మట్టివాసనతోనే ఆరోగ్యం, సంతృప్తి
గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే, గతంలో ఎక్కువమంది డబ్బు సంపాదనే ధ్యేయంగా తమ జీవితాలను కొనసాగించారనే విషయం అక్షర సత్యం. అప్పట్లో డబ్బు ఎక్కువమంది దగ్గర అందుబాటులో ఉండేది కాదు కాబట్టి ఆవిధంగా ఆలోచించారు. ఆ ఆలోచనల ఫలితమే డబ్బు కోసం వ్యవసాయ రంగం నుంచి వేరే ఉద్యోగ వ్యాపార రంగాలకు వలసలు బాగా జరిగినవి. కాబట్టి వ్యవసాయరంగంలో ఒకప్పుడు 90 శాతం ఉండే జనాభా తగ్గి ప్రస్తుతం సుమారు 70 శాతం మంది వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రంగం నుండి దూరం జరిగి ఉద్యోగ, వ్యాపార రంగాలలో స్థిరపడ్డ వారిలో చాలామంది ఆర్థికపరంగా ఇబ్బందులు లేని స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయికి చేరే క్రమంలో కొంతమంది వివిధ రకాల కారణాల వలన ఆరోగ్యాన్ని, తృప్తిని కోల్పోవలసి వచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే కొంతమంది తమ జీవితాలను ఫణంగా పెట్టి ఆర్థికంగా ఎదిగారు అని చెప్పవచ్చు. కాని జీవితంలో ఉండవలసిన ఆనందం, తృప్తి, ఆరోగ్యం లాంటివి సరైన పాళ్ళలో లేకపోవడము వలన వీటికొరకు కొంతమంది తిరిగి వ్యవసాయరంగంవైపు చూస్తున్నారు. ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడముతో పాటు, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, శారీరక శ్రమ తప్పని సరిగా చేయాలి. ఈమూడు అంశాలు కలిగిన రంగాలలో వ్యవసాయరంగం మొదటి వరుసలో ఉంటుంది. కాబట్టి జీవితంలో ఆరోగ్యం, తృప్తి, ఆనందం కావాలంటే వ్యవసాయరంగమే సరైన దారి గ్రహించిన చాలామంది వ్యవసాయరంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు పల్నాడు జిల్లా బోయపాలెం గ్రామంలో 13 ఎకరాలలో డ్రాగన్‌ఫ్రూట్ పంటను సాగు చేస్తున్న పోలేశ్వరరావు.
పోలేశ్వరరావు గారిది వ్యవసాయ నేపథ్యం కాదు. వారి తండ్రికాని, వారి తాతలు కాని వ్యవసాయం చేయలేదు. వీరిది వ్యాపార ప్రస్థానం. పోలేశ్వరరావు గారు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ అన్ని రకాల సౌకర్యాలతో జీవితాన్ని కొనసాగించటానికి అనుగుణంగా ఆర్థికంగా బలపడ్డారు. వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకున్నారు. అయినాకాని జీవితంలో ఏదో అసంతృప్తి ఉంది. తన అసంతృప్తికి కారణం తెలుసుకుని దానికి పరిష్కారం వ్యవసాయరంగమే అని గ్రహించి అటువైపు అడుగులు వేశారు. తాము వ్యాపారరంగంలో కొనసాగుతూ గుంటూరు సమీపములోని బోయపాలెం గ్రామంలో కొంత భూమిని కొనుగోలు చేసుకున్నారు. ఆ భూమిలో ఎలాంటి పంటలు సాగు చేయాలని ఆలోచించసాగి వివిధ రకాల పంటల గురించిన సమాచారాన్ని సేకరించి తమ ఆలోచనలకు, జీవనశైలికి అనుగుణంగా ఉండే పంట డ్రాగన్‌ఫ్రూట్ అని గ్రహించి డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేయటానికి నిర్ణయం తీసుకున్నాడు.

పోలేశ్వరరావుగారు స్వతహాగా వ్యాపారవేత్త కాబట్టి అతని ఆలోచనలు తప్పనిసరిగా లాభాలు పొందాలనే ఉంటాయి. తగినంత పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి సాగుని త్వరగా లాభాల బాట పట్టించడముతో పాటు వ్యవసాయరంగాన్ని కూడా వ్యాపారసరళిలో చేసి లాభాలు గడించాలంటే డ్రాగన్ ఫ్రూట్ సాగు సరైనదారి అని గ్రహించి డ్రాగన్ ఫ్రూట్ సాగుకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టి, అన్ని తెలుసుకున్న తరువాత డ్రాగన్ ఫ్రూట్ సాగుని వ్యాపారంగా చేయాలని తలచి అందుకు అనుగుణంగా మిగతా రైతులకు భిన్నంగా అంటే ఎకరానికి 8000 మొక్కలు వచ్చేలా పదమూడు ఎకరాలకు లక్షకు పైగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను 2020 వ సంవత్సరం జూన్ నెలలో నాటించారు.

మన దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగి పదికి పైగా డ్రాగన్ ఫ్రూట్ రకాలను సేకరించి 13 ఎకరాలలో నాటించాడు. మామూలుగా ఇప్పటివరకు డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేసే రైతులు ఎకరానికి 5 నుంచి 8 లక్షల వరకు ఖర్చు చేసి ఎకరానికి 1600 నుంచి 4000 మొక్కల వరకు నాటించారు. కాని పోలేశ్వరరావు గారు పది అడుగులు ముందుకు వేసి ఎకరానికి 15 లక్షలకు పైగా ఖర్చు చేసి ఎకరానికి 8000 మొక్కలు వచ్చేలా నాటించాడు. వీరు వ్యవసాయాన్ని కూడా వ్యాపారంగా చూడాలి అనే లక్ష్యంతో, తనకు పెట్టుబడి ఇబ్బంది లేదు కాబట్టి తాను పెట్టుబడి పెట్టి వచ్చే ఫలితాలను తోటి రైతులకు చూపించగలిగితే ఇంకొంతమంది రైతులు ఈ బాటలో నడవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని భావించి 13 ఎకరాలకుగాను లక్ష మొక్కలకు పైగా నాటించి సాగు చేస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి బెడ్ తయారు చేసుకుని బెడ్లపై మాగిన పశువుల, గొర్రెలు, కోళ్ళ ఎరువులలో ట్రైకోడెర్మావిరిడే, సూడోమోనాస్, వేపపిండి లను కలిపి ఈ మిశ్రమాన్ని వేసి రెండు వరుసలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను 2020వ సంవత్సరం జూన్ నెలలో నాటించాడు.

మొక్కలకు పోషకాలను అందించడానికి సంవత్సరానికి మూడుసార్లు ట్రైకోడెర్మా, సూడోమోనాస్, వేపపిండిలను కలిపిన పశువుల/గొర్రెల/కోళ్ళ ఎరువును అందించడంతో పాటు క్రమం తప్పకుండా జీవామృతం, నవధాన్యాల పిండి ద్రావణం, ఫ్రూట్ పర్మంటెడ్ జ్యూస్ ద్రావణాన్ని డ్రిప్పు ద్వారా పంపిస్తుంటాడు. అన్ని మెళకువలు సక్రమంగా పాటిస్తున్నారు. కాబట్టి మొక్కలు పెట్టిన 12 నెలల తరువాత మొదటి దిగుబడి మొదలయ్యింది. మొదటి సంవత్సరం 13 ఎకరాలకు గాను 10 టన్నుల దిగుబడి సాధించగలిగారు. ఈ సంవత్సరం జూన్ నెల నుండి దిగుబడి మొదలయ్యింది. ఆగస్టు 17వ తారీకు వరకు 30 టన్నుల దిగుబడి పొందారు. నవంబరు వరకు దిగుబడి వస్తుంది. పంటను గమనించినట్లయితే 13 ఎకరాలకు గాను ఇంకా 70 టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పోలేశ్వరరావు గారు అంటున్నారు. వచ్చిన దిగుబడిని మార్కెట్ చేయడంలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. కాయలను సైజుల వారీగా గ్రేడు చేసి కిలో 80/- నుంచి 130/- రూపాయల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నాడు. మరిన్ని వివరాలు 98485 90044 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఆరోగ్యం, తృప్తికి సరైనదారి
వ్యవసాయంలో శారీరక శ్రమకు అవకాశం ఉండటంతో పాటు కాలుష్యం లేని వాతావరణం అందుబాటులో ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉండేవారు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మన ఆరోగ్యం మన మానసిక స్థితిపై కూడా చాలావరకు ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో పంటలు దిగుబడి సాధించిన తరువాత వచ్చే తృప్తికి వెలకట్టలేము. దానికి తోడు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వ్యక్తులు, విద్యార్థిని, విద్యార్థులు మన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి తమ అభిప్రాయాలు వెల్లడించిన సమయంలో మనం పొందే తృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తాను వివిధ రకాల వ్యాపారాలలో కోట్లు సంపాయించిన సందర్భంలో పొందిన ఆనందం కంటే తాను డ్రాగన్ ఫ్రూట్ సాగుని ప్రారంభించిన తరువాత పొందే తృప్తి ద్వారా వచ్చిన ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంతో పాటు తమ ఆరోగ్యం మెరుగు అవుతుంది కాబట్టి తృప్తికి, ఆరోగ్యానికి సరైనదారి వ్యవసాయమే అని తాను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను అని పోలేశ్వరరావు అంటున్నాడు.

