కూరగాయలకు స్థిరంగా పెరుగుతున్న గిరాకీ
మానవుల ఆహారంలో గత కొన్ని థాబ్దాల్లో చాలా మార్పులు సంభవించాయి. గింజధాన్యాలు, పప్పుధాన్యాల ప్రాముఖ్యత కొంత తగ్గుతుండగా పండ్లు, కూరగాయలు, వంటనూనెలు, పాలు, గ్రుడ్లు, మాంసం వంటి అనుబంధ పదార్థాల వాటా క్రమేపీ పెరుగుతున్నది. సాంప్రదాయ పంటల సాగు గిట్టుబాటుగా లేకపోవటం వల్ల ఉద్యానవన పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి అనుబంధ వ్యాపకాలవైపు పెట్టుబడులు మళ్ళుతున్నాయి. నీటివసతితోపాటు శ్రామికుల లభ్యత పష్కలంగా ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగు వాణిజ్యస్థాయిలో జరుగుతున్నది. 1951లో దేశంలో 28.4 లక్షల హెక్టార్లలో కూరగాయల్ని సాగు చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. హెక్టారుకి 5.8 టన్నుల దిగుబడితో 165 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తయ్యాయి. తలసరి కూరగాయల ఉత్పత్తి, లభ్యత రోజుకి 88 గ్రాములు మాత్రమే. 2021-22లో కూరగాయల సాగు 113.5 లక్షల హెక్టార్లలో జరగ్గా హెక్టారుకి 18 టన్నుల సగటు దిగుబడితో 2048 లక్షల టన్నులు ఉత్పత్తయినట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ఏడు థాబ్దాల కాలంలో కూరగాయల విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగింది. హెక్టారు దిగుబడి 2.72 రెట్లు పెరిగింది. ఉత్పత్తి 11 రెట్లు పెరిగినందువల్ల తలసరి లభ్యత రోజుకి 400 గ్రాములకు ఎగబాకింది. 2021లో ప్రపంచంలో ఉత్పత్తయిన 1150 మిలియన్ టన్నుల్లో భారతదేశం వాటా సుమారు 18 శాతంగా ఉంది. అల్లం, బెండకాయల ఉత్పత్తిలో భారత్కు ప్రథమ స్థానం ఉండగా, బంగాళాదుంప, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, కాబేజీ, వంకాయ వంటి అనేక కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచింది. దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు 2021-22లో 6986 కోట్ల రూపాయల విలువైన తాజా కూరగాయల్ని, దాదాపు ఎనిమిదివేలకోట్ల రూపాయల విలువైన శుద్ధి చేసిన కూరగాయల్ని ఎగుమతి చేయడం జరిగింది. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, మిశ్రమ కూరగాయల్ని శుద్ధి చేసి, ఎగుమతి చేస్తున్నది. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు కూరగాయల ఉత్పత్తిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తూ, సగానికి పైగా కూరగాయల్ని పండిస్తున్నాయి. ప్రపంచ సగటు దిగుబడితో పోలిస్తే ఆలుగడ్డ, కాలీఫ్లవర్ల విషయంలోనే భారతదేశపు సగటు దిగుబడి ఎక్కువ. కాబేజీ, వంగ, బెండ, ఉల్లిగడ్డ, టమాటాల దిగుబడి ప్రపంచ సగటు దిగుబడితో పోలిస్తే దేశంలో తక్కువగానే ఉంది. మొత్తం కూరగాయల సగటు దిగుబడి ప్రపంచ సగటు దిగుబడితో పోలిస్తే తక్కువగానే ఉంది.
ముఖ్యమైన కూరగాయలు
మొత్తం కూరగాయల ఉత్పత్తిలో 28.9 శాతం వాటాతో ఆలుగడ్డదే అగ్రస్థానం. 11.3 శాతం వాటాతో టమాట రెండవ స్థానంలోనూ, 10.3 శాతం వాటాతో ఉల్లిగడ్డ మూడవ స్థానంలో నిలిచాయి. 8.1 శాతం వాటాతో వంకాయ, 5.5 శాతం వాటాతో కర్రపెండలం, 5.4 శాతం వాటాతో కాబేజి, 4.6 శాతం వాటాతో కాలీఫ్లవర్, 3.9 శాతం వాటాతో బెండకాయ, 2.4 శాతం వాటాతో బఠానీ, 0.8 శాతం వాటాతో చిలగడదుంపలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన కూరగాయలన్నింటికీ కలిపి 18.8 శాతం వాటా ఉంది. 1961లో దేశంలో 3.75 లక్షల హెక్టార్లలోనే బంగాళాదుంపను సాగు చేయగా, 7.25 టన్ను సగటు దిగుబడితో 27.19 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. 2022-23 సంవత్సరంలో దేశంలో బంగాళాదుంప సాగు 23.5 లక్షల హెక్టార్లకు పెరిగింది. బంగాళా దుంప విస్తీర్ణం 6.27 రెట్లు పెరగటం ఒక విశేషమైతే, ఉత్పత్తి సుమారుగా 22 రెట్లు పెరిగి 597.4 లక్షల టన్నులకు చేరింది. ఉత్పాదకత కూడా 3.5 రెట్లు పెరిగి హెక్టారుకి 25.4 టన్నులకు చేరింది. బంగాళాదుంప ఉత్పత్తి 22 రెట్లు పెరగటం కూరగాయల ఉత్పత్తి వేగంగా పుంజుకోవటానికి దోహదపడింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు ఆలుగడ్డ ఉత్పత్తిలో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 1961లో టమాటా కేవలం 50 వేల హెక్టార్లలో మాత్రమే సాగయింది. హెక్టారుకి 9 టన్నుల చొప్పున దిగుబడి 4.64 లక్షల టన్నులే. 2022-23లో టమాట సాగు 19.28 రెట్లు పెరిగి 8.64 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దిగుబడి కూడా 2.65 రెట్లు పెరిగి 23.87 టన్నులకు చేరింది. ఉత్పత్తి 44.4 రెట్లు పెరిగి 206.2 లక్షల టన్నులకు చేరింది. ఇంత విరివిగా ఉత్పత్తి పెరగటంతో టమాట సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు టమాట ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. మరో ముఖ్యమైన పంట ఉల్లిగడ్డను కూడా 1961లో కేవలం 1.2 లక్షల హెక్టార్లలోనే సాగు చేశారు. హెక్టారుకి 10 టన్నుల దిగుబడితో కేవలం 12 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు ఉత్పత్తయ్యాయి. 2022-23 సంవత్సరంలో ఉల్లిసాగు విస్తీర్ణం 4.83 రెట్లు పెరిగి 5.8 లక్షల హెక్టార్లకు విస్తరించింది. సగటు దిగుబడి 53.45 టన్నులకు చేరటం ద్వారా 7.48 రెట్ల వృద్దిని నమోదు చేసింది. ఫలితంగా ఉల్లి ఉత్పత్తి 310.1 లక్షల టన్నులకు పెరిగి 25.84 రెట్లకు చేరింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు ఉల్లి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచాయి. టమాట ఉత్పత్తి 62 సంవత్సరాల్లో 44 రెట్లు, ఉల్లి ఉత్పత్తి 26 రెట్లు, ఆలుగడ్డ ఉత్పత్తి 22 రెట్లు పెరగటం కూరగాయల ఉత్పత్తిని పెంచటానికి దోహదపడ్డాయి. ఈ మూడు రకాల కూరగాయలు దేశమంతటా వినిమయదారుల ఆదరణను చూరగొని, లభ్యతమైతున్నాయి. వీటి ధరలు తగ్గినప్పుడు రైతులు, పెరిగినప్పుడు వినిమయదారులు గగ్గోలు పెడుతుంటారు. ప్రభుత్వాలు కూడా వీటి ఎగుమతుల్ని నియంత్రించడం ద్వారా ధరల్ని అదుపులో ఉంచే ప్రయత్నాలను చేస్తుంటాయి. వంగతోటల సాగు 1961లో 1.50 లక్షల హెక్టార్లలో జరిగి, హెక్టారుకి 7 టన్నుల దిగుబడితో 9.9 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. 2022-23లో వంగతోటల సాగు 7.6 లక్షల హెక్టార్లకు విస్తరించింది. మొత్తం ఉత్పత్తి 126.1 లక్షల టన్నులకు పెరిగి, 16.59 టన్నుల సగటు దిగుబడిని దేశం సాధించింది. దిగుబడి 2.37 రెట్లుకి చేరుకోవడం, విస్తీర్ణం 5.07 రెట్లు పెరగటం వల్ల ఉత్పత్తి 12.74 రెట్లు పెరిగింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్లు వంకాయ ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లలో కూడా వంకాయ ఉత్పత్తి గణనీయమైన స్థాయిలోనే ఉంది. కర్రపెండలాన్ని కూడా కూరగాయల్లో లెక్కించినా, దానిని వరి బియ్యానికి ప్రత్యామ్నాయంగానే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నారు. కేబేజి ఉత్పత్తి 1961లో 2.88 లక్షల టన్నులు మాత్రమే. 2022-23లో అది 9.95 లక్షల టన్నులకు పెరిగింది. పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలు ఈ కూరగాయను అధికంగా పండిస్తున్నాయి. కాలీఫ్లవర్ ఉత్పత్తి 1961లో 4.13 లక్షల టన్నులుంటే, 2023కి అది 8.8 లక్షల టన్నులకు పెరిగింది. పశ్చిమబెంగాల్, బీహార్, హర్యానా, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఈ కూరగాయను ఎక్కువగా పండిస్తున్నాయి. బెండకాయల ఉత్పత్తి 1961లో 7.75 లక్షల టన్నులుండగా, 2022-23లో 33.24 లక్షల టన్నులకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు ఈ కూరగాయను ఎక్కువగా పండిస్తున్నాయి. ఇలాగే బఠానీ, చిలగడదుంప, తీగ పంటలైన బీర, సొర, పొట్ల, కాకర, దొండ, బీన్స్, చిక్కుడు వంటి కూరగాయల ఉత్పత్తిలో కూడా ఎంతో కొంత వృద్ధి ఉండటం వల్లనే, దేశం కూరగాయల లభ్యత విషయంలో స్వయం సమృద్ధిని కలిగి ఉంది. ఐతే జనాభా పెరుగుదల సంవత్సరానికి 1.5 శాతం ఉండగా, కూరగాయలకు గిరాకీ సంవత్సరానికి మూడు శాతం కన్నా ఎక్కువగా పెరుగుతూ ఉండటం వల్ల కూరగాయల విస్తీర్ణంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతున్నా సరిపోవటం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల సాగు

కూరగాయల సాగు, ఉత్పత్తి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కొంత వెనకబడే ఉన్నాయి. 2017లో భారత ప్రభుత్వం ప్రచురించిన స్టాటిస్టికల్ ఇయర్ బుక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2.44 లక్షల హెక్టార్లలో కూరగాయల సాగు జరిగింది. 28.54 టన్నుల హెక్టారు దిగుబడితో 69.81 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తయి, దేశంలోని రాష్ట్రాలలో పదవ స్థానంలో నిలిచింది. తెలంగాణాలో 1.39 లక్షల హెక్టార్లలో కూరగాయల్ని పండించారు. 19.78 టన్నుల సగటు దిగుబడితో 27.54 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తయి, దేశంలోని రాష్ట్రాలలో 15వ స్థానంలో నిలిచింది. తెలంగాణా ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం కూరగాయల తలసరి లభ్యత రోజుకి 250 గ్రాములు మాత్రమే. జాతీయ పోషక విలువల అధ్యయన సంస్థ ప్రకారం రోజుకి 32.5 గ్రాములు అవసరం. దానితో పోలిస్తే 23 శాతం కొరత ఉన్నట్లు అర్థమౌతున్నది. టమాట, వంగ, కాబేజి, కాలీఫ్లవర్, దోస, కారట్, ముల్లంగి పంటల్లో తెలంగాణ కొంత మిగులు కలిగి ఉంటే, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, కాకర, బీర, పచ్చిమిర్చి, బెండ, సొర, బీన్స్, కాప్సికం, చేమ, కందలతో పాటు ఇతర కూరగాయల విషయంలో కొరతను ఎదుర్కుంటున్నది. కూరగాయల ఉత్పత్తిని పెంచటానికి ‘పంటకాలనీ’లను ప్రోత్సహిస్తామని ఉద్యానవన శాఖ కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో 36.5 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2017 కి అది 27.34 లక్షల టన్నులకు తగ్గగా తాజా అంచనాల ప్రకారం 2022-23లో 13.05 లక్షల టన్నులకు మరింత తగ్గింది. కూరగాయల భారీ దిగుమతులపై రాష్ట్రంలోని నగరాలన్నీ ఆధారపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పండ్ల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానానికి చేరుకున్నది. 7.5 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలుండగా 180 లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తయినట్లు అంచనా వేశారు. కాని కూరగాయల ఉత్పత్తి మాత్రం 64.46 లక్షల టన్నులకే పరిమితమై, తొమ్మిదవ స్థానంలో నిలిచింది. 2020-21లో ఆంధ్రప్రదేశ్లో కూరగాయల సాగు 2.64 లక్షల హెక్టార్లలో జరిగి, 75.38 లక్షల టన్నులు ఉత్పత్తయినట్లు రాష్ట్ర ఉద్యాన వన శాఖ ప్రకటించింది. కానీ తర్వాతి రెండు సంవత్సరాల్లో కూరగాయల ఉత్పత్తి 2020-21 స్థాయిని అధిగమించలేదు. టమాట, మిర్చి, కాప్సికం, బెండ, వంగ, కొన్ని ఆకుకూరల విషయంలో మిగులు ఉత్పత్తి ఉన్నా, ఇతర కూరగాయల విషయంలో కొరత ఉంది. పండ్లు, చేపలు, రొయ్యలు, గ్రుడ్ల వంటి ఉత్పత్తుల విషయంలో అగ్రస్థానంలో ఉన్నా కూరగాయల విషయంలో దేశంలో 9, 10 స్థానాల్లోనే నిలుస్తున్నది. కూరగాయల తలసరి లభ్యత జాతీయ సగటుకి సమీపంలోనే తారసలాడుతున్నది.
సాగు లాభదాయకత
కూరగాయల సాగు విస్తీర్ణంలో పెరుగుదల కనిపిస్తుందంటే వాటి సాగు లాభదాయకంగా ఉందనే విషయం స్పష్టమౌతున్నది. వరి పంటలో నికరాదాయం హెక్టారుకి 50 నుండి 60 వేల రూపాయల ఆదాయం నికరంగా లభిస్తుండగా, కూరగాయల పంటల నుండి హెక్టారుకి ఒక లక్షల రూపాయల నుండి లక్షన్నర రూపాయల వరకు నికరాదాయం లభించే అవకాశముంది. పలు అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. అయితే ప్రతి సీజన్లోనూ ఇది జరుగుతుందని చెప్పలేము. వర్షాబావం, అధిక వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు, కొన్నిసార్లు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. మార్కెట్లో కూరగాయ ధరలు ఒక్కోసారి పతనమై, ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంటుంది. కానీ నాలుగైదు సీజన్ల సగటు ఆదాయాలను లెక్కిస్తే సాంప్రదాయంగా పండించే గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలతో పోలిస్తే కూరగాయ పంటల ద్వారా రెట్టింపు ఆదాయం లభిస్తుందనే అవగాహన కలుగుతుంది. కూరగాయల ధరల సూచీ సాంప్రదాయ పంటల ధరలతో పోలిస్తే వేగంగా పెరిగింది. 2012లో 100గా ఉన్న కూరగాయల ధరల సూచీ 2023 ఆగస్టు నాటికి 250కి పెరిగింది. 2012లో వడ్ల మద్దతు ధర క్వింటాలుకి రూ. 1250గా ఉండగా, అది 2023కి రూ. 2183 కి పెరిగింది.

11 సంవత్సరాల వ్యవధిలో వరి మద్దతు ధర 75 శాతం పెరిగింది. ఇదే సమయంలో కూరగాయల ధరల సూచీ 150 శాతం పెరిగింది. ప్రజల ఆహార అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా కూరగాయలకు గిరాకీ స్థిరంగా పెరుగుతున్నది. కూరగాయల సాగు కూడా అనేక కొత్త పుంతలు తొక్కుతున్నది. ఎత్తైన బెడ్లు తయారు చేయటం, వాటిపై ప్లాస్టిక్ షీట్లను పరచడం, బిందు, తుంపర సేద్యాల ద్వారా నీరు సరఫరా చేస్తూ, మొక్కలకు అవసరమైనప్పుడు కర్రల ఊతాన్నందిస్తూ, పందిళ్ళపై పాకించటానికి వేర్వేరు పదార్థాలను వాడుతూ, సూక్ష్మపోషక పదార్థాలను అందిస్తూ అనేక మెరుగైన సేద్యపు పద్ధతులను వాడుతున్నారు. వీటన్నిటికీ అదనపు పెట్టుబడిని పెడుతున్నారు. అనేక కూరగాయల్లో సంకర రకాలను వాడుతున్నారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కలను అధిక ధరకు కొనుగోలు చేసి, సమయాన్ని ఆదా చేస్తున్నారు. ఈ చర్యలన్నీ దిగుబడులను పెంచటానికి ఉపయోగపడుతున్నాయి. అధునాతనమైన షేడ్నెట్లు, గ్రీన్హౌస్లను కూడా కొందరు వినియోగిస్తున్నారు. కూరగాయల సాగులో వ్యవసాయం పెట్టుబడి సాంద్రత కల్గిన వాణిజ్యంగా మారుతున్నది. కొందరు దిగుబడి తగ్గినా సేంద్రియ పద్ధతుల్లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన కూరగాయల్ని పండిస్తున్నారు. సేంద్రియ కూరగాయలకు మార్కెట్ గిరాకీ క్రమేపీ పెరుగుతున్నది. రసాయనిక ఎరువుల్ని, పురుగుమందుల్ని ఎక్కువగా వాడకుండా ‘బాధ్యతాయుత’ వ్యవసాయం చేస్తున్న రైతులు, సేంద్రియ కూరగాయలకు ఎక్కువ ధరను చెల్లించటానికి సిద్ధపడుతున్న వినిమయదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నారు. శాఖాహారం, వీగన్ ఉద్యమాలు కూడా ప్రపంచమంతటిలాగానే భారతదేశంలో కూడా బలపడుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ కూరగాయలకు మరింత గిరాకీని పెంచేలా ఉన్నాయి. కూరగాయల సాగు మరింత విస్తీర్ణాన్ని ఇతర పంటల నుండి ఆకర్షించవచ్చు. కూగరాయల ఎగుమతి అవకాశాలు కూడా భవిష్యత్లో మరింత పెరగవచ్చు. ఇప్పటికి కేవలం మూడు శాతం కూరగాయలనే శుద్ధి చేసి, విలువను జోడిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడుతున్న ప్రవాస భారతీయుల సంఖ్య పెరిగే కొద్దీ తాజా కూరగాయలు, శుద్ధి చేసిన కూరగాయలకు ఎగుమతి అవకాశాలు పెరగవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూరగాయల సాగుకి ప్రోత్సాహకాలనందించి స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తాయని ఆశిద్దాము.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్ ఞ కన్సల్టెంట్ ఇక్రిసాట్), ఫోన్: 83098 59517, 70328 11608

