జిల్లాలవారీగా జొన్నకొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలోరూ.1,100 కోట్లతో జిల్లాలవారీగా జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తామని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మరో రూ.1,800 కోట్లతో అదనంగా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. “యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు 16.13 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం ఉత్పత్తి 42.87 లక్షల టన్నులకు చేరింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే రూ.4,172.94 కోట్లతో 12.85 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. మరో 6.53 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో 4.03 లక్షల ఎకరాల్లో 4.03 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి అయింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లతో కొనుగోళ్లు చేపడతాం. ఆదిలాబాద్ జిల్లాలో 26, సంగారెడ్డి జిల్లాలో 10, కామారెడ్డి జిల్లాలో 43, మెదక్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. దీంతోపాటు 10,175 టన్నుల పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తాం” అని వెల్లడించారు.

Read More

మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

మొక్కజొన్న పంట ఉత్పత్తి మొత్తానికి సాయం అందించాలి

ఆంధ్ర రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించడంతోపాటు.. 100% పంట ఉత్పత్తికి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ‘2025-26 రబీలో రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. 37.61 లక్షల టన్నుల దిగుబడి లభిస్తుందని అంచనా. అత్యధికంగా నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఎన్టీఆర్, కర్నూలు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగైంది. రబీ పంట జూన్ వరకు చేతికొస్తోంది. అధిక ఉత్పత్తి కారణంగా, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కు వగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతారు’ అని లేఖలో చంద్రబాబు వివరించారు. కర్షకుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని 50:50 నిష్పత్తిలో కాకుండా మొత్తం కేంద్రమే భరించాలని, మొత్తం పంట ఉత్పత్తిలో 25% మాత్రమే కాకుండా 100% ఉత్పత్తికి సాయం అందించాలని పేర్కొన్నారు. జూన్ వరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More