అంతరించిపోతున్న మామిడి రకాల సంరక్షణ
అంతరించిపోతున్న మామిడి రకాలు పండూరు వారి మామిడి, కోలంగోవ, రాజమాను, పాపారాజు గోవ, హైదర్‌సాహెబ్, ఫిరంగి లడ్డూ, పనుకులు, నల్ల ఆండ్రస్ లాంటి రకాలను రేపటి తరానికి అందించాలనే సంకల్పంతో ఏలూరు జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం సంరక్షిస్తోంది. ఇవే కాదు.. అరుదైన మొత్తం 24 మామిడి రకాలను జాగ్రత్తగా పెంచుతోంది. ఆయా చెట్లు ఎక్కడున్నాయో రైతుల ద్వారా తెలుసుకొని.. వాటి కొమ్మలు తెచ్చి పరిశోధనా స్థానంలో అంటుకట్టారు. ఇలా 2 నెలల కిందట ఒక్కో రకం మొక్కలు 120 చొప్పున అంటుకట్టి పెంచుతున్నారు. మంచి నాణ్యత, తెగుళ్లను తట్టుకునే వాటిని సేకరించి, సంరక్షిస్తున్నామని ఉద్యాన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. రాధారాణి తెలిపారు.


