మొక్కజొన్న పంట ఉత్పత్తి మొత్తానికి సాయం అందించాలి

ఆంధ్ర రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించడంతోపాటు.. 100% పంట ఉత్పత్తికి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ‘2025-26 రబీలో రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. 37.61 లక్షల టన్నుల దిగుబడి లభిస్తుందని అంచనా. అత్యధికంగా నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఎన్టీఆర్, కర్నూలు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగైంది. రబీ పంట జూన్ వరకు చేతికొస్తోంది. అధిక ఉత్పత్తి కారణంగా, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కు వగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతారు’ అని లేఖలో చంద్రబాబు వివరించారు. కర్షకుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని 50:50 నిష్పత్తిలో కాకుండా మొత్తం కేంద్రమే భరించాలని, మొత్తం పంట ఉత్పత్తిలో 25% మాత్రమే కాకుండా 100% ఉత్పత్తికి సాయం అందించాలని పేర్కొన్నారు. జూన్ వరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More

జన్యువుల వృద్ధితో వేరుశనగ పంట దిగుబడి పెరిగింది

పంటలో జన్యువులు వృద్ధి కారణంగా వేరుశనగ దిగుబడిలో ప్రతి యేటా పెరుగుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మెట్టప్రాంతాల పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్‌) అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌తోపాటు వివిధ ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని స్పానింగ్‌బంచ్‌, వర్జీనియాబంచ్‌ అనే రెండు ప్రధాన రకాలలో కాయ దిగుబడి, గింజ శాతం, గింజ బరువు ప్రాతిపదికన రెండేళ్లలో నాలుగు పంట సీజన్లలో విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయం తేల్చింది. మూడు నుంచి నాలుగు నెలల కాలంలో పండే పంటకు యేటా హెక్టారుకు సుమారు 27 కిలోలు.. ఆరు నెలల్లో కాతకొచ్చే రకాల్లో హెక్టారుకు 25 కిలోల దిగుబడి పెరుగుదలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్రిశాట్‌ గత 20 ఏళ్లలో 240 వేరుశనగ రకాలను అభివృద్ధి చేసింది. కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ, జన్యు ఎంపికల వంటి అధునాతన సాధనలతో పరిశోధనలు జరిపి, మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ తెలిపారు.

Read More
  • 1
  • 2