పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే ట్రైకోడెర్మా విరిడె ద్రావణం
ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని రైతులే సులభంగా తయారు చేసుకునే పద్ధతిని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని 100 మి.లీ. సీసాల్లో నింపి వ్యవసాయ కార్యాలయాల ద్వారా రైతులందరికీ రూ. 20 కి. అందించనున్నారు. ఈ ఒక్కసీసా రూ. 40 వేల విలువైన 200కి. ట్రైకోడెర్మా విరిడె పొడితో సమానంగా పనిచేస్తుంది.
తయారీకి కావలసిన పదార్థాలు :
- 200 లీ. నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ లేదా సిమెంటు తొట్టి
- 200 లీ. నీరు * 2 కి. బెల్లం
- ట్రైకోడెర్మా విరిడె కల్చర్ (చిక్కని ద్రావణం) – 100 మి.లీ. సీసా
తయారీ పద్ధతి : నీడలో ఉంచిన డ్రమ్ములో 200 లీ. నీరు పోయాలి. 2 కిలోల బెల్లాన్ని పొడి చేసి నీటిలో వేసి కలిసేలా త్రిప్పాలి. సీసాలోని ట్రైకోడెర్మా విరిడె చిక్కని ద్రావణాన్ని బెల్లం కలిపిన నీటిలో పోసి కలియత్రిప్పాలి. డ్రమ్ముపైన మూత ఉంచాలి. ఉదయం, సాయంత్రం కర్రతో ఒక నిమిషం కలియత్రిప్పాలి. దీనిలో ట్రైకోడెర్మా విరిడె శిలీంద్రం విపరీతంగా పెరుగుతుంది. 4, 5 రోజులకు ద్రావణం వాడటానికి సిద్ధమౌతుంది.
ప్రతిసారి కొత్త సీసాలను కొనవలసిన అవసరం లేదు. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కలిపాక అందులో నుంచి 2 లీటర్ల ద్రావణాన్ని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ద్రావణం తయారు చేసుకునేటపుడు 2 కిలోల బెల్లంతో పాటు 200 లీటర్ల నీటిలో కలిపితే రెండు రోజుల్లో మళ్ళీ సిద్ధమౌతుంది. బెల్లం రంగులో వుండే నీరు 2 రోజులకు తెల్లగా మారుతుంది. ఈ ద్రావణం రెండేళ్ళు నిల్వ ఉంటుంది. వెంటనే ప్రభావం చూపుతుంది. తయారు చేసుకున్న 5 లీటర్ల ద్రావణాన్ని ఒక క్యాన్‌లో పోసి మూత పెట్టుకోవాలి. 200 లీ. నీటిలో 2 కిలోల బెల్లంతోపాటు ఈ 5 లీటర్ల ద్రావణం కలపాలి. రెండురోజుల్లో మళ్ళీ వాడుకోవచ్చు. 15 రోజులకొకసారి పిచికారి, నెలకోసారి సాగునీరు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వాలి.
ప్రయోజనాలు : విత్తనశుద్ధి : విత్తుకునే అరగంట ముందు విత్తనాలను ట్రైకోడెర్మా విరిడె ద్రావణంలో ముంచి తీయాలి. నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళడానికి : ఈ ద్రావణాన్ని పిచికారి చేస్తే పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది.
కంపోస్టు తయారీలో : చెట్ల నీడలో ప్లాస్టిక్ షీట్ పరచి దానిపై పంట వ్యర్థాలను పొరలా వేయాలి. 10 లీ. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఇలా 4Ð7 పొరల వరకు వేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేయాలి. ప్రతి 7 రోజులకోసారి కంపోస్టుని తిరగెయ్యాలి. 60 శాతం తేమ ఉండేలా చూడాలి. 40 రోజులకు కంపోస్టు సిద్ధమౌతుంది.
ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కర్ణాటక, కేరళ రాష్ట్రాల సేంద్రియ రైతులు పంటలు, తోటల్లో వాడుతున్నారు. దీనిని 1:1 నిష్పత్తిలో కలిపి 15 రోజులకోసారి ఎకరా పంటపై పిచికారి చేయాలి. పంటకు నెలకోసారి కాలువల ద్వారా సాగు నీటితో కలిపి పారించాలి లేదా డ్రిప్ / స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వవచ్చు. జీవామృతం ఇచ్చిన రోజునే ఈ ద్రావణాన్ని యిచ్చినా ఫర్వాలేదు. కానీ వేర్వేరుగా ఇవ్వాలి. భూమిలో నివసించే శిలీంద్రాల ద్వారా కలిగే మాగుడు తెగులు, వేరుకుళ్లు, ఎండు తెగుళ్లను సమర్దవంతంగా అరికడుతుంది.


