పత్తి రైతులకు వరం ‘కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌

కేంద్ర కేబినెట్ కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌కు రూ.5,659.22 కోట్ల వ్యయంతో ఆమోదం తెలపడం దేశంలోని పత్తి రైతులకు వరం లాంటిదని భాజపా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. “ఈ మిషన్ పత్తి ఉత్పాదకతను పెంచడంతో పాటు, ప్రపంచ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పంట క్షేత్రం నుంచి విదేశాల వరకు (ఫాం టు ఫారిన్) అనే లక్ష్యానికి అనుగుణంగా రైతులు, పరిశ్రమ, సాంకేతికత ఎగుమతులను అనుసంధానిస్తుంది. సుమారు 32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా ఈ మిషన్ కొనసాగుతుంది అని రామచందర్రావు అన్నారు.

Read More

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

పీఎం ఆషా పథకం కింద మొక్కజొన్న రైతులకు నేరుగా ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలని.. ఏపీని ప్రత్యేకంగా పరిగణించి ధరల వ్యత్యాసంలో 100% కేంద్రమే భరించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,700 మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర రూ. 2,400 కంటే ఇది చాలా తక్కువ. రోజురోజుకు ధరలు పడిపోతున్నాయి’ అని వివరించారు. ‘రాష్ట్రంలో 42.06 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 14.26 లక్షల టన్నుల పంట కోత దశలో ఉంది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారు. నాఫెడ్, ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలి. జూన్ 2026 వరకు పథకాన్ని పొడిగించాలి’ అని సీఎం కోరారు.

Read More

ఏపీ మష్రూమ్ మిషన్‌కు కార్యాచరణ

ఆంధ్రరాష్ట్రంలో రూ. 12,960 కోట్లతో ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31 అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రాజెక్టు అమల్లో భాగంగా 40% రాయితీ అందిస్తారు. పొదుపు సంఘాల మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పుట్టగొడుగులను కూడా వ్యవసాయ ఉత్పత్తిగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని అధికారులు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఏడాదికి లక్ష టన్నుల ఉత్పత్తి సాధించాలని సీఎం నిర్దేశించారు. రాయలసీమ ఉద్యానహబ్‌లో భాగంగా ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన వాతావరణానికి అనుకూలమైన మిల్కీ, వరి గడ్డి ఆధారిత రకాల నుంచి బటన్ మష్రూమ్ రకాల సాగును ప్రోత్సహిస్తారు. రోజుకు 10 టన్నుల సామర్థ్యంతో కూడిన యూనిట్లతో పాటు చిన్న యూనిట్లకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పాలసీ కింద ఏపీ మష్రూమ్ మిషన్ ద్వారా ప్రోత్సాహకాలిస్తారు. పుట్టగొడుగుల ఉత్పత్తిలో (ఏటా 45 వేల టన్నులతో) బిహార్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్త ఉత్పత్తిలో 11% ఆ రాష్ట్రానిదే. బటన్, ఆయిస్టర్, మిల్కీ రకాల సాగులో అగ్రస్థానంలో ఉంది. బిహార్ తర్వాత స్థానాల్లో ఒడిశా, మహారాష్ట్ర, హరియాణ, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. దేశీయ ఉత్పత్తిలో వైట్‌బటన్ వాటా అధికం. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ముందంజలో ఉంది. 2023-24 గణాంకాల ప్రకారం అక్కడ ఏడాదికి 16 వేల టన్నులు ఉత్పత్తి అవుతోంది.

ఏపీ పుట్టగొడుగుల మిషన్
వార్షిక ఉత్పత్తి లక్ష్యం: 67,500 టన్నులు
అవసరమైన స్థలం: 81 కోట్ల చదరపు అడుగులు
యూనిట్ల సంఖ్య (ఒక్కోటి 5 వేల అడుగులు):1,62,000
మొత్తం పెట్టుబడి అంచనా: రూ. 12,960 కోట్లు
రాయితీ (40%): రూ. 5,184 కోట్లు
కేంద్రం వాటా (60%): రూ. 3,110 కోట్లు
రాష్ట్ర వాటా (40%): రూ. 2,074 కోట్లు

Read More

మొక్కజొన్నను ధరల మద్దతు పథకంలో చేర్చాలి

కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నను ధరల మద్దతు పథకం (ప్రైజ్ సపోర్ట్ స్కీమ్)లో చేర్చి, సగం పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సోమవారం లేఖ రాశారు. ప్రస్తుత సీజన్‌లో సుమారు 11,21,494 ఎకరాల్లో పంట సాగు కాగా.. దాదాపు 29.79లక్షల టన్నుల దిగుబడి రానుంది.
మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న ప్రస్తుతం క్వింటాలు సగటు ధర రూ.1,759 పలుకుతుండగా.. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400తో పోలిస్తే ఇది రూ. 641 తక్కువ. రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం 92 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటివరకు 65వేల టన్నులు కొనుగోలు చేసింది. మార్కెట్లో అనిశ్చితి వల్ల ధరలు పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్నను పీఎసఎస్ కింద చేర్చి, మొత్తం ఉత్పత్తిలో 50% కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

Read More

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో ఆయిల్‌పామ్‌లో మంచి ఫలితాలు

తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగులో ఆధునిక సాంకేతికతను, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇక్రిశాట్‌లో 100 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్‌లో నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి రకాల వృద్ధి, హైబ్రిడ్ సృష్టికి ఇందులో పరిశోధనలు జరగనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోసం భారత్ ఆయిల్‌పామ్ పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్) ని సైతం భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో 2.91 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఏటా రెండు లక్షల ఎకరాల పెంపుదలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రభుత్వ రంగంలో ఆయిల్‌ఫెడ్, ప్రైవేటు రంగంలో 14 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయిల్‌పామ్ సాగుకు సబ్సిడీలను ఇస్తోంది. ఇంత చేస్తున్నా ఆశించిన స్థాయిలో సాగు పెరగడంలేదు. ఈ నేపథ్యంలో ఆయిల్షామ్ సాగుకు ఏర్పడుతున్న అడ్డంకులను ప్రభుత్వం అధ్యయనం చేయించి, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

Read More

ఈ-నామ్ 2.0పై పూర్తి స్థాయి శిక్షణ అవసరం

కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ-నామ1.0ను ప్రవేశ పెట్టింది. దీన్ని మరింత వృద్ధి పరిచి ఈ ఏడాది ‘ఈ-నామ్ 2.0’ను తీసుకొచ్చింది. అయితే, సిబ్బందికి కనీసం శిక్షణ ఇవ్వకుండా అమలు చేయడంతో పంట నమోదులో తప్పిదాలు (ఎర్రర్) చూపించడం, బిడ్డింగ్ సమస్యలు, ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల లాగిన్లలో ఇబ్బందులు, రైతులకు మంచి ధర వచ్చే అవకాశం లేకపోవడం, ఒక్క రోజులో పూర్తయ్యే అమ్మకాలకు మూడు రోజులు పట్టడం వంటి ప్రధాన సమస్యలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 27న ఈ-నామ్ 2.0 ప్రవేశపెట్టగా లాట్ల కేటాయింపులు జరగకపోవడంతో అధికారులు నిజామాబాద్ మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టగా రైతులు క్వింటాకు రూ. వెయ్యి వరకు నష్టపోయారు. తాజాగా శుక్రవారమూ అదే పరిస్థితి ఎదురైంది. యార్డుకు 30 వేల బస్తాల పసుపు రాగా ఉదయం 8 గంటల నుంచి అధికారులు తీవ్రంగా శ్రమించాక వెయ్యి బస్తాలకు మాత్రమే లాట్లు ఇవ్వగలిగారు. తర్వాత సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తడంతో గత్యంతరం లేక బహిరంగ వేలం ప్రారంభించడంతో వ్యాపారులు పంట కొనుగోలు చేశారు. వేలం విధానంలో సాధారణంగా కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులకు మాత్రమే లాభం ఉంటుంది. వారు నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వస్తుంది. సిబ్బందికి ఈ-నామ్ 2.0 పై పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి… సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాతే అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Read More

మొక్కజొన్న పంట ఉత్పత్తి మొత్తానికి సాయం అందించాలి

ఆంధ్ర రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించడంతోపాటు.. 100% పంట ఉత్పత్తికి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ‘2025-26 రబీలో రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. 37.61 లక్షల టన్నుల దిగుబడి లభిస్తుందని అంచనా. అత్యధికంగా నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఎన్టీఆర్, కర్నూలు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగైంది. రబీ పంట జూన్ వరకు చేతికొస్తోంది. అధిక ఉత్పత్తి కారణంగా, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కు వగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతారు’ అని లేఖలో చంద్రబాబు వివరించారు. కర్షకుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని 50:50 నిష్పత్తిలో కాకుండా మొత్తం కేంద్రమే భరించాలని, మొత్తం పంట ఉత్పత్తిలో 25% మాత్రమే కాకుండా 100% ఉత్పత్తికి సాయం అందించాలని పేర్కొన్నారు. జూన్ వరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More

పంటల సాగుకు అందించే రుణ పరిమితి పెంపు

వివిధ రకాల పంటల రుణాల పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి పెంచుతూ రాష్ట్రంలోని బ్యాంకులకు తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖలు, అగ్రి, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, నాబార్డు, బ్యాంకుల అధికారులతో కూడిన సాంకేతిక కమిటీ సమావేశమై 127 రకాల పంటల వ్యయాలు, రైతుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి సిఫార్సులు చేయగా.. రుణ పరిమితిని ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించింది.


వరి – రూ.48 వేలు, పత్తి – రూ.52 వేలు, మొక్కజొన్న – రూ.38 వేలు,
వేరుశనగ – రూ.34 వేలు, మిర్చి – 90 వేలు, చెరకు – 84 వేలు.

Read More

రుణభారం తెలంగాణ రైతులకు తక్కువ

వివిధ రాష్ట్రాల్లో రైతులకు ఉన్న అప్పుల మొత్తంపై తమిళనాడు ఎంపీ ఎ. రాజా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు వ్యవసాయ ప్రధానమైన కర్ణాటక, తమిళనాడు, ఏపీ లతో పోలిస్తే తెలంగాణలో రైతులకు రుణభారం తక్కువగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘2025 డిసెంబరు 31 నాటికి తమిళనాడు రైతులపై రూ.5,06,290.45 కోట్లు, ఏపీ రైతులపై రూ. 3,75,254. 59 కోట్లు, కర్ణాటక రైతులపై రూ.2,10,244.47 కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇదే సమయంలో తెలంగాణ రైతులపై రూ.1,75,960. 56 కోట్ల అప్పు మాత్రమే ఉందని చెప్పారు. రైతు రుణభారంపై జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) 2025 డిసెంబరు 31 నాటికి కటాఫ్ డేట్‌గా తీసుకొని ఈ వివరాలు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.

Read More

పురుగు మందుల నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం

మనదేశంలో పురుగు మందులు వినియోగిస్తే కొన్నిసార్లు పురుగులు కాకుండా పంటలు నాశనమవడం, తెగుళ్లపై ఎలాంటి ప్రభావం కనిపించకపోవడం, రైతులు మరణించడం, పర్యావరణానికి తీవ్ర హాని జరగడం సర్వసాధారణంగా మారింది. మరోవైపు ఈ విపరిణామాల బాధ్యులు చట్టం నుంచి సులువుగా తప్పించుకుం టున్నారు. ఈ ధోరణిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నాణ్యతకు, ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ… వాటిని ఉల్లంఘించిన వారికి రూ. అర కోటి జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నూతన పురుగు మందుల నిర్వహణ (పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్) చట్టం తెస్తోంది. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు తెలపాలంటూ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. రైతులు, పౌరసమాజం సైతం సూచనలు చేయడానికి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. ముసాయిదా బిల్లును మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ agriwelfare.gov.inలోనూ ఉంచింది.
కేంద్రానికి సర్వాధికారాలు
ప్రస్తుతం అమలులో ఉన్న పురుగు మందుల చట్టం(1968), పురుగు మందుల నిబంధన(1971)ల్లో ఉన్న లోపాలను సవరించడానికే కొత్త చట్టం తెస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ‘పురుగు మందుల తయారీ, అమ్మకం నుంచి వాడకం వరకు పారదర్శకతను తీసుకురావడం, రైతులకు నాణ్యమైనవే అందేలా చూడటం, వాటి ప్రమాణాలు గుర్తింపు సామర్థ్యం పెంచడం, నకిలీలను నియంత్రించడం, కఠిన జరిమానాలు విధించడం, తయారయ్యే ప్రతి మందునూ ప్రయోగశాలల్లో పరీక్షల అనంతరమే ధ్రువీకరించడం, జీవ పురుగు మందుల వినియోగాన్ని ప్రోత్సహించడం, మానవులు, జంతువులు, పర్యావరణానికి కలిగే ముప్పును తగ్గించడం, స్వదేశీ తయారీ భారీఎత్తున పెంచడం” తమ లక్ష్యాలని వెల్లడించింది. ఈ చట్టం అమలులోకి వచ్చాక దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తాయి.
తయారీదారులు ప్రమాణాలు పాటించాలి
పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీలను డబ్బాపై ముద్రించాలి. తయారీ సంస్థ పేరు, చిరునామా, ఉత్పత్తి స్థలం, వాడిన రసాయనాలు, ఇతర వివరాలుండాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే ఉత్పత్తి జరగాలి. క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు వెల్లడించే సాంకేతికతను వినియోగించాలి.
ఉల్లంఘిస్తే శిక్ష
పురుగు మందుల రసాయన మిశ్రమంలో మార్పులు ఉండి, ప్రభావాన్ని చూపలేకపోయినా, రైతుల ఆరోగ్యానికి హాని కలిగించినా, నాణ్యత తగ్గించేలా ఇతర పదార్థాలు కలిపినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించి పురుగుమందుల తయారీ, దిగుమతి చేసుకున్నా… వాటి విక్రయంతో ఎవరైనా మృతి చెందినా, తీవ్రంగా గాయపడినా… ఉత్పత్తిదారుడు, సంస్థను బాధ్యులుగా పరిగణిస్తారు. వారికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, లేదంటే రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఒకేసారి రెండూ విధించొచ్చు. రెండోసారి నేరం చేస్తే… మొదటిసారి విధించిన జరిమానా కంటే రెట్టింపు జరిమానా వేస్తారు. మూడోసారి నేరం చేస్తే… సంబంధిత సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్స్ శాశ్వత రద్దుకు పెస్టిసైడ్ ఇన్‌స్పెక్టర్ సిఫార్సు చేస్తారు. జరిమానాను చెల్లించకుంటే రిజిస్ట్రేషన్ కమిటీ ఇచ్చే రికవరీ సర్టిఫికెట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆ మొత్తాన్ని భూమి శిస్తు బకాయిల్లా వసూలు చేస్తారు. అవసరమైతే ఆస్తిని జప్తు చేస్తారు.

Read More
  • 1
  • 2