రేపటితో రైతు భరోసా పూర్తి చేస్తాం
సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతుభరోసా నిధులు జమ చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.8284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు, ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు కూడా రైతుభరోసా నిధుల ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. ఇంతకుముందు రైతు రుణమాఫి కూడా చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోగా పూర్తి చేశామని ఈ సందర్భంగా మంత్రిగారు గుర్తుచేశారు. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా సన్నాలకు మద్ధతు ధరపై 500/-లు బోనస్ ప్రకటించడం జరిగిందని, తద్వారా అదనంగా 2 వేల కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా పండిన ప్రతి పంటను తమ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. రైతు భరోసా ద్వారా అందుకున్న నిధులను రైతులు పంట పెట్టుబడులకు వాడుకొని, మంచి పంటలు పండించుకోవాలని ఈ సందర్భంగా మంత్రిగారు ఆకాంక్షించారు. రైతుల సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యమని, అందుకనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం పట్ల మా ప్రభుత్వ వైఖరి చిత్తశుద్ధి ఏ మాత్రం మారదని మంత్రిగారు తెలియజేశారు.

