మట్టివాసనతోనే ఆరోగ్యం, సంతృప్తి

గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే, గతంలో ఎక్కువమంది డబ్బు సంపాదనే ధ్యేయంగా తమ జీవితాలను కొనసాగించారనే విషయం అక్షర సత్యం. అప్పట్లో డబ్బు ఎక్కువమంది దగ్గర అందుబాటులో ఉండేది కాదు కాబట్టి ఆవిధంగా ఆలోచించారు. ఆ ఆలోచనల ఫలితమే డబ్బు కోసం వ్యవసాయ రంగం నుంచి వేరే ఉద్యోగ వ్యాపార రంగాలకు వలసలు బాగా జరిగినవి. కాబట్టి వ్యవసాయరంగంలో ఒకప్పుడు 90 శాతం ఉండే జనాభా తగ్గి ప్రస్తుతం సుమారు 70 శాతం మంది వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రంగం నుండి దూరం జరిగి ఉద్యోగ, వ్యాపార రంగాలలో స్థిరపడ్డ వారిలో చాలామంది ఆర్థికపరంగా ఇబ్బందులు లేని స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయికి చేరే క్రమంలో కొంతమంది వివిధ రకాల కారణాల వలన ఆరోగ్యాన్ని, తృప్తిని కోల్పోవలసి వచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే కొంతమంది తమ జీవితాలను ఫణంగా పెట్టి ఆర్థికంగా ఎదిగారు అని చెప్పవచ్చు. కాని జీవితంలో ఉండవలసిన ఆనందం, తృప్తి, ఆరోగ్యం లాంటివి సరైన పాళ్ళలో లేకపోవడము వలన వీటికొరకు కొంతమంది తిరిగి వ్యవసాయరంగంవైపు చూస్తున్నారు. ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడముతో పాటు, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, శారీరక శ్రమ తప్పని సరిగా చేయాలి. ఈమూడు అంశాలు కలిగిన రంగాలలో వ్యవసాయరంగం మొదటి వరుసలో ఉంటుంది. కాబట్టి జీవితంలో ఆరోగ్యం, తృప్తి, ఆనందం కావాలంటే వ్యవసాయరంగమే సరైన దారి గ్రహించిన చాలామంది వ్యవసాయరంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు పల్నాడు జిల్లా బోయపాలెం గ్రామంలో 13 ఎకరాలలో డ్రాగన్‌ఫ్రూట్‌ పంటను సాగు చేస్తున్న పోలేశ్వరరావు.

పోలేశ్వరరావు గారిది వ్యవసాయ నేపథ్యం కాదు. వారి తండ్రికాని, వారి తాతలు కాని వ్యవసాయం చేయలేదు. వీరిది వ్యాపార ప్రస్థానం. పోలేశ్వరరావు గారు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ అన్ని రకాల సౌకర్యాలతో జీవితాన్ని కొనసాగించటానికి అనుగుణంగా ఆర్థికంగా బలపడ్డారు. వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకున్నారు. అయినాకాని జీవితంలో ఏదో అసంతృప్తి ఉంది. తన అసంతృప్తికి కారణం తెలుసుకుని దానికి పరిష్కారం వ్యవసాయరంగమే అని గ్రహించి అటువైపు అడుగులు వేశారు. తాము వ్యాపారరంగంలో కొనసాగుతూ గుంటూరు సమీపములోని బోయపాలెం గ్రామంలో కొంత భూమిని కొనుగోలు చేసుకున్నారు. ఆ భూమిలో ఎలాంటి పంటలు సాగు చేయాలని ఆలోచించసాగి వివిధ రకాల పంటల గురించిన సమాచారాన్ని సేకరించి తమ ఆలోచనలకు, జీవనశైలికి అనుగుణంగా ఉండే పంట డ్రాగన్‌ఫ్రూట్‌ అని గ్రహించి డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేయటానికి నిర్ణయం తీసుకున్నాడు.

పోలేశ్వరరావుగారు స్వతహాగా వ్యాపారవేత్త కాబట్టి అతని ఆలోచనలు తప్పనిసరిగా లాభాలు పొందాలనే ఉంటాయి. తగినంత పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి సాగుని త్వరగా లాభాల బాట పట్టించడముతో పాటు వ్యవసాయరంగాన్ని కూడా వ్యాపారసరళిలో చేసి లాభాలు గడించాలంటే డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు సరైనదారి అని గ్రహించి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టి, అన్ని తెలుసుకున్న తరువాత డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుని వ్యాపారంగా చేయాలని తలచి అందుకు అనుగుణంగా మిగతా రైతులకు భిన్నంగా అంటే ఎకరానికి 8000 మొక్కలు వచ్చేలా పదమూడు ఎకరాలకు లక్షకు పైగా డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలను 2020 వ సంవత్సరం జూన్‌ నెలలో నాటించారు. 

మన దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగి పదికి పైగా డ్రాగన్‌ ఫ్రూట్‌ రకాలను సేకరించి 13 ఎకరాలలో నాటించాడు. మామూలుగా ఇప్పటివరకు డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేసే రైతులు ఎకరానికి 5 నుంచి 8 లక్షల వరకు ఖర్చు చేసి ఎకరానికి 1600 నుంచి 4000 మొక్కల వరకు నాటించారు. కాని పోలేశ్వరరావు గారు పది అడుగులు ముందుకు వేసి ఎకరానికి 15 లక్షలకు పైగా ఖర్చు చేసి ఎకరానికి 8000 మొక్కలు వచ్చేలా నాటించాడు. వీరు వ్యవసాయాన్ని కూడా వ్యాపారంగా చూడాలి అనే లక్ష్యంతో, తనకు పెట్టుబడి ఇబ్బంది లేదు కాబట్టి తాను పెట్టుబడి పెట్టి వచ్చే ఫలితాలను తోటి రైతులకు చూపించగలిగితే ఇంకొంతమంది రైతులు ఈ బాటలో నడవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని భావించి 13 ఎకరాలకుగాను లక్ష మొక్కలకు పైగా నాటించి సాగు చేస్తున్నాడు. డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్క ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి బెడ్‌ తయారు చేసుకుని బెడ్‌లపై మాగిన పశువుల, గొర్రెలు, కోళ్ళ ఎరువులలో ట్రైకోడెర్మావిరిడే, సూడోమోనాస్‌, వేపపిండి లను కలిపి ఈ మిశ్రమాన్ని వేసి రెండు వరుసలు డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలను 2020వ సంవత్సరం జూన్‌ నెలలో నాటించాడు.

మొక్కలకు పోషకాలను అందించడానికి సంవత్సరానికి మూడుసార్లు ట్రైకోడెర్మా, సూడోమోనాస్‌, వేపపిండిలను కలిపిన పశువుల/గొర్రెల/కోళ్ళ ఎరువును అందించడంతో పాటు క్రమం తప్పకుండా జీవామృతం, నవధాన్యాల పిండి ద్రావణం, ఫ్రూట్‌ పర్మంటెడ్‌ జ్యూస్‌ ద్రావణాన్ని డ్రిప్పు ద్వారా పంపిస్తుంటాడు. అన్ని మెళకువలు సక్రమంగా పాటిస్తున్నారు. కాబట్టి మొక్కలు పెట్టిన 12 నెలల తరువాత మొదటి దిగుబడి మొదలయ్యింది. మొదటి సంవత్సరం 13 ఎకరాలకు గాను 10 టన్నుల దిగుబడి సాధించగలిగారు. ఈ సంవత్సరం జూన్‌ నెల నుండి దిగుబడి మొదలయ్యింది. ఆగస్టు 17వ తారీకు వరకు 30 టన్నుల దిగుబడి పొందారు. నవంబరు వరకు దిగుబడి వస్తుంది. పంటను గమనించినట్లయితే 13 ఎకరాలకు గాను ఇంకా 70 టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పోలేశ్వరరావు గారు అంటున్నారు. వచ్చిన దిగుబడిని మార్కెట్‌ చేయడంలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. కాయలను సైజుల వారీగా గ్రేడు చేసి కిలో 80/- నుంచి 130/- రూపాయల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నాడు. మరిన్ని వివరాలు 98485 90044 కి ఫోను చేసి తెలుసుకోగలరు.  

ఆరోగ్యం, తృప్తికి  సరైనదారి

వ్యవసాయంలో శారీరక శ్రమకు అవకాశం ఉండటంతో పాటు కాలుష్యం లేని వాతావరణం అందుబాటులో ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉండేవారు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మన ఆరోగ్యం మన మానసిక స్థితిపై కూడా చాలావరకు ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో పంటలు దిగుబడి సాధించిన తరువాత వచ్చే తృప్తికి వెలకట్టలేము. దానికి తోడు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వ్యక్తులు, విద్యార్థిని, విద్యార్థులు మన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి తమ అభిప్రాయాలు వెల్లడించిన సమయంలో మనం పొందే తృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తాను వివిధ రకాల వ్యాపారాలలో కోట్లు సంపాయించిన సందర్భంలో పొందిన ఆనందం కంటే తాను డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుని ప్రారంభించిన తరువాత పొందే తృప్తి ద్వారా వచ్చిన ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంతో పాటు తమ ఆరోగ్యం మెరుగు అవుతుంది కాబట్టి తృప్తికి, ఆరోగ్యానికి సరైనదారి వ్యవసాయమే అని తాను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను అని పోలేశ్వరరావు అంటున్నాడు.

Read More

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుతో మంచి లాభాలు

భారత దేశం వ్యవసాయక దేశం. అనాదిగా మన ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలలో కొనసాగుతున్నారు. సగానికి పైగా ప్రజలు మన దేశంలో వ్యవసాయ రంగంలో కొనసాగుతున్నా కూడా ఎంతమంది తమ పంటల సాగులో లాభాలు పొందుతున్నారు? అని అడిగితే అతితక్కువమంది రైతులు మాత్రమే తమ పంటల సాగుని లాభదాయకంగా కొనసాగిస్తున్నాము. ఎక్కువమంది  వ్యవసాయంలో నష్టాలను భరించవలసి వస్తుందనే సమాధానం వస్తుంది. నష్టాలను భరిస్తూ పంటల సాగును ఎలా కొనసాగిస్తున్నారా అనే సందేహం రావచ్చు. ప్రతి రైతుకు తప్పనిసరిగా ఆశ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా రాబోవు పంటకాలాలలో లాభాలు రాకపోవా అనే ఆశతో లేదా కొంతమంది గత్యంతరం లేక పంటల సాగుని కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఎక్కువమంది రైతులు వ్యవసాయంలో లాభాలు పొందలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏవిధమైన కారణాలు ఉన్నా కాని ప్రస్తుత పంటలసాగు రైతులందరికి లాభదాయకంగా లేదనే విషయం అక్షర సత్యం. ఈ సమస్యకు పరిష్కారం కొరకు మరియు తమ వ్యవసాయాన్ని లాభల బాటలో నడిపించడం కొరకు రైతు ప్రతినిత్యం ఆలోచిస్తూ, అన్వేషిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనల, అన్వేషణల ఫలితంగా వివిధ రకాల పరిష్కార మార్గాలైన పెట్టుబడులు తగ్గించుకోవడం, కూలీ ఖర్చులు తగ్గించుకోవడం, పంట ఉత్పత్తులకు విలువ జోడించటం, పంట ఉత్పత్తులను సొంతంగా మార్కెట్‌ చేసుకోవడం, కొత్త పంటలవైపు ఆలోచనలు చేయడము లాంటి వివిధ రకాల పరిష్కార మార్గాలు రైతుల మెదడులో మొలుస్తుంటాయి. ఇన్ని రకాల పరిష్కార మార్గాలలో కొత్త పంటల విధానం గురించి ఎక్కువ మంది రైతులు మొగ్గుచూపిస్తుంటారు. దాని ఫలితమే ఔషధ పంటలు, అడవి ఆముదము, దూలగొండి, టేకు, శ్రీగంధం, చందనం, యాపిల్‌ బేర్‌, తైవాన్‌ జామ లాంటి వివిధ రకాల కొత్త పంటలు రావడము, కొన్నింటిలో రైతులు చేతులు కాల్చుకోవడం అందరికీ తెలిసిందే. ఈ కొత్త పంటలను సాగు చేయాలంటే మొక్కలు లేదా విత్తనాలకు మరియు మౌలిక వసతులకు ఎకరానికి యాభై వేలకు మించి, కొన్నింటికయితే ఎకరానికి ఇరవై వేల రూపాయలలోపే పెట్టుబడులు పెట్టవలసి రావచ్చు. కాని ఇటీవల వచ్చిన కొత్త పంటలు డ్రాగన్‌ ఫ్రూట్‌ మరియు ఖర్జూర పంటలు సాగు చేయాలంటే మాత్రం ఎకరానికి సుమారు 5 లక్షల వరకు పెట్టుబడి అవసరం పడుతుంది. అంత ఎక్కువ ఖర్చు పెట్టి డ్రాగన్‌ఫ్రూట్‌, ఖర్జూర లాంటి పంటల సాగు మొదలు పెట్టాలంటే ఒక సాధారణ రైతుకు సాధ్యమయ్యే పని కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆర్థిక స్తోమత కలిగిన రైతులు ఈ పంటల సాగును మొదలు పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి పరిణామమే అని చెప్పవచ్చు. అంత పెట్టుబడి పెట్టి కొంతకాలం వేచిచూసి దిగుబడి వచ్చిన తరువాత, వచ్చిన దిగుబడిని మార్కెటింగ్‌ చేసిన తరువాత మాత్రమే ఆ పంట రైతులకు లాభసాటిగా ఉంటుందా? లేదా? అనే విషయాలను తెలియచేయడానికి, అలాంటి ఖర్చుతో కూడుకున్న కొత్త పంటలను సాగు చేయటానికి కొంతమంది అభ్యుదయ రైతులు ముందుకు వచ్చి డ్రాగన్‌ ఫ్రూట్‌, ఖర్జూర లాంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి.

శ్రీనివాసరెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వారి తండ్రి, తాతల దగ్గర నుంచి వ్యవసాయం ప్రధాన వృత్తిగా చేసుకుని జీవితాలను కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి చిన్న తనం నుండి వ్యవసాయంలో తన వంతు పాత్రను పోషిస్తూ ఉండేవాడు. ఉన్నత చదువులు చదివిన శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలలో చేరి ఇప్పటికి 31 వ సంవత్సరాలు పూర్తి అయ్యింది. బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా తన మనసులో తన ప్రధాన వృత్తి వ్యవసాయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. తాను త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ విరమణ తరువాత తన పూర్తి సమయాన్ని వ్యవసాయ రంగంలో గడపాలనే ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేయడం గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. తమకు సొంత భూమి ఉంది, చిన్నతనం నుండి పంటల సాగులో అనుభవం ఉంది కాబట్టి తన అనుభవాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో స్థిరపడాలనే తలంపుతో వివిధ రకాల పంటల సాగు గురించి విచారించడం, క్షేత్రస్థాయి పరిశీలన చేయడం మొదలు పెట్టి వివిధ ప్రాంతాలలో, వివిధ రకాల పంటలను పరిశీలించిన తరువాత ఖర్జూర (డేట్స్‌) పంటను సాగు చేయాలనే నిర్ణయానికి వచ్చి అందుకు సంబంధించిన రైతులను కలిసి, ఖర్జూర పంటను పరిశీలించి తాను సేకరించిన సమాచారంతో ఖర్జూర పంట వేయాలని 2019 వ సంవత్సరములో నిర్ణయించుకుని 2019వ సంవత్సరం ఆగస్టు నెలలో ఖర్జూర మొక్కలు నాటించాడు. తరువాత డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి కూడా ఆలోచించి 2022 వ సంవత్సరములో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును కూడా మొదలు పెట్టాడు.

ఖర్జూర: 10 ఎకరాలలో ఖర్జూర (డేట్స్‌) పంట సాగులో ఉంది. ఇందుకు గాను ఒక్కొక్క మొక్క 4250/- చొప్పున కొనుగోలు చేసి 2019వ సంవత్సరం ఆగస్టు నెలలో ఎకరానికి 76 మొక్కలు (ఆడ మొక్కలు+మగ మొక్కలు కలిపి) చొప్పున 10 ఎకరాలకు గాను 760 మొక్కలు నాటించాడు. ఖర్జూరలో చాలా రకాలు ఉన్నాయి కాని వీరు మాత్రం ఫ్రెష్‌ ఫ్రూట్‌ రకాలు అయిన బర్హి మరియు ఎలైట్‌ మొక్కలను ఎంపిక చేసుకుని నాటించాడు. ఎకరానికి 76 మొక్కల చొప్పున వచ్చేలా గుంతలు తీయించి మొక్కలు నాటించాడు. పశువుల ఎరువులో వేరు పురుగు సమస్య ఉంది కాబట్టి, ఆ పురుగులు లేత మొక్కలను తిన్నట్లయితే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని భావించి గొర్రెల ఎరువును గుంతలలో వేయించాడు. ఒకవేళ వేరు పురుగులు లేత మొక్కలను పాడు చేసినా కూడా మొక్కలు చనిపోకుండా ఎదుగుదల తగ్గి మరుసటి సంవత్సరం ఇగురు పెట్టడం తాను ప్రత్యక్షంగా చూడడం జరిగిందని శ్రీనివాసరెడ్డి వివరించాడు. ఖర్జూర ఎడారి జాతి మొక్క కాబట్టి పోషకాలు మరియు చీడపీడల విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. కాని రెడ్‌ వీవిల్‌ పురుగు బయటకు కనిపించకుండా చెట్టులోపల గుడ్లు పెట్టి చెట్టును పాడు చేస్తుంది. మనం ఊహించకుండానే ఒక రోజు చెట్టు విరిగి పడిపోతుంది. ఈ పురుగును కనిపెట్టడం చాలా కష్టం. చెట్టు మొదలులో పదార్థం తింటూ చిన్న శబ్దం చేస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తేనే మనం ఆ పురుగు చేసే శబ్దాన్ని వినవచ్చు. ఈ శబ్దాన్ని కుక్కలు కనిపెట్టి అక్కడ ఏదో ఉన్నట్లు పురుగు ఆశించిన చెట్టు వద్ద కుక్కలు తవ్వుతూ ఉంటాయి కాబట్టి ఆ పురుగును నివారించవలసి అవసరం ఎంతైనా ఉందని శ్రీనివాసరెడ్డి వివరించాడు. ఖర్జూర పండ్ల సాగులో పరపరాగ సంపర్కము చాలా ముఖ్యం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు బాక్స్‌ చూడగలరు.

మొక్కలు నాటిన మూడవ సంవత్సరం అంటే గత సంవత్సరం 10 ఎకరాల నుంచి 1000 కిలోల దిగుబడి పొందాడు. ఈ సంవత్సరం అంటే మొక్కలు నాటిన నాలుగవ సంవత్సరం పది ఎకరాల నుంచి 10 టన్నుల పైగానే దిగుబడి పొంది కిలో 130/-ల చొప్పున అమ్మకం చేశాడు. మొక్కల వయస్సు పెరిగే కొలది దిగుబడి పెరుగుతుంది. దానికి తోడు ఈ మొక్కల జీవితకాలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని శ్రీనివాసరెడ్డి వివరిస్తున్నాడు. 

డ్రాగన్‌ఫ్రూట్‌: శ్రీనివాసరెడ్డి గారు ఖర్జూర (డేట్స్‌)తో పాటు 13 ఎకరాలలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును కొనసాగిస్తున్నాడు. ఇందులో మూడు ఎకరాలు ఖర్జూరలో అంతరపంటగా మరియు 10 ఎకరాలలో ఏక పంటగా డ్రాగన్‌ ఫ్రూట్‌ని సాగు చేస్తున్నారు. లైనుకి లైనుకి 12 అడుగులు, మొక్కకు మొక్కకు 10 అడుగుల దూరం పాటించి సిమెంటు స్థంభాలను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క స్థంభానికి నాలుగు మొక్కల చొప్పున నాటించాడు. పాదులలో పశువుల ఎరువు చాలా ఎక్కువగా వేయించి ఎత్తు పాదులలో డ్రాగన్‌ మొక్కలు నాటించాడు. నీటి వసతి కొరకు డ్రిప్‌ ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది రైతులు అంటే మొదటలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు మొదలు పెట్టిన రైతులు స్థంభం పైన టైరు ఏర్పాటు చేసుకుని ఆ టైరులో డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు పెరిగేలా ఏర్పాటు చేసుకున్నారు కాని అనుభవం పెరిగే కొలది డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు పద్ధతులలో అనేక మార్పులు సంభవించాయి. ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా స్థంభం పైన టైరును కాకుండా సిమెంటు రింగులను శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేయించాడు. డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కకు కొమ్మలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువ కొమ్మల బరువుకు టైరు తట్టుకోలేదు కాబట్టి సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకున్నాడు.

మొక్కలు నాటిన ఎనిమిది, తొమ్మిది నెలలలో మొదటి పంట వచ్చింది కాని చాలా తక్కువగా వచ్చింది. ప్రస్తుతానికి రెండవ సంవత్సరం దిగుబడి పొందుతున్నాడు. అంటే మొక్కలు నాటిన 20 నెలలకు రెండవ పంట దిగుబడిని పొందుతున్నాడు. జులై 15 వరకు పది ఎకరాలకు గాను 10 టన్నుల వరకు దిగుబడి పొందడము జరిగింది. ప్రస్తుతం పంట పూత మరియు చిన్న మొగ్గ థలో ఉంది. శ్రీనివాస రెడ్డి సాగు చేసే రకం సియాన్‌ రెడ్‌ రకం. ఈ రకం దిగుబడి మొత్తం ఒకేసారి కాకుండా దఫాలు దఫాలుగా వస్తుంది. ప్రస్తుత పంటను గమనించినట్లయితే ఎకరానికి ఇంకా 4 టన్నుల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంది. అంటే రెండవ సంవత్సరం ఎకరానికి 5 టన్నుల దిగుబడి పొందవచ్చు అని శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడు.

మార్కెటింగ్‌ విషయానికొస్తే తాను పొందిన దిగుబడి మొత్తాన్ని సొంతంగా దారి పక్కన పండ్లు అమ్మేవారికి, కాలనీలలో, అపార్టమెంట్లలో కిలో 120/-లకు తగ్గకుండా అమ్మకం చేస్తున్నాడు. వచ్చిన దిగుబడిని అమ్మకం చేసుకోవడంలో శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. ఇకముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండవు అనే ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం గిరాకి తగ్గట్లుగా పండ్లు అందుబాటులో ఉండడం లేదు కాబట్టి కొన్ని సమయాలలో వియత్నాం నుండి డ్రాగన్‌ ఫ్రూట్‌ పండ్లను దిగుమతి చేసుకుంటున్నారు. మన దగ్గర కూడా సాగు విస్తీర్ణం పెరిగి పండ్లు అందుబాటులోకి వస్తే వియత్నాం నుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరం లేకపోగా, మొదట ఖర్చు చేసిన పెట్టుబడులు సాధించిన తరువాత డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతులు ధరలు తగ్గించే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు మంచి భవిష్యత్‌ ఉందని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడుతున్నాడు. 

రుచి విషయానికొస్తే డ్రాగన్‌ ఫ్రూట్‌లో రెండు రకాలు ఉన్నాయి. వైట్‌ పల్ప్‌ మరియు పింక్‌ పల్ప్‌. తాను పింక్‌ పల్ప్‌ రకాన్ని సాగు చేస్తున్నాను కాబట్టి ఇది మంచి రుచిగా ఉంటుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి డ్రాగన్‌ ఫ్రూట్‌ని రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం తినాలని, ప్రపంచం మొత్తం అదే విధంగా తింటున్నారు కాబట్టే ప్రపంచం మొత్తం డ్రాగన్‌ ఫ్రూట్‌ అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరెడ్డి వివరించాడు.

ఖరీదైన పంటలు పెద్ద మొత్తంలో అంటే 20 ఎకరాలకు గాను కోటి రూపాయలకు పైగా పెట్టిబడి పెట్టి డ్రాగన్‌ ఫ్రూట్‌ మరియు ఖర్జూర పంటలను సాగు చేస్తూ, వీటి సాగులో ఉన్న సాధకబాధకాలను తోటి రైతులకు తెలియచేయడంతోపాటు తన పదవీ విరమణ తరువాత ఆరోగ్యకర వ్యాపకం కోసం ఈ పంట సాగును శ్రీనివాసరెడ్డి ఎంపిక చేసుకొని కొనసాగిస్తున్నాడు. మరిన్ని వివరాలు 99491 11198 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

పరపరాగ సంపర్కము

ఈ రకం ఖర్జూరాలో మగ మొక్కలు మరియు ఆడ మొక్కలు విడివిడిగా ఉంటాయి కాబట్టి 10 శాతం మగ మొక్కలు ఉండేలా మొక్కలు నాటుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి కూడా అదే నిష్పత్తిలో 10 శాతం మగ మొక్కలు నాటించాడు. మగ మొక్క నుంచి పూలు విచ్చుకొనే సమయంలో పరిశీలించి పుప్పొడిని సేకరించి ఆడ మొక్కలలోని పూలకు నైపుణ్యంతో అద్దవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఏ మాత్రం తేడా వచ్చినా అంటే సేకరించిన పుప్పొడిని అద్దలేకపోతే కాయలు చిన్నవిగా ఉండి అందులో విత్తనం తయారవదు. అవి తినటానికి పనికిరావు. ఆడ మొక్కల పూవులలోని అన్ని పూవులకు పుప్పొడిని అద్దలేకపోయినట్లయితే పుప్పొడి తగిలిన కాయలలో విత్తనం తయారయ్యి ఆ కాయలు లావుగా అయ్యి తినటానికి తీపిగా ఉంటాయి. ఆడ పువ్వులు గెలలోని అన్ని కాయలకు పుప్పొడి అద్దినట్లయితే గెలలోని అన్ని కాయలలో విత్తనం ఉత్పత్తి అయ్యి, కాయలు లావుగా ఉండి మంచి రుచిని కలిగి ఉంటాయి. ఈ మొక్కలలో పరపరాగ సంపర్కము అతి కష్టమయినది కాబట్టి రైతులు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలతో పుప్పొడిని సేకరించవలసి ఉంటుంది. కొన్ని సార్లు పుప్పొడి సరిపోనట్లయితే వేరే రైతుల వద్ద నుంచి పుప్పొడిని కొనుగోలు చేసుకుని ఉపయోగించవలసి ఉంటుంది. గత సంవత్సరం శ్రీనివాస రెడ్డి గుజరాత్‌లోని ఒక రైతు వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగిందని వివరించాడు. తేనెటీగల వలన ఖర్జూర పంటలో పెద్దగా ఉపయోగం లేకపోగా తేనెటీగలు పుప్పొడిని సేకరించుకొని పోతాయి కాబట్టి తేనెటీగల వలన పుప్పొడి కోల్పోవలసి రావచ్చు అని శ్రీనివాసరెడ్డి వివరించాడు. మగ మొక్కల నుంచి పుప్పొడి ఉత్పత్తి అయ్యే సమయములో మరియు పుప్పొడిని ఆడపూలపై అద్దే సమయములో భారీ వర్షాలు పడినట్లయితే పంటను నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్జూర సాగు రిస్కుతో కూడుకున్న పంట అని శ్రీనివాసరెడ్డి వివరిస్తున్నాడు.

Read More