బయోడైనమిక్ ఎరువు… కొమ్ము ఎరువు (500)

దీనిని తాజా ఆవు పేడను చనిపోయిన ఆవు కొమ్ములలో నింపి సారవంతమైన భూమిలో ఆకురాలుకాలం నుండి వసంత రుతువు వరకు పాతిపెట్టి తయారుచేస్తారు. తయారయిన కొమ్ము ఎరువు శక్తివంతమైన భూమి చైతన్య కారకం. దీనిని భూమిలో కాల్షియం చురుకుదనాన్ని, సూర్యుని / జీవ శక్తులను భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ శక్తులు విత్తనం మొలకెత్తడం, వేర్లు వృద్ధి చేయడం, మొక్క పెరగడంతోపాటు భూమిలో హ్యూమస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొమ్ము ఎరువును భూమి నిర్మాణానికి, భూమిలో ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు, వానపాములను పెంచుతాయి. ఎకరానికి 85 గ్రాముల కొమ్ము ఎరువుని సరిపడే నీటిలో కలిపి సవ్యదిశలో ఒక గంటసేపు కలిపి మధ్యాహ్నం తర్వాత భూమిపై సంవత్సరానికి కనీసం రెండుసార్లు వసంత ఋతువు, ఆకులు రాల్చే కాలంలో నీటి బిందువుల రూపంలో పిచికారి చేయాలి. కొమ్ము ఎరువు అసలైన బయోడైనమిక్ ఎరువు.

Read More

మాంసం, వరి పొట్టుతో కునపజలం

ఆదికాలంలోనే భారతీయ వ్యవసాయ శా¢స్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రసిద్ధ ప్రాచీన వ్యవసాయ శా¢స్తవేత్తలు ప్రాచీన రుషులు, పరాశరుడు, సురపాలుడు తదితరులు అతద్భుతమైన పరిశోధనలు జరిపి గ్రంథస్థం చేశారు. సురపాల మహర్షి రాసిన వృక్షాయుర్వేదంలో కునపజలం అనే ద్రావణ ఎరువుని ప్రస్తావించారు. సంస్కృతంలో కునప అంటే మృత కళేబరం. జలం అంటే నీరు. అంటే శవం కంపుకొట్టే నీరని అర్థం. ఇది మొక్కలకు పోషక ద్రావణంగానూ ఉపయోగపడుతుంది. దీన్ని చేపల వ్యర్థాలతోనూ, కోడిమాంసం వ్యర్థాలతోనూ, పంది, జింక, ఇతర అడవి జంతువుల మాంసంతోనూ తయారుచేసేవారు. అడవులు అంతరించి జంతువులు కనుమరుగవుతున్న కాలంలోనే ప్రస్తుతం చేపల వ్యర్థాలు, కోడి మాంసం వ్యర్థాలతోనూ తయారు చేసుకోవచ్చు. కోడి మాంసపు వ్యర్థాలతో చేసేదాన్ని కుక్కుట కునప అంటారు.

ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారుచేసే ‘కునపజలం’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి కునపజలం తయారుచేస్తే, మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజిస్ట్) ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డా॥ వై.ఎల్.నెనె. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ కునపజలం కన్నా ఈ కునపజలం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని డా॥ నెనె అంటున్నారు.

తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం (గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరినీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.

తయారుచేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే కునపజలం తయారీలో వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరిపొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతో పాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతిగల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి, పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి, నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల కునపజలాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి.

ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీనివల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది.

దిగుబడిని పెంచే కునపజలం
కావలసిన పదార్థాలు : మాంసం-1 కిలో; మినప పప్పుపొడి -1/4 కి.; నువ్వులు- 1/4 కి.; నల్లబెల్లం- 1/4 కి.; ఆవుపాలు – 1 లీటరు; ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె – 50 గ్రాములు; మంచి నీరు – 5 లీటర్లు

తయారు చేసే విధానం : మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్ళీ మరగించాలి. పొంగువచ్చిన తర్వాత మినపపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ ఉండాలి. పొంగు వచ్చిన వెంటనే పాత్రను దించి, చల్లార్చి, మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసిన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంతలో పాతి పెట్టాలి. 11వ రోజు బయటకు తీసి కషాయాన్ని వడపోయాలి. ఈ కషాయాన్ని వేరొక కుండలో పోసి దానికి నెయ్యి లేక నూనె కలిపి పాత్రపై మూకుడు పెట్టి ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి గట్టిగా తాడుతో కట్టి 10 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు. 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పంటపైనన్నా పిచికారి చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు. ఇది ప్రభావశీల ఔషధం. పంట దిగుబడి 20% పెరుగుతుంది.

Read More

పురుగులు, తెగుళ్ళ నివారణకు మ్యాజిక్ కంపోస్టు

కావలసిన పదార్థాలు
పశువుల పేడ : 1 కిలో
పశువుల మూత్రం : 1 లీటరు
వేప ఆకులు, కానుగ ఆకులు, జిల్లేడు ఆకులు : 1 కిలో (ఒక్కొక్కటి)
బెల్లం : 50 గ్రా.

తయారు చేసే విధానం : ఒక కుండ తీసుకొని పైన చెప్పిన చెట్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండలో వేసి దానికి పశువుల పేడ, మూత్రం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుండను బట్టతో కప్పి ఉంచి వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. వారం రోజుల తరువాత దానిలోని మిశ్రమాన్ని వడపోసి దానికి నీటిని కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి.

  • చిన్న మొక్కలకు ఒక భాగం మిశ్రమానికి 60-70 రెట్ల నీటిని కలిపి, పెద్ద మొక్కలకైతే 30-40 రెట్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి.
  • ఈ కషాయాన్ని విత్తనశుద్ధికి కూడా ఉపయోగించవచ్చు.
  • పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
  • చెదలు సమస్యగా ఉన్నచోట మ్యాజిక్ కంపోస్టు తయారీలో ఆముదం లేదా సీతాఫలం ఆకులు కలిపి తయారు చెయ్యాలి.

పంటల ఎదుగుదలకు మిశ్రమం :
పశువుల పేడ : 100 కిలోలు
పశువుల మూత్రం : 100 లీటర్లు
వేరుశనగ చెక్క (పిండి) : 100 కిలోలు

పై మూడు పదార్థాలను ఒక పాలిథిన్ పట్టాపై వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక ఎకరం పొలానికి సరిపోతుంది. మిశ్రమాన్ని పొలంలో సమంగా పడేలా చల్లుకోవాలి. దీనిని వాడటం వలన పంటలకు కావలసిన పోషక పదార్థాలు లభించి పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనిని అన్ని పంటలలోనూ వాడుకోవచ్చు.

Read More