క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 పెరిగిన మిరప ధర
గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి మిరప విత్తన వ్యాపారం పడిపోయింది. నారు పోసే పరిస్థితి కానరాక నర్సరీలూ వెలవెలబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ల్లోనూ సాగు భారీగా తగ్గనుంది. దీంతో వ్యాపారుల మాయాజాలం మొదలైంది. రేట్లు కాస్త కదిలిస్తే పెరిగిన మిరప ధరలతో రైతుల్లో ఆశ మొదలవుతుందని, మళ్లీ ముమ్మరంగా సాగుకు సిద్ధమవుతారని భావించారు. ఈ మూడు రోజుల్లోనే ధరలు క్వింటాలు రూ. 1,000 నుంచి రూ.1,500 వరకు పెరిగాయి. కిందటి నెలతో పోలిస్తే సగటున రూ.2వేలు ధర పెరిగింది. ఏసీలో నిల్వ ఉంచిన మిరపకాయలకు రకాల వారీగా రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు ఇస్తున్నారు. గుంటూరు మార్కెట్లో రోజూ 50 వేలకు పైగా బస్తాల అమ్మకం జరుగుతోంది. *ధర ఇప్పుడే పెరగటానికి కారణాలు ఏమిటి?* వాస్తవానికి గుంటూరు పరిధిలోని శీతల గోదాముల్లోనే సుమారు 40 లక్షల బస్తాలు నిల్వ ఉన్నట్లు అంచనా. అయినా రైతులు అమ్మకానికి రావడం లేదు. దీంతో వ్యాపారులు ధరల్ని కొంతమేర పెంచుతున్నారు. సీజన్ కావడంతో పాటు నాణ్యమైన సరుకు అమ్మకానికి రాకపోవడంతోనే కొంతమేర ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

