తెలంగాణలోని ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్రంగా 2047 నాటికి మానవ రహిత వ్యవసాయ విధానాన్ని భారత్-ఆస్ట్రేలియా దేశాల పరస్పర సహకారంతో చేపట్టేందుకు ఉద్దేశించిన స్మార్ట్‌ఫార్మ్ నెట్‌వర్క్ గురువారం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ అగ్రివర్సిటీ, హైదరాబాద్ పరిశోధన, ఆవిష్కరణల కేంద్రం(ఆరఐసీహెచ్), ఆస్ట్రేలియాలోని చార్లెస్ స్టర్ట్ వర్సిటీ, బెంగళూరు సైన్స్ టెక్నాలజీ క్లస్టర్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, అగ్రివర్సిటీ వీసీ జానయ్య మాట్లాడుతూ.. “మానవ రహిత వ్యవసాయం సంకల్పంతో సాగే ఈ ప్రాజెక్టులో భారత్, ఆస్ట్రేలియాలకు చెందిన ప్రభుత్వ, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, అంకురాలు, పరిశ్రమలు భాగస్వాములుగా ఉంటాయి. సంయుక్త పరిశోధనలు, పైలట్ ప్రాజెక్టులు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. వ్యవసాయ సాంకేతికతలు, వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, సంయుక్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం” అని వారు తెలిపారు. కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు కార్యాలయం ముఖ్యశాస్త్రవేత్త విశాల్ చౌదరి, చార్లెస్ స్టర్ట్ వర్సిటీ వీసీ మైకేల్ ఫ్రెండ్, రిచ్ సీఈవో పింపాలె, బెంగళూరులోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ హిల్లరీ మెచీ, బెంగళూరు సైన్స్, టెక్నాలజీ క్లస్టర్ సీఈవో అనంత రామన్, అగ్రివర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్, పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

y