై పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి… సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాతే అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.


