ప్రధాని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో సుదీర్ఘ కాలం పాటు రైతులు నిరసనలు తెలియచేసిన పరిస్థితులలో ప్రభుత్వం దిగివచ్చి రైతుల కోరిక మేరకు ఆ నల్ల చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు హామీ ఇచ్చి నిరసనలను విరమింప చేశారు. కాని ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రధాని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సంయుక్త కిసన్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. ఇందుకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల రైతుల మద్దతు కూడగట్టేందుకు చేపట్టిన యాత్ర నిన్న హైదరాబాదు చేరుకున్న సందర్భంలో నిన్న సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. నిరసనలో పాల్గొన్న రైతులపై కాల్పులు జరిపిన సందర్భంలో అక్కడ లభించిన తూటాలను రైతు నాయకుడు సుర్జీత్‌సింగ్‌ ప్రదర్శించారు.

Read More

వ్యవసాయంలోనే తృప్తి

మనది వ్యవసాయక దేశం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో వ్యవసాయం చేయడము చాలా కష్టంగా ఉండడముతో పాటు వ్యవసాయంలో ఆర్థికంగా ఫలితాలు సక్రమంగా లేకపోవడము, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారు శారీరక శ్రమ తక్కువ చేస్తూ ఆర్థికంగా ఎదగడం లాంటి పరిణామాలు ప్రత్యక్షంగా చూసిన చాలామంది వ్యవసాయరంగాన్ని వదలి ఉద్యోగ, వ్యాపార రంగాలకి వలసలు పోవడం జరిగింది. కానీ కాలం గడిచేకొలది, ఆరోగ్యంపై అవగాహన పెరిగే కొలది ఆరోగ్యంగా ఉండాలంటే ఉద్యోగ, వ్యాపార రంగాల కంటే వ్యవసాయ రంగమే సరైనదారి అని నమ్మి ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చే కొంతమంది ఉద్యోగ, వ్యాపార రంగాల నుంచి వ్యవసాయ రంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా సేంద్రియ సాగు గురించి అవగాహన పెరిగిన తరువాత మనం ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ ఉత్పత్తులు తప్పనిసరిగా తినాలనే అవగాహన ప్రజలలో పెరగడము మొదలైన దగ్గరి నుంచి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టేవారి సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒక రంగం అనేకాకుండ ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, సేవా రంగం ఇలాంటి రంగాల నుంచే కాకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థుల కూడా తమ విద్య పూర్తి అయిన తరువాత వ్యవసాయ రంగంలో అడుగు బెడుతున్నారు. ఇలాంటి వారితో పాటు ఆర్థిక అవసరాల నిమిత్తం సొంత పొలం ఉన్నా కాని వ్యవసాయ రంగాన్ని వదలి వేరే రంగాలకు వెళ్ళిన వారు ఆర్థికంగా ఇబ్బందులు లేని స్థాయికి ఎదిగిన తరువాత తమ మూలాలను వెతుక్కుంటూ తిరిగి వ్యవసాయ రంగంలో ప్రవేశించారు. ఇంకా ప్రవేశిస్తూనే ఉంటారు. ఈ కోవకు చెందుతాడు బాపట్ల జిల్లా వేమూరు మండలం, జంపని గ్రామానికి చెందిన శ్రీనివాసరావు.

శ్రీనివాసరావుది వ్యవసాయ నేపథ్యం. అయినా కాని చదువు పూర్తి కాగానే అందరిలాగానే వ్యవసాయాన్ని వదిలి వేరే రంగాలకు వెళ్లడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సంవత్సరాలు మలేషియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం, కొంతకాలం బంధువులకు సంబంధించిన రైల్వే కాంట్రాక్టు పనులు చూసుకోవడం జరిగింది. ఎన్ని చేసినా కాని తృప్తి లేకుండాపోయింది. తాను ఏదో కోల్పోయిన భావం కలుగుతుంది. తనకు తృప్తి కావాలంటే తిరిగి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టాల్సిందేనని గ్రహించి వ్యవసాయరంగంలో అడుగు పెట్టడం జరిగింది. తరువాత కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాల వలన తన సమయాన్ని మొత్తం పూర్తిగా వ్యవసాయంలో కేటాయించవలసి వచ్చి, సేంద్రియ పద్ధతులు పాటించాలని భావించి గత 6 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం 9 ఎకరాలలో వరితో పాటు ఒక ఎకరంలో నిమ్మ, ఒక ఎకరంలో ఐదు అంచెల విధానంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ సమీకృత వ్యవసాయంలో భాగంగా నాటుకోళ్ళను కూడా పెంచుతూ, నీటికుంటలో వర్షాకాలంలో చేపలు కూడా పెంపకం చేస్తున్నాడు.

నిమ్మ: ఒక ఎకరంలో నిమ్మతోట సాగులో ఉంది. దాని వయస్సు 15 సంవత్సరాలు. కాని గత 6 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ నిమ్మ మొక్కలను సాగు చేస్తున్నాడు. నిమ్మ తోట సాగు అనుభవంలో కొత్తగా నిమ్మ తోట పెట్టేవారు 18þ18 లేదా 18þ15 అడుగుల దూరం పాటించి నిమ్మ మొక్కలు నాటుకుంటే అనుకూలంగా ఉంటుందని అంటున్నాడు. గుంతలలో బాగా మాగిన పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం పిండి, జీవామృతం కలిపిన మిశ్రమాన్ని వేసి మొక్కలు నాటుకోవాలి. తమ పొలంలో నాటు నిమ్మ మరియు బాలాజి రకం నిమ్మ రెండు రకాలు ఉన్నాయి కాని ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు నాటు నిమ్మ రకం అనకూలంగా ఉంటుందని అంటున్నాడు. అవసరాన్నిబట్టి పైపాటుగా అప్పుడప్పుడు మాగిన పశువుల ఎరువు, వేపపిండి, ఆముదపు పిండి, వేరుశనగ పిండిల మిశ్రమాన్ని మరియు ద్రవజీవామృతాన్ని భూమికి అందిస్తుంటాడు. చీడపీడల నివారణకు మరియు మంచి దిగుబడికి గాను వేపనూనె, పుల్లటి మజ్జిగ, నీమాస్త్రం, పంచగవ్య, సప్తధాన్యాంకుర కషాయం, చౌహాన్‌ క్యూ పద్ధతిలో ఉన్న ం.క. ద్రావణం లాంటి వాటిని అవసరాన్ని బట్టి పిచికారి చేస్తుంటాడు. అన్ని అనుకూలంగా ఉంటే నిమ్మ మొక్కలు నాటిన తరువాత 3వ సంవత్సరం దిగుబడి మొదలయ్యి క్రమంగా దిగుబడి పెరుగుతూ చెట్టు బాగా ఎదిగిన తరువాత ఎకరం నుంచి 100 నుంచి 150 బస్తాల నిమ్మకాయల దిగుబడి పొందవచ్చు. మార్కెట్‌లో ఉన్న ధరలను బట్టి ఆదాయం వస్తుందని వివరించాడు. 

ఐదు అంచెల పద్ధతి: ఒక ఎకరం పొలాన్ని ఐదు అంచెల పద్ధతికి కేటాయించి 50 అడుగుల పొడవు మరియు వెడల్పును ఎంపిక చేసుకున్నాడు. ప్రస్తుతం మామిడి, కొబ్బరి, అరటి, మునగ, జామ లాంటి మొక్కలు నాటించాడు. మిగతా మొక్కలు మరియు వివిధ రకాల కూరగాయలు త్వరలో మొదలు పెట్టబోతున్నాడు. ఐదు అంచెల పద్ధతికి గాను అడుగు ఎత్తులో బెడ్‌లు చేసుకొని బెడ్‌లపై మొక్కలు నాటించాడు. నీటి వసతి కొరకు కాలువలు ఉన్నా కాని వివిధ రకాల మొక్కలకు నీటి అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి నీటిని కాలువ ద్వారా కాకుండా డ్రిప్పుద్వారా అందిస్తే అనుకూలంగా ఉంటుందని శ్రీనివాసరావు అంటున్నాడు.

నాటుకోళ్ళు: సేంద్రియ సాగులో ఆర్థికంగా ఫలితాలు రావాలంటే సమీకృత వ్యవసాయం సరైన దారి అని తెలుసుకున్న శ్రీనివాసరావు నాటుకోళ్ళ పెంపాకన్ని కూడా చేపట్టాడు. మొదట 50 కోళ్ళతో మొదలయితే సంవత్సరంలో 500 కోళ్ళు అయినాయి.  అందులో 100 కోళ్ళు అమ్మగా ప్రస్తుతం 400 కోళ్ళు ఉన్నాయి. ఈ కోళ్ళన్నీ కూడా ఐదు అంచెల పద్ధతి వేసిన పొలంలో తిరుగుతూ ఉంటాయి. అదనంగా ఆవుల పేడ మరియు కొంత దాణాని కూడా అందిస్తున్నాడు. సక్రమంగా చేసుకుంటే నాటుకోళ్ళు మంచి ఆదాయ వనరే… కానీ కోళ్ళకు వచ్చే వ్యాధులపై సరిగ్గా అవగాహన లేకపోవడం, పొలం మొత్తాన్ని ఒంటరిగా చూసుకోవలసి రావడము, బయట నుంచి వచ్చే వారి వలన కోళ్ళకు జబ్బులు వచ్చే అవకాశాలు ఉండడము లాంటి కారణాల వలన తాను సక్రమంగా కోళ్ళ పెంపకాన్ని చేయలేకపోతున్నానని అంటూ, ఒక వ్యక్తిని కోళ్ళ పెంపకానికి కేటాయించగలిగితే స్వయం ఉపాధిగా కోళ్ళ పెంపకం మంచి అవకాశం అని శ్రీనివాసరావు అంటున్నాడు.

వీటన్నింటితోపాటు ఎకరం పొలం అంటే 200 అడుగుల పొడవు మరియు వెడల్పుతో చెరువు తవ్వించాడు. ఆ చెరువు తవ్విన మట్టిన ఐదు అంచెల విధానంలో బెడ్‌లకు ఉపయోగించాడు. చెరువు కట్ట మీద కొబ్బరి మొక్కలు మధ్యలో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలతో పాటు పైనాపిల్‌ మొక్కలు, వివిధ రకాల కూరగాయ మొక్కలు సాగు చేస్తున్నాడు.  వేసవి కాలంలో చెరువులో నీటిని పంటల సాగుకు వినియోగిస్తూ వర్షాకాలంలో చెరువులో బాగా నీరు ఉన్నప్పుడు కొన్ని చేపలను కూడా పెంపకం చేస్తుంటాడు. వీటన్నింటితో పాటు గట్ల మీద అవకాశం ఉన్న చోట కంది మొక్కలు నాటి వచ్చిన దిగుబడిని సొంతంగా ఉపయోగించుకోవడముతో పాటు మిగిలిన వాటిని బంధువులకు, తెలిసిన వారికి అమ్మి అదనపు ఆదాయం గడిస్తున్నాడు.

సేంద్రియ సాగుకు ముఖ్య వనరు అయినటువంటి దేశీయ జాతి ఆవులను నాలుగింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తున్నాడు. పాలను అమ్మకం చేయకుండా సొంతానికి ఉపయోగించుకోగా మిగిలిన పాలను పుల్లటి మజ్జిగ తయారు చేపించి పంటలకు పిచికారి చేస్తుంటాడు. మరిన్ని వివరాలు 73374 53266 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More