అతి భారీ వర్షాలు కురిసే రోజులు పెరుగుతున్నాయ్
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్లో అనేక అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈసీజన్లో 108 శాతం వర్షపాతం నమోదు అయ్యింది. సీజన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (24 గంటల వ్యవధిలో 11.5 నుంచి 20.45 సెం.మీ.) కురిసిన సందర్భాలు 2,632, అత్యంత భారీ వర్షాలు, కుంభవృష్టి (20.45 సెం.మీ. కంటే ఎక్కువ) కురిసిన సందర్భాలు 473 వరకూ ఉన్నాయి. గత ఐదేళ్ళతో పోలిస్తే ఈ సంఖ్య క్రమేపి పెరుగుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు జులై, ఆగస్టు నెలల్లో కురుస్తున్నాయి. గడచిన ఐదేళ్ళుగా పరిశీలిస్తే పశ్చిమ తీరం, ఈశాన్య తూర్పు, ఉత్తర భారతంలో వర్షాల తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది కేరళ నుంచి గుజరాత్ వరకు పశ్చిమ తీరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిస్సా, బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ వంటి చోట్ల వర్ష బీభత్సం కనిపించింది. దానికి వాతావరణంలో మార్పు ఒక్కటే కారణమని చెప్పలేమని, అక్కడ స్థానిక పరిస్థితులు, పట్టణీకరణ, భారీ ఎత్తున నిర్మాణాలు, పరిశ్రమలు, వాహన కాలుష్యం వంటివి కూడా కారణాలుగా చెప్పవచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగాధిపతి ఆచార్య సునీత అన్నారు. అయితే వర్షాల తీవ్రత పెరగడంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె చెప్పారు.

