ఔషధ మొక్క… సీతాఫలం
సాధారణ నామం : కస్టర్డ్ యాపిల్ శాస్త్రీయ నామం : అనోనా స్క్వామోసా కుటుంబం: అనోనేసి
సీతాఫలం పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో సాగు చేయవచ్చు. సీతాఫలం పండ్లు కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, రాగి, పీచుపదార్థం, తక్కువ కొవ్వు కలిగి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను సమకూరుస్తాయి. సీతాఫలం ఆకులు, గింజలు మరియు ఇతర భాగాల్లో ‘అనోనైన’ అనే పదార్థం ఉండటం వలన చేదు గుణం కలిగి ఉంటుంది. అందుకే సీతాఫలం ఆకులను పశువులు, మేకలు తినవు. ఆకులు, గింజల నుండి తీసిన రసంలో కీటకనాశిని లక్షణాలున్నాయి.
ఉపయోగాలు : పురుగుల నివారణలో ఉపయోగించు సీతాఫలం ఆకులు, గింజలు, గింజల నూనె కషాయాలు
- సీతాఫలం ఆకు కషాయం : 500 గ్రా. సీతాఫలం ఆకులను 2 లీ. నీటిలో ఉడికించాలి. ఒక లీటరు ద్రావణం మిగిలే వరకు ఉడికించాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 10 15 లీ. నీటిలో కలిపి పురుగులు సోకిన మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేసి పేనుబంక, సుడిదోమ, గొంగళిపురుగులు, డైమండ్ బ్యాక్ మాత్, పచ్చదోమ, పచ్ౘ్నల్లి పురుగులను నివారించవచ్చు.
- వివిధ ఆకుల కషాయం : వేపాకు1 కి., కానుగ 1 కి., బిల్వం 1కి., విషముష్టి 1/2 కి., వావిలాకు 1 కి., తంగేడు 1 కి., సీతాఫలం 1/2 కి., పిచ్చి తులసి 1 కి., పుదీనా 1/2 కి., పాలకొడిస 1/2కి., కొత్తిమీర 1/2కి., నేరేడు 1 కి., నేలవేము 1/2 కి., యూకలిప్టస్ 1 కి., అత్తాకోడలు ఆకు 1 కి., ఈ ఆకులలో ఏవైనా 5 రకాల ఆకులను పైన చెప్పిన మోతాదులో తీసుకుని 10 లీ. నీటిలో అరగంట సేపు బాగా ఉడికించి, ఉడుకుతున్న ఈ ద్రావణాన్ని కర్రతో మధ్య మధ్య కలుపుతూ, కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. కషాయానికి 100 గ్రా. సబ్బుపొడి లేదా 500 గ్రా. కుంకుడు రసం కలిపి, ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి సాయంత్రం వేళ పంటపై పిచికారి చేయాలి.
- ఈ కషాయం అనేక పంటలనాశించే రసం పీల్చే పురుగులు, పెద్ద దశలోనున్న లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, ఆకులనుతినే గొంగళిపురుగులపై బాగా పనిచేస్తుంది.
- దశపర్ణి కషాయం : వేప ఆకులు 5కి., నల్లేరు ఆకులు 2కి., అరిస్టాలోకియా ఆకులు 2కి., బొప్పాయి ఆకులు 2కి., సీతాఫలం ఆకులు 2 కి., కానుగ ఆకులు 2 కి., ఆముదం ఆకులు 2 కి., గన్నేరు ఆకులు 2 కి., జిల్లేడు ఆకులు 2 కి., టైనోస్పోరా కార్డిఫోలియా ఆకులు 2 కి., పచ్చి మిరప కాయల పేస్టు 2 కి., వెల్లుల్లి పేస్టు 2కి., ఆవుపేడ 3 కి., ఆవు మూత్రం 5 లీ.
- వీటినన్నింటినీ నూరి 200 లీ. నీటిలో కలిపి ఒక నెల రోజులు పులియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి మూడుసార్లు కలియతిప్పాలి. నెల రోజుల తర్వాత వడపోయాలి. ఈ కషాయాన్ని 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఈ కషాయాన్ని ఒక ఎకరం పొలంలో ఫాగింగ్ మెషిన్‌తో చల్లి తామర పురుగులు, ఆకుముడత పురుగు, లీఫ్ హాపర్స్‌ని నివారించవచ్చు.
- సీతాఫలం విత్తన నూనె కషాయం : పచ్చి కాయల నుండి గింజలను తీసి గ్రైండర్‌లో వేసి నూనె తీయాలి. ఒక భాగం నూనెని 20 భాగాల నీటిలో కలిపి డైమండ్ బ్యాక్‌మాత్ ఆశించిన పంటపై పిచికారి చేయాలి.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి


