రైతులకు ఈ ఏడాది వ్యక్తిగత యంత్రపరికరాలు ఇవ్వాలని.. డ్రోన్ల వినియోగం పెంచాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు కేటాయించింది. రూ87.50 కోట్లతో 875 యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి 40% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్నారు. డ్రోన్ల సాంకేతికతను ప్రోత్సహించేందుకురూ.35 కోట్లు, ఆర్‌కేవీవై పథకాలకు రూ.1,061 కోట్లు కేటాయించారు. 2024-25 ఏడాదిలో 4.50 లక్షల మట్టి నమూనాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీనికి రూ. 18.35 కోట్లు కేటాయించారు. డ్రై కెమిస్ట్రీ విధానంలో చేపట్టనున్న ఈ పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగించనున్నారు. ఆల్ఫా స్ప్రెక్ట్రోస్కోపి ద్వారా మట్టి నమూనాలను స్ప్రెక్టల్ లైబ్రరీలో భద్రపరుస్తారు. వాటి ఆధారంగా తర్వాత ఉపగ్రహ చిత్రాలతో మట్టి నమూనాలను విశ్లేషించి, రియల్‌టైమ్‌లో కృత్రిమ మేథ ద్వారా ఫలితాలు రాబడతారు.
రైతులకు మరింత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్‌లను అందించాలని డ్రోన్‌ల తయారీదారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఒకే దఫాలో ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీతో పాటు పైరు ఎదుగుదలను పరీక్షించేలా డ్రోన్‌ల సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నారు. దాని వల్ల రైతులకు ఖర్చు తగ్గుతుందని నిన్న జరిగిన డ్రోన్‌ల సమ్మిట్‌లో ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా పాల్గొన్నారు.
దిల్లీ, కాన్పుర్, రోపార్‌లలో ఉత్కృష్ట కేంద్రాల ప్రారంభం
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం.. సుస్థిర నగరాల అభివృద్ధి కోసం కేంద్ర విద్యాశాఖ భారీ కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు దిల్లీ, కాన్పుర్, రోపార్‌లలో ఉత్కృష్ట కేంద్రాల (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)ను వర్చువల్ పద్ధతిలో మంగళవారం ప్రారంభించింది. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఈ కేంద్రాలు సూచించిన పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించనున్నాయి. ఇందులో భాగంగా పరిశోధనలు, అంకుర సంస్థలకు తోడ్పాటు కోసం వచ్చే నాలుగేళ్లలో రూ. 990 కోట్లు ఖర్చుచేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పంజాబ్, హరియాణా సహా రైతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయం లాభసాటిగా మార్చే పరిశోధనలను ఐఐటీ రోపార్ ఉత్కృష్ట కేంద్రం పర్యవేక్షించనుంది.
రైతుల ఆదాయం, ఆహార భద్రతను మెరుగు పరిచేందుకు కేంద్రం పీయం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నత యోజన పథకాలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకోసం 1,01,321 కోట్ల రూపాయలు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించినట్లు మంత్రి పేర్కొన్నారు. పీయం-ఆర్‌కేవీవైలో భాగంగా నేల సారం, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీకరణ… వంటి వివిధ చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని నిర్ణయించాం అని మంత్రి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో దేశానికి స్వావలంబన చేకూర్చేందుకు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ ఏర్పాటుకు రూ. 10,103 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ఈ మిషన్ ద్వారా రానున్న ఏడేళ్ళలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం అని మంత్రి అన్నారు. ఈ మిషన్‌లో భాగంగా నూనెగింజల సాగును 40 లక్షల హెక్టార్లకు విస్తరించనున్నాం అని మంత్రి చెప్పారు.
ఏనుగులు మందలుగా విరుచుకుపడి పంటల్ని సర్వనాశనం చేయడం, మనుషుల్ని తొక్కి చంపడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఏనుగులు దాడిచేసి పంటలను నాశనం చేశాక వాటిని తరమడం కంటే వాటి రాకను ముందే గుర్తించి అప్రమత్తమైతే చాలావరకు నష్టాన్ని నివారించగలుగుతాం. ఈ దిశగా కేరళలోని అమృత యూనివర్సిటీ ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ని ఉపయోగించి ‘అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీ’ని రూపొందించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జీపీఏఐ సదస్సులో దానికి సంబంధించిన త్రీడీ నమూనాను ప్రదర్శించింది. ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. రాత్రిపూట పనిచేసేందుకు వీలుగా ఇన్‌ఫ్రారెడ్ సపోర్ట్ ఉన్న కెమెరాలు వాడతారు. వాటిలోని సెన్సర్లు కెమెరా పరిధిలోకి వచ్చే జంతువుల కదలికల్ని గుర్తిస్తాయి. అవి ఏనుగులయితే అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఎటువైపు వెళ్తున్నాయి? వంటి వివరాలన్నీ కొన్ని సెకన్ల వ్యవధిలోనే విశ్లేషించి మెసేజ్ రూపంలో స్థానికులకు, రైతులకు మొబైల్ ఫోన్లలో పంపిస్తాయి. ఏనుగుల ఫోటోలు, వీడియోలు 5-10 సెకన్లలో అటవీశాఖ అధికారులకు చేరతాయి. కాబట్టి అవసరమైన చర్యలు వెంటనే తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి.
ఈ నెల 22, 23 తేదీల్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కీలక శిఖరాగ్ర సభ ‘ఫూచర్ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగెన్ (నెదర్లాండ్స్)కు చెందిన డాక్టర్ ప్రజల్ ప్రధాన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఒక అధ్యయనం నిర్వహించింది. నగరాలు, నగర పరిసర ప్రాంతాల్లో ఇళ్ళపైన, ఖాళీ స్థలాలలో చేపట్టే వ్యవసాయ కార్యకలాపాలనే అర్బన్ అగ్రికల్చర్‌గా చెప్పవచ్చు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ళు, చేపల పెంపకం.. వంటి కార్యకలాపాలన్నీ ఈ అర్బన్ అగ్రికల్చర్ కోవలోకే వస్తాయి. ‘అర్బన్ అగ్రికల్చర్’ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. కాని ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను పాటించగలిగినప్పుడే దాని ప్రయోజనాలు ఒనగూడతాయని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ స్పష్టం చేశారు. అర్బన్ అగ్రికల్చర్ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించడంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు సుస్థిరత ఎలా ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపించింది అని డాక్టర్ ప్రధాన్ వివరించారు.
మనది వ్యవసాయక దేశం. ఒకప్పుడు 90 శాతానికి పైగా, ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవితాలను కొనసాగిస్తున్నారు. స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తూ పంటలు సాగు చేసి ప్రజల ఆకలిని తీర్చే చాలామంది రైతులు తమ కడుపులను కాల్చుకొంటున్నారనే విషయం అక్షర సత్యం. వ్యవసాయం చేసి పంటల సాగు చేస్తున్నారు కాని ఎక్కువమంది రైతులు తమ పంటలసాగులో ఆర్థికంగా నష్టాలను భరించవలసి వస్తుంది. పంటలసాగు లాభదాయకంగా లేకపోవడానికి వివిధ రకాల కారణాలున్నాకాని పెట్టుబడులు పెరగటంతోపాటు సరైన సమయంలో సక్రమంగా వ్యవసాయ పనులు చేయలేకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులందరికి ఒకే సమయములో వ్యవసాయ పనులు మొదలు అవుతాయి కాబట్టి ఒకే సమయంలో అందరి పొలంలో వ్యవసాయ పనులు నిర్వహించడానికి కూలీలు అందుబాటులో ఉండకపోవడం అనే విషయం సర్వసాధారణం. అనుకున్న సమయానికి కూలీలు అందుబాటులో లేకపోవడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు కూలీలకు ఎక్కువ డబ్బు చెల్లించవలసి రావడమే కూడా జరిగి కూలీల ఖర్చు పెరిగి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కూలీల కొరతను అధిగమించడానికి ఫార్మ్ సంస్థ వారు ఒక రోబోను తయారు చేశారు.
మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కొంచెం నిదానించిందని చెప్పవచ్చు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఏదిఏమైనాకాని గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో సాంకేతికపరమైన యంత్రాలు, పనిముట్లు వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టడంలో కొంచెం వేగం పెరిగిందనవచ్చు. గతంలో పంటలసాగులో శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేది. ఒకప్పుడు పంటలపై ఏమైనా పిచికారి చేయాలంటే 10-15 లీటర్ల ట్యాంకును వీపున వేసుకుని నాజిల్ అమర్చిన రాడ్‌ను చేతులతో ముందుకు, వెనుకకు లాగుతుంటే ఆ పరికరానికి అమర్చిన నాజిల్ ద్వారా మందులు పంటలపై పిచికారి జరుగుతుంటాయి. వరి కోతకోయాలన్నా, కంది, పెసర, మినుము, శనగ, మొక్కజొన్న మొదలగు పంటలు కోయాలన్నా మానవ వనరులనే ఉపయోగించేవారు. కాని ఇటీవలకాలంలో ఇలాంటి పనులు చేయడానికి యంత్రాలు రావడం అనేది రైతులకు దొరికిన అదృష్టంగా భావించవచ్చు.
అయినా కాని మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాల అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విషయాలను గుర్తించిన నిపుణులు, యువత, ప్రభుత్వాలు.. వ్యవసాయంలో కొత్త కొత్త యంత్ర పరికరాల ఆవిష్కరణ కొరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల ఫలితమే వ్యవసాయంలో ఎన్నో కొత్త యంత్రాలు, పరికరాలు రావడం జరిగింది. ఇటీవలకాలంలో వ్యవసాయంలో ప్రవేశపెట్టిన కొత్త యంత్ర పరికరాల గురించి ప్రస్తావించవలసి వస్తే డ్రోన్ గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు డ్రోన్ సరసన రోబో కూడా చేరింది. డ్రోన్‌తో కేవలం పిచికారి మాత్రమే చేయవచ్చు. కాని రోబోతో వివిధ రకాల వ్యవసాయ పనులు చేయవచ్చు అని వివరిస్తున్నారు ఫామ్ రోబో సంస్థ ప్రతినిధి రాధాకృష్ణ.
ఎద్దుల అరకతో, పవర్ వీడర్‌తో చేసే పనులయినటువంటి అంతర సేద్యం, రోటోవేటర్, కలుపు నివారణ కొరకు ఉపయోగించే గొర్రు, గుంటకల లాంటి వివిధ రకాల అంతర సేద్యం పనులు ఈ రోబోతో చేసుకోవచ్చు. మందుల పిచికారికి కూడా రోబోను ఉపయోగించు కోవచ్చు. ఈ రోబో సుమారు 500 కిలోల వరకు బరువు మోయగల సామర్థ్యం కలది కాబట్టి అంత బరువు గల వ్యవసాయ ఉత్పత్తులను, పశుగ్రాసాలను కూడా రవాణా చేసుకోవడము కొరకు ఈ రోబోను ఉపయోగించుకోవచ్చు. రోబో బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుంది కాబట్టి పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి మంచి ప్రత్యామ్నాయం రోబో అని చెప్పవచ్చు. రోబోను ఆపరేట్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. చిన్న పిల్లలు వీడియో గేమ్ ఆడుతున్నట్లు ఈ రోబోను ఆపరేట్ చేయవచ్చు కాబట్టి ఎవరైనా రోబోను చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చని రాధాకృష్ణ వివరించాడు. మరిన్ని వివరాలు 9154153922 కి ఫోను చేసి తెలుసుకోగలరు.