బయోడైనమిక్ ఎరువు… కొమ్ము ఎరువు (500)

దీనిని తాజా ఆవు పేడను చనిపోయిన ఆవు కొమ్ములలో నింపి సారవంతమైన భూమిలో ఆకురాలుకాలం నుండి వసంత రుతువు వరకు పాతిపెట్టి తయారుచేస్తారు. తయారయిన కొమ్ము ఎరువు శక్తివంతమైన భూమి చైతన్య కారకం. దీనిని భూమిలో కాల్షియం చురుకుదనాన్ని, సూర్యుని / జీవ శక్తులను భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ శక్తులు విత్తనం మొలకెత్తడం, వేర్లు వృద్ధి చేయడం, మొక్క పెరగడంతోపాటు భూమిలో హ్యూమస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొమ్ము ఎరువును భూమి నిర్మాణానికి, భూమిలో ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు, వానపాములను పెంచుతాయి. ఎకరానికి 85 గ్రాముల కొమ్ము ఎరువుని సరిపడే నీటిలో కలిపి సవ్యదిశలో ఒక గంటసేపు కలిపి మధ్యాహ్నం తర్వాత భూమిపై సంవత్సరానికి కనీసం రెండుసార్లు వసంత ఋతువు, ఆకులు రాల్చే కాలంలో నీటి బిందువుల రూపంలో పిచికారి చేయాలి. కొమ్ము ఎరువు అసలైన బయోడైనమిక్ ఎరువు.

Read More

సూక్ష్మ జీవుల వృద్ధి కోసం… ఇ.ఎం. ద్రావణం

కావలసిన పదార్థాలు : మగ్గిన అరటి పండ్లు : 3 కిలోలు; బొప్పాయి పండ్లు (గింజలు తీసినవి) : 3 కిలోలు; గుమ్మడి పండ్లు (తొక్క తీసిన) : 3 కిలోలు; లేత కొబ్బరి నీరు : 300 మి.లీ.; కోడిగ్రుడ్లు : 2; నీరు : 10 లీటర్లు.

తయారు చేయు విధానం

  • పైన తెలిపిన పదార్థాలను (1, 2, 3) బాగా ముద్దగా చేసి ఒక కుండలో వేయాలి.
  • దానికి 10 లీ. నీటిని, 300 మి.లీ. లేత కొబ్బరి నీటిని మరియు 2 కోడిగ్రుడ్ల సొనని చేర్చాలి.
  • ఈ మిశ్రమాన్ని ఉంచిన కుండను గుడ్డతో కప్పి 45 రోజుల వరకూ నీడలో ఉంచాలి.
  • మధ్య మధ్యలో పై మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి. కషాయానికి 5 లీ. నీటిని చేర్చి పలుచని గుడ్డతో వడపోయాలి.
  • ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి.

ఎలా పనిచేస్తుంది?

  • పై ద్రావణంలో చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి భూసారం పెంచడంలో ఉపయోగపడతాయి.
  • ఈ ద్రావణంలో ఉన్న పోషకాల వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.
Read More

ఔషధ మొక్క…. శతావరి

శతావరి ఆకురాల్చే అడవులలో తరుచుగా చెట్ల క్రింద పెరుగుతూ కనబడుతుంది. ముళ్ళ పొదలు లేదా ఇతర పొదల మీద ప్రాకుతూ బహువార్షికంగా పెరిగే ముళ్ళ తీగ. ఆకులు సూదులలా ఉంటాయి. చిన్న, చిన్న కొమ్మలు గుంపులుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా 0.2 సెం.మీ. పొడవు కలిగి ఆకుల మొదళ్ళ నుండి గుత్తులుగా ఏర్పడతాయి. కాడలు కలిసి ఉంటాయి. పండ్లు గుండ్రంగా 0.4þ0.4 సెం.మీ. పరిమాణం కలిగి ఎర్రగా ఉంటాయి. వేర్లు సుమారు 100 వరకు ఉండి కండ కలిగి గుత్తులుగా తయారవుతాయి.

సాధారణ నామం : సీతమ్మజడ / ఆస్పరాగస్/పిల్లితీగలు / పిల్లిపీచర గడ్డలు / చందమామగడ్డలు శాస్త్రీయ నామం : ఆస్పరాగస్ రెసిమోసస్ కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో స్టిరాయిడ్లు, గ్లెåకోసైడ్స్ (ఆస్పరాగోసైడ్స్), బిట్టర్ గ్లెåకోసైడ్, ఆస్పరాజిన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దుంపలలో పిండిపదార్థం, మ్యూసిలేజ్ కూడా ఉంటాయి.
  • దీనిని బలవర్థకంగా, మూత్రం సులువుగా జారీ చేయడానికి ఉపయోగిస్తారు. వీర్యాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. తేనెతో తాజావేరు రసాన్ని కలిపి అజీర్ణ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల వ్యాధుల చికిత్సకు వాడే తైలాలలో దీనిని ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • శతావరి ఆకు మిథనాల్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీ. పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (నుస్రా అండ్ హరూన్, 2016).
  • శతావరి ఆకుల నీటి, అసిటోన్, ఇథనాల్ ద్రావణాలు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్లడ్‌సుగర్, ట్రైహలోస్‌పై విష ప్రభావాన్ని చూపాయి (గంగ, ఆమె అనుచరులు, 2017)
  • శతావరి ఆకుల ఇథనాల్ ద్రావణం బాసిల్లస్ ప్యుమిలిస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కెరిచియాకోలి, సూడోమోనాస్ ఈరూజినోసా, ప్రోటియస్‌వుల్గారిస్, స్టెఫైలోకోకసఆరియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కాండిడా ఆల్బికాన్స్ పెరుగుదలను అరికట్టింది (బిట్టు అండ్ కుమార్, 2010).
  • శతావరి ఆకుల ద్రావణం ఈడెసఈజిప్టీపై మస్క్యిటోసైడల్ ప్రభావాన్ని చూపింది. 65% వికర్షక చర్యను ప్రదర్శించింది (కండాగిల్ అండ్ సోమవర్షి, 2016).
  • శతావరి వేరు ద్రావణాలు పర్యావరణహిత పద్ధతిలో అనోఫిలస్ స్టెఫెన్సీ, ఈడిస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటస్ దోమలను వికర్షక చర్య ద్వారా నివారించాయి (గోవింద రాజన్ అండ్ శివశంకర్, 2015)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పొటాష్‌కు పొగాకు ద్రావణం

మొక్కల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే పొటాషియంను అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారుచేసే ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగకరం.

పొగాకు కాడలను ముక్కలుగా చేసుకుని ఒక కిలో కాడలకు ఏడు లీటర్ల నీటిని కలిపి ఏడు రోజుల పాటు నానబెట్టాలి. దీనివల్ల నీటిలో కరిగే పొటాష్ తయారవుతుంది. అరటి పండు ద్వారా కూడా పొటాష్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

లీటర్ నీటికి మూడుశాతం ద్రావణాన్ని కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పొటాష్‌తో పాటు తెగుళ్ల బెడద తగ్గుతుంది.

Read More

ఇటుకల కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.

Read More

పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

కోళ్లలో మైకోప్లాస్మోసిస్ వ్యాధి / దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి (సి.ఆర్.డి)

మైకోప్లాస్మా జాతి సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల సమూహాన్ని “మైకోప్లాస్మోసిస్” అంటారు. ఈ జాతి సూక్ష్మజీవులు సుమారుగా 17 రకాలున్నప్పటికీ, 2-3 రకాలు మాత్రమే కోళ్లలో వ్యాధిని కలిగిస్తాయి. అవి మైకోప్లాస్మా గాలిసెప్టికం(అన్ని రకాల పక్షులకు), మైకోప్లాస్మా సైనోవి (సాధారణ కోళ్ళు, టర్కీలు, పావురాలు), మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ (ప్రధానంగా టర్కీలకు). ఈ వ్యాధిలో ప్రధానంగా శ్వాసకోశ సంబందిత లక్షణాలు గమనిస్తాము మరియు దీర్గకాలికంగా ఉంటుంది. అందువలన దీనిని దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి లేదా క్రానిక్ రేస్పిరెటరి డిసీజ్ (సి.ఆర్.డి) అని అంటారు.

అన్ని వయస్సు కోళ్ళకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. శీతాకాలం వంటి చల్లగా వుండే మాసాల్లో మరియు ఇతర వ్యాధులైనటువంటి ఇ.కోలి, పాశ్చురేల్లోసిస్, ఇన్ఫేక్ట్చువస్ బ్రోoకిటిస్, కొక్కెర తెగులు సోకినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి ఉదృతంగా ఉంటుంది. వ్యాధి సోకిన కోడి ద్వారా, కలుషితమైన గాలి ద్వారా ఆరోగ్యకరమైన ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంది. షెడ్ లో కోళ్ళు కిక్కిరిసి వుండి, గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేకుండా ఉన్నప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన లిట్టర్, కోళ్ళ మూత్రం ద్వారా, కలుషితమైన దాణా,  త్రాగునీటి ద్వారా, ఇతర పక్షులు, కోడి పిల్లల బాక్సులు, పరికరాలు, గ్రుడ్ల ట్రే ల ద్వారా, టీకాలు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో పని మనుషుల ద్వారా , బ్రీడింగ్ ఫారాలలో వ్యాధి గ్రస్త పుంజుల వీర్యం ద్వారా, తల్లి కోడి అండాశయం నుండి గ్రుడ్డు ద్వారా కోడిపిల్లలకు వ్యాపిస్తుంది.

లక్షణాలు:
మైకోప్లాస్మా గాలిసెప్టికం బారిన పడిన బ్రాయిలర్ కోళ్లలో 4 వారాల తరువాత మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి బారిన పడిన లేయర్ కోళ్లలో వ్యాధి మెల్లగా వ్యాపిస్తుంది. సూక్ష్మక్రిమి కోళ్ళ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 11-18 రోజుల్లో లక్షణాలు కనబడతాయి. ప్రప్రథమంగా శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అందులోను మొదటగా శ్వాసనాళo పైభాగం ఆశించడం వలన శ్వాస తీసుకోవడం కష్టతరమై కోళ్ళు తల పైకెత్తి గాలి పీల్చుకుంటాయి. అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు కూతలు కూడా వినబడుతాయి. ఆ తర్వాత సుక్ష్మక్రిమి గాలిగదులు, శ్వాసనాళం కింది భాగాన్ని ఆశించినప్పుడు గాలి గదులు వాచిపోతాయి. శ్వాసనాళంలో నెమ్ము చేరడం వలన గురక శబ్దం వస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు నుండి నీరు కారుతూ ఉంటుంది. చిన్న పిల్లలలో 30% వరకు మరణాలు సంభవిస్తాయి. గ్రుడ్ల ఉత్పత్తి 20-30% తగ్గిపోతుంది. మేత వినియోగం తగ్గటం వలన పెరిగే కోళ్లలో పెరుగుదల రేటు తగ్గి బరువు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో నీళ్ళ విరోచనాలుంటాయి. ఇంకా పెరికార్దిటిస్, పెరిటోనిటిస్, పెరిహేపటైటిస్ తరచుగా కనబడతాయి.

మైకోప్లాస్మా సైనోవి తరచుగా 4-12 వారాల కోడిపిల్లలకు, అలాగే 10-12 వారాల టర్కీకోళ్ళకు సోకుతుంది. ఇది ప్రధానంగా కీళ్ళను ప్రభావితం చేయడం వలన కీళ్ళ వాపులు, కీళ్ళ మధ్యలో మరియు టేండాన్ పొరలలో తెల్లటి చిక్కటి ద్రవం చేరి, కోళ్ళు కుంటుతూ ఉంటాయి.

మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ వ్యాధి బారిన పడిన టర్కీ కోళ్ళలో శ్వాస కష్టమవటం, తక్కువ శరీర పెరుగుదల, మెడ మరియు కాళ్ళ కీళ్ళలో వాపు, గ్రుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం, పొదిగే గ్రుడ్ల నుండి పిల్లల ఉత్పత్తి తగ్గటం, అధిక మరణాలు సంభవించడం వంటివి గమనిస్తాము.

పోస్ట్ మార్టెం చేసి చూస్తే:
శ్వాసనాళం ఫైభాగంలో రక్తస్రావాలు ఉంటాయి. తెల్లటి జిగట పదార్ధం కనబడుతుంది. గాలి గదులు మందమై కందిపోయి జున్ను లాంటి పదార్ధం పేరుకొని ఉంటుంది. గుండె, కాలేయం మీద పలుచని పొర ఏర్పడుతుంది.
చికిత్స : వ్యాధి గ్రస్త కోళ్ళకు థయాముటిన్, టైలోసిన్ వంటి యాంటిబయోటిక్ మందులను త్రాగే నీళ్ళలో లేదా ఇంజక్షన్ రూపంలో 5-7 రోజులు వాడాలి. ఇవే కాకుండా ఆక్సిటెట్రాసైక్లిన్, క్లోర్టెట్రాసైక్లిన్ ను టన్ను దాణాలో 200-400 గ్రా. చొప్పున కలిపి కూడా వాడవచ్చు.

నివారణ :

  • పెద్ద కోళ్ళు, కోడి పిల్లలు ఒకే షెడ్లో కాకుండా వేర్వేరు షెడ్లలో ఉంచాలి. ఈ షెడ్లు దూరంగా, ఎడంగా ఉండాలి.
  • కొత్తగా పిల్లలు తెచ్చే ముందు, షెడ్లను పొటాషియం పెర్మంగానేట్ మరియు ఫార్మలిన్ ద్రావణంతో ఫుమిగేషన్ చేసి 2-3 వారాలు ఖాళీగా ఉంచాలి.
  • కోళ్ళ ఫారాలలో కోళ్ళు కిక్కిరిసి, గుమికూడి ఉండకుండా చూడాలి. అందుకొరకు సరిపోను స్థలం కేటాయించాలి.
  • అధిక చలి మరియు గాలి, వెలుతురు లోపం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కావున గాలి,వెలుతురు సక్రమంగా ప్రసరించేలా చూడాలి.
  • టీకాలు, ఏలికపాముల మందు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో కోళ్ళు ఒత్తిడికి గురికాకుండా చూడాలి.
  • పాత లిట్టర్ తొలగించి, అమోనియా వాయువును నివారించాలి.
  • వ్యాధితో మరణించిన కోళ్ళను కాల్చి వేయాలి. వ్యాధి సోకిన వాటిని వెంటనే వేరు చేయాలి.
  • వాహనాలు, దాణా బస్తాలు, క్రేట్లు, పరికరాల ద్వారా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి.
  • కోళ్ళ షెడ్లు మరియు పరికరాలను శుభ్రం చేయడానికి ప్రతిపాదిత క్రిమిసంహారణిలైనటువంటి ఫినోలిక్ ఆమ్లం, క్రెసాలిక్ ఆమ్లం, హైపోక్లోరైట్, 10% ఫార్మలిన్, 0.1% గ్లుటరాల్దిహైడ్, బ్లీచింగ్ పౌడర్ ను వాడాలి.

డా. టి. విజయ నిర్మల శాస్త్రవేత్త (పశువైద్య విభాగం), డా. ఎన్. శ్రీ విద్య రాణి శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా. బి.ఎస్. కాంతి శ్రీ శాస్త్రవేత్త (గృహ విజ్ఞాన విభాగం), డా. ఎస్. ఫిరోజ్ హుస్సేన్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. ఎం.బాలకృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట, వై.ఎస్.ఆర్. కడప జిల్లా-516173, డా. గోవిందరాజులు, ఎ.డి.ఆర్., ఆర్.హెచ్.ఆర్.ఎస్., తిరుపతి & డా. సి.హెచ్. రూత్, విస్తరణ సంచాలకులు, వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ : 8121136184

Read More

కలుపు మాయం… పాదులు సిద్ధం

ఉద్యాన పంటల్లో చెట్లచుట్టూ కలుపు తీయాలన్నా, పాదులు చేయాలనా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఎక్కువ మంది కూలీలు అవసరం. పంటలకు ధరలున్నప్పుడు రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలీలను పెట్టుకొని కలుపు తీయడం, పాదులు చేయించడం చేస్తారు. అదే ధరలు లేని సమయంలో ఈ పని తలకు మించిన భారం అవుతుంది. పంట దిగుబడికి ఈ పనులు తప్పనిసరి. అలాగే వదిలేస్తే చెట్లు బ్రతకకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.

ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చేందుకు ఒక ప్రత్యామ్నాయ పరికరాన్ని మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం తో తయారు చేసి ఈ పరికారానికి సుదర్శన్ వీడర్ గా పేరు పెట్టారు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణ రావు

ఉద్యానవన పంటల్లో అంతర్ కృషి పరికరం

ఈ పరికరం కోసం ఒక పొడవాటి ఇనుప పైపును తీసుకొని చక్రా కారం లో వంచి కింద బాగాన చిన్న పాటి కర్రులు అమర్చి వెల్డింగ్ ద్వారా అనుసంధానం చేసి పరికరాన్ని తయారు చేశారు, చెట్టు వద్ద 5 నిముషాలలో కలుపు, పాది రెండూ చేసుకోవచ్చు. ఉద్యానవన రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ట్రాక్టర్లు, ఎద్దుల సహాయంతో రైతులు ఉద్యాన పంటల్లో కలుపు తీసే కార్యక్రమం చేస్తుంటారు. అయితే చెట్టు పాది లో అంతర కృషి చేయాలంటే మనుషుల సహాయం అవసరం ఉంటుంది.

ఈ పరికరాన్ని చెట్టుకు అమర్చి ఒక వ్యక్తి చుట్టూ తిరగడం వల్ల గుంటక తరహాలో మడకలు భూమిని చదును చేయడంతో పాటు పాది ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు మిగులుతుంది. శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఒక్క మనిషి గంట వ్యవధిలోనే అర ఎకరా పొలం పూర్తి చేయవచ్చు.

దీనికి 4 వేల వరకు ఖర్చు వస్తుంది. చెట్టు సైజు ని బట్టి పరికరం ధర మారుతుంది.

రైతుల కోరితే వారికి తయారు చేసి ఇస్తారు. ఈ పరికరానికి పేటంట్ చేయడం జరిగింది. పేటెంట్ నెంబర్ :507641-001

ఈ పరికరం కోసం శ్రీ ఆంజనేయ స్మాల్ అగ్రి టూల్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రైతునేస్తం ముప్పా లక్ష్మణరావు, ఫోన్ : 9849140465 లో సంప్రదించగలరు.

Read More

ఎల్‌ నినో (El Nino) ప్రభావం మరియు పశువుల సంరక్షణ – సమగ్ర నివేదిక

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక తీవ్రమైన వాతావరణ మార్పు. దీని ప్రభావం వల్ల భారతదేశం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు మరియు తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయంతో పాటు పాడి మరియు మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, మరియు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

పశువులపై ఎల్‌నినో చూపే ప్రభావాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, మరియు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య, నివారణ చర్యల గురించి కింద వివరంగా వివరించబడింది:

  1. పశువులపై ఎల్‌ నినో చూపే తీవ్ర ప్రభావాలు

ఎ. ఉష్ణోగ్రత మరియు హీట్ స్ట్రెస్:
• ఎల్‌నినో సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6°C వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
• పశువులకు వాతావరణంలో ఉష్ణోగ్రత-తేమ సూచిక 68 కంటే తక్కువగా ఉంటే సురక్షితం. కానీ ఎల్‌నినో వల్ల ఈ సూచిక 79 కంటే ఎక్కువగా నమోదై, పశువులు భయంకరమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతాయి.
• మనుషుల లాగా పశువులకు చెమట పట్టే సామర్థ్యం చాలా తక్కువ. కాబట్టి వేడిని తట్టుకోవడానికి పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పశువు శరీరంలోని శక్తి మాంసం, పాలు ఉత్పత్తికి బదులుగా శ్వాస తీసుకోవడానికే వృథా అవుతుంది.

బి. రోగనిరోధక వ్యవస్థ క్షీణత మరియు వ్యాధులు:
• ఎల్‌నినో సమయంలో వాతావరణ ఒత్తిడి వల్ల పశువుల శరీరంలో కార్టిసోల్ మరియు ఏసీటీఎచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి.
• వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమారలు, మరియు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి.
• అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా మరియు వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి.

సి. పాడి ఆవులు, గేదెలపై ప్రభావం:
• ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
• తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. పాలలో కొవ్వు మరియు ప్రోటీన్ శాతం బాగా తగ్గిపోయి పాలు పలచబడతాయి.
• ప్రత్యుత్పత్తి వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. ఈస్ట్రోజెన్, ఎల్‌హెచ్ హార్మోన్ల స్థాయిలు పడిపోయి అండాల నాణ్యత దెబ్బతింటుంది.
• ఆవులు సైలెంట్ హీట్‌కు గురవుతాయి మరియు గర్భస్థ పిండాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
• ఒక పరిశోధన ప్రకారం, ఎల్‌నినో వల్ల కలిగే హీట్ స్ట్రెస్ సమయంలో ఆవులలో పిండాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చల్లటి వాతావరణంలో సజీవ పిండాల శాతం 59.2% ఉండగా, ఎల్‌నినో సమయంలో అది 38.2%కి పడిపోయినట్లు గుర్తించారు.

డి. మాంసం కోసం పెంచే పశువులపై ప్రభావం:
• సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరగడం ఆగిపోతుంది.
• తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గ్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది.
• దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది.

ఇ. నీరు మరియు పశుగ్రాస కొరత:
• ఎల్‌నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.
• చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు ప్రబలుతాయి.

  1. నివారణ మరియు యాజమాన్య చర్యలు

ఎ. పశుగ్రాస నిర్వహణ:
• ముందస్తు ప్రణాళిక: రాబోయే కరువు పరిస్థితులను (ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాస ప్రణాళిక చేసుకోవాలి.
• సైలేజ్ తయారీ: వర్షాకాలంలో లేదా పచ్చగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన గడ్డిని వృథా చేయకుండా “సైలేజ్” లేదా ఎండుగడ్డిగా నిల్వ చేసుకోవాలి.
• దాణా మరియు మేత కొలతలు: 400-500 కేజీల బరువుండే పశువుకు రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 కేజీల ఎండుగడ్డి (వరి గడ్డి లేదా జొన్న), 3-5 కేజీల దాణా విధిగా అందించాలి. పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలి.
• ప్రభుత్వ పథకాల వినియోగం: ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద, ప్రకృతి వ్యవసాయం కింద ఖాళీ భూముల్లో పచ్చగడ్డిని పెంచాలి. హరిత గోపాలం పథకం ద్వారా పశుగ్రాస క్షేత్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలి.
• పొలాల గట్లపై పెరిగే సహజమైన గడ్డిని నాశనం చేయకుండా పశువుల కోసం భద్రపరచుకోవాలి.

బి. దాణాలో మార్పులు మరియు సప్లిమెంట్లు:
• పశువులు ఎండ సమయంలో మేత తినలేవు, కాబట్టి వాతావరణం చల్లగా ఉండే ఉదయం (6-7 గంటలకు) మరియు సాయంత్రం (4-6 గంటలకు) సమయాల్లో మేత మేపాలి.
• మేతలో పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి.
• వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
• పశువులకు మినరల్ మిక్చర్ మరియు ఉప్పు ఎక్కువగా ఉండే దాణా అందించాలి. విటమిన్ సి, విటమిన్ బి1, మరియు ఎల్-కార్నిటైన్ కలిగిన పోషకాలు పశువులకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.

సి. నీటి నిర్వహణ:
• ఒక ఆవుకు రోజుకు కనీసం 40-60 లీటర్ల శుభ్రమైన తాగునీరు అవసరం, ఎండాకాలంలో ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. పశువులకు ఎల్లప్పుడూ చల్లటి, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.
• వ్యవసాయ క్షేత్రాల్లో పల్లపు ప్రాంతాల్లో ఫార్మ్ పాండ్స్ తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

డి. వసతి మరియు శీతలీకరణ:
• పశువుల పాకల పైకప్పుకు ఆస్బెస్టాస్ లేదా జింక్ రేకులు వాడకూడదు, ఇవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. కప్పులపై గడ్డి లేదా కొబ్బరి ఆకులు వేసి ఉంచాలి.
• గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. పాకలలో వేడిని తగ్గించడానికి ఫాగర్లు, మిస్ట్ డ్రాప్స్, లేదా స్ప్రింక్లర్లు తో పాటు ఫ్యాన్లు ఉపయోగించి సూక్ష్మ వాతావరణాన్ని చల్లగా ఉంచాలి. క్లోజ్డ్ హౌస్ పద్ధతిని వాడితే కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

ఇ. ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాక్సినేషన్:
• ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ముందే పశువులకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, మరియు జబ్బవాపు లకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
• పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు త్రాగించాలి. పాకల్లోకి పేలు, గోమారలు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి.
• పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
• ఉరుములు, పిడుగులు పడే సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకూడదు. అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు పశువులను బలవంతంగా లాగడం చేయకూడదు.
పై విధానాలను సూక్ష్మస్థాయిలో ప్రణాళికబద్ధంగా పాటిస్తే, ఎల్‌నినో లాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సైతం పశుగ్రాస కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం పశువైద్యాధికారిని సంప్రదించడం అత్యంత కీలకం.

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప. Ph: 94945 88885

Read More

పచ్చిరొట్ట ఎరువులు – ప్రాముఖ్యత

పంటలకు అవసరమయ్యే పోషకాలు సేంద్రియ రూపంలో సమర్ధవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే మడిలో ముందే వేసుకోవాలి. తక్కువ వనరులతో బాగా పెరిగే పంటలను సుమారు 2 నెలల ముందే మడిలో విత్తుకోవాలి, ఆ పంట పూతకువచ్చే సమయంలో భూమిలో కలియదున్నాలి. ఈ పంట భాగాలు నేలలోని తేమ సరిపడినంత ఉన్నప్పుడు త్వరగా కుళ్ళిపోతాయి. దున్నిన 2-3 వారాలకు బాగా కుళ్ళటం వల్ల విడుదలయిన పోషకాలు అప్పుడు మడిలో విత్తిన ముఖ్యపంటకు అందుతాయి. ఉదా: జనుము, పెసర, మినుము, బఠాణి, ఉలవలు.

దబోల్కర్ పద్ధతి
భూసారం పెంచుకోవటానికి మన ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రకి చెందిన శ్రీపాద దబోల్కర్ అనే శాస్త్రవేత్త కొన్ని సూచనలు చేశారు.
ధాన్యపు గింజలు : 5 కేజీలు (మొక్కజొన్న, జొన్న, సజ్ౙ, తైదలు, రాగులు మొ….)
పప్పు గింజలు : 5 కేజీలు (మినుములు, పెసలు, శనగలు, కంది, అలసంద మొ….)
నూనె గింజలు : 5 కేజీలు (నువ్వులు, వేరుశనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, మొ…)
సుగంధ ద్రవ్యములు : 50 గ్రాములు (ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర మొ…)
పచ్చిరొట్ట పంట విత్తనాలు : 5 కేజీలు (జనుము, జీలుగ, అవిశ, పిల్లిపెసర మొ॥)

దుక్కి దున్ని మండలాగిన తరువాత ఈ విత్తనాలన్నీ కలగలిపి ఎకరానికి 20-25 కిలోలను చల్లుకోవాలి. 45 రోజుల వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నాలి.

ఇలా చేయడం వల్ల పంటకాలం నష్టపోతామని భావించినట్లయితే రైతులు తమ పొలాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని, ఏటా ఒక భాగంలో ఈ పద్ధతి పాటిస్తూ కొద్ది సంవత్సరాలలో మొత్తం పొలాన్ని సారవంతంగా చేసుకోవచ్చు.

పచ్చి ఆకు ఎరువులు
పచ్చిరొట్ట పంట వేసుకోవటం కుదరని పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న చెట్ల ఆకులను, లేత కొమ్మలను తీసుకువచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు ఎరువులు అందించే పద్ధతి.
పచ్చి ఆకు ఎరువుగా ఉపయోగపడే మొక్కలు గ్లైరిసీడియా, కానుగ, మోదుగ, సీతాఫలం, వెంపలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్ల మీద ఈ మొక్కలను నాటుకుంటే సాగు భూమికి ఎరువు అవసరాలు సులువుగా అందించవచ్చు.

వరిపొలాలలో వేసుకునేందుకు అనువైన పప్పుధాన్యాలు – పెసర, అలసంద, శనగ, సోయాచిక్కుడు, వేరుశనగ, కంది.

వరి పొలాలలో అనువైన పశుగ్రాస పంటలు – సిరట్రో, క్లైటోరియా, టెస్మాంథస్, జనుము, చిక్కుడు. వరి పొలాలలో సాగుకు అనువైన పచ్చిరొట్టనిచ్చే పంటలు – జీలుగ, జనుము.

Read More
  • 1
  • 2