పాలవెల్లువ 2.0

గ్రామీణ స్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, తద్వారా పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా 19.9.2024న కేంద్ర సహకార మరియు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ పాలవెల్లువ 2.0కు శ్రీకారం చుట్టింది. మహిళల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల్లో సహకార సంఘాల ద్వారా 50% పాలఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. కొత్తగా 75000 బహుళార్థ సాధక పాలఉత్పత్తిదారుల సహకార సంఘాల స్థాపన, 46000 పాలఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం, ఐదు సంవత్సరాల చివరికి రోజుకు 1000 లక్షల లీటర్ల పాలఉత్పత్తి లక్ష్య సాధన దిశగా కేంద్ర సహకార మరియు పశుసంవర్థక పాడి పరిశ్రమ శాఖలు ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో సమావేశాలు జరిపి నిరంతరం ప్రగతిని సమీక్షిస్తున్నాయి.

1998 నుండి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రస్థానం పదిలపరుచుకుంటున్న భారత్, స్థూల ఉత్పత్తికి 25% వాటా సమకూరుస్తుంది. డిసెంబర్ 2014 నుండి అమలవుతోన్న రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెల్లో పాలఉత్పాదకత 36.63% పెరిగిందని తెలుస్తోంది. అంతేకాక ఆధునిక పాలపరీక్షా పరికరా…తో పాల నాణ్యత పరిశీలన పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.

రాష్ట్రాలవారీగా 2024 నుండి 2029 వరకు పాలఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యం ఇలా ఉంది.

తెలంగాణాపరంగా చూస్తే –
2024-2026కు గాను కొత్త సంఘాల ఏర్పాటు 8%, బలోపేతం 42% గా నమోదయింది.
ప్రస్తుత సంవత్సరంకి 306 కొత్త సంఘాల ఏర్పాటు లక్ష్యంగా ఉంది.
పాడి సుస్థిర అభివృద్ధికి 3 అంచెల సహకార వ్యవస్థ రామరక్షగా నాడే క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ చెప్పారు. కాగా తెలంగాణలో బలహీనంగా ఉన్న గ్రామస్థాయి సహకార సంఘాల పాల సేకరణకు సవాల్‌గా మారింది.
ఉన్న సంఘాల్లో ఆడిట్ జరగక పోవడం, సభ్యుల నిర్లిప్త భావన, సంఘ స్ఫూర్తికి విఘాతంగా నిలిచింది.
తెలంగాణ సహకార యూనియన్ మరింతగా సభ్యుల అవగాహనా కార్యక్రమాలు విస్తృతపరచాల్సిన అవసరం ఉంది.
గ్రామస్థాయిలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో యూనియన్లు రాష్ట్ర స్థాయిలో సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
పాడి రైతులు సంఘటితంగా ఉంటే, పక్క రాష్ట్రం, కర్నాటకలో రోజుకు కోటి లీటర్లు పాలసేకరణ సాధ్యపడుతుండగా, విస్తృత విపణి అవకాశాలున్నా, తెలంగాణలో వివిధ సహకార వ్యవస్థలు, ప్రైవేటు ఆధిపత్యానికి దారితీస్తోంది.
తెలంగాణలో కరీంనగర్ పాడి రైతుల కంపెనీ, ముల్కనూర్ మహిళా డెయిరీ, నల్లగొండ రంగారెడ్డి యూనియన్, విజయడెయిరీ ఇలా 4 రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి.
1964 చట్టంలో ఉన్న విజయ డెయిరీ వ్యవస్థాగత అసమానతలతో ఆశించినంతగా పాలసేకరణ, మార్కెటింగ్ లక్ష్యాలకు చేరువ కావాలంటే, పాడిరైతుల సంఘటిత ముందడుగు ఎంతో అవసరం.
సహకారశాఖ ద్వారా త్వరితగతిన సంఘాల ఏర్పాటు, పశుసంవర్థక శాఖ ద్వారా పాడిరైతులకు సేవలు సమ్మిళితంగా లభిస్తే, పాడి రైతు బతుకులో భరోసా వస్తుంది. అలాగే, సబ్సిడీతో పాడిపశువులకు రుణాలు దొరకకపోవడం, పాడిపరిశ్రమపై బడ్జెట్ లో తగు కేటాయింపులు జరగకపోవడం పాడిపరిశ్రమపై నీలినీడలు ప్రసరించడానికి కారణం అవుతోంది. కర్నాటకలో ఏటా 2000 కోట్లు ప్రోత్సాహకం ఇస్తుంది కాబట్టే, పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. తద్వారా నిర్వహణ ఖర్చులు అదుపులో ఉన్నాయి.
అదేవిధంగా తెలంగాణలో కూడా –
1) పాడి పశువులను సబ్సిడిపై ఇచ్చే పథకం అమలు
2) పాల ప్రోత్సాహకం విడుదల
3) సాంకేతిక వనరుల సరఫరా
4) పశు ఆరోగ్యంకై నిరంతర సేవలు
5) సంఘాల ఏర్పాటు అనివార్యం చేయడం
అనే పంచ సూత్రాలు అమలయితే పాల ఉత్పత్తి పెరిగి, జీవనోపాధులు మెరుగు కాగలవు.

మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ తెలంగాణ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

సహకార రంగాన్ని తెలంగాణాలో బలోపేతం చేస్తాం

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో సహకార వ్యవస్థ విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశిష్‌కుమార్, అదనపు కార్యదర్శి సిద్ధార్థ్ జైన్, సంచాలకుడు సత్య, రాష్ట్ర సహకార, పశుసంవర్ధక శాఖ కార్యదర్శులు సురేంద్ర మోహన్, ఇలంబర్తి, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో సహకార ఉద్యమం బలంగా ఉంది. సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో, గ్రామీణ స్థాయిలో ఆర్థిక సాధికారత కీలక పాత్ర పోషిస్తోంది. మెరుగైన పాలన, డిజిటల్ సమీకరణ, ఆర్థిక నిర్వహణ, సామర్థ్య వృద్ధి ద్వారా సహకార సంఘాలను పటిష్ఠం చేస్తున్నాం” అని తెలిపారు. ఆశిష్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక వసతుల నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read More

తెలంగాణలో 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

కేంద్ర పథకం కింద ఏర్పాటు

దేశంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌-ఎఫ్పీవో)ల ఏర్పాటు, ప్రోత్సాహక పథకం కింద తెలంగాణలో 311 సంఘాలు ఏర్పాటు కానున్నాయి. 2025లో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా 10వేల సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో తెలంగాణకు 311 కేటాయించింది. అన్నదాతల ఆదాయం పెంపు, పెట్టుబడి రాయితీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సభ్యులకు తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ, పంట ఉత్పత్తులశుద్ది, గిట్టుబాటు ధరలు కల్పించేలా మార్కెట్‌ అనుసంధానానికి ప్రస్తుతం దేశంలోని ఎఫ్పీవోలు కృషి చేస్తున్నాయి. ఇదే తరహాలో తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఎఫ్‌పీవోలో ఇలా..: కేంద్ర పథకం కింద ఎంపికయ్యే సంఘాలలో కనీసం 300 మంది సభ్యులు ఉండాలి. రూ.2 వేలు వాటాధనం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. సంఘం యాజమాన్య బోర్డులలో మహిళా రైతులు ప్రాతినిధ్యం ఉండాలి. సంఘాల సభ్యులకు వ్యాపార ప్రణాళికల తయారు, వాటి అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి సంఘానికి ఈక్విటీ గ్రాంట్‌ కింద కేంద్రం రూ.15 లక్షలు, నిర్వహణకు ఏటా రూ.6 లక్షల చొప్పున మూడేళ్లు గ్రాంటు ఇస్తుంది. కేంద్ర పథకం కింద ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ రూ.1500 కోట్లు కేటాయించారు. దీని కింద సంఘాలకు రుణాలు ఇస్తారు. ఇందులో 85 శాతం వరకు పూచీకత్తును కేంద్రం ఇస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)నే ఎఫ్‌పీవోలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమర్థంగా నడుస్తున్న పీఏసీఎస్‌లను ఎంపిక చేయాలని సహకార యూనియన్‌ను ఆదేశించింది.

Read More