ఎకరా వరకూ.. రైతు భరోసా నిధులు విడుదల
యాసంగి సీజన్‌కు పంటల పెట్టుబడి కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు రూ.3,446.94 కోట్లను రైతు భరోసా కింద ఆదివారం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎకరాకు రూ. 6 వేల చొప్పున విడుదల చేశారు. నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లు విడుదలయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 24,935 మంది రైతులకు రూ.10.43 కోట్లు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని… ఆమేరకు బ్యాంకుల నుంచి సందేశాలు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి, నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.


