పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది
పశుసంవర్ధకంలో అధిక లాభాలు పొందాలంటే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా చాలా ముఖ్యం. ఒక ఆవు లేదా గేదె సమయానికి ఈనకపోతే రైతుకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యలలో చాలా వరకు సరైన పోషకాహారం లేకపోవడమే ప్రధాన కారణం.
పశువుల శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు శక్తి, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు నీరు సమతుల మోతాదులో అవసరం. వీటిని సమతుల ఆహారం లేదా బ్యాలెన్స్డ్ ఫీడ్ అంటారు. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పశువుల శక్తి అవసరాలను.
ప్రసవం ముందు మరియు తర్వాత ప్రత్యేక పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల పశువులు త్వరగా కోలుకుని మళ్లీ సమయానికి గర్భం దాల్చుతాయి. అలాగే పశువులకు క్రమం తప్పకుండా కృమినాశక మందులు వేయించడం, శుభ్రమైన నీరు అందించడం అవసరం.
- శక్తినిచ్చే ఆహారం: ధాన్యాలు, మక్కజొన్న, జొన్న, బార్లీ, గోధుమ పొట్టు వంటి పదార్థాలు పశువులకు శక్తిని అందిస్తాయి. పశువులకు తగిన శక్తి అందకపోతే అవి బలహీనంగా మారి, వేడి లక్షణాలు సరిగా కనిపించవు. గర్భధారణ శాతం కూడా తగ్గుతుంది. ప్రసవం తర్వాత శక్తి లోపం ఉంటే పశువులు తిరిగి గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- ప్రోటీన్ల ప్రాముఖ్యత: ప్రోటీన్లు శరీర కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు మరియు పునరుత్పత్తి అవయవాల పనితీరుకు చాలా అవసరం. నూనె గింజల పిండి, పత్తి గింజల పిండి, సోయాబీన్ మీల్, శనగ చొప్ప వంటి పదార్థాలు మంచి ప్రోటీన్ వనరులు. ప్రోటీన్ లోపం ఉంటే ఆడ పశువుల్లో అండోత్పత్తి సరిగా జరగదు. మగ పశువుల్లో వీర్య నాణ్యత తగ్గుతుంది.
- ఖనిజ లవణాలు పునరుత్పత్తిలో కీలక పాత్ర: కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి మాత్రమే కాకుండా గర్భధారణకు కూడా అవసరం. కాపర్, కోబాల్ట్, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ ఖనిజాలు పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటి లోపం వల్ల గర్భస్రావాలు, వంధ్యత్వం, పిల్లలు బలహీనంగా పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పశువులకు ప్రతిరోజూ మినరల్ మిక్చర్ ఇవ్వడం చాలా మంచిది.
- విటమిన్ల: ముఖ్యంగా విటమిన్ A, D మరియు E పునరుత్పత్తికి చాలా అవసరం.
విటమిన్ A లోపం వల్ల వేడి లక్షణాలు తగ్గిపోవచ్చు. విటమి+న్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ E మరియు సెలీనియం కలిసి పనిచేసి గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పచ్చి గడ్డి మరియు నాణ్యమైన మేతలో ఇవి సహజంగా లభిస్తాయి. - నీటి ప్రాముఖ్యతను: శుభ్రమైన నీరు సరిపడా ఇవ్వకపోతే ఆహారం జీర్ణం సరిగా కాదు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో జీవక్రియలు దెబ్బతిని పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వేసవికాలంలో మరింత ఎక్కువ నీరు అవసరం.
- గర్భధారణ సమయంలో పోషకాహారం : గర్భిణీ పశువులకు సాధారణ ఆహారంతో పాటు అదనపు పోషకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరైన ఆహారం ఇవ్వకపోతే పిల్ల బలహీనంగా పుడుతుంది. అలాగే ప్రసవం తర్వాత పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

ప్రసవం తర్వాత పశువుల సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం.ప్రసవం జరిగిన వెంటనే తగినంత నీరు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఖనిజ లవణాలు మరియు శక్తినిచ్చే ఆహారం ఇవ్వడం ద్వారా పశువు త్వరగా కోలుకుంటుంది. తద్వారా తిరిగి సమయానికి గర్భం దాల్చుతుంది.
- పచ్చిమేత ప్రాముఖ్యత :
నాపియర్ గడ్డి, జొన్న గడ్డి, మక్క సైలేజ్, లూసెర్న్ వంటి పచ్చిమేతల్లో మంచి పోషకాలు ఉంటాయి. పచ్చిమేత ఇవ్వడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. పునరుత్పత్తి సమస్యలు తగ్గుతాయి.
రైతు సోదరులారా,
పశువులలో కనిపించే అనేక పునరుత్పత్తి సమస్యలకు సరైన పోషకాహారం ద్వారానే పరిష్కారం లభిస్తుంది. సమతుల ఆహారం, మినరల్ మిక్చర్, పచ్చిమేత, పరిశుభ్రమైన నీరు మరియు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు ఉంటే పశువులు ఆరోగ్యంగా ఉండి సమయానికి ఈనుతాయి. దీంతో పాల ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం కూడా మెరుగుపడుతుంది.
పశువుల పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అనుగుణంగా కొన్ని సూచనలను కింద ఇవ్వడం జరిగింది
• పశువులకు సరైన సమయానికి, సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం వల్ల వేడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో చేయగలుగుతారు.
• ప్రసవం తర్వాత ఎక్కువకాలం ఈనకపోవడానికి ప్రధాన కారణాల్లో పోషకాల లోపం ఒకటి. సమతుల ఆహారం ఇవ్వడం ద్వారా “సర్వీస్ పీరియడ్” తగ్గుతుంది.
• అధిక పాల ఉత్పత్తి ఇచ్చే పశువులకు సాధారణ పశువుల కంటే ఎక్కువ శక్తి మరియు ప్రోటీన్లు అవసరం. లేకపోతే శరీర బరువు తగ్గి పునరుత్పత్తి సమస్యలు వస్తాయి.
• శరీర స్థితి స్కోర్ (Body Condition Score) సరైన స్థాయిలో ఉండాలి. చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా గర్భధారణ శాతం తగ్గుతుంది.
• పొడి దశలో (Dry period) సరైన పోషకాహారం ఇవ్వడం తదుపరి పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
• ప్రసవానికి ముందు “స్టీమింగ్ అప్” పద్ధతిలో క్రమంగా అదనపు కాంసన్ట్రేట్ ఆహారం ఇవ్వడం వల్ల ప్రసవం సాఫీగా జరుగుతుంది మరియు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
• గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడటానికి విటమిన్ E మరియు సెలీనియం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
• మినరల్ మిక్చర్ నిరంతరం ఇవ్వడం వల్ల “సైలెంట్ హీట్” సమస్యలు తగ్గుతాయి.
• పచ్చిమేతలో ఉండే సహజ విటమిన్లు మరియు ఖనిజాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.
• వేసవికాలంలో వేడి ఒత్తిడి (Heat stress) వల్ల పశువులలో గర్భధారణ శాతం తగ్గుతుంది. ఈ సమయంలో చల్లటి నీరు, ఆకుకూర మేత మరియు ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా అవసరం.
• సరైన ఆహారం ఇచ్చిన పశువుల్లో గర్భస్రావాలు తక్కువగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి.
• మగ పశువుల్లో కూడా పోషకాహారం చాలా ముఖ్యం. సరైన ప్రోటీన్, జింక్ మరియు విటమిన్లు ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
• కాల్షియం లోపం వల్ల ప్రసవానంతర సమస్యలు, ముఖ్యంగా మిల్క్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
• ఆహారంలో అకస్మాత్తుగా మార్పులు చేయకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతిని పునరుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
• సైలేజ్ మరియు హే వంటి నిల్వ మేతలను సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా సంవత్సరమంతా పోషకాహారం అందించవచ్చు.
• కృమినాశక మందులు వేయకపోతే పశువులు తీసుకునే పోషకాలు పూర్తిగా శరీరానికి అందవు. అందుకే క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయాలి.
• పరిశుభ్రమైన మేత మరియు నీరు ఇవ్వడం ద్వారా వ్యాధులు తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.
• పోషకాహారం సరైన స్థాయిలో ఉంటే పశువుల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి సమయానికి అండోత్పత్తి జరుగుతుంది.

అందువల్ల ప్రతి రైతు “పోషకాహారమే పశువుల పునరుత్పత్తికి పునాది” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Dr.K.Archana
Assistant Professor
College of Veterinary Science, Korutla

