రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై ‘ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటినెన్స్ యాక్టు(ఎస్మా)’ను ప్రయోగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అక్కడక్కడ రైతులను ఇబ్బబందులకు గురి చేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావడంతో సోమవారం ఆయన అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడినా, రైతులను గందరగోళానికి గురి చేసినా, వేధించినా కఠినంగా వ్యవహరించాలని నిర్ధేశించారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.


