జీడి, మిర్చి, మామిడి రైతుల ప్రయోజనాల కోసం బోర్డులు ఏర్పాటు చేయమని కేంద్రమంత్రిని కోరిన లోకేశ్
‘జీడిపప్పు ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రాసెసింగ్ వ్యవస్థ ఆధునికీకరణ, సరైన మార్కెటింగ్ కోసం జీడి బోర్డు అవసరం. మిర్చి బోర్డు ఏర్పాటైతే ధరల హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చు. రాష్ట్రంలో ఏటా దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. ఈ పంటలు సాగు చేసే రైతుల కష్టాలు తొలగడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో జీడి, గుంటూరులో మిర్చి, చిత్తూరులో మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రవాణిజ్యమంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి లోకేశ్ కోరారు. మూలపేట, చిలమత్తూరు, కుప్పం, దొనకొండల్లో 4 కొత్త పారిశ్రామిక నోడ్లను అభివృద్ధి చేసేందుకు అనుమతులివ్వాలి. నీరు, విద్యుత్తు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.5,811 కోట్ల గ్రాంట్ మంజూరు చేయండి. విజయవాడ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు నోడ్‌కు అనుమతివ్వాలి. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ల మాస్టర్ప్లాన్లు ఆమోదం పొంది, టెండర్లకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ఈపీసీ విడుదలకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆమోదం ఇప్పించండి’ అని విజ్ఞప్తి చేశారు.

