కొబ్బరికి యుద్ధం దెబ్బ
కొబ్బరి సాగుకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక పెట్టింది పేరు. తమిళనాడు, ఏపీల నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావం దేశం లోని కొబ్బరి మార్కెట్‌పై పడింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో కువైట్, ఒమన్, దుబాయ్, ఇరాన్, సౌదీలకు ఎగుమతి చేసేందుకు కాయలను సిద్ధం చేశారు. అయితే యుద్ధం నేపథ్యంలో ముంబయి, చెన్నై, తూత్తుకూడి పోర్టుల్లోనే కాయలతో కంటెయినర్లు నిలిచిపోయాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. ఆయా దేశాలకు ఎగుమతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా ఓడరేవుల్లో ఉన్న సరకును స్థానికంగా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కొబ్బరి ధరల పతనం..: గత నెలలో శివరాత్రి సందర్భంగా కోనసీమ కొబ్బరి మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. వెయ్యి పచ్చి కాయలు రూ.18-20 వేలు పలికాయి. కురిడీల ధరలూ బాగానే ఉన్నాయి. శ్రీరామనవమికి దేశవ్యాప్తంగా మంచి ధర వస్తుందని వ్యాపారులు ఆశించారు. ఓడరేవుల ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే కొబ్బరికాయలు అక్కడే నిలిచిపోవడంతో ధరలపై ప్రభావం చూపింది. దీంతో ప్రస్తుతం వెయ్యి కాయలు రూ.13-14 వేలకు పతనమయ్యాయని మార్కెట్ విశ్లేషకుడు అప్పన కాళీప్రసాద్ తెలిపారు.


