బయోచార్ తయారీ, వినియోగం మరియు వ్యవసాయంలో ప్రయోజనాలు

రైతు వ్యర్థంగా భావించే వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు, పప్పుధాన్యాల కాండాలు, కూరగాయ పంటల అవశేషాలు భూమికి అమూల్యమైన సహజ సంపద. వీటిలో సేంద్రియ పదార్థం, విలువైన పోషకాలు, నేల సారాన్ని పెంచే కార్బన్ సమృద్ధిగా ఉంటాయి. వాటిని కాల్చేస్తే ఈ సంపద మొత్తం నష్టపోతుంది. అదే శాస్త్రీయంగా వినియోగిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఎరువుల వినియోగం సమర్థవంతమవుతుంది, సాగు ఖర్చు తగ్గుతుంది.

రైతులు పంట అవశేషాలను కాల్చడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. ఒక పంట కోసిన వెంటనే మరో పంట వేయాల్సిన అవసరం, కూలీల కొరత, అవశేషాలను తొలగించడానికి అయ్యే అధిక ఖర్చు, యంత్రాల లభ్యత లేకపోవడం వంటి సమస్యలు వారిని ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి. కానీ తాత్కాలికంగా సమయం ఆదా చేసినా, దీర్ఘకాలంలో నేల సారాన్ని, పంట ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది.
అందుకే పంట అవశేషాలను కాల్చడం కంటే వాటిని కంపోస్టు, వర్మీ కంపోస్టు, మల్చింగ్, పశువుల మేత, బయోగ్యాస్ లేదా బయోచార్ రూపంలో వినియోగించడం ఉత్తమ పరిష్కారం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బయోచార్ సాంకేతికత నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నీటి నిల్వను పెంచడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది. పంట అవశేషాలను సమస్యగా కాకుండా విలువైన వనరులుగా మార్చుకునే ఈ సాంకేతికత రైతులకు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయానికి కొత్త దిశను చూపుతోంది.

బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.

  ప్రస్తుతం వాతావరణ మార్పులు, నేల సారం క్షీణించడం, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బయోచార్ ఒక స్థిరమైన పరిష్కారంగా గుర్తింపు పొందుతోంది. ఇది నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వాతావరణ అనుకూల మరియు సుస్థిర వ్యవసాయానికి కూడా కీలకమైన సాంకేతికతగా నిలుస్తోంది.

డ్రమ్ పద్ధతిలో బయోచార్ తయారి
చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో తక్కువ ఖర్చుతో బయోచార్‌ను 200 లీటర్ల సామర్థ్యం గల పాత ఇనుప డ్రమ్ సహాయంతో తయారు చేయవచ్చు. ముందుగా డ్రమ్ అడుగు భాగంలో మరియు కింది ప్రక్కవైపున కొద్దిపాటి గాలి ప్రవేశించేలా చిన్న రంధ్రాలు చేయాలి. అనంతరం పొడి పంట అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి డ్రమ్‌లో గట్టిగా నింపాలి. తరువాత డ్రమ్‌కు మూత బిగించి, మూత అంచులను బంకమట్టితో మూసివేయాలి. దీంతో డ్రమ్‌లోకి గాలి ప్రవేశించడం నియంత్రించబడుతుంది.

ఆ తర్వాత డ్రమ్‌ను పొయ్యి లేదా ఇటుకలతో ఏర్పాటు చేసిన మంటపై ఉంచి వేడి చేయాలి. సుమారు 20-25 నిమిషాల తర్వాత మూత అంచుల వద్ద నుంచి నీలిరంగు వాయువు విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో డ్రమ్‌లో ఉష్ణోగ్రత 300-400°C వరకు చేరుకొని పైరోలిసిస్ ప్రక్రియ పూర్తవుతుంది.

నీలిరంగు వాయువు విడుదల తగ్గిన తర్వాత మంటను ఆర్పివేయాలి. అనంతరం డ్రమ్‌ను జాగ్రత్తగా దించి నేలపై ఉంచాలి. వెంటనే అడుగు భాగంలోని రంధ్రాలను కూడా బంకమట్టితో మూసివేయాలి. దీంతో గాలి లోపలికి ప్రవేశించకుండా నిరోధించబడి, పంట అవశేషాలు పూర్తిగా బూడిదగా మారకుండా కార్బన్ రూపంలో నిల్వ చేయబడతాయి.

డ్రమ్‌ను సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మూతను తీసి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను చిన్న ముక్కలుగా లేదా పొడి రూపంలో తయారు చేయాలి. అనంతరం దీనిని కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి కొంతకాలం ఉంచిన తర్వాత పొలంలో ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
బయోచార్ తయారీలో ఆక్సిజన్ ప్రవేశం పరిమితంగా ఉండాలి. గాలి ఎక్కువగా ప్రవేశించినట్లయితే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

పంట వ్యర్థాలు పోషకాల గనులు

పంట వ్యర్థాలు… నేలకు జీవం. పొలంలో కలిపితే ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. పంట దిగుబడులూ పెరుగుతాయి. తగలబెడితే నేలకు నష్టం, భూమి వేడెక్కుతుంది. అందులోని సూక్ష్మజీవులూ చనిపోతాయి. పైగా కాలుష్యం మరో అతి పెద్ద సమస్య. టన్ను వరి గడ్డిని నేలలో కలిపేస్తే… 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం, 1.2 కిలోల గంధకంతోపాటు సేంద్రియ కర్బనం లభిస్తుంది. టన్ను మొక్కజొన్న గడ్డిలో 9.16 కిలోల నత్రజని, 2.08 కిలోల ఫాస్పరస్, 15.78 కిలోల పొటాషియంతోపాటు 5.17 కిలోల కాల్షియం, 3.62 కిలోల మెగ్నీషియం, 1.54 కిలోల సల్ఫర్ ఉంటుంది.

గతంలో వరి కోతల తర్వాత నూర్పిడి చేసి గడ్డిని పశువుల మేతగా ఉపయోగించేవారు.. మిరప, పత్తి, కంది తదితర పంటలు వ్యర్థాల్ని మండెలుగా పేర్చి వంట చెరకుగా వినియోగించేవారు. ఇప్పుడు అధికశాతం రైతులు యంత్రాలతోనే వరి కోయిస్తున్నారు. ఎల్పీజీ అందుబాటులోకి రావడంతో వంట చెరకు అవసరమూ తగ్గిపోయింది. దీంతో పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చివేస్తుండటంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. మొక్కజొన్న గడ్డి తగలబెట్టే సమయంలో మంటలు అంటుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తెలంగాణలోని హన్మ కొండ, ఏపీలోని పల్నాడు జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్నాయి. వ్యర్థాల్ని కాల్ౘ్డం కంటే నేలలో కలిపి దున్నేయడం వల్ల పంట దిగుబడులు పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది.

మొక్కజొన్న సాగు బాగా పెరిగింది
దేశంలో ఏటా 500 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70% వాటా.. వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలకు సంబంధించినవే. ఒక్క వరి పంట వ్యర్థాలే 34% ఉన్నాయి.. ఈ ఏడాది రబీలో ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 12.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు 4.2 టన్నుల నుంచి 6.2 టన్నుల పంట వ్యర్థాలు వస్తాయి. సగటున ఎకరాకు 5 టన్నుల చొప్పున చూసినా.. ఒక్క మొక్కజొన్న నుంచే 62.75 లక్షల టన్నుల వ్యర్థాలు వస్తాయి. తెలంగాణలోనూ 2024 సంవత్సరంతో పోలిస్తే 5 లక్షల ఎకరాలు పెరిగింది. రబీలో 17.72 లక్షల ఎకరాల్లో సాగైంది. పంట వ్యర్థాల్ని బయోమాస్ ప్లాంట్లకు తరలించవచ్చు. బయోచార్, ఇతర ఉత్పత్తులకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.

చాలా నష్టం

  • నేల పైభాగం నుంచి 15 సెం.మీ. లోతు వరకు వేర్లు అభివృద్ధి చెందుతాయి. అక్కడుండే నత్రజని, కర్బనాన్ని ఉపయోగించుకుంటాయి. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల ఈ పోషకాలు తగ్గిపోతాయి. మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
  • పంట వ్యర్థాల్ని తగలబెడితే.. అందులో నుంచి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, నైట్రసఆక్సైడ్, ఇతర హైడ్రోకార్బన్లు అందులో ఉంటాయి.
  • వరిగడ్డిని కాల్ౘ్ివేస్తే అందులో 70% కార్బన్‌డైఆక్సైడ్, 7% కార్బన్ మోనాక్సైడ్, 0.66% మీథేన్ విడుదలవుతాయి. గడ్డిలోని నత్రజని నైట్రస్ ఆక్సైడ్‌గా వెలువడుతుంది.
  • పొగ నుంచి వెలువడే కాలుష్యం ద్వారా క్యాన్సర్ కారకాలు వెలువడుతున్నాయని అనుమానిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
    ప్రోత్సాహం తప్పనిసరి
  • 2021 సంవత్సరంలో ఏర్పాటైన ‘వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ కాలుష్య నివారణకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలతో సమగ్ర విధానాన్ని పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో చిన్న, సన్నకారు రైతులకు పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను ఉచితంగా అందుబాటులో ఉంచాలని గతేడాది ఈ కమిషన్ ఆదేశించింది.
  • విద్యుత్ కేంద్రాలు పంట వ్యర్థాలతో చేసిన గుళికలను కనీసం 5% వాడాలని స్పష్టం చేసింది. అలా చేయ కుంటే.. అవి ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్తుపై పర్యావరణ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
  • మరోవైపు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చివేసే ఘటనలను కేంద్రం ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ ద్వారా పర్యవేక్షిస్తోంది. పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను రాయితీ ద్వారా అన్నదాతలకు అందజేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పంట వ్యర్థాల నిర్వహణపై రైతులను చైత న్యపరచాలి. పలు ప్రోత్సాహకాలు అందిస్తే వారు మొగ్గుచూపుతారు.
Read More

వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి అన్ని దేశాలు సహకరించుకోవాలి

వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో సంపన్న దేశాలు, వర్థమాన దేశాల మధ్య సత్వరం అంగీకారం కుదరకపోతే సమయం మించిపోతుందని 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్ 30) సభ అధ్యక్షుడు ఆందే కొరియా డు లాగో సోమవారం హెచ్చరించారు. వాతావరణ మార్పుల నిరోధం గురించి చర్చించడానికి, ప్రపంచ దేశాలతో సమన్వయం నెరపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్బన ఉద్గార రహిత అభివృద్ధి సాధనకు సంపన్న దేశాలు చేయూతనివ్వాలని వర్ధమాన దేశాలు కోరుతుంటే.. సంపన్న దేశాలు దానికి నిరాకరించడమే కాకుండా వర్ధమాన దేశాలు తమ పాట్లు తాము పడాలన్నట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాలుష్య కారక శిలాజ ఇంధనాల స్థానంలో జీవ ఇంధనాల వినియోగాన్ని బ్రెజిల్, భారత్లో పెద్ద ఎత్తున చేపట్టాయని వివరించారు. అయితే ఇది ఖరీదైన పరిష్కారమార్గం కాబట్టి.. దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు.

Read More