బియ్యం ఎగుమతులను తెలంగాణ నుంచి విదేశాలకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన భారత్‌ ఇంటర్నేషనల్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పౌరసరఫరాల శాఖలు తెలంగాణ బియ్యం స్టాల్‌ను ఏర్పాటు చేశాయి. దీనిని రవీంద్ర ప్రారంభించారు. ఎంటీయూ 1010, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, బీపీటీ 5204, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 118, జై శ్రీరాం, హెచ్‌ఎంటీ సోనా, చిట్టిముత్యాలు వంటి ప్రీమియం రకాల బియ్యాన్ని ఈ స్టాల్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే ఫిలిప్పీన్సుకు ఎగుమతి చేస్తున్నామని, త్వరలోనే ఆఫ్రికా తదితర దేశాలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని రవీంద్ర చెప్పారు. కువైట్‌ తదితర దేశాల ప్రతినిధులు, ఇండియన్‌ రైస్‌ ఎక్స్పోర్టర్స్‌ ఫెడరేషన్‌ అధ్యకక్షుడు ప్రేమ్‌ గార్గ్‌ స్టాల్‌ను సందర్శించారు.