సేంద్రియ రైతుల కోసం ‘ఏలూరు రైతు సంపద’

‘ఏలూరు రైతు సంపద’ డాట్ ఇన్ అనే ఒక వెబ్‌సైట్‌ను ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా జిల్లాలో సేంద్రియ సేద్యం చేస్తున్న అన్నదాతలు వారు పండించే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని ఉచితంగా కల్పించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న మోసాలను నియంత్రించడం, రైతు-వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఉంచేందుకు ఈ ప్రత్యేక ప్లాట్‌ఫాంను కలెక్టర్ ఏర్పాటు చేయించారు. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యే ఉత్పత్తులను జిల్లా వ్యవసాయ-ఉద్యానశాఖలు ధ్రువీకరిస్తాయి. దాంతో వినియోగదారులు నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుని రైతులతో మాట్లాడి తీసుకోవచ్చు.
సృజనాత్మక ఆలోచనలో భాగంగా…

సృజనాత్మక ఆలోచనలో భాగంగా…
వచ్చే సమావేశం నాటికి ప్రతి కలెక్టర్ ఒక సృజనాత్మక ఆలోచనతో రావాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా ఏలూరు కలెక్టర్ ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ అధికారులను సమన్వయం చేసుకుని దీన్ని రూపొందించారు. ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయటానికి క్యూఆర్ కోడ్ వినియోగదారులకు అందు బాటులో ఉంచారు. దూర ప్రాంతాలకు చెందినవారు ఎవరైనా బుక్ చేసుకుంటే వారికి సరకులు పంపటానికి కార్గో బస్సులు, పార్సిల్ సర్వీసులు సులభతరం చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్, సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీన్ని ప్రజంట్ చేయనున్నారు.
ఈ నెల 18 లేదా 19న ఏలూరులో రైతు సంపద ఉత్పత్తుల భారీ మేళాను ఏర్పాటు చేసి ఈ వేదికను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలో ఆయా శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రైతుల ఉత్పత్తులను ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలని సోమవారం పీజీఆర్ఎస్‌కు హాజరైన అధికారులకు కలెక్టర్ సూచించారు.

Read More

సెన్సర్ సహాయంతో పంటల నీటి అవసరం తీర్చవచ్చు

ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని పొగాకు పరిశోధన కేంద్రంలో సెన్సర్ ఆధారిత పొగాకును 8 ఎకరాల్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)- జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ నేతృత్వంలో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. ఈ విధానంలో మొక్కల వేర్ల దగ్గర మట్టిలో సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఇవి నేలలో ఉన్న నీటి పరిమాణాన్ని నిరంతరం కొలుస్తూ సమాచారాన్ని గేట్‌వే టవర్ ద్వారా క్లౌడ్ సిస్టమ్‌తో పంచుకుంటాయి. దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాంకేతికత విశ్లేషిస్తుంది. నేలలో తేమ స్థాయి తగ్గితే ఆటోమేటిక్‌గా మోటారు ఆన్ అయ్యి నీరు పారుతుంది. సెల్‌ఫోన్‌లో కల్టివేట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఈ ప్రక్రియను రైతు గమనించవచ్చు. సంప్రదాయ పద్ధతిలో హెక్టారుకు సుమారు 4,500 ఘనపు మీటర్ల నీరు అవసరం కాగా.. ఈ విధానంలో అది 1700 ఘనపు మీటర్లకు తగ్గింది అని పంటల నిర్వహణ హెచఓడీ, ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కొరడా రాజశేఖరరావు తెలిపారు.

Read More

ఈ-నామ్ 2.0పై పూర్తి స్థాయి శిక్షణ అవసరం

కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ-నామ1.0ను ప్రవేశ పెట్టింది. దీన్ని మరింత వృద్ధి పరిచి ఈ ఏడాది ‘ఈ-నామ్ 2.0’ను తీసుకొచ్చింది. అయితే, సిబ్బందికి కనీసం శిక్షణ ఇవ్వకుండా అమలు చేయడంతో పంట నమోదులో తప్పిదాలు (ఎర్రర్) చూపించడం, బిడ్డింగ్ సమస్యలు, ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల లాగిన్లలో ఇబ్బందులు, రైతులకు మంచి ధర వచ్చే అవకాశం లేకపోవడం, ఒక్క రోజులో పూర్తయ్యే అమ్మకాలకు మూడు రోజులు పట్టడం వంటి ప్రధాన సమస్యలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 27న ఈ-నామ్ 2.0 ప్రవేశపెట్టగా లాట్ల కేటాయింపులు జరగకపోవడంతో అధికారులు నిజామాబాద్ మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టగా రైతులు క్వింటాకు రూ. వెయ్యి వరకు నష్టపోయారు. తాజాగా శుక్రవారమూ అదే పరిస్థితి ఎదురైంది. యార్డుకు 30 వేల బస్తాల పసుపు రాగా ఉదయం 8 గంటల నుంచి అధికారులు తీవ్రంగా శ్రమించాక వెయ్యి బస్తాలకు మాత్రమే లాట్లు ఇవ్వగలిగారు. తర్వాత సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తడంతో గత్యంతరం లేక బహిరంగ వేలం ప్రారంభించడంతో వ్యాపారులు పంట కొనుగోలు చేశారు. వేలం విధానంలో సాధారణంగా కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులకు మాత్రమే లాభం ఉంటుంది. వారు నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వస్తుంది. సిబ్బందికి ఈ-నామ్ 2.0 పై పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి… సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాతే అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Read More

తెలంగాణా రాష్ట్రానికి వ్యవసాయ పథకాల్లో రూ.51 కోట్ల కోత

తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర నిధుల కేటాయింపులో పోలిస్తే రూ.51 కోట్ల మేర కోత పడింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మసాగునీరు, భూసార ఆరోగ్య నిర్వహణ, వర్షాధార ప్రాంత అభివృద్ధి, డిజిటల్ వ్యవసాయం, వెదురు అభివృద్ధి పథకం, సహజ వ్యవసాయం తదితర కేంద్ర పథకాల కింద రాష్ట్రంలో ఏటా రూ.1,439.49 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో 60 శాతం వాటా కింద కేంద్రం రూ.871.15 కోట్లు విడుదల చేస్తోంది. ఆదివారం ప్రవేశ పెట్టిన 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.820 కోట్లు మాత్రమే పేర్కొన్నారు. రూ.51 కోట్ల మేర తగ్గించారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయాధికారులు సంప్రదించగా… ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనలో కొన్ని కేంద్ర పథకాలను విలీనం చేయడంతో రాష్ట్రానికి నిధులు తగ్గాయని కేంద్ర అధికారులు సమాచారం ఇచ్చారు.
సీఎం ధన్-ధాన్య కృషి యోజన అమలుకు తెలంగాణ రాష్ట్రంలో జనగామ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలు ఎంపికయ్యాయి. దీనికింద ఏటా రూ.160 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ. 960 కోట్లు వెచ్చిoచాలని కేంద్రం నిర్దేశించింది. దీనిలో 31 పథకాలను విలీనం చేయగా.. అందులో తెలంగాణలో అమలయ్యే ఆరు పథకాలున్నాయి. వాటన్నింటినీ ఒకే పద్దుగా నిధులు కేటాయించడంతో రాష్ట్రానికి రూ.50 కోట్ల మేర తగ్గినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ధన్-ధాన్య పథకానికి అదనంగా నిధులు వస్తాయని భావిస్తుండగా… ఉన్నవాటిలో కోత విధించడంపై వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాయనున్నారని తెలిపారు.

Read More

తెలంగాణాకు వెన్నెముక రైతులే

హైదరాబాదులో నిన్న ప్రారంభమయిన గ్లోబల్‌ సదస్సులో ”విలువ ఆధారిత ఉత్పత్తుల గొలుసు విధానం-రైతుల ఆదాయం రెట్టింపు” అనే అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం మీడియాతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”తెలంగాణకు వెన్నెముక రైతులే. జనాభాలో ఎక్కువ మంది జీవనోపాధికి సేద్యం వనరుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు సంక్షేమం, పురోగతికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. గత రెండేళ్లలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. లక్ష కోట్లు వెచ్చించాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయం, దాని అనుబంధ ఆర్థిక వ్యవస్థ దాదాపు 34.6 బిలియన్‌ డాలర్లు. 2047 నాటికి దీనిని 400 బిలియన్‌ డాలర్లకు పెంచాలనేది లక్ష్యం. ఆ స్థాయిలో వృద్ధి సాధించడానికి స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌, రంగాల వారీ వ్యూహంతో పనిచేస్తున్నాం. అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటల్‌ వ్యవసాయం, డ్రోన్లు, యాంత్రీకరణ, మార్కెట్‌ లింకేజీలు, ఈ-ట్రేడింగ్‌ బలోపేతం, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీ.. లాజిస్టిక్‌ వ్యవస్థలు, సహకార సంస్థలు, వ్యవసాయ స్టార్టప్‌ల బలోపేతం, రైతు భరోసా, పంటలబీమా, వ్యవసాయ యంత్రాలకు రాయితీ, ఆహార శుద్ధి జోన్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడతాం. ఇవి రైతుల ఆదాయాలను పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి సహాయపడతాయి. పొలం నుంచి మార్కెట్‌ వరకు మార్కెట్‌ ఆధారిత గొలుసు వ్యవస్థలను నిర్మించడం, గిట్టుబాటు ధరలను నిర్ధారించడం, వృథాను తగ్గించడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాం’ అని తెలిపారు. చర్చలో భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు సలహాదారు శ్రీనివాసన్‌, ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత మోదడుగు విజయ్‌ గుప్తా, కోసాంబ్‌ ఎండీ జె.ఎస్‌. యాదవ్‌, ఆదిత్య బిర్లా గ్లోబల్‌ ట్రేడింగ్‌ ఎండీ, సీఈవో రాజేష్‌ సోమాని, వ్యవసాయ పరిశోధన సంస్థ మాజీ అధిపతి డాక్టర్‌ సమరేందు మహంతి, మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్‌ అధ్యకక్షుడు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

పంట నష్ట అంచనాను పారదర్శకంగా చేపట్టాలి

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను వల్ల జరిగిన పంట నష్టం అంచనాను పారదర్శకంగా చేపట్టాలని, ఏపీ ఎయిమ్స్‌ పంట నమోదు యాప్‌ ద్వారా మాత్రమే పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. పంట నష్ట నమోదు నుంచి జియో కోఆర్డినేట్‌, క్షేత్రస్థాయి ఫొటోలు అప్‌లోడ్‌ను ప్రభుత్వం మినహాయించినట్లు ఆయన చెప్పారు. ఈ-పంటలో నమోదైన వాస్తవ సాగుదారులనే నమోదు చేయాలన్నారు.

Read More

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 24వ ర్యాంక్

  • జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి NIRF (National Institutional Ranking Framework) 2025 లో 24వ ర్యాంక్ – గత ఏడాదితో పోలిస్తే 13 ర్యాంకుల మెరుగుదల.
  • ప్రభుత్వ మద్దతు, సిబ్బంది కృషి ప్రధాన కారణాలు – ఉపకులపతి అల్థాస్ జానయ్య

దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పనితీరుపై భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే నివేదిక NIRF (National Institutional Ranking Framework) 2025 ఈరోజు విడుదల అయ్యింది. ఈ జాబితాలో దేశంలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల జాబితాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) 24వ ర్యాంక్ ను సాధించింది. 2015 లో PJTAU ఆరవ ర్యాంక్ సాధించగా, 2023లో ఆ ర్యాంక్ 37కు పడిపోయింది. ఇప్పుడు పనితీరు మెరుగు పరుచుకుని 24 ర్యాంకు సాధించిందని PJTAU ఉపకులపతి అల్దాస్ జానయ్య వివరించారు. దక్షిణాదిలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో 4వ స్థానంలో PJTAU నిలవడం గర్వకారణమని జానయ్య అన్నారు. 10 నెలల క్రితం తాను PJTAU ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ ఏడాది ర్యాంకు మెరుగుపడిందని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో ప్రత్యేకంగా 4 ఆధునిక పరిశోధన కేంద్రాలు ప్రారంభించానన్నారు. మానవ రహిత వ్యవసాయమే ధ్యేయంగా డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెంపునకు సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ ను, సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణ పరిశోధనలకు గాను సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ను, అదేవిధంగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సిస్టమ్స్ ను, అలాగే బోధన, బోధనేతర సిబ్బంది లో నైపుణ్యాల పెంపుదలకి సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సహజ వనరుల పరిరక్షణ, యూరియా, ఇతర రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, నీటి సమర్థ యాజమాన్యం వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ”రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసి సుమారు 1200 గ్రామాల్లో 1,20,000 మంది రైతులని శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా కలిసి ఆ అంశాలపై అవగాహన కల్పించారని జానయ్య వివరించారు. అలాగే సుమారు 11వేల గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకి నాణ్యమైన 40 వేల విత్తన కిట్లను పంపిణీ చేశామని జానయ్య పేర్కొన్నారు. సామాన్యులకి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వ్యవసాయ విద్యను చేరువ చేయాలన్న ఉద్దేశంతో సీట్లను పెంచి, ఫీజులు తగ్గించామని, వ్యవసాయ కూలీల పిల్లలకు ప్రత్యేక సీట్లు కేటాయించామని జానయ్య వివరించారు. అలాగే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని విస్తృత పరిశోధనలు చేపట్టామని జానయ్య తెలిపారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR), రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ కార్యదర్శి శ్రీ M. రఘునందన్ రావు ల నిరంతర మార్గదర్శకత్వం, తోడ్పాటుతో ఈ ర్యాంకు సాధించగలిగామన్నారు. అదేవిధంగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల కృషి, తోడ్పాటు ర్యాంకుల పెరుగుదలకు దోహదం చేసిందని జానయ్య అన్నారు. వారందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2026 లో 10వ ర్యాంకు, 2027లో 5వ ర్యాంకు సాధిస్తామని అల్థాస్ జానయ్య ధీమా వ్యక్తం చేశారు.

Read More
  • 1
  • 2